కం!! వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగ పడక వివరింప దగున్,
కని, కల్ల, నిజము తెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ!
తా. ముందుగాప్రతివాడు చెప్పేది వినాలి.చెప్పినదాని మీద ఆధారపడి తొందర పాటుగా నిర్ణయాలు చేయకూడదు. చెప్పిన విషయాన్ని వివరంగా పరిశీలించాలి. అందులో నిజమేమిటో,అబద్ధ మేమిటో తెలుసుకోవాలి.అలా తెలుసు కొని నిర్ణయాలు చేసే మనిషే ఈ భూమిమీద నీతిపరుడవుతాడు.
అంటే మనం వాస్తవాల మీద ఆధారపడి నిర్ణయాలకు రావాలి. ఊహల మీద ఆధార పడి, చెప్పుడు మాటల మీద ఆధారపడి నిర్ణయాలకు రాకూడదు.విషయాల గతిని,తార్కికంగా పరిశీలించాలి.అప్పుడే నిజా నిజాలు మనకు గోచరిస్తాయి.విషయాల చలనాన్ని పరిశీలిస్తూ, వాస్తవాల మీద ఆధార పడి నిర్ణయాలకు రావడాన్నే గతి తార్కిక పధ్ధతి అంటాము. దీనినే భౌతిక వాదం అని కూడా అంటారు.భౌతికవాదిగా ఉండే మనిషి ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటాడు.అర్ధం చేసుకొని మసులుకుంటాడు.ఈ ప్రపంచం లోని విషయాలను మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతడే జ్ఞాని. అతడే విజ్ఞుడు.
జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది మొదటిది ప్రకృతికి సంబంధించిన జ్ఞానం.రెండవది సమాజానికి సంబంధించిన జ్ఞానం.ఈ రెండూ తప్ప మరో రకమైన జ్ఞానం లేదు.మనం చెప్పుకునే అన్ని రకాల జ్ఞానాలు ఈ రెండు జ్ఞానలకే లోబడి ఉంటాయి. గతి తార్కిక పరిశీలన మీద ఆధారపడి విశ్వ విజ్ఞానాన్ని,సమాజ విజ్ఞాన్ని పొందినవాడే విజ్ఞుడు, ప్రాజ్ఞుడు అవుతాడు.
No comments:
Post a Comment