Tuesday 26 November 2019

Memorandum Submitted to 4th State Finance Commission

                                                                                                            తేదీ:06.06.2019
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ 4 వ రాష్ట్ర ఆర్ధిక సంఘం ఛైర్మెన్‌ శ్రీ గుమ్మడి నాంచారయ్య గారికి,
గరుడ ఎన్‌క్లేవ్‌, తాడేపల్లి-522 501
ఆర్యా,
విషయం: 4 వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సుల తయారీ సందర్భంగా పరిగణనలోకి తీసుకొవలసిన అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న మొమొరాండం.
నాల్గవ రాష్ట్ర ఆర్ధిక సంఘం ఛైర్మెన్‌గా నియమితులైనందుకు ముందుగా మీకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా అభినందనలు తెలియజేస్తున్నాము. మిమ్ములను ఛైర్మెన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన గజెట్‌ నోటిఫికేషన్‌ తేదీ 16.05.2018లో ఇచ్చిన టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ పై మాఅభిప్రాయాలను ఈ మొమొరాండం ద్వారా మీముందుంచుతున్నాము.
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 1లో ఇచ్చిన అంశాలపై మా అభిప్రాయం మరియు మా డిమాండు
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 1లో ఇచ్చిన దాని ప్రకారం పన్నుల ద్వారా, డ్యూటీల ద్వారా, టోల్‌ ద్వారా, ఇతర ఫీజుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయాన్ని స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏవిధంగా పంపిణీ చేయాలన్నది 4 వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సు చేయవలసి యున్నది. దీనిపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మా అభిప్రాయాన్ని మీముందుంచుతున్నాము.
స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి. స్థానిక సంస్థల పనివిధానానికి సంబంధించి, దేశవ్యాపిత సారూప్యత, ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రాలు రకరకాల నిర్ణయాలు తీసుకోవటం, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం లాంటివి జరుగుతున్న నేపధ్యంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయటం కోసం 1992 లో భారత ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ (పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు సంబంధించినది) మరియు 74వ రాజ్యాంగ సవరణ (మున్సిపల్‌ వ్యవస్థకు సంబంధించినది) చేశారు. ఈ రాజ్యాంగ సవరణలలో అత్యంత కీలకమైన విషయాలు.
01. స్థానిక సంస్థలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తించటం: దేశంలో ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో నివశిస్తారు. జనావాసాలన్నీ గ్రామాలలోగాని, పట్ణణాలలోగాని ఉంటాయి. ప్రజలకు మంచినీరు రోడ్లు, పారిశుధ్యం, ఆరోగ్యం, విద్య లాంటి ప్రాధమిక సౌకర్యాలు కలుగ జేయవలసి యున్నది. ఇవన్నీ ఉన్నప్పుడే గ్రామాలుకాని, పట్టణాలుగాని నివాస యోగ్యాలుగా ఉంటాయి. ప్రజలు హాయిగా జీవించాలంటే ఇవన్నీ కావాలి. ఇవి చేయవలసింది స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలు అన్ని విధాలా పటిష్టంగా ఉంటేనే ఈ పనులు చేయగలవు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే స్థానిక సంస్థలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని అనాటి పాలకులు గుర్తించి 73,74 రాజ్యాంగ సవరణలు చేశారు. దేశ వ్యాపితంగా స్థానిక సంస్థలు నిర్వహించే విధులను రూపొందించారు. గ్రామ పంచాయితీలు నిర్వహించవలసిన విధులను రూపొందించి భారత రాజ్యాంగం 11 వ షెడ్యూల్‌లో చేర్చారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు నిర్వహించవలసిన విధులను రూపొందించి భారత రాజ్యాంగం 12 వ షెడ్యూల్‌లో చేర్చారు. దీనితో స్థానిక సంస్థలు నిర్వహించవలసిన విధులకు దేశ వ్యాపితంగా సారూప్యత రావటంతో బాటుగా, ఆ విధులకు రాజ్యాంగ బధ్దత ఏర్పడింది. కనుక ఈ షెడ్యూళ్లలో ఇచ్చిన విధులను తప్పని సరిగా అమలు జరప వలసిందే.
02. నిధులు: రాజ్యాంగం అప్పగించిన విధులను నెరవేర్చాలంటే స్థానిక సంస్థలకు నిధులు కావాలి. స్ధానిక సంస్థలకు ఇంటిపన్ను మినహా ఆదాయాలు ఉండవు. ఇది బహు స్వల్పం. స్థానిక సంస్థలు విధులు నిర్వహించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిందే. కేటాయించటం అనేది అనివార్యం అన్నది పాలకులు గుర్తించారు. ఎంత కేటాయించాలి అన్నది తేల్చటం కోసమే రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారతరాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 243-I ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
స్ధానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటం వెనుక మరొక ముఖ్యాంశం ఇమిడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అనేక రకాలుగా పన్నులు చెల్లిస్తున్నారు. ప్రజలకు కావలసిన ఉమ్మడి పనులను నిర్వహించటం కోసమే రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు (Tax is an individual contribution determined by law for Common works for the progress of community). రాష్ట్ర ప్రభుత్వం తమవద్దకు చేరిన నిధులను ముందుగా జన నివాసాలవద్ద సౌకర్యాలకు (అంటే గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో సౌకర్యాలకు) ఖర్చు చేయాలి. ఆ తర్వాత జనావాసాలకు-జనావాసాలకు మధ్య (Between one village/Town to another village/Town) జరిగే పనులకు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తంగా జరిగే పనులకు ఖర్చు పెట్టాలి. ఇందులో జన నివాసాలవద్ద సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయటం మానవ సమాజ అభివృధ్ధికి అత్యంత కీలకం. రాష్ట్ర నిధులలో కొంత భాగాన్ని స్థానిక సంస్థలకు కేటాయించటం అనివార్యం కనుకనే, కేటాయించ వలసిన ఆ భాగాన్ని నిర్ణయించటం కోసం ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
తప్పుడు ప్రచారంఅయితే మన ప్రభుత్వాలు గత దశాబ్ద కాలంగా స్థానిక సంస్థలకు కేటాయించవలసిన నిధులను నిలిపి వేయటం కోసం, ''ఆస్తిపన్ను స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు'' అని ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము. స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేనని, స్థానిక సంస్థలకు ఆ నిధులు ఇవ్వటం ప్రభుత్వాల దయాబిక్ష కాదని, తాము చెల్లించిన పన్నుల నుండి స్థానికావసరాలకు నిధులను పొందటం రాష్ట్ర ప్రజల హక్కు అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము స్పష్టం చేస్తున్నాము.
గత రాష్ట్ర ఆర్ధిక సంఘాలుభారత రాజ్యాంగం ఆర్టికిల్‌ 243-I ప్రకారం ఇప్పటికి 3 ఆర్ధిక సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొదటి ఆర్ధిక సంఘం రాష్ట్ర ఆదాయంలో ఏటా 39.24 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలని, ఆ వచ్చిన మొత్తంలో 30 శాతం పట్టణ స్థానిక సంస్థలకు, 70 శాతం పంచాయతీరాజ్‌ సంస్థలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. రెండవ రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆదాయంలో ఏటా 40.92 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలని, ఆ వచ్చిన మొత్తంలో 18.5 శాతం పట్టణ స్థానిక సంస్థలకు, 81.5 శాతం పంచాయతీరాజ్‌ సంస్థలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. మూడవ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆదాయంలో శాతంగా కాకుండా కేవలం నిధుల మొత్తాలను మాత్రమే సిఫార్సు చేసింది. 2010 నుండి 2015 వరకుగల 5 ఏళ్ళకు గాను కేవలం పట్టణ స్థానిక సంస్థలకు రు. 489.34 కోట్లు, పంచాయతీరాజ్‌ సంస్థలకు రు. 1274.34 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. 4 వ ఆర్ధిక సంఘం సకాలంలో వేయలేక పోయినందున తదుపరి కాలానికి ఇవ్వవలసిన మొత్తాన్ని నిర్థారించటంకోసం ఏర్పాటుచేసిన ఉప సంఘం 2010 నుండి 2015 వరకు పట్టణ స్థానిక సంస్థలకు రు. 515.24 కోట్లు, పంచాయతీరాజ్‌ సంస్థలకు రు. 1597.04 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది.
పై 3 ఆర్థిక సంఘాల సిఫార్సులను పరిశీలించినప్పుడు.మొదటి ఆర్థిక సంఘం సిఫార్సులు స్థానిక సంస్థలకు ఊతమిచ్చేవిగా ఉన్నాయి. రెండవ ఆర్ధిక సంఘం సిఫార్సులు స్థానిక సంస్థలకు ఊతమిచ్చేమిగా ఉన్నప్పటికీ, పట్టణ స్థానిక సంస్థలకు కోత విధించింది. మూడవ ఆర్ధిక సంఘం సిఫార్సులలో రాష్ట్ర ఆదాయంనుండి శాతంగా కాకుండా కేవలం కొద్ది మొత్తాలను ఇచ్చి చేతులు దులుపుకున్నట్లుగా స్పష్టం అవుతున్నది. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నది. కాని స్థానిక సంస్థలకు ఇచ్చే మొత్తాలలో భారీగా కోత విధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏనిష్పత్తిలో పెరుగుతుందో అదే నిష్పత్తిలో స్థానిక సంస్థలకు కూడా వాటా పెరగాలి. అందుకు భిన్నంగా మూడవ ఆర్ధిక సంఘం సిఫార్సులు కొద్ది మొత్తాలను మాత్రమే కేటాయించటం, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటమే నని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము భావిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు Urbans are growth Engines అని ప్రచారం చేస్తున్నాయి. పట్టణాలు (Urbans) growth Engines గా మారాలంటే అక్కడి మౌలిక సౌకర్యాలు ప్రపంచస్థాయిలో అభివృధ్ధి చెందాలి. అలా అభివృధ్ధి చెందాలంటే నిధులు కావాలి. ఒకవైపు Urbans are growth Engines అని చెబుతూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను కుదించటం పరస్పర విరుధ్ధమని మేము భావిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్‌ లో అక్కడక్కడ కొద్ది పాటి పరిశ్రమలున్నప్పటికీ, ప్రధానంగా వ్యవసాయిక రాష్ట్రం. ఆర్ధిక వ్యవస్థకూడా వ్యవసాయాధారితంగానే ఉన్నది. అందువలన స్థానిక సంస్థలకు అదనపు ఆదాయాలు వచ్చే అవకాశాలు లేవు. కనుక స్థానిక సంస్థలు రాష్ట్ర ఆదాయంనుండి వచ్చే వాటా మీదనే ప్రధానంగా ఆధారపడవలసి యున్నది.
పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంనుండి 40 శాతం స్థానిక సంస్థలకు ఖచ్చితంగా విడుదల చేయాలని, అందులో 30 శాతం ఖచ్చితంగా పట్టణ స్థానిక సంస్థలకు, 70 శాతం పంచాయతీరాజ్‌ సంస్థలకు కేటాయించాలని కోరుతున్నాము. మా ఈ డిమాండును మీ సిఫార్సులలో పొందుపరచవలసిందిగా కోరుతున్నాము.
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 4V లో ఇచ్చిన అంశాలపై మా అభిప్రాయం మరియు మా డిమాండు
టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌ 4Vలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని మిమ్ములను కోరియున్నారు. అదే విధంగా ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటానికి కూడా సిఫార్సులు చేయమని కోరియున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌లోని ఈ అంశాలను పరిశీలిస్తే త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్థాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి, ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం ముందే నిర్ణయంతీసుకొని దానికి తగిన విధంగా సిఫార్సులు చేయమని ఆర్ధికసంఘాన్ని కోరినట్లుగా ఉన్నది. అంతేతప్ప ఆవ్యవస్థలను మెరుగుపరచటానికి సిఫార్సులను కోరలేదు. అందువలన ఈ అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మా వ్యతిరేకతకుగల కారణాలను ఈ దిగువ నిస్తున్నాము.
01. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 11 మరియు 12 ప్రకారం త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లు వగైరాలు స్థానిక సంస్థలు నిర్వహించాలి. వాటిని వ్యాపారాత్మకంగా మార్చాలన్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వాలు కాని, స్థానిక సంస్థలు కాని వాణిజ్య దుకాణాలు కావు. పౌరులు ఆదుకాణాల కస్టమర్లు కాదు. పౌర సౌకర్యాలను కలుగజేయటం కోసం పౌరుల పన్నులతో ఏర్పాటు చేసుకున్న ప్రజా సంస్థలు. ప్రజలు చెల్లించిన పన్నులతో వాటిని నడపవలసియున్నది. ప్రభుత్వం, స్థానిక సంస్థలు వాణిజ్య దుకాణాలైనచో ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించనవసరంలేదు. మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన త్రాగునీరు, పారిశుధ్యం చాలా కీలకమైనవి. వీటిని వ్యాపారమయం చేయటం దారుణం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు ఇవ్వాలి. మనది ఉష్ణ ప్రదేశం. పైగా అనేక సంప్రదాయాలున్న ప్రదేశం. వీటన్నింటి కోసం ఇంకా ఎక్కువ నీరు ఇవ్వవలసియున్నది. 72 సంవత్సరాల స్వతంత్రం అనంతరంకూడా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసి వస్తున్నది. అనేక పట్ణణాలలో రోజు ఇచ్చే పరిస్థితిలేదు. రెండు మూడు రోజులకొకసారి నీరు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య. అందుకే దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము.
మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే పారిశుధ్యం అవసరం. కాని పట్టణాలన్నీ చెత్తతో సతమతమవుతున్నాయి. చెత్తను నశింపజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. ఒక జనావాసాల వద్ద సేకరించిన చెత్తను మరో జనావాసాల దగ్గరలో పోస్తున్నారు. అక్కడ ప్రజలకు అనారోగ్యంగా మారుతుండటంతో ఆప్రాంతాలలో ప్రజలు ఆంధోళనలకు దిగుతున్నారు. ఈ సమస్యను ఏపట్టణ స్థానిక సంస్థకు ఆ పట్టణ స్థానిక సంస్థ సొంతంగా పరిష్కరించుకోలేవు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే పరిష్కరించబడగలవు. అదేవిధంగా పట్టణాలలో భూగర్భ డ్రైనేజికూడా నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కొన్ని పట్టణాలలో అసలు భూగర్భ డ్రైనేజి లేదు. చాలా పట్టణాలలో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు లేవు. ఉన్న చోటకూడా అవి పనిచేయవు. పూడికలు తీసే నాధుడులేడు. ఈ సమస్యను పరిష్కరించ వలసిన విధానాన్ని గురించి సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, పారిశుధ్ధ్యంతో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం దారుణం. అందుకే దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము.
2010 జులై 28 న త్రాగునీరు, పారిశుధ్యం అనేవి మానవ హక్కులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది ((Water and Sanitation are  recognized as Human Rights by UNO General Assembly through resolution No 64/292 dated 28th July 2010 ). ఐక్యరాజ్య సమితిలో భారతదేశంకూడా భాగ స్వామిగా ఉన్నది. కాని మన పాలకులు త్రాగు నీటిని, పారిశుధ్యాన్ని ప్రజల హక్కుగా చూడకుండా వ్యాపార సరుకుగా చూడటం దారుణం. అందుకే వీటిని వ్యారసరుకుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, పారిశుధ్యం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన చర్యల గురించి సిఫార్సులు చేయవలసినదిగా కోరుతున్నాము.
ప్రజారవాణా వ్యవస్థ ఆవశ్యకత
రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.
జనాభా ఎక్కువ ఉన్న మనలాంటి దేశంలో Mass Transport System  యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. రవాణా అన్నది మానవ నాగరికతకు, సమాజ అభివృద్ధికి కీలకమైనది. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే, చౌకగా, సురక్షితంగా, బాధ్యతాయుతంగా, అన్ని ప్రాంతాలను కలిపేదిగా ఉంటుందని ఋజువయింది. ప్రైవేటీకరిస్తే ప్రజలకు భారంగా మారుతుంది. లాభాలొచ్చే రూట్లలో తప్ప, ఇతర ప్రాంతాలకు విస్తరించదు. లాభంవచ్చినా రాక పోయినా, అవసరం అయితే నష్టాన్ని సబ్సిడీగా భరించి అయినా ప్రజల సౌకర్యార్ధం అన్ని గ్రామాలకు అన్ని రూట్లలో బస్సులను తిప్పగలిగేది ప్రభుత్వమే. ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే,
01. అన్ని గ్రామాలకు అన్ని రూట్లలో బస్సు సౌకర్యం ఏర్పడుతుంది.
02. ప్రజలకు రావాణా చార్జీలు అందుబాటులో ఉంటాయి.
03. ఉద్యోగులకు , ఉద్యోగ భరోసా ఉంటుంది.
04. ఉద్యోగులు గౌరవ ప్రదంగా జీవించగలుగుతారు
05. వివిధ వర్గాల ప్రజలు రాయితీ ధరలలో ప్రయాణం చేయగలుగుతారు.
06. ప్రజలకు సురక్షిత ప్రయాణం అందుతుంది.
ఇవేవీ ప్రైవేటు రంగంలో ఉండవు. ప్రైవేటురంగంలో లాభమే పరమావధిగా ఉంటుంది తప్ప ప్రజా శ్రేయస్సు, ప్రజల అవసరాలు పరమావధిగా ఉండదు. అందుకే ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండవలశిందేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గా భావిస్తున్నాము. మేము మీ ముందుంచుతున్న ఈవిషయాలను పరిశీలించి ప్రజారవాణా వ్యవస్థ ప్రైవేటీకరణకు దారితీసే విధంగా సిఫార్సులు చేయవద్దని కోరుతున్నాము. ప్రభుత్వ రంగంలోనే ఉంచి, మరింత సమర్ధవంతంగా పని చేసేవిధంగా సిఫార్సులు చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇతర అంశాలు.
ఈ సందర్భంగా మరికొన్ని అంశాలను మీ ముందుంచుతున్నాము.
స్థానిక సంస్థల ఆదాయాలను లాగేసుకోవటం
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వానికి స్థానిక సంస్థల మధ్య ఎలా పంచాలి అన్న విషయంపై సిఫార్సుల కోసం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తూనే , మరో వైపు స్థానిక సంస్థల ఆదాయాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటున్నది. ఉదాహరణకు ఆస్తిపన్ను స్థానిక సంస్థల పరిధిలోనిది. ఇది స్థానిక సంస్థల ఆదాయం. పట్టణాలలో ఆస్తిపన్ను వసూలు చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్ధలనుండి కమీషనర్‌ & డైరెక్టరేట్‌ ఆప్‌ మున్సిపల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (సి.డి.ఎం.ఏ) కు బదలాయించారు. ఇప్పుడు సి.డి.ఎం.ఏ తిరిగి స్థానిక సంస్థకు ఆమొత్తాన్నిబదలాయిస్తే సరేసరి, లేకుంటే లేదు.
అదేవిధంగా వృత్తిపన్ను స్థానిక సంస్థలకు చెందిన ఆదాయం. 1990 వదశకంలో వృత్తిపన్ను వసూలు చేసే బాధ్యతను కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంటుకు అప్పగించారు. వసూలైన మొత్తంలో 95శాతం తిరిగి స్థానిక సంస్థలకు చెల్లించాలన్నది నిబంధన . ఆ రోజుల్లో కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంటు వారు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు. ప్రభుత్వం వాటిని సక్రమంగా స్థానిక సంస్థలకు ఇచ్చేదికాదు. ఇటీవల కాలంలో తిరిగి స్థానిక సంస్థలే వసూలు చేసేవిధంగా అనుమతించారు. అయితే ఈమొత్తాన్ని స్థానిక సంస్థలు వాడుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ ట్రెజరీలో జమచేయాలి. మరల ప్రభుత్వం ఇచ్చినప్పుడే తీసుకోవాలి. త్వరలో నీటిచార్జీలు, డ్రైెనేజి చార్జీలుకూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేపరిస్థితి కనుపిస్తున్నది. ఈవిధంగా స్థానిక సంస్థల ఆదాయ మార్గాలనుకూడా రాష్ట్ర ప్రభుత్వం హరిస్తున్నది. స్థానిక సంస్థలను అంతకంతకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడేటట్లు చేయటమే అవుతుంది.
ఇక ఆస్తిపన్ను 1980వ దశకంనుండి కూడా బకాయిలున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలు వాటిని వసూలు చేయలేకపోతున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఆస్తులకు దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను చెల్లించటం లేదు. పట్టణాలలో రోడ్లప్రక్కన బుట్టలలో పళ్ళు అమ్ముకునేవారినుండి ఆశీళ్ళు వసూలు చేస్తున్నారు. కాని ప్రైవేటుసంస్థలు రోడ్లు త్రవ్వి కేబుళ్ళు, పైపులైన్లు వేస్తున్నాయి. కాని స్థానిక సంస్థలు వాటినుండి అద్దెను వసూలు చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నది. ఈ విధంగా స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడుతున్నది.
అదేవిధంగా తలసరిగ్రాంటు, రోడ్డు గ్రాంటులు కూడా ఇవ్వటం లేదు. ఈవిషయాలనుకూడా తమరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాము.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను స్థానిక సంస్థలపై రుద్దటం
ఇక రాష్ట్ర ప్రభుత్వం తాను చేయవలసిన ఖర్చునుకూడా స్థానిక సంస్థలపై రుద్దుతున్నది. ఉదాహరణకు పేదలకు గృహ నిర్మాణం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం.పథకం అనంతరం గృహనిర్మాణానికి అయ్యే ఖర్చులో 30 శాతం స్థానిక సంస్థలపై రుద్దారు. ఫలితంగా స్థానిక సంస్థలపై అదనపుభారం పడింది.
ఉద్యోగుల వేతనాలు
అదే విధంగా స్థానిక సంస్థ అనేది ప్రజల స్థానిక అవసరాలు చూడటానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగం. కలెక్టర్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం, ఎలాగో స్థానిక సంస్థ కూడా అలాంటిదే. కనుక స్థానిక సంస్థ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే. అయితే స్థానిక సంస్థ ఉద్యోగుల జీతాలు స్థానిక సంస్థ మీదనే రుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది. జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం.పథకం పేరుతో విజయవాడ లాంటి చోట్ల అమలు చేశారు. దీనితో స్థానిక సంస్థలు జీతాలు చెల్లించలేని స్తితికి పడిపోయినవి. ఉద్యోగులు ఆంధోళనలు చేయవలసి వచ్చింది. ఇతర సంస్థలలో ఉద్యోగుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు, స్థానిక సంస్థల ఉద్యోగుల వేతనాలుకూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.
మున్సిపల్‌ ఫండ్‌ VS లాభనష్టాలు లెక్కించటం
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్నిConsolidate Fund అన్నవిధంగానే మున్సిపల్‌ సంస్థకు వచ్చిన ఆదాయాన్ని (అది ప్రభుత్వంనుండి నుండి వచ్చిన ఆదాయం కావచ్చు, లేక స్థానిక పన్నుల నుండి వచ్చి ఆదాయం కావచ్చు) Municipal Fund అంటాము. నిజానికి ఇది మున్సిపల్‌ సంస్థ మొత్తం ఆదాయం అవుతుంది. ఇది మున్సిపల్‌ సంస్థ యొక్క Consolidate Fund . దీనినుండి వివిధ పనులకు ఖర్చు చేయాలి. అయితే అందుకు భిన్నంగా గత దశాబ్ద కాలంగా మున్సిపల్‌ సంస్థ నిర్వహించే ప్రతిపనికీ, ఆపనికి వచ్చే ఆదాయ వ్యయాలను లెక్కించి, లాభనష్టాలను లెక్కగడుతున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌ 4హలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని మిమ్ములను కోరటం ఆ విధానంలో భాగంగానే. ఈ విధానాన్నే మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రతి పనికి లాభ నష్టాలను లెక్కగట్టి ప్రజలనుండి వసూలు చేయాలని సంకల్పించినప్పుడు, ఇక ప్రభుత్వానికి విడిగా పన్నులు చెల్లించవలసిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాము. ఎవరు ప్రభుత్వ సేవలను పొందుతారో వారే ఖర్చు మొత్తాన్ని భరించాలన్న ఫిలాసఫీని ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. అంటే ఆ సేవలను పొందనివారికి ఆ ఖర్చుతో కూడా సంబంధంలేదని ప్రభుత్వం చెబుతున్నది.ఈ ఫిలాసఫీని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇదే నిజమైతే పట్టణాలలో నివశించేవారు వ్యవసాయోత్పత్తులను కొనుక్కుంటున్నారు. కాని వ్యవసాయంతో వారికి సంబంధంలేదు. గ్రామీణ రోడ్ల వ్యవస్థ, గ్రామీణ త్రాగునీటి వ్యవస్థతో వారికి సంబంధంలేదు. తాముకట్టిన పన్నులనుండి వ్యవసాయానికి ఎందుకు సబ్సిడీ ఇవ్వాలని, గ్రామీణ రోడ్లకు ఎందుకు ఖర్చు చేయాలని, గ్రామీణ త్రాగునీటి ప్రాజెక్టులకు ఎందుకు ఖర్చు చేయాలని పట్టణ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడితే అది అశాంతికి, అస్తవ్యస్త పరిస్థితికి దారితీస్తుంది. అందువలన Consolidate Fund నుండి (అంటే Municipal Fund నుండి) వివిధ పనులకు ఖర్చులు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము. ఈ విషయాలను కూడా మీ సిఫార్సుల సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
స్థానిక సంస్థల విధులను లాగేసుకోవటం
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను, వృత్తిపన్ను వగైరాలను తన చేతులలోకి తీసుకున్న విధంగానే స్థానిక సంస్థలలో జరిగే పనులను కూడా నెమ్మది నెమ్మదిగా లాగేసుకుంటున్నది. ఉదాహరణకు భూగర్భ డ్రైనేజి, స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణం స్థానిక సంస్థలు చేయవలసిన పనులు. అవసరమైతే దానికి ప్రభుత్వం సహకరించవచ్చు. కాని 2015లో కేంద్ర ప్రభుత్వం గుంటూరులో భూగర్భ డ్రైనేజి కోసం, విజయవాడలో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణం కోసం నిధులను విడుదల చేసింది. ఆ నిధులను గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థలకు బదలాయించకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టులు పిలచి, కాంట్రాక్టర్లకు అప్పగించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఆదాయ మార్గాలను లాగేసుకుంటున్న విధంగానే, పనులనుకూడా లాగేసుకుంటున్నదన్న విషయం స్పష్టమవుతున్నది. ఇది స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటమే అవుతుంది. ప్రజాస్వామ్యవస్వస్థకు విఘాతం. ఈ విషయాలనుకూడా మీసిఫార్సుల సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
స్థానిక సంస్థలలో ఔట్‌ సోర్సింగ్‌వలన పనులు నాశిరకంగా జరగటమే కాకుండా స్థానిక సంస్థలు విపరీతంగా నఫ్టపోతున్నాయి. అందువలన ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విడనాడాలని కోరుతున్నాము.
స్థానిక సంస్థలు బలోపేతం కావాలని, స్థానిక స్వపరిపాలన సజావుగా నడవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కోరుకుంటున్నాము. మీరు సిఫార్సులను చేసేటప్పుడు మేము ఇచ్చిన ఈ వివరాలను దృష్టిలో ఉంచుకోవలసిందిగా కోరుతున్నాము.
పైన ఇచ్చిన అంశాల సారాంశాన్ని క్లుప్తంగా ఈ దిగువనిస్తున్నాము.
01. రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు 40 శాతం నిధులను కేటాయించాలి. వచ్చిన మొత్తంలో 30 శాతం పట్టణ స్థానిక సంస్థలకు, 70 శాతం పంచాయితీ రాజ్‌ సంస్థలకు కేటాయించాలి.
02. త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లతో సహా 11,12 వ షెడ్యూళ్ళలో ఉన్న విధులను వేటీనీ వ్యాపారాత్మకంగా మార్చటం కాని, ప్రైవేటీకరించటం కానీ చేయరాదు.
03. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించరాదు. ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేయాలి.
04. ఆస్తిపన్ను, వృత్తిపన్ను, వినోదపుపన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వాటా తదితర స్థానిక సంస్థల ఆదాయాలను స్థానిక సంస్థలకే వదిలేయాలి. రోడ్డు టాక్స్‌లో 10 శాతం వాటాను స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
05. రోడ్లు త్రవ్వి కేబుళ్ళు, పైపులైన్లు వేసే ప్రైవేటు సంస్థలనుండి అద్దెను వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
06.విద్యుత్‌ సంస్థలు మంచినీటి సరఫరాకుసైతం స్థానిక సంస్థలనుండి కమర్షియల్‌ రేటుతో విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తున్నవి. మంచినీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌కు గృహావసరాలకు వసూలుచేసే చార్జీలనే వసూలు చేయాలి. లేదా విద్యుత్‌ స్థంభాలు, కేబుల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్లకు వినియోగించిన స్థలాలకు అద్దె వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
07. పేదలకు గృహనిర్మాణానికి అయ్యే ఖర్చును స్థానిక సంస్థలపై రుద్దరాదు. పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి.
08. స్థానిక సంస్థలలోని ఉద్యోగుల జీత భత్యాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
09. ప్రతిపనికి లాభ నష్టాలను లెక్కగట్టి ప్రజలనుండి వసూలు చేయాలనే విధానాన్ని విడనాడాలి. Municipal Fund  ను ఏర్పాటుచేసి, దాని నుండి మాత్రమే ఖర్చు చేసే విధానాన్ని అమలు జరపాలి.
10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో స్థానిక సంస్థలు చేయవలసిన పనులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా చేపట్టరాదు. స్థానిక సంస్థల ద్వారానే ఆ పనులను చేయించాలి.
11. ఆస్తిపన్ను. డ్రైనేజిచార్జీలు, నీటిచార్జీలు తదితర పన్నులు, చార్జీలను వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకే ఉండాలి.
12. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులకు చెల్లించవలసిన ఆస్తిపన్ను చెల్లించక పోతే స్థానిక సంస్థ కఠిన చర్యలు తీసుకొనే విధంగా చట్టసవరణలు చేయాలి.
13. స్థానిక సంస్థలలో ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విడనాడాలి.
14. పట్ణణాలు, గ్రామాల అభివృధ్ధికి ఒక నిర్థిష్టమైన యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు జరపాలి.
మీ సిఫార్సులను రూపొందించే సమయంలో పై విషయాలను పరిగణన లోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి)              (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు                          కార్యదర్శి

No comments:

Post a Comment