Friday, 27 August 2010

Press Note on G.O.Rt No 973 dt 21.08.2010

ప్రచురణార్ధం                                              తేదీ:25.08.2010

    చెత్త తొలగింపుపై చార్జీల ప్రతిపాదనను తిరస్కరిస్తూ నగరపాలక సంస్థ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో  ఇవ్వడం ప్రజాస్వామ్య విరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఈ మేరకు నగర మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఒక మెమొరాండాన్ని సమర్పించింది.  డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని,అనేక మంది కార్పొరేటర్లు, విజయవాడ నగర పౌరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని నగర మేయర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ తప్పు పడుతున్నది. నగర పాలక సంస్థ చేసిన తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం  సంజాయిషీ  కోరినప్పుడు సంజాయిషీ ఇవ్వవలసింది నగర కౌన్సిల్‌ తప్ప నగరమేయర్‌ వ్యక్తిగతంగా కాదు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ లేఖను నగర కౌన్సిల్‌ లోపెట్టి చర్చించి కౌన్సిల్‌ నిర్ణయాన్ని సమాధానంగా పంపాలి. అందుకు భిన్నంగా మేయర్‌ గారు లేఖ వ్రాయటం, అందులో   డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు విధించుకోవచ్చని అనేకమంది కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారని,విజయవాడ నగర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని  వ్రాయటం దారుణం. నిజానికి  నగరపాలక సంస్థ ఏనాడు ఈ విషయంపై ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. నగరంలో అపార్టుమెంట్‌ అసోసియేషన్లు, కాలనీల అసోసియేషన్లు, ఉద్యోగ కార్మిక సంఘాలు, వర్తక వాణిజ్యవర్గాల సంఘాలు అనేకం ఉన్నాయి. వీరెవరినీ సమావేశ పరిచి సంప్రదించలేదు.  పైగా  ఈ ప్రతిపాదన కౌన్సిల్‌ ముందుకు వచ్చిన సందర్భంగా సి.పి.ఐ(యం) వారు ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. 70 వేలమందికి పైగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ  ఓటుచేశారు.  ఎవరితోనూ సమావేశాలు  నిర్వహించకుండా, ఏవిధమైన అభిప్రాయ సేకరణ జరగకుండా, యు.జి.డి. పనులు అయిన తర్వాత చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని విజయవాడ నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మేయరుగారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటం  ప్రజాస్వామ్య విరుధ్ధం. ఈవిషయంపై  మేయరుగారు 25.06.2010 న రాష్ట్ర్నపభుత్వానికి సంజాయిషీ ఇస్తూ  వ్రాసిన  లేఖను పూర్తిగా ప్రజల ముందుంచాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

     చార్జీల ప్రతి పాదనను కౌన్సిల్‌ తిరస్కరించటం విజయవాడ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ చేపట్టిన సంస్కరణల స్పూర్తికి విరుధ్ధమని జీ.వోలో పేర్కొనటంపట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరల ప్రతి పనికి లెక్కగట్టి వసూలు చేయటమే సంస్కరణల స్పూర్తి అయితే, ఆ సంస్కరణలు నగర ప్రజలకు అక్కరలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్లున్నది.  ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానిక అవసరాలకై స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థలు చేసే ప్రతి పనికి రేటుగట్టి వసూలు చేసుకోండని చెప్పటమే రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఉద్దేశ్యం.దీనిని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ తిరస్కరిస్తున్నది. తాము చెల్లిస్తున్న పన్నులనుండి నగరపాలక సంస్థకు రావలసిన నిధులను క్రమం తప్పకుండా పూర్తిగా విడుదల చేయటం, ప్రణాళికాబధ్ధమైన అభివృద్ధి జరగటం కోసం నిర్ధిష్ట చర్యలు చేపట్టడానికి తగిన సంస్కరణలు నగర ప్రజలకు కావాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

     ఆర్ధిక విషయాలతో ముడిపడి ఉన్న ప్రతిపాదనలను కౌన్సిల్‌ తిరస్కరించటం మూలంగా కార్పొరేషన్‌ ఆర్ధిక స్థితి దిగజారటమేకాకుండా,  కార్పొరేషన్‌ చేసే ఏపనికి చార్జీలు విధించదన్న సంకేతం నగర ప్రజలకు వెళుతుందని ఈ జీ.వో లో ఇచ్చారు. ఇది నగర పాలక సంస్థ ప్రజాతంత్ర పనివిధానాన్ని, నగర ప్రజలను అవమాన పరచటంగానే టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.  నిజానికి స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్నారు. కనుక నగర ప్రజలు కార్పొరేషన్‌ చేసే ఏపనికి మరల చార్జీలు చెల్లించనవసరంలేదు.  స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి విజయవాడ నగర అభివృద్ధికి, స్ధానిక సంస్థలకు ఎందుకు నిధులివ్వరని, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు విడుదల చేయక పోవటం, ప్రాధాన్యతలను ఎంచుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా పనులు నిర్వహించటం నగర పాలక సంస్థ అర్ధిక స్థితి క్షీణించ డానికి కారణాలు తప్ప, చెత్త సేకరణకు పన్ను విధించక పోవటం వలన కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది.

    ఇప్పటికైనా కౌన్సిల్‌ తీర్మానాన్ని గౌరవించి, జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను రద్దు చేయాలని  టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది. రద్దు చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా చూడవలసినదిగా మేయరు గారిని, నగర కార్పోరేటర్లను, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

                         

           (వి. సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు)

             అధ్యక్షులు                                      కార్యదర్శి        

No comments:

Post a Comment