Wednesday 18 November 2015

PRESS NOTE                                                     DATE: 18.11.2015

          విద్యాధరపురంలోని ఆర్‌టిసికి చెందిన స్థలాన్ని ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇస్టిట్యూట్‌కు అప్పగించాలని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. ఆ స్థలం ఆర్‌టిసికి అవసరంలేకపోతే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి వేయాలని డిమాండు చేస్తున్నది. ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇస్టిట్యూట్‌ అనేది వైద్యరంగంలో ఒక కార్పొరేట్‌ వ్యాపార సంస్థ. ప్రైవేటు వ్యాపార సంస్థ కోసం ఆర్‌టిసి స్థలాన్ని ఇవ్వవలసిన అవసరం ఏమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాల నిర్వహణకోసం ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తుంది. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు ఉంటే వాటిని కేటాయిస్తుంది. లేదా ప్రైవేటు ఆస్తులను భూసేకరణ చట్టప్రకారం సేకరించి కేటాయిస్తుంది. ఏవిధంగా కేటాయించిన్పటికీ అవి ప్రభుత్వ ఆస్తులే. అంటే ప్రజల ఉమ్మడి ఆస్తులు. ఏ ప్రభుత్వరంగ సంస్థ అయినా తనకు కేటాయించిన భూమి తన కార్యకలాపాలకు వాడుకోవాలి. తనకు అవసరంలేకపోతే తిరిగి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి వాపసుచేయాలి లేదా స్థానిక సంస్థకు అప్పగించాలి. అంతేకాని ఇష్టారాజ్యంగా ప్రైవేటుసంస్థలకు అప్పగించడానికి, అది ఆర్‌టిసి అధికారుల సొంత ఆస్తికాదు. విజయవాడను రాజధానిలో భాగంగా గుర్తించిన తర్వాత వివిధ డిపార్టుమెంట్లకు చెందిన విలువైన స్థలాలను కాజేయటానికి అనేకమంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు వాటికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పి.పి.పి విధానాలు, లీజువిధానాలు, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రైవేటు సంస్థలు కాజేయటానికి ఉపకరిస్తున్నాయి. రాష్ట్ర పరిపాలన విజయవాడనుండి సాగుతున్న తరుణంలో వివిధ కార్యాలయాలకు, క్వార్టర్సుకు స్థలాలు అవసరమవుతున్నాయి. ఆర్టీసీ తోసహా మరే ప్రభుత్వ రంగసంస్థకు చెందిన స్థలమైనా , ఆసంస్థ వినియోగించుకోకుండా నిరుపయోగంగా ఉంటే ఆ స్థలాలలో ప్రభుత్వ కార్యాలను నిర్మించుకొని వాడుకోవచ్చు. లేదా ప్రభుత్వ ఉద్యోగులకు వసతిగృహాలు నిర్మించవచ్చు. ఇళ్ళ స్థలాలుగా మార్చి ఇళ్లలేనివారికి కేటాయించవచ్చు. అంతేగాని ప్రభుత్వ అవసరాలకు గాని, సంస్థ అవసరాలకుగాని వినియోగించుకోకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే అవుతుంది. అందువలన ఆర్‌టీసికి అవసరంలేని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తమ కార్యాలయాలు లేదా ఉద్యోగుల క్వార్టర్సు నిర్మించి వినియోగించుకోవాలని, లేదా లేఅవుట్‌ వేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.