Friday 17 March 2017

Press Meet on Metro Rail Project Vijayawada


ప్రచురణార్ధం:                                                                                                    తేదీ:17.03.2017 
మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో ఎటువంటి మార్పులు జరగబోవని, బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు మరియు కాల్వల పైన మెట్రో నిర్మాణం సాధ్యం కాదని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ప్రకటించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఖండిస్తున్నది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని, ఏలూరు రోడ్డులో కాకుండా మెట్రో రైలు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు ద్వారా నిర్మించాలని మెట్రో రైల్‌ ప్రాజెక్టు వలన భూములు కోల్పోయే బాధితులు కోరుతున్నారు. ఆ మేరకు ప్రాజెక్టు రుణం మంజూరు చేయటానికి ముందుకు వచ్చిన జర్మనీ, ఫాన్స్‌లకు చెందిన సంస్థలకు లేఖ ఇచ్చినట్లుగా పత్రికలలో వచ్చింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు బాధితుల అభిప్రాయానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తు తెలియ జేస్తున్నది. 
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కూడా మెట్రో రైలు రూట్లను మార్చాలని కోరింది. ఈ మేరకు జనవరి 31 వతేదీన అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ఛైర్మెన్‌కు లేఖ వ్రాశింది. మెట్రో రైల్‌ లక్ష్యాన్ని కేవలం ట్రాఫిక్‌ నియంత్రణకే పరిమితం కాకుండా, నగర విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో కొన్ని రూట్లను కూడా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. విజయవాడ- ఆగిరిపల్లి, విజయవాడ -పెద అవుట్‌పట్లి, విజయవాడ - జి.కొండూరు లేదా మైలవరం, విజయవాడ -కంకిపాడు. విజయవాడ - కంచిక చర్ల లేదా నందిగామ, విజయవాడ - అమరావతి (రాజధాని) మార్గాలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. ఇంతమంది కోరినా, ప్రత్యామ్నాయ మార్గాలున్నా, వేటినీ పట్టించుకోకుండా, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలోనే వేయాలని నిర్ణయించటం నియంతృత్వమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
మెట్రో రైల్‌ నిర్మాణానికిి అయ్యే ఖర్చును రాబట్టడం కోసం రాష్ట్రంలోని పెట్రోల్‌ డీజిల్‌పై మెట్రో సెస్‌ విధించాలని, ఆస్తి పన్ను మీద అదనపు సెస్‌ విధించాలని, వాహనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలపై అదనంగా మెట్రో చార్జి విధించాలని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాహనాలపై ఒకసారి గ్రీన్‌ సెస్‌ విధించాలని డి.పి.ఆర్‌. లో చేసిన ప్రతిపాదనలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మిస్తూ రాష్ట్ర ప్రజలందరి మీద సెస్‌ విధించాలనటం అన్యాయమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎ.యం.ఆర్‌.సి కి స్పష్టం చేసింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చిన్‌ లలో మాదిరిగా విజయవాడ మెట్రోరైలును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతోనే నిర్మించాలని, ప్రైవేటు యాజయాన్యానికి అప్పగించటం, ప్రజలపై భారాలు విధించటం చేయరాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. మెట్రో రైల్‌ కోసం భూములు కోల్పోయేవారికి కొచ్చిన్‌ మెట్రో రైలు మాదిరిగా సెంటుకు గరిష్టంగా రు.52 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. 
విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రకటన నాటి నుండి నేటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే, నియంతృత్వ రీతిలో నడుస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మెట్రో రైలు మొత్తం పట్టణ రవాణాలో ఒక భాగం. కాని విజయవాడ నగరంలో ఏర్పాటుచేసే మెట్రో రైలు గురించి విజయవాడలో ఎలాంటి చర్చ జరగలేదు. విజయవాడ నగరపాలక సంస్థలో దీనిపై చర్చ జరగలేదు. విజయవాడ నగర ప్రజలనుగానీ, నగరంలోని రాజకీయపార్టీలనుగానీ , ప్రజాసంఘాలను, అసోసియేషన్లనుగానీ కనీసం సంప్రదించలేదు, పబ్లిక్‌ హియరింగ్‌ జరపలేదు. ప్రజాభిప్రాయం కోరలేదు. ఎక్కడా చర్చ లేకుండా, ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలు తమంతటతాము చెప్పినా వినిపించుకోకుండా ముందుకు సాగటం ప్రజాస్వామ్యవిరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, పబ్లిక్‌ హియరింగ్‌ జరిపి, ప్రజాభిప్రాయం కోరాలని, దాని ఆధారంగానే మెట్రో రైల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. 


(వి.సాంబిరెడ్డి)                                                                                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                                                               కార్యదర్శి