ప్రచురణార్ధం తేదీ :03.02.2019
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
విజయవాడ నగరంలో మంచినీటి పరఫరాకు, మురుగునీరు నిర్వహణకు వాడుతున్న విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌గా ప్రకటించి, విద్యుత్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ సెక్షన్లకు లబ్ధి చేకూర్చే విధంగా అనేక నిర్ణయాలను ప్రకటిస్తున్నది. వృత్తులవారీ, కులాల వారీ వివిధ రాయితీలు ప్రయోజనాలు ప్రకటిస్తున్నది. అందులో కొన్ని యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇచ్చే నిర్ణయం కూడా ఉంది. కాని విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు సరఫరా చేసే నీటికి మాత్రం విద్యుత్ చార్జీల రాయితీ ఇవ్వటం లేదు. నగరపాలక సంస్థ చేసే నీటి సరఫరాలో అత్యధిక శాతం గృహావసరాలకు వినియోగిస్తున్నదే. గృహావసరాలకు సరఫరా చేసే నీటి కోసం వినియోగించే విద్యుత్‌కు కమర్షియల్ రేటుతో విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనితో నగరపాలక సంస్థపై విపరీతంగా భారం పడుతున్నది. ఉదా హరణకు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో విజయవాడలో నీటి నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం రు.34.15 కోట్లు అయితే, అందులో రు.25 కోట్లు అంటే 73 శాతం విద్యుత్ చార్జీలే ఉన్నాయి. నీటి చార్జీల పెంపుదలకు కార్పొరేషన్ విద్యుత్ చార్జీల భారాన్ని కూడా సాకుగా చూపుతున్నది. విజయవాడ నగరంలో పెంచిన నీటి చార్జీలతో నగర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యక్తిగత గృహాలకు ఆస్తిపన్నుతో ముడి పెట్టి నీటి చార్జీలను పెంచారు. అపార్టు మెంట్లకు మీటరు రీడింగులో వివిధ శ్లాబులను ఏర్పాటు చేశారు. దీనితో నీటి చార్జీలు విపరీతంగా పెరిగాయి, ఇది చాలదన్నట్లు ఏటా 7 శాతం పెంచుతున్నారు. ఇవన్నీ కలిపి నీటి చార్జీల భారం నగర ప్రజలమీద తీవ్రంగా పడింది. నీటి చార్జీలు తగ్గించమని ప్రజలు అనేక సార్లు డిమాండు చేశారు. వివిధ రూపాలలో ఆందోళన చేశారు. అయినా తగ్గించలేదు. నీటి సరఫరాకు ఉచిత విద్యుత్ ఇస్తే, కార్పొరేషన్ నీటి చార్జీలను గణనీయంగా తగ్గించవచ్చు. దీనివలన నగరంలోని 10లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా నగరంలో ఏర్పడే మురుగునీటిని శుధ్ధిచేసిన తదుపరి మాత్రమే బయటకు వదలాలి. ఇది ప్రజారోగ్యానికి దోహదపడే చర్య. మొత్తం మురుగునీటి నిర్వహణకు కార్పొరేషన్ రు 4.5 కోట్లు విద్యుత్ చార్జీల క్రింద ఖర్చు చేస్తున్నది. కావున నీటి సరఫరాకు, మురుగునీటి నిర్వహణకు వినియోగించే విద్యుత్ చార్జీలను రద్దు చేస్తే నగరపాలక సంస్థపై రు. 29.5 కోట్లు భారం తగ్గుతుంది. కావున మంచి నీటి సరఫరాకు, మురుగునీటి నిర్వహణకు నగరపాలక సంస్థ వినియోగిస్తున్న విద్యుత్‌ను ఉచిత విద్యుత్‌గా ప్రకటించి, విద్యుత్ చార్జీలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోరుతున్నది.
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment