Monday 28 November 2016

నోట్ల రద్దు యొక్క లక్ష్యం నల్లధనాన్ని వెలికి తీయటం కాదు. చిల్లర దుకాణాలను మూయించడమే దీని లక్ష్యం.

నవంబరు 8 వతేదీ సాయంత్రం 1000 రు.లు, 500రు.లు నోట్లు చెల్లవని దేశ ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా ప్రకటించాడు. అప్పటికే తమదగ్గర ఉన్న 1000 రు.లు, 500రు.లు నోట్లను డిశంబరు 31 లోపు బ్యాంకులలో మార్చుకోవచ్చని ప్రకటించారు. దానితో ప్రజలపాట్లు మొదలయ్యాయి. ప్రజలు పనులు వదలుకొని నగదు మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయవలసి వచ్చింది. పాత నోట్ల బ్యాంకులో వేసినప్పటికీ తగినంత నగదు బ్యాంకులలో లేకపోవటంతో డబ్బుతీసుకోవటంపై పరిమితి విధించారు. అయినా ప్రజల అవసరాలకు డబ్బులు అందలేదు. బ్యాంకులవద్ద నగదుకోసం పడిగాపులు పడి ఎదురు చూస్తూ 70 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వత్తిడికి తట్టుకోలేక 12 మందికి పైగా బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ప్రాణాలు వదిలారు. చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారాలు, చేతివృత్తులు నిలచి పోయాయి. పరిశ్రమలలో ఉత్పత్తి నిలచి పోతున్నది. పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. రైతులవద్ద వ్యవసాయానికి డబ్బులేక పోవటంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రయాణాలు నిలచి పోయాయి. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వైద్యం చేయించుకోలేక రోగులు తల్లడిల్లుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్తే అతలాకుతలమవుతున్నది. ఇదే కొంత కాలం కొనసాగితే దేశ ఆర్ధిక వ్యవస్త కుప్పకూలిపోతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే కొనసాగితే దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశముందని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.
ఇంత హఠాత్తుగా ప్రభుత్వం ఎందుకు నిర్ణయంతీసుకున్నది? దేశంలో విపరీతంగా నల్లధనాన్ని వెలికితీయటం కోసమే ఈ నిర్ణయంతీసుకున్నామని ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఇతర మంత్రులు పదేపదే చెబుతున్నారు. ప్రజలు కూడా ఏమో నల్ల్లధనం వెలికి తీయటం కోసం ఈ చర్య తీసుకున్నారేమో అని భ్రమపడేవారూ గణనీయంగానే ఉన్నారు. ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశ్యం నల్లధనం వెలికితీయటం కాదని, దీనికి వెనుక కొంతమంది ప్రయోజనాలున్నాయని అంటే తమపై ఎక్కడ జాతివ్యతిరేకులుగా ముద్ర వేస్తారోనని కొంతమంది ఆర్థిక వేత్తలుకూడా ఇది నల్ల్లధనం వెలికి తీయటం కోసం తీసుకున్న చర్యేనని, కాకపోతే కొన్ని చర్యలు చేపట్టి ఉండాల్సిందేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అందుకే ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలి.
నల్లధనం ఎక్కడ ఉన్నది, ఎలా ఉత్పత్తి అవుతుందో ముందుగా పరిశీలిద్దాం. పన్నుకట్టకుండా దానిన సొమ్మును నల్లధనం అంటారని చాలమందిలో ఉన్న అభిప్రాయం. అంటే పన్ను కట్టి ఎంత దోచుకు తిన్నా అది నల్లధనం కాదు. తెల్లధనమే అవుతుంది. ఇది తప్పు. కరెన్సీ నోట్లు చెల్లకుండా చేయటాన్ని ఇంగ్లీషులో డీ మోనిటేజేషన్‌ (సవఎశీఅవ్‌ఱఓa్‌ఱశీఅ) అంటారు. డీ మోనిటేజేషన్‌ అనేది మోనిటైజేషన్‌కు (వీశీఅవ్‌ఱఓa్‌ఱశీఅ ) వ్యతిరేక పదం. సాధారణ భాషలో చెప్పాలంటే మోనిటైజేషన్‌ అనగా ఒక వస్తువు యొక్క విలువకు చెల్లుబాటయ్యే ధనరూపం ఇవ్వటం. అంటే వస్తువు యొక్క విలువకు సమాన విలువతో చెల్లుబాటయ్యే విధంగా కరెన్సీ ఉండాలి. ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే తక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధర పడి పోతుంది. వస్తువుల ఉత్పత్తిదారులు నష్టపోతారు. ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే ఎక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధరలు పెరిగి పోతుంది. వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువకన్నా ఎక్కువ విలువను చెల్లించవలసి వస్తుంది. అంటే వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువతో బాటుగా అదనంగా ధనం కోల్పోతాడు. వస్తువు విలువతో బాటుగా ఆ ఆదనపుధనం కూడా ఉత్పత్తిదారుని వద్దకు చేరుతుంది. ఈ అదనపుధనం ఇతరులనుండి కాజేసిన ధనం. ఇది నల్ల డబ్బుగా ఉంటుంది. అయితే ప్రభుత్వం దీనిని నల్లడబ్బుగా పరిగణించటం లేదు. కేవలం పన్ను కట్టకుండా ఉంచుకున్న ధనాన్ని మాత్రమే ప్రభుత్వం నల్లడబ్డుగా పరిగణిస్తున్నది. ఇది తప్పు. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే ఎక్కువ విలువకు కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అందుకేధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదనపుధనం ఉత్పత్తిదారుల వద్దకు విపరీతంగా చేరుతున్నది. దీనికి రైతులు మినహాయింపు. ఒక టూత్‌ పేస్టు ఉత్పత్తి చేసేవాడు తన టూత్‌ పేస్టు ధరను నిర్ణయించగలడు. రు.5 ల విలువగలిగిన టూత్‌ పేస్టును రు.40లకు అమ్మినా ప్రభుత్వానికి పన్ను కడితే అది తెల్లధనమే అవుతుంది. కాని రైతుకు తాను ఉత్పత్తి చేసిన పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదు. అందువలన ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నా, రైతుకు వచ్చేదేమీ లేదు. కనుకనే ధరల పెరుగుదల వలన పారిశ్రామిక వర్గాల వద్దకు ధనం విపరీతంగా చేరుతుంటే రైతులు చితికి పోతున్నారు. కనుక నల్లధనం పారిశ్రామిక వర్గాలు, వారి అనుమాయుల వద్ద విపరీతంగా పోగుపడుతున్నది.
పన్నుకడితే తెల్లధనం, పన్ను కట్టకుండా దాచుకుంటే అది నల్లధనం అనే ప్రభుత్వ నిర్వచనాన్నే తీసుకుంటే మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం పన్ను ఎగవేతలు విపరీతంగా పెరిగి పోయాయని లోక్‌ సభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే తెలియజెబుతున్నాయి. నవంబరు 18న, బీ.జే.పీ యం.పి కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు ( ప్రశ్న నెం. 640) కేంద్ర ఆర్ధిక శాఖ ఇచ్చిన సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.
ఆర్ధిక సం|| వసూలైన ప్రత్యక్ష పన్నులు వసూలుకాని ప్రత్యక్ష పన్నులు
(కోట్ల రూ.లలో) (కోట్ల రూ.లలో)
2013-14 638596 674916
2014-15 695792 827690
2015-16 742295 929972
2016-17 377045 903048(సెప్టెంబరు వరకు)
పైఅంకెలు చూస్తే వసూలైన పన్నులకన్నా వసూలుకాని పన్నులు విపరీతంగా పెరిగి పోతున్నాయని స్పష్టం అవుతున్నది. ఈ ఎగవేతలు మోడీ పాలనా కాలంలో ఊపందున్నదన్నది స్పష్టం అవుతున్నది. వసూలు కాని పన్నులు అంటే ఆదాయాన్ని, దానిమీద పన్ను నిర్ధారించిన అనంతరం కట్టకుండా ఎగవేసిన పన్ను అన్నమాట. ఉద్యోగులు పన్నులు ఎగవేసే అవకాశం ఏమాత్రంలేదు. ఎందుకంటే ప్రతి 3 నెలలకొకసారి సమీక్షిస్తూ ఉద్యోగుల వద్దనుండి మార్చి 31 నాటికి పూర్తిగా పన్ను వసూలు చేస్తారు. ఈ పన్నుల ఎగవేతకు పాల్పడింది పారిశ్రామిక వేత్తలు, వారి అనుమాయులేనని స్పష్టమవుతున్నది.
ఒకవైపు పారిశ్రామిక వేత్తలు పన్నులు ఎగవేతలకు ప్పాలడుతుంటే మరోవైపు మోడీ పాలనా కాలంలో ఇదే పారిశ్రామిక వేత్తలకు 2014-15లో రు. 554349 కోట్లు, 2015-16లో రు. 611128 కోట్లు, 2016-17లో రు. 667907 కోట్లు పన్నుల రాయితీలిచ్చారు.
రిజర్వు బ్యాంకు నివేదికలు చూస్తే మరిన్ని అంశాలు బయటపడతాయి. మోడీ 2014 మే 29 న ప్రధానిగా అధికారం చేపట్టారు. అంటే ఆరోజున బీ.జే.పీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మోడీ అధికారం చేపట్టేనాటికి బ్యాంకులలో ఉన్న మొండి బకాయీలు రు.250643 కోట్లు. అది ఏ మాత్రం తగ్గక పోగా పెరిగి 2016 సెప్టెంబరు నాటికి రు.624000 కోట్లు అయ్యింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన రెండున్న సంవత్సరాలలో 624000-250643 =రు.373357 కోట్లు పెరిగాయి. అంటే 149 % పెరిగాయి. ఇది బ్యాంకులు రద్దు చేసిన రు.1,14,000 కోట్లు పోను మిగిలిన పెరుగుదల. నిజానికి రు.1,14,000 కోట్లు రద్దు చేయకపోయి ఉండుంటే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉండేది.
దశాబ్దాల కాలంలో పెరిగి రు.250643 కోట్లుగా ఉన్న మొండి బకాయీలు, మోడీ రెండున్నర ఏళ్ళ పాలనలోనే ఎందుకంత విపరీతంగా పెరిగి రు.624000కోట్లకు (149%) చేరాయి? మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల ఎగవేతలు ఎందుకింత వేగంగా పెరిగాయి? కారణం ఒక్కటే.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి తాను పరిశ్రమాధిపతులకు, బడా కంపెనీలకు అనుకూలమని బాహాటంగానే ప్రకటిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఆదానీ , అంబానీలతో మరింత సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చాడు. అధికారంలోకి వచ్చిన అనంతరం తీసుకున్న చర్యలుకూడా స్వదేశీ, విదేశీ కంపెనీలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ దేశ ప్రజలు ఏమైపోయినా పరవాలేదు, స్వదేశీ, విదేశీ కంపెనీల అభివృధ్దే దేశ అభివృధ్ధి అనే విధంగా అతని చర్యలున్నాయి.
మోడీ రెండున్నరేళ్ళ కాలంలో దేశంలో ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నది. మేకిన్‌ ఇండియాలాంటి నినాదాలిచ్చినా, ఆనినాదాలు వాగాడంబరాలేనని స్పష్టమయింది. ఉపాధి పెరగక పోగా, ఉన్న ఉపాధులు పోతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. దేశంలో పారిశ్రామికోత్పత్తి పడి పోతున్నది. ప్రతిదానికీ విదేశాలమీద ఆధారపడవలసి వస్తున్నది. ఇవన్నీ చూచిన పారిశ్రామిక వేత్తలకు మోడీకి మాటల పసేతప్ప మంత్రాల పస లేదన్న విషయం బాగా అర్ధమైంది. దానితో వారిలో ఋణం ఎగ్గొట్టినా, పన్నులు ఎగ్గొట్టినా అడిగే నాధుడు లేడన్న నిర్భీతి వారిలో పెరిగింది, ఫలింతగా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టడం పెరిగింది. దానితో మొండి బకాయీలు రు. 2,50,643 కోట్లనుండి రు.6,24,000కోట్లకు (149%) కు పెరిగాయి. పన్నుల ఎగవేతలు 6.74లక్షల కోట్లునుండి 9 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.
పన్నుల ఎగవేతదారుల ఆస్తులను, బ్యాంకులకు ఋణాలు ఎగవేసిన వారి ఆస్తులను జప్తుచేసి బకాయీలను నిర్ధాక్షిణ్యంగా బకాయీలను వసూలు చేయలేని మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీస్తుందంటే నమ్మాలా? పన్నుల ఎగవేత దారులు, బ్యాంకులకు ఋణ ఎగవేతదారులపై చేయవలసిన దాడి ప్రజలపై చేసి ఇది నల్లధనం వెలికితీసేటందుకేననటం హాస్యాస్పదం.
అయితే మరి మోడీ ప్రభుత్వం ఈచర్య ఎందుకు తీసున్నట్లు? ఇది కూడా స్వదేశీ, విదేశీ కంపెనీల కోసమే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులను దేశంలోకి విపరీతంగా అనుమతించింది. అందులో ఒక ముఖ్యమైనది రిటైల్‌ రంగం ( అంటే చిల్లర వర్తకం)లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం. దగ్గరలో ఉన్న దుకాణంలనుండి సరుకులు, రోడ్డు ప్రక్కన అమ్మేవారినుండి కూరలు కొనుక్కోవటం మన భారతీయులను ఉన్న అలవాటు. ఈ అలవాటును అలా ఉంచితే చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన విదేశీ కంపెనీలకు లాభాలు రావు. అందువలన ప్రజల అలవాటును మాల్స్‌ వైపుకు మళ్ళించాలి. చివరకు తోటకూరకట్ట, కరివేపాకు కొనాలన్నా మాల్‌ కు వేళ్ళే టట్లు చేయాలి. ఇది జరగాలంటే ప్రజలు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు వినియూగించేవిధంగా చేయాలి. అలా చేయాలంటే ప్రజల దగ్గర మారకం నోట్లు లేకుండా చేస్తే ప్రతివాడిలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించాలన్న ఆలోచన వస్తుంది. కార్డులతో వస్తుకొనాలంటే దుకాణదారుల వద్ద స్వైపింగ్‌ మిషన్లు ఉండాలి. స్వైపింగ్‌ మిషన్లు పెద్ద దుకాణదారులే ఉంచగలరు. కనుక ప్రజలు తప్పనిసరిగా మాల్స్‌ వైపుకు మళ్ళుతారు. దీనితో చిల్లర దుకాణాలు మూతపడతాయి. నోట్ల రద్దు యొక్క లక్ష్యం నల్లధనాన్ని వెలికి తీయటం కాదు. చిల్లర దుకాణాలను మూయించడమే దీని లక్ష్యం.


-యం.వి. ఆంజనేయులు