Friday 26 April 2019

రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలలో ఎన్నో రకాల సబ్సిడీలు భరిస్తున్నది. ఎలాంటి ఉత్పాదక ప్రయోజనం లేకుండానే ఉచితంగా డబ్బులిచ్చే పథకాలు కూడా ప్రకటిస్తున్నది. ప్ర‌జోప‌యోగ‌మైన ఆర్‌.టి.సి. న‌ష్టాల‌ను ఎందుకు ప్ర‌భుత్వం స‌బ్సిడీగా ప్ర‌భుత్వం స‌బ్సిడీగా భ‌రించ‌దు? - టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ సూటి ప్ర‌శ్న‌

ప్రచురణార్ధం:                                                                                     తేదీ:26.04.2019
          రాష్ట్రంలో ఆర్‌.టి.సి. బస్‌ చార్జీలు పెంచవలసిన అవసరం ఉందని, అధికారంలోకి రాబోయే ప్రభుత్వం బస్‌ చార్జీలు పెంచటానికి అనుమతినివ్వాలని ఆర్‌.టి.సి. యం.డి. సురేంద్రబాబు ప్రకటించటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో 128 బస్‌ డిపోలకుగాను116 బస్‌ డిపోలు నష్టాలలో ఉన్నాయని, లాభాలలో ఉన్న డిపోలు కూడా బస్‌ స్టాండ్‌లు వాణిజ్య కార్యక్రమాలు ఇవ్వటం వలన లాభాలలో ఉన్నాయని సురేంద్రబాబు వెల్లడించారు. ఆర్‌.టి.సి నష్టాలలో ఉన్నది ప్రయాణీకులు లేక కాదని, యాజమాన్య లోపం వల్లనేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఆర్‌.టి.సి వినియోగించే డిజిల్‌ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించటం, విచ్చలవిడిగా ప్రైవేటు బస్సులకు అనుమతి నివ్వటం, రాష్ట్రంలోని అన్ని గ్రామాలను కలిపేలా బస్సులను నిర్వహించకపోవటం, అస్థవ్యస్తంగా ఉన్న రోడ్ల నిర్మాణం, ప్రైవేటీకరణ విధానాలు ఆర్‌.టి.సిని దెబ్బతీస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. ''అమరావతి యాత్రకు, పోలవరం యాత్రకు, సి.యం.సభలకు జనాన్ని తరలించటానికి వినియోగించిన బస్‌లకు అయిన ఖర్చు, ఆ ఖర్చుకుగాను ప్రభుత్వం తిరిగి ఎంత చెల్లించింది'' అన్న వివరాలు ప్రజల ముందుంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేస్తున్నది. ప్రభుత్వం వివిధ రకాల ప్రజలకు ఆర్‌.టి.సి. చార్జీలలో రాయితీలు ప్రకటిస్తున్నది. ఆ రాయితీలు ప్రకటించేది ప్రభుత్వం కనుక ఆ రాయితీల వలన కలిగిన నష్టం మొత్తాన్ని ప్రభుత్వం ఆర్‌.టి.సి.కి తిరిగి చెల్లించాలి. ఆవిధంగా ప్రభుత్వం తిరిగి చెల్లించిందా లేదా అన్న విషయాన్ని బహిర్గతం చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేస్తున్నది. బస్‌ స్టాండ్‌లను వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం వలన కొన్ని డిపోలు లాభాలలో ఉన్నాయని చెప్పటం, నష్టాలను పూడ్చుకోవాలన్న పేరుతో రాష్ట్రంలో మరిన్ని బస్‌ స్టాండ్లను ప్రైవేటువ్యక్తులకు అప్పగించటానికేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో ఇంకా 1000 బస్సుల అవసరం ఉందని, సొంత బస్సుల వలన కిలో మీటరుకు రు 6లు నష్టం వస్తున్నందున క్రొత్త బస్సులు కొనటానికి బదులుగా అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సురేంద్రబాబు చెప్పారు. ఇది కేవలం ఆర్‌.టి.సి.కి సొంత బస్సులు లేకుండా చేసి ఆర్‌.టి.సి.ని నిర్వీర్యం చేయటానికి ఉద్దేశించిన చర్య. ప్రజారవాణా వ్యవస్ధను ప్రైవేటీకరించటానికి అనుసరించవలన విధానాలను సిఫార్సులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్ర 4వ ఆర్ధిక సంఘాన్ని కోరింది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్ధను ప్రైవేటీకరించటానికి నిర్ణయించిందని స్పష్టమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగానే ఆర్‌.టి.సి.ని నిర్వీర్యం చేయటానికి, ప్రజారవాణాను ప్రైవేటీకరించటానికి రకరకాల సాకులను ఆర్‌.టి.సి.పాలక వర్గం ప్రజలముందు ఉంచుతున్నదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. 
     రవాణా మానవ నాగరికతకు, సమాజ అభివృద్ధికి కీలకమైనది. అందువలన రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందులో అధిక జనాభా ఉన్న మనలాంటి దేశాలలో ప్రజారవాణా చాలా కీలకమైనది. ఛార్జీలు పెంచితే ప్రజలు ప్రజారవాణాకు దూరమవుతాయి. ఇది సమాజం మీద దుష్ప్రభావాలను చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలలో ఎన్నో రకాల సబ్సిడీలు భరిస్తున్నది. ఎలాంటి ఉత్పాదక ప్రయోజనం లేకుండానే ఉచితంగా డబ్బులిచ్చే పథకాలు కూడా ప్రకటిస్తున్నది. ఎన్నికల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, యాజయాన్య లోపాలవలన ఆర్‌.టి.సి.కి నష్టాలు వస్తే మాత్రం ప్రజలమీద ఎందుకు రుద్దాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. రాబోయే నూతన ప్రభుత్వం చార్జీల పెంపుదలకు అనుమతి నివ్వరాదని, ఆర్‌.టి.సి.కి వచ్చే నష్టం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేస్తున్నది. 

(వి.సాంబిరెడ్డి)                                                       (యం.వి.ఆంజనేయులు) 

అధ్యక్షులు                                                                     కార్యదర్శి






                                                    






Tuesday 23 April 2019

రాష్ట్రంలో నీటి ఎద్ద‌డి పై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ప్రెస్ మీట్ 23.04.2019

ప్రచురణార్ధం: తేదీ:23.04.2019
విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో నీటి సరఫరాలో కొరత ఏర్పడటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. న్యూరాజరాజేశ్వరీ పేట, రాజీవ్‌నగర్‌, వాంబే కాలనీలలో ఇప్పటికే నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నది. విజయవాడ నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం ఏప్రిల్‌ నెలలోనే 6 అడుగులకు పడిపోయింది. మండు వేసవిగా ఉండే మే, జూన్‌ నెలలో నీటి మట్టం మరింతగా పడిపోయే అవకాశం ఉంది. దీనితో నగరంలో నీటి సరఫరా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ సాగునీటికి ఉద్దేశించినది. దాని నుండే నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలో సుమారు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ నగరానికి సరిపడా నీటిని నిల్వ ఉంచుకునేటందుకు ప్రత్యేక రిజర్వాయర్‌ లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉండగానే ప్రకాశం బ్యారేజికి దిగువన కృష్ణా నదిపై చెక్‌ డ్యాం నిర్మించి నీటిని నిల్వ ఉంచాలన్న ప్రతి పాదన వచ్చింది. ఇది నిర్మిస్తే వరద నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అప్పుడు విజయవాడ నగరం పూర్తిగా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రాష్ట్ర విభజన అనంతరం పాలకులు ఆ ప్రతిపాదనను గాలికొదిలేశారు. భవిష్యత్తులో ఎప్పుడో అమరావతికిి చేరే జనానికి కావలసిన నీటి కోసం ఇప్పుడే వైకుంఠపురం వద్ద చెక్‌ డ్యాం నిర్మించడానికి పూనుకుంటున్న పాలకులు,ఇప్పటికే 10 లక్షలకు పైగా జనం ఉన్న విజయవాడ నగర ప్రజలకు కావలసిన నీటి అవసరాల కోసం చెక్‌ డ్యాం నిర్మించాలన్న ఆలోచన చేయక పోవటం దారుణం.
త్రాగునీటి సమస్య కేవలం విజయవాడ నగరానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో త్రాగు నీటి సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడి పోయాయి. కొన్ని మండలాలలో చలమలు, ఊటల నుండి కొబ్బరి చిప్పలతో, డబ్బాలతో తోడి పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడి పోయాయి. తిరుపతిలో ట్యాంకర్లద్వారా నీటిని తెప్పించుకోవలసి వస్తున్నది. ఉత్తరాంధ్రలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపుర్లం, గుంటూరు జిల్లా వినుకొండలలో 3 రోజులకొకసారి నీరిస్తున్నారు. విశాఖ రూరల్‌లో 126 గ్రామాలలో నీటి కొరత ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో దాదాపు జిల్లా అంతటా నీటి సమస్య తీవ్రంగాఉన్నది.గిద్దలూరులో రోజూ 20లక్షల లీటర్ల లోటు ఉందని వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ, మాచర్ల, గురజాల, కృష్ణా జిల్లాలో తిరువూరు, మైలవరం, గంపలగూడెం లాంటి మండలాలలో నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రం మొత్తం త్రాగునీటి సమస్య తీవ్రమవుతున్నది. ప్రభుత్వాలు త్రాగునీటి సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసిన దాని ఫలితంగానే త్రాగునీటి కరువు ఏర్పడుతున్నది. మన పాలకులు సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, త్రాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వటం లేదు. వేసవి రాగానే సమీక్షల మీద సమీక్షలు జరపటం అక్కడక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం మినహా, ఈ సమస్యను శాశ్వితంగా పరిష్కరించాలన్న దృక్ఫథంలేదు. ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించటంలో వైఫల్యం చెందిన పాలకులు అభివృధ్ధిని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.
ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం రాష్ట్రంలో మంచి నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత నివ్వాలని, విజయవాడ నగరానికి మంచినీటి సరఫరా కోసం కనీసం 5 టి.యం.సిల నీటిని నిల్వ ఉంచేవిధంగా చెక్‌ డ్యాంలు నిర్మించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. ఈ వేసవిలో విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా సజావుగా జరిగేటందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నది.


వి.సాంబిరెడ్డి                                                        యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                      కార్యదర్శి