03.08.2018 న టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రెస్‌మీట్‌లో విడుదలచేసిన ప్రెస్ నోట్
ప్రచురణార్ధం: తేదీ:03.08.2018
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో. ను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ వ్రాశింది. విజయవాడ నగరంలో బృందావన్ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 1052.86చ.గ.ల స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయించాలని కోరుతూ గత ఏప్రిల్‌లో మున్సిపల్ కమీషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిపాదనను నగరపాలక సంస్థ కౌన్సిల్ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఆస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కడితే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని కౌన్సిల్ తీర్మానించింది. ప్రతిపాదనను తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానించిన విషయాన్ని కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయిస్తూ 23.07.2018న జీ.వో.నెంబరు 707ను జారీ చేసింది. ఈ విషయంలో మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ ఆలేఖలో పేర్కొన్నది.
మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటే కౌన్సిల్ తీర్మానం మున్సిపల్ చట్టాన్ని గాని, ఇతర చట్టాలనుగాని అతిక్రమించేదిగా ఉండాలి. లేదా ఆతీర్మానం కార్పొరేషన్‌కు నష్టం కలిగించేదిగా ఉండాలి. లేదా ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగా ఉండాలి. ఈ స్థలం విషయంలో కౌన్సిల్ చేసిన తీర్మానం కార్పొరేషన్‌కు నష్టంగాని, ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగాలేదు. పైగా కార్పొరేషన్‌కు లాభం చేకూర్చేదిగా ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ.వో వలన కార్పొరేషన్‌కు నష్టం కలుగుతుంది. కౌన్సిల్ తీర్మానించిన విధంగా షాపింగ్ కాంపెక్స్ కడితే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తే వచ్చే ఆదాయంపోగా, ఆ స్థలాన్ని కార్పొరేన్ శాశ్వితంగా కోల్పోతుంది. ఇది కార్పొరేషన్‌కు తీరని నష్టం. ఈ విషయాన్ని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ ఈ లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కౌన్సిల్ చేసిన తీర్మానం మున్సిపల్ చట్టాన్నిగాని, ఇతర చట్టాన్నిగాని అతిక్రమించటంలేదు. ఈ విషయంలో చట్టాన్ని అతిక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప మున్సిపల్ కౌన్సిల్ కాదు. అందువలన జీ.వో.చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ ఆలేఖలో పేర్కొన్నది.
మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేసి, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినకారణాన్ని కూడా టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ ఆక్షేపించింది. ''క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రం ముందు ఉన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని, శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని విజయవాడలో ఏర్పాటుచేయటం ద్వారా దైవాశీస్సులు పొందటం సముచితంగా ఉంటుందని ఈ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వాలని నిర్ణయించామని'' రాష్ట్ర ప్రభుత్వం ఆ జీ.వో.లో పేర్కొన్నది. వ్యక్తులకు సంబంధించిన నమ్మకాలను, ప్రభుత్వం ప్రజలపై రుద్దటం తప్పని ఆ లేఖలో పేర్కొన్నది. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య లౌకిక సూత్రాల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగ విలువలను పెంపొందించేదిగా ఉండాలే తప్ప, వ్యక్తిగత నమ్మకాలకోసం పనిచేసేదిగా ఉండరాదని ఆలేఖలో స్పష్టం చేసింది. ప్రజోపయోగమైన మున్సిపల్ స్థలాన్ని మత సంస్థలకు ఇవ్వటం లౌకిక తత్వానికి వ్యతిరేకమని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో ప్రజాస్వామ్య విరుధ్ధమని, రాజ్యాంగ విరుధ్దమని, చట్ట విరుధ్ధమని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ ఆలేఖలో స్పష్టం చేసింది. తక్షణమే ఈ జీ.వోను ఉపసంహరించు కోవాలని, కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని పునరుధ్దరించాలని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేసింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ రాష్ట్రప్రభుత్వం కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేయటంపై స్పందించాలని ఎం.ఎల్.ఏలకు, కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీలకు టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment