Wednesday, 14 July 2010

అవసరాలకు మించి భూములు కట్టబెట్టడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.

అవసరాలకు మించి కంపెనీలకు భూములు కట్టబెట్టడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.ఈ రివాజుకు ప్రజల ప్రతిఘటన రూపమే సోంపేట కాల్పుల ఉదంతం.  శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గొల్లగండి వద్ధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించిన స్థానిక ప్రజానీకంపై పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు చనిపోయారు .ఇంకా అనేక మంది గాయ పడ్డారు.బుధవారం నాటి (14.07 .2010) ఈ అమానుష సంఘటనతో రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు,వాటికి భూములను కట్టబెట్టే ప్రభుత్వ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సోంపేట మండలం గొల్లగండి వద్ద 2,640 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల వున్న పలాసపురం,లక్కవరం తదితర గ్రామాల్లో 920ఎకరాల ప్రభుత్వ భూమితో సహా 1540 ఎకరాల భూములను సేకరించింది. దీంట్లో ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజుకు కంపెనీ తీసుకుంది. గ్రామస్థుల నుంచి లక్షల విలువ చేసే రెండు పంటలు పండే భూములను ఉద్యోగాలు ఎరగా చూపి చౌకగా తీసుకునేందుకు వారి నుంచి అంగీకారం పొందింది. ఉద్యోగాలు, పరిహారం, పునరావాసం, కాలుష్యం తదితర అంశాల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకోవాలని స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే,ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు అభ్యంతరాలు తెలిపినా ఖాతరుచేయ లేదు.ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ గత 230 రోజులుగా స్థానికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే నేడు సోంపేటలో పరిస్థితి కాల్పుల దాకా వెళ్లింది. దీనికంతటికీ కీలకం భూమి. కాబట్టి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఎంత భూమి అవసరమో అంతే సేకరించాలి. స్థల ఎంపికలో కూడా జాగ్రత్తవహించాలి. అధికారులచే తప్పుడు నివేదికలు ఇప్పించి రైతులను కానీ,మత్స్యకారులను కానీ రోడ్డున పడేసే పద్ధతి సరికాదు.ఈ భూముల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సమగ్ర విధానం అవసరం.ఒంగోలు సమీపంలో నాలుగువేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి 4000ఎకరాల భూమి (ప్రభుత్వ భూమితో సహా) సేకరించుకునేందుకు ఎలా అనుమతించింది?
           సమీపంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి గానీ అంత స్థలం అవసరమా? ఇటీవల తమిళనాడులో తూత్తుకుడి జిల్లా ఉదంగూడిలో 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 2 యూనిట్లు అంటే 1600 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని తమిళనాడు విద్యుత్‌బోర్డు,భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నెలకొల్పాయి. అందుకోసం వారు సేకరించిన భూమి 939ఎకరాలు (యాజమాన్య నివేదిక పేజీ 1)అంటే ఒక మెగావాట్‌ విద్యుత్తుకు 0.6ఎకరం కంటే తక్కువ చాలని వారు నిర్ధారించారు.ఆ లెక్కన ఒంగోలు సమీపంలోని విద్యుత్తు ప్రాజెక్టుకు 2,400 ఎకరాలు చాలు. కాని ఇన్నిన్ని ఎకరాల సేకరణకు ఎలా అనుమతించారు? అంటే ఈ విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో ఈ అదనపు  భూమిని పెద్ద పెద్ద కంపనీలకు  కట్టబెట్టడానికేనన్నది స్పష్టం.
             పరిశ్రమలు స్తాపించాలంటే భూమి అవసరం. అది  ప్రభుత్వరంగమైన, ప్రైవేటు రంగమైన ఒకటే. పరిశ్రమంటూ పెట్టాలంటే భూమి కావలసిందే.అందులో యే సందేహమూ లేదు.కాని భూమిని సేకరించాలంటే  దానికీ ఒక పద్ధతి ఉంది.  అలాంటప్పుడు దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తే దానిని ఎలా తప్పు పట్టగలం?థర్మల్‌స్టేషన్‌ స్థాపన వల్ల లాభనష్టాలేమిటన్న చర్చ కూడా జరుగుతోంది.ఏ రాష్ట్రమైనా, దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే విద్యుత్తు చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహమూలేదు. మెట్ట ప్రాంతాలలో ధాన్యం పండించడానికి బోరు బావులు, మోటార్లే శరణ్యం. వాటికి కూడా అధిక విద్యుత్తు కావాలి. ఇక గృహావసరాలకు, వాణిజ్యావసరాలకు, ఒకటేమిటి? నిత్య జీవితంలో ప్రతి నిమిషం విద్యుత్తుతోనే ముడిపడి ఉంటుంది. మన దేశంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నందున బొగ్గుతో తయారయ్యే థóర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలు అనివార్యం.అయితే అభివృద్ధి అనే ఫలాన్ని చూపి,పాలకులు ప్రజల ఆర్థిక అంశాలతోనూ, ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. దీనిని మనం అంగీకరించరాదు.
                ఇక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపన వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందా? థóర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో బొగ్గు కార్బన్‌ నిరంతరం మండించడం వల్ల కార్బన్‌డయాక్సైడ్‌ (సిఓ2) వాయువు చాలా పెద్ద మొత్తంలో విడుదలవుతుంది.ఒక అణువు కార్బన్‌ మండేటప్పుడు రెండు అణువుల ఆక్సిజన్‌తో కలిసి ఒక అణువు కార్బన్‌డయాక్సైడ్‌గా మారుతుంది. ఈ ప్రకారం ఉదంకూడిలో 1600 మెగావాట్ల విద్యుత్పత్తికి రోజుకు 18,465 టన్నుల బొగ్గు మండుతున్నదని లెక్కించారు.(యాజమాన్య నివేదిక పేజీ4)అంటే 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రోజుకు 46,162 టన్నుల బొగ్గు అవసరం. రోజుకు దానికి 4 రెట్లు, అంటే 1,84,648 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ తయారవుతుంది.థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలలో విడుదలయ్యే సిఓ2 ప్రపంచమంతా కొద్ది గంటలలో విస్తరిస్తుంది. కొద్ది భాగం మాత్రం అక్కడే కొద్దిసేపు ఉండే అవకాశముంది. ఆ వాయువును నిర్వీర్యం చేయడానికి, విద్యుత్‌ కేంద్రం మొత్తం విస్తీర్ణంలో నాలుగో వంతు భూమిలో, ఎకరానికి 600 చెట్లను నాటితే, అవి సిఓ2ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయనీ, అంతేకాక ఆ చెట్ల కారణంగా ఆ ప్రాంతంలో వేడిమి 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పడిపోతుందనీ వాతావరణ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణ రామగుండం. వేసవిలో ఉష్ణోగ్రతలు అంతకుముందు కంటే 3 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఎక్కువ పెరిగాయి. అప్పుడు విద్యుత్‌ కేంద్ర అధికారులు శాస్త్రీయంగా ఎకరానికి 600 చెట్లు చొప్పున, 25శాతం భూమిలో పెంచడంతో సిఓ2శాతం,అలాగే ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. ఒంగోలు సమీపంలోని విద్యుత్‌ కేంద్రంలో 25 శాతం భూమిని, అంటే 600 ఎకరాల భూమిని పచ్చదనానికి కేటాయించి, దానిలో ఎకరానికి 600 చెట్లు పెంచితే సిఓ2 సమస్య, అధిక ఉష్ణోగ్రత సమస్య నివారించబడుతుంది. ఇక విద్యుత్‌ ఉత్పత్తి సమయంలో చిమ్నీల నుండి వెలువడే ధూళి, సల్ఫర్‌డయాక్సైడ్‌, నెట్రస్‌ ఆక్సైడ్‌ ఆ సమస్యలను ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్లు (ఇఎస్‌పిలు) అమరిస్తే అధిóగమింవచ్చు. ప్రస్తుతానికి ఇవి ఉదంగూడి విద్యుత్‌ కేంద్రం, పాల్వంచలోని కెటిపిస్‌, ఇబ్రహీంపట్నం (కృష్ణాజిల్లా)లోని డా!!నార్ల తాతారావు విజయవాడ ధర్మల్‌ పవర్‌ స్టేషన్లలో వున్నాయి.ఉద్గారాలు పరిమితుల్లో ఉంటే నష్టం వుండదు. పరిమితికి మించితేనే సమస్య. కాబట్టి ఆధునికమైన పరికరాలనమర్చడానికి ప్రైవేటు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి జిల్లాలో కలెక్టరు నాయకత్వంలో పౌర సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దానికై కర్మాగారాల స్థాపన సమయంలో ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. అవసరమైతే ఉద్యమించాలి. అలాంటి పౌర సంఘాలు లేకుంటే విషవాయు ఉద్గారాలు విపరీతంగా పెరిగి చర్మవ్యాధులు, శ్వాసకోస వ్యాధులు, చివరకు రకరకాల క్యాన్సర్లు కూడా పెరిగే ప్రమాదముంది.

No comments:

Post a Comment