Thursday, 22 July 2010

Necessity of Public Lands for Democratic process

ప్రభుత్వ ఖాళీ స్థలాలు హరించడమంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే 
       మనిషి సంఘ జీవి.మనిషి జీవించాలంటే అనివార్యంగా ఇతరులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి.ఇతర మానవులతో సంబంధాలు లేకుండా ఏ మనిషి జీవించలేడు.ఇతర మానవులతో సంబంధాలు కలిగి ఉండాలంటే వారిమధ్య సమచారం ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిసరి. ఈ సమాజం ఎలా నడవాలి అన్న విషయం మీద, అలాగే సమాజంలోని వివిధ విషయాల మీద చర్చ జరుగుతుంది. విషయాలను అధ్యయనం చేసిన వారు, తాము అధ్యనం చేసిన విషయాలను పది మందికీ చెప్పాలనుకుంటారు. అలాగే విషయాలపై పది మందితో చర్చించాలనుకుంటారు. అలా చెప్పుకోవడం లేదా చర్చించు కోవడం కోసం పది మంది ఒకచోట కలవడాన్నే సభ లేక సమావేశం అంటాము. అందువలన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మానవ హక్కు.మానవ సమాజ హక్కు.
       సభలు, సమావేశాలు జరగాలంటే స్థలం కావాలి. స్థలం లేకుండా సభలు, సమావేశాలు జరగవు. కనుక సభలు, సమావేశాలకోసం స్థలం ఏర్పాటు చేసుకోవడం సమాజ అవసరం.సభలు,సమావేశాల ద్వారా పరస్పర అవగాహన కల్పించు కోవడాన్ని, చర్చించి నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజాతంత్ర పద్ధతి అంటాము.కనుక సభలు,సమావేశాలు నిర్వహించడం, వాటికి కావలసిన స్థలాన్ని పొందటం ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కు.ఈ ప్రజాతంత్ర హక్కును  మన విజయవాడ నగర పాలక సంస్థ కాలరాస్తున్నది.అదెలాగో చూద్దాం.
       ఎన్నోబహిరంగసభలకు,ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన స్వరాజ్యమైదానం కాల గర్భంలో కుంచించుక పోయింది.కొంత భాగాన్ని రైతు బజారు ఆక్రమించింది.మరి కొంత భాగాన్ని ఫైర్ స్టేషన్ ఆక్రమించింది.ఇలా సగభాగం ఆక్రమణలకు గురైంది.ఇక మిగిలిన సగభాగంలోమాత్రమేసభలు,సమావేశాలుజరుపుకునేఅవకాశముంది.పైకి  అవకాశమున్నట్లుకనుపిస్తున్నా,వాస్తవానికి  ఆ అవకాశం అందరికీ అందుబాటులో లేదు.కారణమేమంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతిసేవకూ,ప్రతిదానికి పూర్తి ధరను వశూలు చేయాలని ప్రపంచ బ్యాంకు మన ప్రభుత్వాలనాదేశించింది.ఫ్రజాప్రయోజనాలను ఫణంగా పెట్టి,మనప్రభుత్వాలు ఆ ఆదేశాలకు తలొగ్గాయి.దాని ఫలితంగానే స్వరాజ్య మైదానానికి కూడా రేటు నిర్ణయించారు.పూర్తి ధరను వశూలు చేయాలన్న ఆదేశానుసారం స్వరాజ్య మైదానానికిఅద్దెను రోజుకు రు.50,000లుగా నిర్ణయించారు.అంటే ఒకరోజు బహిరంగసభ నిర్వహించాలంటే రు.50,౦౦౦ లను మనం ఇరిగేషన్ డిపార్టుమెంటుకు చెల్లించాలన్నమాట. మా నగరంలో ఉన్న ఈ స్థలం మానగర ప్రజల ప్రజాతంత్ర అవసరాలకు అందుబాటులో ఉండాలని,దీనికి ఎటువంటి చార్జీలు వశూలు చేయరాదని,మన విజయవాడ నగర పాలక సంస్థ కనీసం ఒక తీర్మానం కూడా చేయలేకపోయింది.
       ఇక జింఖానా గ్రౌండ్స్ విషయం.ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోనే ఉన్నది. అయినప్పటికీ దీని అద్దె కూడా ఎక్కువే. ఇందులో సభలు,సమావేశాలు జరపాలన్నా వేల రూపాయలు చెల్లించవలశిందే.
       పాత బస్ స్టాండ్ స్థలాన్ని ఒక మంచి పార్కుగా ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలు ఒకచోట చేరి ముచ్చటించుకునే కూడలిగా ఏర్పాటు చేయవచ్చు.బహిరంగ కార్యక్రమాలకు సభాస్థలిగా తయారు చేయవచ్చు.కాని దానిని ఆర్.టీ.సీ. వారు అంబికా గ్రూపుకు అప్పగించేశారు.వారు షాపింగ్ మాల్ కడతారట.దీనివలన అంబికా గ్రూపు వారికి లాభం తప్ప,మన నగర ప్రజలకేమి ఒరుగుతుంది?నగరప్రజలప్రజాతంత్ర హక్కును కాపాడటం కన్న అంబికా గ్రూపు వారి లాభాలే మన పాలకులకు ముఖ్యమైనాయి. మన విజయవాడ నగర పాలక సంస్థ,మా నగర ప్రజల ప్రజతంత్ర అవసరాలకు ఇది అవసరమని ఒక్క మాటకూడా మాట్లాడలేక పోయింది.
     స్వరాజ్య మైదానినికి ఎదురుగా, ఇరిగేషన్ డిపార్ట్ మెంటుకు చెందిన కెనాల్ గెస్ట్ హౌస్ ఊండేది. ఇప్పుడాస్థలాన్ని లైలా గ్రూపు సంస్థలకు ఇచ్చారు. వారు అక్కడ ఒక మల్టీప్లెక్స్ ధియేటర్ నిర్మిస్తున్నారు. ధియేటర్ నిర్మించేది లాభాలు సంపాదించుకోవడానికి. లాభాలు పొందాలనుకునేవారు స్థలం కొని కట్టుకుంటారు.నగర ప్రజల ప్రయోజనాలను గాలికి వదలి,ప్రభుత్వ స్థలాలను ప్రైవేటువారి లాభాలకోసం ఇవ్వ వలసిన అవసరమేముంది? దీనిని చిన్నపాటి సభాస్థలిగా ఎందుకు మార్చకూడదు?
        ఇలాంటి స్థలాలు నగరంలో చిన్నవి పెద్దవి అనేకమున్నాయి. బృందావన కాలనీలో, ఏ.పి.ఐ.ఐ.సి. కాలనీలో ఉన్న స్థలాలను వివిధ పేర్లతో ప్రైవేటు వారికి అప్పగిస్తూ నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానాలు చేశారు.
       గతంలో పాఠశాలలకున్న ఖళీ స్థలాలలో చిన్నచిన్న సభలు, సమావేశాలు  జరుగుతూ ఉండేవి. ఇప్పుడు వాటి అద్దెలుకూడా రు.1000నుండి రు.1500లు చేశారు.కళాక్షేత్రం అద్దె రు 15,000లు.ఇతర మున్సిపల్ కల్యాణ మంటపాల అద్దె రు.10,000లకు పైమాటే.
       ఖాళీ స్థలాలను ప్రైవేటు వారికి ధరాదత్తం చేయడం, ఉన్న స్థలాలు, కళ్యాణ మంటపాల అద్దెలను భారీగా పెంచడం మూలంగా,ధనవంతులు తప్ప సామాన్యులు సభలు,సమావేశాలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ప్రజస్వామ్యానికి విఘాతం. సభలు, సమావేశాలు ఎంత ఎక్కువగా జరిగితే ఆ సమాజం అంత సజీవంగా ఉంటుంది. సభలు, సమావేశాలు జరగని సమాజం నిస్తేజమౌతుంది. అందువలన సభలు, సమావేశాలు జరగడానికి తగినన్ని స్థలాలు నగరంలో ఉందాలి. ఖాళీ స్థలాలను ప్రైవేటు వారికి ధరాదత్తం చేయడానికి, అద్దెల పెంపుదలకు వ్యతి రేకంగా పోరాడాలి.




No comments:

Post a Comment