Sunday 8 April 2012

కృష్ణానదిపై 4 లైన్ల రోడ్డు బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీలకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్రాసిన లేఖ

                                                                 తేదీ:16.03.2012
గౌరవనీయులైన కృష్ణా జిల్లా కలెక్టరు గారికి,
ఆర్యా!
విషయం:- కృష్ణ నదిపై 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణాన్ని గురించిన ప్రతిపాదన

     విజయవాడ నగరం నానాటికి పెరుగుతున్నది. దీనితో విజయవాడ నగరానికి బయటి ప్రాంతాలనుండి వచ్చిపోయే వారి సంఖ్యకూడా పెరుగుతున్నది. కృష్ణానదికి దక్షిణం వైపున మంగళగిరి, అమరావతి మధ్యలో అనేక గ్రామాలున్నాయి. వీరిలో అత్యధికులు ప్రతి రోజు విజయవాడ ఏదో ఒక పనిమీద వచ్చి పోతుంటారు. ముఖ్యంగా సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌,ఎర్రుబాలెం, పెనుమాక, నవులూరు, కృష్ణాయపాలెం తదితర గ్రామాలనుండి ప్రతి రోజు విజయవాడ వచ్చి పనులు చేసుకొని పోతుంటారు. వీరిలో అత్యధికులకు నివాసం ఆగ్రామాలలో ఉంటే, ఉపాధి మాత్రం విజయవాడలో ఉంటుంది.అందువలన వీరు అనివార్యంగా విజయవాడ రావలసియున్నది.

       తంలో ఈ గ్రామాలనుండి ప్రకాశం బ్యారేజిమీదుగా అత్యధికంగా బస్సులు ఉండేవి. అవి ఆప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేవి. ఆతరువాత ప్రకాశం బ్యారేజిమీద బస్సుల రాక పోకలను నిలిపి వేశారు. దీనితో ఆప్రాంత ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. కేవలం మంగళగిరినుండి మాత్రమే కనక దుర్గమ్మ వారధి మీదుగా బస్సులు రావటానికి వీలుంది. కాని సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌, నవులూరు,ఎర్రుబాలెం,పెనుమాక, కృష్ణాయపాలెం, అమరావతి తదితర గ్రామాలనుండి నేరుగా విజయవాడకు బస్సులు రావటానికి మార్గం లేదు. ఒకటి రెండు బస్సులు మాత్రం ఉండవల్లి సెంటరునుండి కాలువ కట్టమీదుగా, రైలు పట్ల్టాల క్రిందుగా తిరిగి జాతీయ రహదారిలో కలసి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడకు రావలసి వస్తున్నది. ఇది చుట్టు తిరుగుడు ప్రయాణంగా ఉండటం, సమయం అధికంగా తీసుకోవటం, సౌకర్యంగా లేకపోవటంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించవలసి వస్తున్నది. కొంతమంది ఆ గ్రామాలలో ఉన్న తమ ఇళ్లను వదలి విజయవాడలో అద్దెకు ఇళ్ళు తీసుకొని నివశిస్తున్నారు. విజయవాడ వచ్చి పోవటానికి సరౖౖెన రహదారిలేక పోవటం వలననే ఆ ప్రాంతాల ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది.

      నగరానికైనా ఇతర ప్రాంతాలనుండి ప్రజలు నిరంతరం వచ్చి పోతుంటేనే ఆ నగరం అభివృధ్ధి చెందుతుంది. కనుక ప్రజలు నగరానికి వచ్చి పోవటానికి తగిన రహదారి ఏర్పాటు చేయవలసి ఉన్నది. అంతే కాకుండా విజయవాడ నగరం గన్నవరం, కంకిపాడుల వైపుమాత్రమే విస్తరిస్తున్నది. కాని దక్షిణం వైపు విస్తరించడానికి కృష్ణానది అడ్డుగా ఉన్నది. నగరం దక్షిణం వైపుకూడా విస్తరించాలంటే నదికి దక్షిణం ప్రాంతంలోని గ్రామాలను విజయవాడ నగరంతో అనుసంధానం చేస్తూ రహదారి ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాలనుండి సత్వర రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి.

       అంతే కాకుండా విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలుగా ఉన్నాయి. కృష్ణా,గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఈ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి లేదు. ఉన్న కనకదుర్గమ్మ వారధి జాతీయ రహదారులకు చెందినది. జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అది ఉపయోగించుకునే అవకాశంలేదు. కనుక ఈ ప్రాంతంలో కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి అవసరం ఉంది.

  పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా ఒక ప్రతిపాదనను మీ ముందుంచుతున్నాము. కృష్ణా నదికి దక్షిణం వైపున ఉన్న సీతానగరం నుండి, నదికి ఉత్తరం వైపున ఉన్న శనైశ్వరస్వామి గుడివరకు కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మిస్తే నదికి దక్షిణం వైపు ఉన్న గ్రామాల నుండి రాక పోకలు సజావుగా సాగుతాయి. బస్సు సౌకర్యం ఏర్పడుతుంది. రాక పోకలు సజావుగా సాగితే ఆగ్రామాల ప్రజలు విజయవాడకు నివాసం మార్చే అవసరం ఉండదు. విజయవాడ నగరం దక్షిణం వైపుకు కూడా విస్తరించడానికి ఈ బ్రిడ్జి దోహద పడుతుంది. కనుక కనుక మా ప్రతిపాదనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము.
                             అభివందనాలతో

 వి. సాంబిరెడ్డి                                      యం.వి.ఆంజనేయులు 
అధ్యక్షులు                                                 కార్యదర్శి

టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఈ బ్రిడ్జి విషయమై క్రింది వారికి లేఖలను వ్రాశింది.
కృష్ణా జిల్లా
01. కలెక్టర్‌, కృష్ణా జిల్లా
02. మున్సిపల్‌ కమీషనర్‌, విజయవాడ
03. వైస్‌ ఛైర్మెన్‌, వి.జి.టి.యం. ఉడా
04. శ్రీ లగడపాటి రాజగోపాల్‌, యం.పి. విజయవాడ
05. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్‌, శాసన సభ్యులు, విజయవాడ పశ్చిమం.
06. శ్రీ మల్లాది విష్ణు, శాసన సభ్యులు, విజయవాడ సెంట్రల్‌.
07. శ్రీ యలమంచిలి రవి, శాసన సభ్యులు, విజయవాడ తూర్పు.
08. కాంగ్రెస్‌ (ఐ) పార్టీ, విజయవాడ
09. తెలుగు దేశం పార్టీ, విజయవాడ
10. సి.పి.ఐ., విజయవాడ
11. సి.పి.ఐ(యం), విజయవాడ
12. లోక్‌ సత్తా పార్టీ, విజయవాడ

గుంటూరు జిల్లా
01. కలెక్టర్‌, గుంటూరు జిల్లా
02. మున్సిపల్‌ కమీషనర్‌, తాడేపల్లి
03. మున్సిపల్‌ కమీషనర్‌,మంగళగిరి   
04. శ్రీ రాయపాటి సాంబశివరావు, ఎం.పి. గుంటూరు
05. శ్రీమతి కె.కమల, శాసన సభ్యురాలు, మంగళగిరి.