Tuesday 26 November 2019

Memorandum Submitted to Sri Botsa Satuyanarayana, Minister for Urban Development

                                                                                                                                     తేదీ:13.09.2019
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ శాఖామాత్యులు శ్రీ బొత్స సత్యన్నారాయణ గారికి,
ఆర్యా,
విషయం: విజయవాడ నగరం లోని వివిధ అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న మెమొరాండం.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో మున్సిపల్‌ శాఖా మాత్యులుగా అధికారాన్ని చేపట్టిన మీకు ముందుగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా అభినందనలు తెలియజేస్తున్నాము. విజయవాడ నగరానికి సంబంధించిన 3 ప్రధానమైన అంశాలను మీదృష్టికి తీసుకు వస్తున్నాము.
01.నీటి చార్జీల తగ్గింపు
2014 మున్సిపల్‌ ఎన్నికలకు ముందు సుమారు 4 ఏళ్లపాటు సాగిన స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో విజయవాడలో మంచినీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను పెంచుతూ తీర్మానం చేశారు. ఇవి 1.4.2013 నుండి అమలులోకి వచ్చాయి. మంచినీటి చార్జీలను పెంచిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నది. పెంచకముందు వ్యక్తిగత గృహాలకు (టాప్‌ కనెక్షన్‌)కుళాయికి నెలకు రు.80లు చొప్పున వసూలు చేసేవారు. అపార్టుమెంట్లకు మీటర్లు ఉన్నాయి. పెంచకముందు నెలకు 3 కిలో లీటర్లకు రు.100/-లు ఆపైన కిలోలీటరుకు రు.8.25లు చొప్పున వసూలు చేసేవారు.
పెంచిన అనంతరం వ్యక్తిగత గృహాలకు ఇచ్చే నీటి చార్జీలకు, ఇంటి పన్నుకు ముడి పెట్టారు. దీనితో వ్యక్తిగత గృహాలకు 40 శాతం నుండి 400 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు 120 శాతంనుండి 400 శాతం వరకు పెరిగాయి. నిజానికి ఇంటిపన్నును బట్టి నీటి వాడకం ఉండదు. ఏ వ్యక్తిగత గృహానికైనా ఇచ్చేది 1/2'' (అరంగుళం) పైపు తోనే నీరు ఇస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నీరు ఇచ్చే కాలపరిమితికూడా ఒకటిగానే ఉంటుంది. నిర్థిష్ట కాలపరిమితిలో అరంగుళం పైపుద్వారా ఒకే పరిమాణం గల నీరు డిశ్చార్జ్‌ అవుతుంది తప్ప, ఇంటి నిర్మాణాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి, పన్నునుబట్టి నీరు రాదు. అందువలన నీటి చార్జీలను ఇంటిపన్నుతో ముడి పెట్టడం అసమంజసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము.
అదేవిధంగా అపార్టుమెంట్లకు ( మీటర్‌ కనెక్షన్‌) శ్లాబు పధ్దతిని ఏర్పాటు చేశారు. అపార్టుమెంట్‌ భవనంలోని ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొలది నీటి చార్జీల రేటు పెరుగుతుంది. ఎన్ని ప్లాట్లు ఉన్నా, ప్రతికుటుంబం వాడుకునే నీరు మారదు. అదేనీరు వాడుకుంటున్నప్పటికీ ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొలది మీటరు రీడింగ్‌ పై శ్లాబులకు వెళ్ళటంతో నీటి చార్జీలు భారీగా పెరుగుతున్నవి. దీనితో కుటుంబాలపై అదనపు భారం పడుతున్నది. అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లో ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ అయ్యే కొలది అదనపు నీరు వాడకుండానే కుటుంబంపై భారం పడుతున్నది. ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్టు మెంట్‌ బిల్డింగ్‌లో ఉండటం నేరమన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా వ్యక్తిగత గృహాలకు, అపార్టుమెంట్లకు నీరిచ్చే సమయంలో తేడా ఉండదు. కనుక అదనంగా వాడుకునే పరిస్థితి కూడా లేదు.
అంతేకాకుండా నగరంలో ఉన్న ప్రతి అపార్టుమెంట్‌ వారు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసే నీటిని కేవలం త్రాగునీటికే వాడుకుంటారు. ఇతర గృహావసరాలకు పూర్తిగా బోరు బావుల ద్వారా తీసిన నీటిని వాడుకుంటారు. అపార్టుమెంట్లలోని అన్ని ఫ్లాట్ల వారు, వ్యక్తిగత గృహాలవారి మాదిరిగా నీటిని తీసుకుంటే నగరంలో ప్రస్తుతమున్న నీటి సరఫరా చాలదు. నీటిని సరఫరా చేయటం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చాలా కష్టమౌతుంది. అలా వాడుకుంటే ఈ శ్లాబు పధ్ధతి ప్రకారం ప్రతి ఫ్లాటుకు వేల రూపాయలు నీటి చార్జీలకు చెల్లించవలసి వస్తుంది. అందువలన అపార్టుమెంట్లకు శ్లాబు పధ్దతిద్వారా నీటి చార్జీలు వసూలు చేయటం అసంమంజసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము.
దీనితోబాటుగా పెంచిన మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను మరల మరల పెంచే పని లేకుండా ఏటా అటోమాటిక్‌గా 7 శాతం పెరిగే విధంగా కూడా సదరు 2013 స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలోనే తీర్మానం చేశారు. అంటే 1.4.2013 నుండి నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెరిగాయి. ఆ పెరిగిన నీటి చార్జీల మీద ఏటా 7 శాతం కాంపౌండింగ్‌ పధ్ధతిలో పెంచుతున్నారు. ఇది కూడా ప్రస్తుతం అమలు జరుగుతున్నది. 1.4.2013న పెంచిన చార్జీల అసలు పెంపుదల మీద 7 శాతం కాంపౌండింగ్‌ పధ్ధతిద్వారా పెంచిన ఈ అదనపు పెరుగుదలే ప్రస్తుతం 40 శాతానికి చేరింది.
నీటి చార్జీలను పాత పధ్దతికి మార్చాలని కోరుతూ ప్రజలు ఎన్ని సార్లు గత ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ చార్జీలను పాత పధ్ధతికి మార్చాలని కౌన్సిల్లో తీర్మానం చేసినప్పటికీ, ఆతీర్మానాలను ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నూతన ప్రభుత్వంగా తమరు ఈ చార్జీలపై పునరాలోచించి, నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటి పధ్ధతికి మార్చవలసిందిగా కోరుతున్నాము.

4వ రాష్ట్ర ఆర్ధిక సంఘం (4thSFC)ఏర్పాటునోటిఫికేషన్‌ -టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 4వ రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని (4th SFC)ఏర్పాటు చేస్తూ 16.5.2018న గజెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.ఈ గజెట్‌ నోటిఫికేషన్‌ టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 4Vలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని 4th SFCని కోరియున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌లోని ఈ అంశాలను పరిశీలిస్తే త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్థాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి, నాటిి ప్రభుత్వం ముందే నిర్ణయంతీసుకొని దానికి తగిన విధంగా సిఫార్సులు చేయమని 4th SFC ని కోరినట్లుగా ఉన్నది. అంతేతప్ప ఆ వ్యవస్థలను మెరుగుపరచటానికి సిఫార్సులను కోరలేదు. అందువలన ఈ అంశాలను ఆనాడే టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా వ్యతిరేకించాము. మేము వ్యతిరేకించటానికి గల కారణాలను మీదృష్టికి తీసుకు వస్తున్నాము..
భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 11 మరియు 12 ప్రకారం త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లు వగైరాలు స్థానిక సంస్థలు నిర్వహించాలి. నిర్వహించటం అంటే వ్యాపారం చేయటం కాదని మేము అభిప్రాయ పడ్డాము. పైగా ప్రభుత్వాలు కాని, స్థానిక సంస్థలు కాని వాణిజ్య దుకాణాలు కావు. పౌరులు ఆదుకాణాల కస్టమర్లు కాదు. పౌర సౌకర్యాలను కలుగజేయటం కోసం పౌరుల పన్నులతో ఏర్పాటు చేసుకున్న ప్రజా సంస్థలు. ప్రజలు చెల్లించిన పన్నులతో వాటిని నడపవలసియున్నది. మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన త్రాగునీరు, పారిశుధ్యం చాలా కీలకమైనవి. వీటిని వ్యాపారమయం చేయటం దారుణం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు ఇవ్వాలి. మనది ఉష్ణ ప్రదేశం. పైగా అనేక సంప్రదాయాలున్న ప్రదేశం. వీటన్నింటి కోసం ఇంకా ఎక్కువ నీరు అవసరమవుతుంది. 72 సంవత్సరాల స్వతంత్రం అనంతరంకూడా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసి వస్తున్నది. అనేక పట్ణణాలలో రోజు ఇచ్చే పరిస్థితిలేదు. రెండు మూడు రోజులకొకసారి నీరు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య. అందుకే దీనిని మేము వ్యతిరేకించాము.
2010 జులై 28 న త్రాగునీరు, పారిశుధ్యం అనేవి మానవ హక్కులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది (Water and Sanitation are  recognised as Human Rights by UNO General Assembly through resolution No 64/292 dated 28th July 2010 ). ఐక్యరాజ్య సమితిలో భారతదేశంకూడా భాగ స్వామిగా ఉన్నది. కాని తాగు నీటిని, పారిశుధ్యాన్ని ప్రజల హక్కుగా చూడకుండా వ్యాపార సరుకుగా చూడటం సరైందికాదని మేము భావిస్తున్నాము. అందుకే వీటిని వ్యాపార సరుకుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాము.
ఈ విషయాలను వివరిస్తూ 06.06.2019న 4th SFC ఛైర్మెన్‌ గారికి ఒక మెమొరాండాన్ని కూడా సమర్పించాము. ఈ విషయాలను కూడా మీదృష్టికి తీసుక రావటం సందర్భోచితంగా ఉంటుందని భావించి మీదృష్టికి తీసుకు వస్తున్నాము.

02. విజయవాడ అవసరాలకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు
విజయవాడ నగరానికి నీటి సరఫరా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీదనే ఆధారపడి యున్నది. అది ఇరిగేషన్‌కు సంబంధించిన రిజర్వాయర్‌. 10 లక్షలపైగా జనాభా ఉన్న ఈ నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేక రిజర్వాయర్‌ లేదు. వ్యవసాయానికి, నగరంలోని నీటి అవసరాలకు ఈ రిజర్వాయర్‌నుండే నీటిని వాడుకోవాలి. ఇటీవల వేసవిలో ఆ రిజర్వాయర్‌లో నీరు 5 అడుగులకు పడి పోయింది. ఇంకొక్క అడుగు పడిపోయినట్లయితే విజయవాడ నగరం నీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన వలసి వచ్చేది. ఎప్పుడో విజయవాడ జనాభా లక్షలోపు ఉన్న రోజులలో విజయవాడ నీటి అవసరాలకోసం ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా ఉన్న ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీద ఆధారపడటం సమంజసమే. కాని జనాభా 10 లక్షలకు పైగా ఉన్న నేటి పరిస్థితులలో ఈ నగరానికి ఏడాదికి సుమారు 5 టి.యం.సిల నీరు (ఆవిరైపోయే నీటితో సహా) అవసరమవుతుంది. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ నుండి అంతనీటిని తీసుకోవటం సాధ్యపడదు. అందువలన నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా నీటి రిజర్వాయర్లు కావాలి. పెద్ద పులిపాక ప్రాంతంలో చెక్‌ డ్యాం నిర్మించి వరద నీటిని నిల్వ చేయవచ్చు. లేదా వివిధ ప్రాంతాలలో 1 లేదా 2 చెరువులను నిర్మించి కృష్ణానది వరద నీటిని వాటికి తరలించవచ్చు. ఇలాంటి ఏదో ఒక పధ్దతిలో విజయవాడ కోసం ఉపరితల నీటిని 5 టియంసిలు నిల్వ ఉంచే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
03. చెత్త నిర్వహణ
విజయవాడలో చెత్తను నశింపజేసే సమస్య తీవ్రంగా ఉన్నది. నగరంలో చెత్త తొలగింపు కొంతమేరకు బాగానే ఉన్నప్పటికీ ఆ చెత్తను నశింప చేయటానికి కావలసిన ఏర్పాట్లు మాత్రం అవసరమైన మేరకు జరగటంలేదు.నగరమంతటా తొలగించిన చెత్తను సింగ్‌ నగర్‌ ప్రాంతంలో పోస్తున్నారు. ఆ డంపింగ్‌ యార్డు వెదజుల్లుతున్న దుర్వాసన, దుమ్ము ధూళితో అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతుండటంతో తీవ్రమైన ఆందోళనలు చేశారు. అయినా ఆసమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ముస్తాబాద, సవారిగూడెం గ్రామాల ప్రక్కన పోయాలని కార్పొరేషన్‌ ప్రయత్నిస్తుంటే అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్‌ యార్డు వెదజల్లే దుర్వాసన, దుమ్ము ధూళి వాటివలన వచ్చే రోగాలు ఎక్కడైనా ఒకటే. అందువలన ఇది పరిష్కారం కాదని భావిస్తున్నాము. అదేవిధంగా తడి చెత్తను అపార్టుమెంట్ల ఆవరణలోనే కుళ్ల బెట్టుకోమని కార్పొరేషన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది అనారోగ్యం మాత్రమే కాకుండా పరిష్కారంకూడా కాదు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేయాలి. తడి చెత్తనుండి మెన్యూర్‌ తయారు చేయాలి. ఆ ఎరువును పొలాలకు వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలి. అందు కోసం రైతులను చైతన్య పరచాలి. పొడి చెత్తనుండి విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. పెల్లెట్లను బొగ్గు వాడే బాయిలర్స్‌ ఉన్న పరిశ్రమలలో, సిమెంట్‌ పరిశ్రమలలో బొగ్గుకు బదులు ఈ పెల్లెట్లు వాడే విధంగా ప్రోత్సహించాలి. ఇవి జరిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రోజుకు 500టన్నులకు పైగా విజయవాడ నగరంలో చెత్త ఏర్పడుతున్నది. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.
ఈ చెత్తను జనావాసాలకు దూరంగా పోయాలని, నగరానికి ప్రత్యేకంగా చెత్త నుండి విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.
పై మూడు అంశాలలో నీటిచార్జీలను తగ్గించే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతులలో ఉన్నది. అదే విధంగా నగరానికి ప్రత్యామ్నామ నీటి వనరుల ఏర్పాటు, చెత్త నశింపజేయటానికి కావలసిన యార్డులు, విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీల ఏర్పాటు జరగాలంటే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక్కటే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే ఇది సాధ్యపడగలదు. అందువలన ఈ విషయాలను మీ ముందుంచుతున్నాము.
కోరుతున్న అంశాలు సంక్షిప్తంగా...
01. నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటి పధ్ధతికి మార్చాలి.
02. విజయవాడ నగర అవసరాలకోసం ఉపరితల నీటిని 5 టియంసిలు నిల్వ ఉంచే విధంగా ప్రత్యామ్నాయ రిజర్వాయరు ఏర్పాటు చేయాలి.
03. నగరంలో ఏర్పడుతున్న చెత్త నశింపజేయటానికి కావలసిన యార్డులు, విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలి.

అభివందనాలతో

(వి.సాంబిరెడ్డి)                                    (యం.వి. ఆంజనేయులు)
అధ్యక్షులు                                                     కార్యదర్శి

No comments:

Post a Comment