Saturday 14 April 2018

Press Note released at Press meet on 14.4.18

14.04.2018 న టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌

ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలలో  సౌకర్యాలు కల్పించటం కోసం ఏమాత్రం చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క భవనం కూడా పూర్తికాని అమరావతిలో ఎప్పుడో కల్పించబోయే సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టి సదస్సులు నిర్వహించటం  ఎవరి ప్రయోజనం కోసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. మన రాష్ట్రంలో మున్సిపల్‌ పట్టణాలు, నగరాలు 110  ఉన్నాయి. వీటిలో 2011 జనాభాలెక్కల ప్రకారం 1 కోటీ 36 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 30 లక్షల కుటుంబాలున్నాయి. ఈ నగరాలన్నీ మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వేసవిలో అనేక పట్టణాలలో నీటి కొరత తీవ్రంగా తలెత్తుతున్నది.  అనేక పట్టణాలు నగరాలలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు లేవు.  సరైన రోడ్లు లేవు. పార్కింగ్‌ సౌకర్యాలు లేవు. సరైన మురుగునీటి వ్యవస్థలేదు. పారిశుధ్యం పరిష్కారానికి దీర్ఘకాలిక చర్యలు లేవు. కాలుష్య నివారణకు చర్యలు లేవు. పబ్లిక్‌ రవాణా వ్యవస్థ కుంచించుక పోతున్నది. విద్య వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఉపాధిó లభించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అనేక చోట్ల పాఠశాలలకు భవనాలు లేవు. అద్దెలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. గృహ సమస్య తీవ్రంగా ఉంది. ఇలా పట్టణాలు, నగరాలలో ఉండే ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.   నివాసయోగ్య పట్టణంగా రూపొందించడం కోసం ప్రతి పట్టణానికి ఒక నిర్థిష్టమైన ప్రణాళిక ఉండాలి. అలాంటి ప్రణాళికలు లేవు. ఇవన్నీ  పట్టించుకోకుండా, వీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టకుండా, ఎప్పుడో వచ్చే అమరావతికోసం సదస్సులు నిర్వహించటం, హాపీ సిటీ డిక్లరేషన్‌ పేరుతో తీర్మానాలు చేయటం, ఇప్పటికే పట్టణాలలో నివసిస్తున్న ప్రజలను పరిహసించటమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. ఈసదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగారు రాజధాని అమరావతిని అత్యంత నివాస యోగ్యమైన, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన నగరంగా తీర్చిదిద్దుతామని, అన్నీ బ్యాటరీ వాహనాలే వాడతామని, 70 నుండి 80 శాతం ప్రజా రవాణావ్యవస్థ ద్వారా రవాణా జరుపుతామని, సైకిల్‌ ట్రాక్‌లు నిర్మిస్తామని, సౌరవిద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని అన్నారు. ఇలా అమరావతిలో కల్పించే అనేక  సౌకర్యాలగురించి ఏకరువు పెట్టారు. ఇవన్నీ ఇప్పటికే  పట్టణాలలో నివసిస్తున్న ప్రజలకు అవసరంలేదా అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది.

పట్టణాలలో నగరాలలో సమస్యల పరిష్కారాలకోసం తగిన చర్యలను రూపొందించటానికి ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు, పట్టణ సమస్యలపై పని చేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులు, పట్టణ సమస్యలై పనిచేస్తున్న నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌లు కావాలి. అంతేకాని జగ్గీ వాసుదేవ్‌ లాంటి ఆధ్యాత్మిక గురువులు కాదు. పచ్చని అడవులను, పంటపొలాలను నాశనం చేస్తూ పచ్చదనాన్ని గురించి వల్లించటం హాస్యాస్పదం. అదే విధంగా మన పట్టణాలను నగరాలను సౌకర్యవంతంగా రూపొందించటానికి ఉపయోగపడేది మన దేశపు ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లే తప్ప విదేశీ సంస్థలుకావు.  ఇప్పటికైనా ఇటువంటి జిమ్మిక్కులు మాని, ముందుగా ఇప్పటికే  పట్టణాలలో నివసిస్తున్న  ప్రజల సమస్యల పరిష్కారంకోసం ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించాలని, అందులో ఖచ్చితంగా మన దేశీయ ఆర్కిటెక్‌లు, ఇంజనీర్లు, పట్టణ సమస్యలపై పని చేస్తున్న అనుభవజ్ఞులైన అధికారులు, పట్టణ సమస్యలై పనిచేస్తున్న నాన్‌ గవర్నమెంటల్‌ ఆర్గనైజేషన్‌లను, వివిధ ప్రజా సంఘాలను, ట్రేడ్‌ యూనియన్లను, రాజకీయపార్టీలను భాగస్వాములను చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.                                                   

వి.సాంబిరెడ్డి                            యం.వి.ఆంజనేయులు
   అధ్యక్షులు కార్యదర్శి