బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారికి వ్రాశిన లేఖ.
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారికి,
ఆర్యా!
విషయం:- బెంజి సర్కిల్ వద్ద ప్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి.........
విజయవాడ నగరంలోని మహాత్మా గాంధీరోడ్డును బెంజి సర్కిల్ వద్ద దాటుకుంటూ 5వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది. మద్రాసు నుండి కలకత్తావెళ్ళే భారీవాహానాలు, హైదరాబాద్ వైపునుండి 9 వ నెంబరు జాతీయ రహదారి ద్వారా కలకత్తా, మరియు మచిలీపట్టణం వెళ్ళే భారీవాహానాలు 5వనెంబరు జతీయ రహాదారి ద్వారావచ్చి బెంజి సర్కిల్ వద్ద చీలుతాయి. అందువలన బెంజి సర్కిల్ వద్ద విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడి నిలిచి పోతున్నది. దీనితో నగరవాసులకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది.అందువలన బెంజి సర్కిల్ వద్ద ప్లైఓవర్‌ను నిర్మించాలని విజయవాడ నగరవాసులు ఎంతో కాలంగా కోరుతున్నారు.అయినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు.
అయితే ఇటీవల బెంజి సర్కిల్ వద్ద ప్లైఓవర్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నదని,నటరాజన్ గుల్జార్ రోడ్డు (టిక్కిల్ రోడ్డు)నుండి ప్రారంభించి,బెంజి సర్కిల్ మీదుగా పటమట యన్.టి.ఆర్.విగ్రహాం వరకు మహాత్మా గాంధీ రోడ్డు మీద ఈ ప్లైఓవర్‌ను నిర్మించబోతున్నారని పత్రికలలో చూచాము.
ఈ విషయంపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి 19.02.2010న ది ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హాలులో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.నగరంలోని వర్తక వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఛార్టెడ్ ఎకౌంటెట్లు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు, మాజీ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్,ఆ పరిసర ప్రాంతాల నివాసులు,పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు,ఛిల్డ్రన్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలవారు,మోటారు ట్రాన్స్ పోర్టు ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు.వారందరు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి తమ పరిశీలనార్ధం మీముందుంచుతున్నాము.
అభిప్రాయాలు:
01. జాతీయ రహాదారి మీద వస్తున్న భారీ వాహానాల వలననే బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. కారణ మేమంటే మహాత్మా గాంధీ రోడ్డు మీద బెంజి సర్కిల్ వద్ద ఎలాంటి వాహానాలు ఆగవు.ఆగే అవసరం కూడా లేదు.అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే స్థానిక వాహానాల వలన ట్రాఫిక్ సమస్య తలెత్తడం లేదు.ట్రాఫిక్ సమస్యకు కారణం జాతీయ రహాదారి మీద వస్తున్న భారీ వాహానాలే.కనుక భారీ వాహానాలను మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చేస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య ఉండదు.అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద కాకుండా జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మిస్తే ఈసమస్య పరిష్కారమౌతుంది.
02. మహాత్మా గాంధీ రోడ్డు మీద ప్లైఓవర్ నిర్మించి, మహాత్మా గాంధీ రోడ్డుమీద వచ్చే ట్రాఫిక్‌ను జాతీయ రహాదారిపై వచ్చే ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చేసినా బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది.అయితే దీని ప్రయోజనం పరిమితంగా ఉండటవేు కాకుండా ట్రాఫిక్‌కు కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి.ఇటీవలనే మహాత్మాగాంధీ రోడ్డును 120అడుగులుండేవిధంగా వెడల్పు చేశారు.ఆ సందర్భంగా పట్టా భూములలో నిర్మించుకున్న ఇళను సైతం తొలగించి వెడల్పు చేసారు.ఈ రోడ్డు మీద సిటీ బస్సులు,చిన్న కార్లు,మోటారు సైకిళు,ఆటోలు,సైకిల్ రిక్షాలు,పాల వాహానాలు, ఫైరింజన్లు, అంబులెన్స్‌లు ,స్కూల్‌బస్సులు తిరుగుతుంటాయి. నగరంలో ఇది ఒక ప్రధాన రహాదారి.నగరంలో అనేక ప్రాంతాలకు వెళే సిటీ బస్సులు ఈ రోడ్డు ద్వారానే వెళ్లాలి. నగర భౌగోళిక పరిస్థితి దృష్ట్యా,ఇతర మార్గాలలో వెళే అవకాశం కూడా లేదు.అలాంటి ఈ రోడ్డు మీద ప్లైఓవర్ నిర్మిస్తే ఈ రోడ్డు మరల ఇరుకుగా తయారవుతుంది.జాతీయ రహాదారినుండి మహాత్మా గాంధీ రోడ్డులోకి ప్రవేశించే సిటీ బస్సులు,ఇతర వాహానాలకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది.ఇది మరల ట్రాఫిక్ సమస్యకు కారణమవుతుందే తప్ప పరిష్కారం కాదు.అదే జాతీయ రహాదారిపై ప్లైఓవర్ నిర్మిస్తే అటు జాతీయ రహాదారిపై వెళే వాహానాలకు గాని,ఇటు మహాత్మా గాంధీ రోడ్డు మీద వెళే ట్రాఫిక్‌కుగాని ఎలాంటి ఆటంకం ఉండదు.సమస్య పరిష్కార మవుతుంది.
03. అంతేకాకుండా, నటరాజన్ గుల్జార్ రోడ్డు (టిక్కిల్ రోడ్డు) నుండి బెంజి సర్కిల్ మీదుగా పటమట యన్.టి.ఆర్. విగ్రహాం వరకు మహాత్మాగాంధీ రోడ్డుపై 3 ప్రధానమైన బస్సు స్టాపులు ఉన్నాయి. వీటిని తరలించే అవకాశం కూడా లేదు.మహాత్మా గాంధీ రోడ్డు మీద ప్లైఓవర్ నిర్మిస్తే ఈ బస్సు స్టాపులను రద్దు చేయవలసి ఉంటుంది.దీనివలన నగరంలోని అత్యధిక బస్సు ప్రయాణీకులకు ఇది ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.
04. మహాత్మాగాంధీ రోడ్డులో బి.ఆర్.టి.యస్ బస్సు కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవైపు ప్లైఓవర్ నిర్మించి,మరోవైపు బి.ఆర్.టి.యస్ బస్సులకు డెడికేటెడ్ లైన్ ఏర్పాటు చేస్తే,ఇక ఇతర వాహానాలకు తావుండదు. ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది.
05.జాతీయ రహాదారిపై ప్లైఓవర్ నిర్మిస్తే మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. బెంజ్ సర్కిల్‌తో బాటుగా నిర్మలా కాన్వెంట్ రోడ్డు,ప్రభుత్వ ఐ.టి.ఐ.నుండి గురునానక్‌నగర్ వెళే రోడ్డు జాతీయ రహాదారిని దాటుతున్నాయి.ఈ మధ్యలో ఉన్న కాలనీలలో ఇంకా అనేక చిన్న రోడ్లు ఉన్నాయి.ఈ ప్రాంతంలో అనేక ముఖ్యమైన విద్యాలయాలు కూడా ఉన్నాయి.జాతీయ రహాదారిమీద స్క్యూ బ్రిడ్జినుండి మొదలై హెల్త్ యూనివర్శిటీవరకు ప్లైఓవర్ నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ప్రస్తుతం జాతీయ రహాదారి వలన, నగరం జాతీయ రహాదారికి తూర్పు, పడమర ప్రాంతాలుగా చీలి ఉన్నది. జాతీయ రహాదారిపై ప్లైఓవర్ నిర్మిస్తే ఈ రెండు ప్రాంతాలు కలిసి పోతాయి.ఆటోనగర్‌లోకి భారీ వాహానాలు ప్రవేశించడానికి గురునానక్ రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డుగా అభివృద్ధి చెంది, పడమటలో ట్రాఫిక్ వత్తిడి తగ్గుతుంది. రోడ్డుకు ఇరు వైపులనున్న కాలనీల నుండి వచ్చే రోడ్లు కలిసి పోవడంతో కొన్ని రోడ్ల మీదనే ఏర్పడుతున్న ట్రాఫిక్ వత్తిడి తగ్గుతుంది.అందువలన జాతీయ రహాదారిపై ప్లైఓవర్ నిర్మించడమే సరైనది.
06. నగరానికి ఒక ముఖ్యమైన ప్లైఓవర్ నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యపై సమగ్రమైన అధ్యయనం జరిపి ప్లైఓవర్ నిర్మిస్తే అది నగర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతుంది.గతంలో వి.జి.టి.యం.ఉడా వారు ఒక అధ్యయనం జరిపి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ మాస్టర్ ప్లానులో కూడా జాతీయ రహాదారి మీదనే ప్లైఓవర్ నిర్మించాలని సూచించారు.
07. నగరంలో నిర్మించే ప్లైఓవర్ నగర ప్రజలకు సౌకర్యయుతంగా ఉండటవేు కాకుండా, నగర అందాన్ని ఇనుమడింపజేసేదిగా కూడా ఉండాలి. జాతీయ రహాదారిపై ప్లైఓవర్ నిర్మిస్తేనే నగర ప్రజలకు సౌకర్యంతో బాటుగా, నగరానికి వన్నె తెచ్చేదిగా ఉంటుంది.
08. జాతీయ రహాదారిపై ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నందున గతంలో 2 లైన్లుగా ఉన్న 5వనెంబరు జాతీయ రహాదారిని 4 లైన్లుగా మార్చారు. ప్రస్తుతం 6 లైన్లుగా మార్చుతున్నారు. జాతీయ రహాదారిపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందనే దీనర్ధం. ట్రాఫిక్ విపరీతంగాపెరిగినప్పుడు దానిని పరిష్కరించవలసిన బాధ్యత జాతీయ రహాదారుల సంస్థ(నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా ) పై ఉన్నది.చెన్నై నుండి కలకత్తా మధ్యలో,విజయవాడతో పోల్చినప్పుడు చాలాతక్కువ ట్రాఫిక్ ఉన్న పట్టణాలకు,కొన్ని పల్లెటూళ్ళకు సైతం జాతీయ రహాదారుల సంస్థరింగ్ రోడ్డులను నిర్మించింది.కాని రెండు జాతీయ రహాదారుల కూడలిగా ఉండి, ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్న విజయవాడ నగరానికి మాత్రం రిండ్ రోడ్డును నిర్మించలేదు.విజయవాడ నగరానికి రింగ్ రోడ్డును నిర్మించి ఉన్నట్లైతే ఈ సమస్య చాలావరకు పరిష్కారమయ్యేది.
09. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మించవలసింది జాతీయ రహాదారుల సంస్థ . అది జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు నగరపాలక సంస్థకు ఆర్ధిక భారం తప్పుతుంది. నగర ప్రయోజనం నెరవేరుతుంది.
పైవన్నీ 19.02.2010న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకాభిప్రాయంగా వచ్చిన అభిప్రాయాలు.గతంలో విజయవాడ నగరంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పోలీస్ కంట్రోల్ రూంనుండి వినాయకుని గుడివరకు 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్లైఓవర్ నిర్మించారు.కాని అది ట్రాఫిక్ సమస్యను పరిష్కరించక పోగా కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యకు అదే కారణమవుతున్నది. ఇప్పుడు నిర్మించబోయే ప్లైఓవర్ అంతకంటే ముఖ్యమైనది.అందువలననే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దానికోసవేు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరిపాము.ఏవిధంగా చూచినా బెంజి సర్కిల్ వద్ద జాతీయ రహాదారిపై ప్లైఓవర్ నిర్మించడవేు నగర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారమని అందరూ అభిప్రాయపడ్డారు.
నగర ప్రజల అభిప్రాయాన్ని ,నగర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని మహాత్మా గాంధీ రోడ్డుకు బదులుగా స్క్యూ బ్రిడ్జి నుండి బెంజి సర్కిల్ మీదుగా హోల్త్ యూనివర్శిటీవరకు 5వనెంబరు జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాము.
అభివందనాతో
(వి. సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి
తేదీ: 22.02.2010
తేదీ: 22.02.2010
No comments:
Post a Comment