Monday, 4 February 2019

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మంచినీటి స‌ర‌ఫ‌రాకు వినియోగించే విత్యుత్‌ను ఉచిత విత్యుత్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాలి.

ప్ర‌చుర‌ణార్ధం                                                                          తేదీ :03.02.2019

                విజయవాడ నగరంలో మంచినీటి పరఫరాకు, మురుగునీరు నిర్వహణకు వాడుతున్న విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌గా ప్రకటించి, విద్యుత్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ సెక్షన్లకు లబ్ధి చేకూర్చే విధంగా అనేక నిర్ణయాలను ప్రకటిస్తున్నది. వృత్తులవారీ, కులాల వారీ వివిధ రాయితీలు ప్రయోజనాలు ప్రకటిస్తున్నది. అందులో కొన్ని యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇచ్చే నిర్ణయం కూడా ఉంది. కాని విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు సరఫరా చేసే నీటికి మాత్రం విద్యుత్‌ చార్జీల రాయితీ ఇవ్వటం లేదు. నగరపాలక సంస్థ చేసే నీటి సరఫరాలో అత్యధిక శాతం గృహావసరాలకు వినియోగిస్తున్నదే. గృహావసరాలకు సరఫరా చేసే నీటి కోసం వినియోగించే విద్యుత్‌కు కమర్షియల్‌ రేటుతో విద్యుత్‌ చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనితో నగరపాలక సంస్థపై విపరీతంగా భారం పడుతున్నది. ఉదా హరణకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌ ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో విజయవాడలో నీటి నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం రు.34.15 కోట్లు అయితే, అందులో రు.25 కోట్లు అంటే 73 శాతం విద్యుత్‌ చార్జీలే ఉన్నాయి. నీటి చార్జీల పెంపుదలకు కార్పొరేషన్‌ విద్యుత్‌ చార్జీల భారాన్ని కూడా సాకుగా చూపుతున్నది. విజయవాడ నగరంలో పెంచిన నీటి చార్జీలతో నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యక్తిగత గృహాలకు ఆస్తిపన్నుతో ముడి పెట్టి నీటి చార్జీలను పెంచారు. అపార్టు మెంట్లకు మీటరు రీడింగులో వివిధ శ్లాబులను ఏర్పాటు చేశారు. దీనితో నీటి చార్జీలు విపరీతంగా పెరిగాయి, ఇది చాలదన్నట్లు ఏటా 7 శాతం పెంచుతున్నారు. ఇవన్నీ కలిపి నీటి చార్జీల భారం నగర ప్రజలమీద తీవ్రంగా పడింది. నీటి చార్జీలు తగ్గించమని ప్రజలు అనేక సార్లు డిమాండు చేశారు. వివిధ రూపాలలో ఆందోళన చేశారు. అయినా తగ్గించలేదు. నీటి సరఫరాకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, కార్పొరేషన్‌ నీటి చార్జీలను గణనీయంగా తగ్గించవచ్చు. దీనివలన నగరంలోని 10లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా నగరంలో ఏర్పడే మురుగునీటిని శుధ్ధిచేసిన తదుపరి మాత్రమే బయటకు వదలాలి. ఇది ప్రజారోగ్యానికి దోహదపడే చర్య. మొత్తం మురుగునీటి నిర్వహణకు కార్పొరేషన్‌ రు 4.5 కోట్లు విద్యుత్‌ చార్జీల క్రింద ఖర్చు చేస్తున్నది. కావున నీటి సరఫరాకు, మురుగునీటి నిర్వహణకు వినియోగించే విద్యుత్‌ చార్జీలను రద్దు చేస్తే నగరపాలక సంస్థపై రు. 29.5 కోట్లు భారం తగ్గుతుంది. కావున మంచి నీటి సరఫరాకు, మురుగునీటి నిర్వహణకు నగరపాలక సంస్థ వినియోగిస్తున్న విద్యుత్‌ను ఉచిత విద్యుత్‌గా ప్రకటించి, విద్యుత్‌ చార్జీలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

వి.సాంబిరెడ్డి                                                             యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                          కార్యదర్శి


   





Monday, 21 January 2019

విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌పై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ప్రెస్ మీట్ 21.01.2019

ప్రచురణార్ధం:                                                    తేదీ:21.01.2019                                                                   
విజయవాడ నగరపాలక సంస్థ ప్రవేశ పెట్టబోతున్న చివరి బడ్జెట్‌ ప్రతి పాదనలుకూడా పలు అనుమానాలకు తావిచ్చేవిగా ఉన్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయ పడుతున్నది. కార్పొరేషన్‌కు రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు, 13,14 కేంద్ర ఆర్ధిక సంఘాల నిధులు, అమృత్‌ పథకం నిధులు, ఎసి సబ్‌ ప్లాన్‌ నిధులు, నాన్‌ ప్లాన్‌ గ్రాంట్‌ ఎ.పి.ప్రభుత్వ గ్రాంట్‌, తదితర గ్రాంటులు, నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుండి వస్తాయి. వాటిని ఆదాయంలో చూపెట్టాలి. ఈ నిధులనుండి ఏపని చేస్తే ఆపని క్రిందఖర్చు చూపెట్టాలి. అందుకు భిన్నంగా అవే పద్దు పేరుతో ( ఉదా: రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు, 13,14 కేంద్ర ఆర్ధిక సంఘాల నిధులు, అమృత్‌ పథకం నిధులు, ఎసి సబ్‌ ప్లాన్‌ నిధులు, నాన్‌ ప్లాన్‌ గ్రాంట్‌ ఎ.పి.ప్రభుత్వ గ్రాంట్‌ పేర్లతో )ఖర్చు చూపారు. ఆర్ధిక వనరుల పేరుతో ఖర్చులు ఉండవు. ఎదో ఒక పని చేయటానికి ఖర్చులుంటాయి. ఏ పనికి ఈ నిధులు వాడారని చూపెట్టాడానికి బదులుగా, ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వ వనరుల పేర్లను వాడారు. ఇలా చూపించటంలో ఉద్దేశం ఈ నిధులను ఎందుకు ఖర్చు పెెట్టారన్నది కౌన్సిల్‌కు, ప్రజలకు తెలియకుండా చేయటమే నని అర్ధమవుతున్నది. చేసిన ఖర్చుకు స్పష్టత లేదు. అంతే కాకుండా ఆదాయంలో చూపిన మొత్తాలకు, ఖర్చులో చూపిన మొత్తాలకు పొంతనలేదు. రాష్ట్ర ముఖ్యంత్రిగారు ఇటీవల విడుదల చేసిన 8వ శ్వేతపత్రంలో విజయవాడలో కేంద్రం విడుదల చేసిన రు.461కోట్లతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా ప్రకటించారు. కాని బడ్జెట్‌లో ఎక్కడా ఆనిధులను చూపలేదు. కాని ఖర్చులో మాత్రం కొంత చూపారు. 2017-18లో రు.3,55,16,799లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2018-19 లో ఖర్చు సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2019-20 బడ్డెట్‌లో రు.7,50,000 గా ఖర్చు చూపారు. అంటే మొత్తం ఖర్చు రు.3,62,66,799 గా చూపారు. ఆదాయం చూపకుండా ఖర్చు ఎలా చూపారన్నది ప్రశ్నార్ధకం. ఈ సంవత్సర బడ్జెట్‌ సవరించిన ఆదాయాలలో జIIూ ఔశీతీసర (జతీఱ్‌ఱషaశ్రీ Iఅటతీaర్‌తీబష్‌బతీవ Iఅఙవర్‌ఎవఅ్‌ ూశ్రీaఅ) నిధులు రు.150.13 కోట్లుగా చూపారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ అంచనాలలో రు.175.22 కోట్లుగా చూపారు. వెరశి రు.325.25 కోట్లుగా చూపారు. 2018 అక్టోబరు 22న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.వో. నెం.336 ప్రకారం కేవలం 6 పనులకు మాత్రమే ఈ నిధులు సమకూర్చుతారు. అందులో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణం కూడా ఉంది. ఇందులో 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 90 శాతం బ్యాంకులోన్‌ తీసుకోవాలి. అంటే అప్పు చేయాలి. ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వం భరించదు. కార్పొరేషనే భరించాలి. ఇప్పుడు బడ్జెట్‌లో చూపిన రు. 175.22 కోట్లలో రు. 292.73 కోట్లు అప్పుగానే ఉంటుంది. ఈ అప్పును కార్పొరేషనే తీర్చాలి. ఆదాయంలో చూపిన ఈ జIIూ నిధులతో ఈ 6 పనులలో ఏపనికి ఎంత ఖర్చు చేస్తారో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రు.461 కోట్ల స్ధానంలో ఈ జIIూ నిధులను స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణంకోసం ఖర్చు చేయబోతున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే జరిగితే కేంద్రం విడుదల చేసిన రు.461 కోట్లలో ఒక్క పైసాకూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా, స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణంకోసం నగరపాలక సంస్థ చేత అప్పు చేయించబోతున్నదని స్పష్టమవుతుంది. కనుక నిజంగా స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణ పనులు కేంద్రం ఇచ్చిన రు.461 కోట్ల నిధులతోనే జరుగుతున్నాయా లేక అప్పుగా వచ్చే జIIూ నిధులను స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణానికి వాడబోతున్నారా? స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణానికి కాకపోతే జIIూ నిధులను దేనికి వాడబోతున్నారు? ఈ ప్రశ్నలకు కార్పొరేషన్‌ పాలకులు నగర ప్రజలకు సమాధానం చెప్పాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                                    యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                           కార్యదర్శి






Thursday, 13 December 2018

రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి పౌరుడిని ఓట‌రుగా న‌మోదు చేయ‌టం ఎన్నిక‌ల క‌మీష‌న్ బాధ్య‌త‌- ప‌క్కా ఓట‌రులిస్టు త‌యారైన త‌ర్వానే 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లాలి- టాక్స్ పేయ‌ర్స్ అసోసియేస‌న్ డిమాండ్‌


ప్రచురణార్ధం:                                                                    తేదీ:13.12.2018


2019 ఎలక్షన్ల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అర్హుడైన ఏ పౌరుడు ఓటు లేకుండా ఉండకూడదని, అందుకోసం పక్కా ఓటర్‌ లిస్టులను తయారు చేసి ఎన్నికలకు వెళ్లాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల అధికారులను డిమాండు చేసింది. ఆమేరకు రాష్ట్ర ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఆర్‌.పి. సిసోడియాకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఒక లేఖ వ్రాశింది. ఇటీవల తెలంగాణా ఎన్నికలలో ప్రతి నియోజక వర్గంలో వేలాది ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు గగ్గొలు పెట్టారని, అక్కడి ఛీప్‌ ఎలకక్షన్‌ ఆఫీసర్‌ ప్రజలను క్షమాపణకోరవలసి వచ్చివందని అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో తల్తెకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెల్లడించిన ఓటర్‌లిస్టులో అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయి. అనేకమంది ఓటుకోసం మరల దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికికి తమ ఓటు ఉన్నదో లేదో కూడా తెలియదు. కొంతమంది తమకు ఓటరు కార్డు ఉంది కనుక తమ ఓటు ఖచ్చితంగా లిస్టులో ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. కాని ఓటరు కార్డు ఉన్నప్పటికీ, ఓటరు లిస్టులో పేరులేని వారు గణనీయంగా ఉన్నారన్న విషయాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ దృష్టికి తెచ్చింది. అలాంటివారు ఎన్నికల సమయంలో మాత్రమే తమ ఓటు లేదన్న విషయాన్ని గ్రహిస్తారని, కాని అప్పుడు చేయగలిగిందేమీ లేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఒకే డోర్‌ నెంబర్‌ లో ఉన్న వారి ఓట్లను వివిధ బూతులకు కేటాయించటంతో వారికి తమ ఓటు ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని, అందువలన ఒకే డోర్‌ నెంబర్‌లో ఉన్న వారందరి ఓట్లును ఒకే బూతుకు కేటాయించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 
ఓట్ల వెరిఫికేషన్‌ను రాజకీయ పార్టీలకు వదలి వేయటం సరి కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి నుండి తమ పాలన సంతృప్తిగా ఉన్నదా లేక అసంతృప్తిగా ఉన్నదా తెలుపమని ఫోన్లు వస్తున్నాయని, తాము అసంతృప్తిగా ఉన్నదని చెప్పటం వలననే తమ ఓట్లు తొలగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో ప్రజలలో ఎన్నికల కమీషన్‌ మీద విశ్వాసం కన్నా అధికార పార్టీ పట్ల భయం ఎక్కువగా ఉన్నదని, ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీ కనుసన్నలలో పని చేస్తున్నదన్న భావన వారిలో నెలకొని ఉండటమే దీనికి కారణమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. అర్హులైన పౌరులందరి పేర్లను ఓటరు లిస్టులో చేర్చటం ద్వారా ప్రజలలో విశ్వాసం కల్పించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 2019 ఎన్నికల సమయానికి ఇంకా 3 నెలల సమయం ఉన్నందున ఈ 3 నెలల కాలంలో ఎన్నికల యంత్రాంగాన్ని రంగంలోకి దించి ఇంటింటికీ తిరిగి ఓట్లు వెరిఫికేషన్‌ చేయించాలని, ఓట్లు గల్లంతయిన వారి ఓట్లును తిరిగి చేర్పించాలని, పక్కా ఓటరు లిస్టులతో ఎన్నికలకు వెళ్లాలని ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

వి.సాంబిరెడ్డి                                                       యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                కార్యదర్శి 











Tuesday, 20 November 2018

"రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వం"- ఈ క్ష‌ణం వెబ్ ఛాన‌ల్‌తో M.V. Anjaneyulu



"రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర  ప్ర‌భుత్వం"- ఈ క్ష‌ణం వెబ్ ఛాన‌ల్‌తో M.V. Anjaneyulu




Monday, 12 November 2018

ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌ను అప్పుల‌లో ముంచే జీ.వో 336ను ర‌ద్దు చేయాలి- టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ డిమాండ్ 12.11.2018

ప్ర‌చుర‌ణార్ధం
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి ఉద్దేశించిన జీ.వో నెం.336ను తక్షణమే ఉపసంహరించు కోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థలలో వివిధ పనులను చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రు.12,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అందులో 90 శాతం అంటే రు. 11,340 కోట్లు బ్యాంకులనుండి 8 శాతం వడ్డీకి ఋణం తీసుకోబోతున్నది. మిగతా 10 శాతం అంటే రు.1260కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా, సివరేజి మేనేజ్‌మెంట్‌, వర్షపునీటి కాలువలు, రోడ్ల పునర్నిర్మాణం, శ్మశానవాటికలు, పార్కుల అభివృధ్ధి- ఈ ఆరుపనులు ఈ ఋణంతో చేస్తారట. నిజానికి మున్సిపల్‌ నిధులతో ఈ పనులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులనుండి స్ధానికాభివృధ్ధికోసం మున్సిపాలిటీలకు నిధులను కేటాయించాలి. ఇవేవి చేయకుండా వేలకోట్లరూపాయలు అప్పులుచేసి ఈ పనులు చేస్తామనటం దారుణం. ఇప్పటికే నీటి కనెక్షన్‌ ఇవ్వాలన్నా, డ్రైనేజి కనెక్షన్‌ ఇవ్వాలన్నా డొనేషన్‌లపేరుతో వాటికయ్యే ఖర్చును వసూలు చేస్తున్నారు. నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు భారీగా పెంచి వాటి నిర్వాహణకు అయ్యే ఖర్చును ప్రజల నుండే వసూలు చేస్తున్నారు. పార్కులు ప్రైవేటువారికి ఇస్తున్నారు. ఒకవైపు నిర్మాణ,నిర్వహణా వ్యయాలను ప్రజలనుండి వసూలు చేస్తూ తిరిగి అవే పనులకు వేలాది కోట్లరూపాయలు అప్పులు తెచ్చి చేస్తామనటంలో ఔచిత్యమేమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది.
అయితే ఈ ఋణం తీసుకునేది ప్రభుత్వమైనా భరించేది ప్రభుత్వం కాదు. ఈ పనులకు చేయటానికి ఏ మున్సిపల్‌ సంస్థ పరిధిలో ఎంత ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని ఆ మున్సిపాలిటీ లేదా ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆ జీ.వోలో నిబంధన విధించారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా మున్సిపల్‌ సంస్థలను అప్పుల ఊబిలోకి నెడుతున్నదని స్పష్టం అవుతున్నది. ఈ ఋణంలో మొదటి దఫాగా రు.3000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. కేవలం 4 నెలలో కాలంలో రు.3000 కోట్లు విలువగలిగిన పనులు ఎలా అవుతాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. విజయవాడలో వర్షపునీటి కాలువల నిర్మాణం కోసం కేంద్రం నుండి రు.461 కోట్లు వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా, నేటికీ పనులు అరకొరగా జరుగుతున్నాయే తప్ప పూర్తికాలేదు. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశంకూడా కనుపించటం లేదు. మూడేళ్ళలో రు.461 కోట్ల విలువ కలిగిన పనులు చేయలేని ప్రభుత్వం, 4 నెలల కాలంలో రు.3000 కోట్లు ఖర్చు చేసి పనులు చేస్తామనటం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మరో 5 నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండగా రు.3000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే తీసుకోవటం మున్సిపాలిటీలలో పనులు చేయటానికి కాదని, ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్ళించటానికి వేసిన ఎత్తుగడ అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేసే అప్పును పట్ణణాలు, నగరాలలోని ప్రజలే భరించాలి. దానికోసం మున్సిపల్‌ సంస్థలు పట్టణ ప్రజలపై పన్నుల భారం వేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగా మారబోతున్నది. అదే విధంగా భవిష్యత్తులో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను శాశ్వితంగా ఎగ్గొట్టడానికి ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కారణాలన్నింటి రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ఋణం కోసం విడుదల చేసిన ఈ జీ.వోను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నది. పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి, ప్రజలపై భారాలను మోపటానికి ఉద్దేశించిన ఈ జీ.వో ను తక్షణమే ఉప సంహరించుకోవాలని, నగరాలలో పట్టణాలలో ఈ ఆరు పనులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

వి.సాంబి రెడ్డి                                                                               యం.వి. ఆంజ‌నేయులు
అధ్య‌క్షులు                                                                                       కార్య‌ద‌ర్శి













Friday, 3 August 2018

మున్సిప‌ల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని అప్ర‌జాస్వామికంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌టంపై గ‌ళం విప్పిన టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్

03.08.2018 న టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ప్రెస్‌మీట్‌లో విడుద‌ల‌చేసిన ప్రెస్ నోట్‌

ప్రచురణార్ధం:                                                                                    తేదీ:03.08.2018 
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ తీర్మానాన్ని రద్దు చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో. ను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి లేఖ వ్రాశింది. విజయవాడ నగరంలో బృందావన్‌ కాలనీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 1052.86చ.గ.ల స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయించాలని కోరుతూ గత ఏప్రిల్‌లో మున్సిపల్‌ కమీషనర్‌ నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిపాదనను నగరపాలక సంస్థ కౌన్సిల్‌ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఆస్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడితే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని కౌన్సిల్‌ తీర్మానించింది. ప్రతిపాదనను తిరస్కరిస్తూ కౌన్సిల్‌ తీర్మానించిన విషయాన్ని కమీషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయిస్తూ 23.07.2018న జీ.వో.నెంబరు 707ను జారీ చేసింది. ఈ విషయంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో పేర్కొన్నది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటే కౌన్సిల్‌ తీర్మానం మున్సిపల్‌ చట్టాన్ని గాని, ఇతర చట్టాలనుగాని అతిక్రమించేదిగా ఉండాలి. లేదా ఆతీర్మానం కార్పొరేషన్‌కు నష్టం కలిగించేదిగా ఉండాలి. లేదా ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగా ఉండాలి. ఈ స్థలం విషయంలో కౌన్సిల్‌ చేసిన తీర్మానం కార్పొరేషన్‌కు నష్టంగాని, ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగాలేదు. పైగా కార్పొరేషన్‌కు లాభం చేకూర్చేదిగా ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ.వో వలన కార్పొరేషన్‌కు నష్టం కలుగుతుంది. కౌన్సిల్‌ తీర్మానించిన విధంగా షాపింగ్‌ కాంపెక్స్‌ కడితే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తే వచ్చే ఆదాయంపోగా, ఆ స్థలాన్ని కార్పొరేన్‌ శాశ్వితంగా కోల్పోతుంది. ఇది కార్పొరేషన్‌కు తీరని నష్టం. ఈ విషయాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఈ లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కౌన్సిల్‌ చేసిన తీర్మానం మున్సిపల్‌ చట్టాన్నిగాని, ఇతర చట్టాన్నిగాని అతిక్రమించటంలేదు. ఈ విషయంలో చట్టాన్ని అతిక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప మున్సిపల్‌ కౌన్సిల్‌ కాదు. అందువలన జీ.వో.చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో పేర్కొన్నది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని రద్దు చేసి, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినకారణాన్ని కూడా టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆక్షేపించింది. ''క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రం ముందు ఉన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని, శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని విజయవాడలో ఏర్పాటుచేయటం ద్వారా దైవాశీస్సులు పొందటం సముచితంగా ఉంటుందని ఈ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వాలని నిర్ణయించామని'' రాష్ట్ర ప్రభుత్వం ఆ జీ.వో.లో పేర్కొన్నది. వ్యక్తులకు సంబంధించిన నమ్మకాలను, ప్రభుత్వం ప్రజలపై రుద్దటం తప్పని ఆ లేఖలో పేర్కొన్నది. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య లౌకిక సూత్రాల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగ విలువలను పెంపొందించేదిగా ఉండాలే తప్ప, వ్యక్తిగత నమ్మకాలకోసం పనిచేసేదిగా ఉండరాదని ఆలేఖలో స్పష్టం చేసింది. ప్రజోపయోగమైన మున్సిపల్‌ స్థలాన్ని మత సంస్థలకు ఇవ్వటం లౌకిక తత్వానికి వ్యతిరేకమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో ప్రజాస్వామ్య విరుధ్ధమని, రాజ్యాంగ విరుధ్దమని, చట్ట విరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో స్పష్టం చేసింది. తక్షణమే ఈ జీ.వోను ఉపసంహరించు కోవాలని, కౌన్సిల్‌ చేసిన తీర్మానాన్ని పునరుధ్దరించాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ రాష్ట్రప్రభుత్వం కౌన్సిల్‌ తీర్మానాన్ని రద్దు చేయటంపై స్పందించాలని ఎం.ఎల్‌.ఏలకు, కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీలకు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తున్నది. 

వి.సాంబిరెడ్డి                                                                    యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                          కార్యదర్శి