Sunday, 8 May 2016

నీటి మీట‌ర్ల‌పై టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో 08.05.2016 న జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానం

08.05.2016 న జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానం 
అమృత్‌ పధకంలోని షరతులకు అనుగుణంగా విజయవాడ నగరంతో సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలలో నీటి మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు జరుగుతున్న రౌండ్‌టేబుల్‌ సమావేశం తీవ్రంగా పరిగణిస్తున్నది. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ నాయకత్వంలోయున్న యు.పి.ఎ. ప్రభుత్వం జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిని రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు జరపటం ప్రారంభించింది. విజయవాడ నగరపాలక సంస్థలో ఆనాటి కాంగ్రెస్‌ నాయకత్వంలో ఉన్న కౌన్సిల్‌లో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకంలోని అన్ని షరతులను ఆమోదించారు. నీటి మీటర్లు పెట్టాలన్న షరతు జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకంలో ఉన్నది. దానికనుగుణంగానే ప్రజలు కోరక పోయినప్పటికీ 24 గంటలు నీటి సరఫరా చేస్తామని, 24 గంటలు నీటి సరఫరా జరిగితే ప్రజలు విచ్చలవిడిగా వాడేస్తారుగాబట్టి, నీటి వినియోగాన్ని నియంత్రించటం కోసం నీటి మీటర్లు పెడతామని ప్రకటించారు. ఆనాడు నీటి మీటర్లు పెట్టే ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 
నేడు కేంద్రంలోని బి.జె.పి. నాయకత్వంలో నడుస్తున్న యన్‌.డి.ఎ. ప్రభుత్వం అమృత్‌ పేరుతో మరో క్రొత్తపథకాన్ని ప్రవేశ పెట్టింది. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకంలో ఉన్న అన్నిషరతులు మైల్‌ స్టోన్స్‌ పేరుతో అమృత్‌ పథకంలో పొందుపరచారు. అమృత్‌ పథకంలో నీటి మీటర్లు ఏర్పాటు చేయాలన్న షరతు కూడా ఉన్న విషయాన్ని ఈ సమావేశం గుర్తిస్తున్నది. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో 31 పట్టణాలను అమృత్‌ పధకంలో చేర్చింది. విజయవాడ నగరం కూడా అమృత్‌ పథకంలో ఉన్న నగరాలు, పట్టణాల జాబితాలో ఉన్నది. ఏప్రిల్‌ 4, 2016 న జరిగిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో నీటిమీటర్లతో సహా అమృత్‌ పథకంలో పొందుపరచిన అన్ని షరతులను ఆమోదించారు. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అనుసరించిన విధానానికి, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి, రాష్ట్రంలో, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాలకు తేడా లేదని ఈ సమావేశం భావిస్తున్నది. 
గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయవాడలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం కార్పొరేటర్లు వ్యతిరేకించారు. తెలుగుదేశంపార్టీగా విజయవాడలో ఆందోళనలు చేశారు. అదే తెలుగు దేశంవారు నేడు అమృత్‌ పథకంపేరుతో నీటిమీటర్లు పెెట్టబోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే అమలు పరచడం రివాజుగా మారిందని ఈ సమావేశం గుర్తిస్తున్నది. . కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్య ఉన్నవి రాజకీయ విబేధాలేగాని, విధానపరమైన విబేధాలు కాదని ఈ సమావేశం అభిప్రాయపడుతున్నది. 
విజయవాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలనలో పెంచిన నీటిచార్జీలు కట్టలేక ఇప్పటికే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి చార్జీల పెంపు దారుణమని, తాము అధికారంలోకి వస్తే నీటిచార్జీలు తగ్గిస్తామని వాగ్దానంచేసి అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్‌ పాలకులు, ఏటా 7 శాతం పెంచుతున్నారు. ఇప్పుడు నగరమంతటా ఇంటింటికీ నీటి మీటర్లు పెట్టడానికి సిధ్దపడుతున్నారు. ఇది ప్రజలను మోసం చేయటమేనని ఈ సమావేశం భావిస్తున్నది. 
విజయవాడ నగరంలో ప్రజలు నీటిమీటర్లు వ్యతిరేకిస్తున్నందున, ఎలాగైనా నీటి చార్జీలు పెంచాలన్న ఆలోచనతో వ్యక్తిగత గృహాలకు ఇంటిపన్ను ఆధారంగా నీటి చార్జీలు పెంచారు. అపార్టుమెంట్లకు విద్యుత్‌ చార్జీల మాదిరిగా స్లాబు పధ్ధతిని ఏర్పాటు చేశారు. దీనివలన నీటి చార్జీలు విజయవాడ నగరంలో విపరీతంగా పెరిగి పోయాయి. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకుకూడా నీటి మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నీటి మీటర్లు పెడితే నీటి చార్జీలు రెట్టింపవుతాయి. నీటిని వ్యాపార సరుకుగా మార్చుతున్న పాలకుల విధానాలను ఈ సమావేశం తిరస్కరిస్తున్నది. నీటి మీటర్లు పెట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని ఈ సమావేశం పాలకులను కోరుతున్నది. 
దక్షిణ భారత దేశం ఉష్ణ ప్రదేశం. అలాగే నీటితో సాంస్కృతిక అవసరాలున్నాయి. భౌతికంగా, సాంస్కృతికంగా నీటి అవసరం ఎక్కువ. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని, నీటి మీటర్లు పెట్టి నీటి వినియోగాన్ని కుదించడానికి బదులుగా, అవసరాలకు సరిపడా నీరు అందించడానికి ఏర్పాటు చేయాలని ఈ సమావేశం పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నది. 
విజయవాడ 10 లక్షల జనాభాగలిగిన నగరం. రాజధానిలో భాగంగా గుర్తించబడిన అనంతరం ఈ నగరజనాభా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. విజయవాడ నగరానికి ఎల్లప్పుడూ నీరు లభించే విధంగా నీటివనరులు కావలసి యున్నది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్‌లో నీరు అట్టడుగు మట్టానికి చేరింది. ఈ పరిస్థితి మారాలని, విజయవాడ నగరానికి నిరంతరంగా నీటి లభ్యత హామీ ఉండాలని ఈ సమావేశం అభిప్రాయ పడుతున్నది. దీనికోసం ఈ సమావేశం కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుతున్నది. 
విజయవాడ నగరానికి 5 టి.యం.సిల నీరు అవసరమున్నది. కృష్ణానదిలో ప్రతి సంవత్సరం వందలాది టి.యం.సిల 
విజయవాడ నగరానికి 5 టి.యం.సిల నీరు అవసరమున్నది. కృష్ణానదిలో ప్రతి సంవత్సరం వందలాది టి.యం.సిల నీరు సాధారణ వరదగా సముద్రంలో కలిసి పోతున్నది. సముద్రంలో కలిసి పోయే నీటిలో విజయవాడ నీటి అవసరాలకోసం 5 టి.యం.సిల నీటిని నిల్వ ఉంచుకునే ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రకాశం బ్యారేజినుండి వ్యవసాయానికి ఇవ్వవలసి యున్నది. వి.టి.పియస్‌.కు కృష్ణా నదినుండే నీరు ఇవ్వవలసి ఉన్నది. ఈ అవసరాలన్నీ తీరాలంటే వరదనీటిని నిల్వ ఉంచే ఏర్పాటు చేయాలి. వరదనీటిని నిల్వ ఉంచాలంటే కృష్ణా నదిపై 2 చెక్‌డ్యాంలు నిర్మించాలి. ఇబ్రహింపట్నంకు దిగువన ఒకచెక్‌ డ్యాం నిర్మిస్తే దానిలో నిల్వ ఉండే నీరు వి.టి.పి.యస్‌కు సరిపోతుంది. దానితో వి.టి.పి.యస్‌ కోసం ప్రకాశం బ్యారేజీలో నీరు నిల్వ ఉంచనవసరం లేదు. ప్రకాశం బ్యారేజికి దిగువన పెదపులిపాక పరిసర ప్రాంతాలో ఒకచెక్‌ డ్యాం నిర్మిస్తే దానిలో నిల్వ ఉండే నీరు విజయవాడ నీటి అవసరాలకు సరిపోతుంది. విజయవాడ నీటి అవసరాలకోసం పూర్తిగా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌పై ఆధార పడవలసిన అవసరం ఉండదు. కేవలం చెక్‌ డ్యాంలో నీళ్ళు లేనప్పుడు మాత్రమే ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ నీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ చెక్‌ డ్యాంలన్ని కృష్ణ నదికి సాధారణ వరద వచ్చినప్పుడు నిండుతాయి. అందువలన కృష్ణా నదిపై ఇబ్రహింపట్నంకు దిగువన, పెదపులిపాక పరిసర ప్రాంతాలో చెక్‌ డ్యాంలను నిర్మించవలసిందిగా ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. 
విజయవాడ నగరంలో నీటి సరఫరా ఖర్చును తగ్గించడానికి చేపట్టవలసిన చర్యలను కూడా ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నది. 
01.విద్యుత్‌ సంస్థలు మంచినీటి సరఫరాకు వసూలు చేస్తున్న రేట్లు అత్యధికంగా ఉన్నాయి. ప్రైవేటు వ్యాపారాలు, ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు విద్యుత్‌ నిస్తున్నారు. ఉదాహరణకు 1 యూనిట్‌ కు ఆక్వా కల్చర్‌కు, చెరకు క్రషింగ్‌కు రు.3.75 పై., ఫౌల్ట్రీ, హైచరీస్‌ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్టాంట్లకు రు4.75 పై., ధార్మిక ప్రదేశాలకు రు.4.70పై., పుట్టగొడుగులు కుందేళ్ళ ఫారాలకు , పూలమొక్కలపెంపకానికి రు5.74 పై., చొప్పున వసూలు చేయబోతున్నారు. ఇవన్నీ ప్రైవేటు వ్యాపారాలే.కాని పేద ధనిక బేధంలేకుండా పట్టణ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందించే రక్షిత మంచినీటి పథకాలకు మాత్రం విద్యుత్‌ చార్జీలు మున్సిపాలిటీలలో యూనిట్‌కు రు.5.75 పై, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో యూనిట్‌కు రు.6.28 పై లు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ప్రైవేటు వ్యాపారాలకు, ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ధరన్నా అధికంగా ఉన్నాయి. పట్టణ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందించడం కోసం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడంకోసం ఏర్పాటు చేసినవి రక్షిత మంచినీటి పథకాలు. రక్షిత మంచినీటి పథకాలు ప్రజారోగ్యంలో భాగం. ప్రజారోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. రక్షిత మంచినీటి పథకాలకు విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచడంతో పట్టణ స్థానిక సంస్ధలు అందించే నీటిఖర్చు విపరీతంగా పెరిగి పోతుంది. ఫలితంగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లపై విపరీతంగా భారం పడుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో రక్షిత మంచినీటి పథకాలకు విద్యుత్‌ చార్జీలను స్లాబుపధ్ధతి కాకుండా స్థిరంగా యూనిట్‌కు రు.2.60పైసలు చొప్పున (ఇది గృహావసరాలకు సీ గ్రూపులో వసూలు చేస్తున్న కనీస చార్జీ) వసూలు చేసేవిధంగా సవరించాలని ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. 
విజయవాడ నగరంలో ఇంకా అనేక ప్రాంతాలలో పాతకాలం నాటి నీటి పైపులే ఉన్నాయి. పాతవాటి స్థానంలో నాణ్యమైన నీటి పైపులను ఏర్పాటు చేయటం ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని ఈ సమావేశం భావిస్తున్నది. 
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుతున్నది. 
డిమాండ్లు 
01. నీటిమీటర్ల ప్రతిపాదనను విరమించుకోవాలి. నీటి చార్జీలను 31.3.2013 కు ముందున్న స్థాయికి తగ్గించాలి 
02. కృష్ణా నదిపై ఇబ్రహింపట్నంకు దిగువన, పెదపులిపాక పరిసర ప్రాంతాలో చెక్‌ డ్యాంలను నిర్మించాలి. 
03. రక్షిత మంచినీటి పథకాలకు విద్యుత్‌ చార్జీలను స్లాబులతో సంబంధంలేకుండా స్థిరంగా యూనిట్‌కు రు.2.60పైసలు చొప్పున (ఇది గృహావసరాలకు సీ గ్రూపులో వసూలు చేస్తున్న కనీస చార్జీ) మాత్రమే వసూలు చేయాలి. 
04. విజయవాడనగరంలో నీటిసరఫరా పైపులను పాతవాటిని మార్చి నాణ్యతగల క్రొత్త పైపులను ఏర్పాటు చేయాలి. 
ఈ డిమాండ్ల సాధనకోసం పోరాడాలని ఈ సమావేశం తీర్మానిస్తున్నది

Tuesday, 26 April 2016

Press Note

PRESS NOTE                                                                                          తేదీ: 26.04.2016 

విజయవాడతో సహా రాష్ట్రంలోని అన్నిపట్టణాలలో ఇంటింటికీ నీటి మీటర్లు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నది. నదులలో వరద నీటిని సమర్ధవంతంగా త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవటానికి చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వం, దానికి భిన్నంగా రాష్ట్ర ప్రజల మంచినీటి అవసరాన్ని ఆసరాగా చేసుకొని మంచినీటితో వ్యాపారం చేయటానికి, ప్రజలను దోపిడీ చేయటానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని స్పష్టం అవుతున్నది. 
గతంలో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. షరతులకనుగుణంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయవాడలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నించింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కు తగ్గింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అమృత్‌ పథకంలో భాగంగా ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నిస్తున్నది. విజయవాడ నగరంలో కూడా అమృత్‌ పథకం పేరుతో నీటి మీటర్లు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటిమీటర్ల ఏర్పాటుతో సహా అమృత్‌ పథకంలో మైల్‌ స్టోన్స్‌ పేరుతో పొందుపరచిన అన్ని షరతులను అమలుజరపటానికి వీలుగా ఈ నెల 4వ తేదీన జరిగిన విజయవాడ నగర కౌన్సిల్‌ సమావేశంలో అజెండాగా పెట్టి ఆమోదించుకున్నారు. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. షరతులకు, అమృత్‌ పధకంలోని మైల్‌ స్టోన్స్‌ పేరుతో ఉన్న షరతులకు తేడా ఏమిటో, ఏమి తేడా గమనించి కౌన్సిల్లో ఆమోదించారో నగర ప్రజలకు స్పష్టం చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర పాలకులను డిమాండ్‌ చేస్తున్నది. గత కౌన్సిల్లో కనీస అధ్యయనం లేకుండా జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. షరతులను కాంగ్రెస్‌ ఆమోదించింది. చివరకు అది నగరానికి గుదిబండగా మారింది. నగరపాలక సంస్థను దివాలా తీయించింది. ప్రజలపై భారాలు మోపింది. నేడు అమృత్‌ పథకంలో మైల్‌ స్టోన్స్‌ పేరుతో ఉన్న షరతులను కూడా కనీస అధ్యయనం లేకుండా, చర్చలేకుండా తెలుగుదేశం పాలకులు ఆమోదించారు. ఇది నగర ప్రజలపై పిడుగుపాటు కాబోతున్నదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
నాటి కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ 24 గంటల నీటిసరఫరా చేస్తామని, అందుకోసం నీటి మీటర్లు పెడతామని ప్రకటిస్తే, నేటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా 24 గంటల నీటిసరఫరా చేస్తామని, అందుకోసం నీటి మీటర్లు పెడతామని ప్రకటిస్తున్నది. నేటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి నీటి మీటర్ల ఏర్పాటును కేవలం పట్టణాలు,నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలకు కూడా విస్తరించబోతున్నది. ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లా ప్రత్తికొండ మండలంలో 24 గంటల నీటిసరఫరా చేస్తామని, అందుకోసం నీటి మీటర్లు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.ఇ. కృష్ణమూర్తి ప్రకటించటం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది. రాష్ట్రంలో పట్టణాలు,నగరాలతోబాటు, కుళాయిలున్న అన్ని గ్రామాలలోకూడా నీటిమీటర్లు పెట్టడానికి, నీటిని వ్యాపార సరుకుగా మార్చడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని స్పష్టమవుతున్నది. 
జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. షరతులకనుగుణంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయవాడలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం కార్పొరేటర్లు వ్యతిరేకించారు. తెలుగుదేశంపార్టీగా విజయవాడలో ఆంధోళనలు చేశారు. నాడు నీటి మీటర్ల ఏర్పాటుపై వ్యతిరేకించడానికీ, ఆంధోళనలు చేయటానికి గల కారణాలేమిటో, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ బాటలోనే నడుస్తూ నీటి మీటర్లను ఎందుకు పెట్టాలంటున్నారో పాలకులు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది.
విజయవాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలననలో పెంచిన నీటిచార్జీలు కట్టలేక ఇప్పటికే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే నీటిచార్జీలు తగ్గిస్తామని వాగ్దానంచేసి అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్‌ పాలకులు, ఏటా 7 శాతం పెంచుతున్నారు. ఇప్పుడు నగరమంతటా నీటి మీటర్లు పెట్టడానికి సిధ్దపడుతున్నారు. ఇది నగర ప్రజలను వంచించటమేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. నీటి మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు మోపే ప్రయత్నాలను విరమించి, నీటి చార్జీలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. 
(వి.సాంబిరెడ్డి)                                                                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                                           కార్యదర్శి






Sunday, 10 January 2016

Round Table on Petroleum Products  Prices by Tax Payers Association, People For India, M.B.Vignanakendram on 10.01.2016

Sunday, 6 December 2015

Press Note

PRESS NOTE                                                             DATE   07.12.2015
స్వరాజ్య మైదానాన్ని నగరంలోని ప్రజాతంత్ర కార్యక్రమాలకు, విజ్ఞాన వినోదకార్యక్రమాలకోసం అందుబాటులో ఉండేవిధంగా ఖాళీస్ధలంగానే ఉంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. రైతుబజారుతో సహా అందరినీ తొలగించి ఈ గ్రౌండును పార్కుగా చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా వస్తున్న వార్తల పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆంధోళన వ్యక్తం చేస్తున్నది. దీపావళి సమయంలో బాణసంచా అమ్ముకునేవారిని అనుమతించకపోవటం, బుక్‌ ఎగ్జిబిషన్‌ వారిని కూడా అనేక తర్జన భర్జనల అనంతరం కొద్దిభాగంలో అనుమతించటం, డ్రైవింగ్‌ స్కూల్‌ వారిని జనవరిలో ఖాళీ చేయమని చెప్పటం, హెలీపాడ్‌లు నిర్మించడం లాంటిచర్యలు ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. 
ఈ గ్రౌండ్‌ నగరానికి ఎన్నోవిధాలుగా ఉపయోగపడుతున్నది.బుక్‌ ఎగ్జిబిషన్‌లాంటి విజ్ఞాన కార్యక్రమాలకు, భిన్నమతాలవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల బహిరంగ సభలకు పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్‌లకు, హస్తకళలను ప్రోత్సహించే హస్తకళల ఎగ్జిబిషన్‌లకు, సెలవుదినాలలో పిల్లలు ఆడుకోవటానికి, డ్రైవింగ్‌ నేర్చుకునేవారికి, రైతుబజార్‌ ద్వారా ప్రజలకు, ఇలా ఎన్నోవిధాలుగా నగరప్రజలకు ఉపయోగనడుతున్నది.దీపావళి సమయంలో బాణసంచా అమ్మకాలకు ఉపయోగపడుతున్నది. గతంలో ఈ గ్రౌెండ్‌లోనే రూపవాణీ లాంటి జాతీయ సంస్థలు గొప్పజాతీయ కళారూపాలు ప్రదర్శించారు. వినోద కార్యక్రమాలైన సర్కస్‌లు లాంటివి జరుగుతున్నాయి. ఇన్నివిధాలుగా దశాబ్దాలుగా మనకు ఉపయోగపడుతున్న ఈ గ్రౌండును ఇప్పుడు విజయవాడ ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా చేయాలనుకోవటం దారుణం. ఇవేవీ లేకుండా విజయవాడ ప్రజలు ఎడారి బ్రతుకులు ఎందుకు బ్రతకాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. 
నగరంలో ఇప్పటికే చిన్నవి పెద్దవి అన్నీకలిపి126 పార్కులున్నాయి.వీటన్నింటి సక్రమంగా నిర్వహిస్తే ప్రజలకు వారివారి ప్రాంతాలలోనే పార్కులు అందుబాటులోఉంటాయి. మరల క్రొత్తపార్కును నిర్మించవలసిన అవసరంలేదు. ఈ గ్రౌండును పార్కుగా మార్చితేే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే నగరంలో ఉన్న లాభాలొచ్చే పార్కులను ప్రైవేటువారికి ఇచ్చారు. పార్కులను ప్రైవేటువారికి అప్పగించంటం ప్రభుత్వ విధానంగా ఉన్నది.ఇప్పుడు ఇది కూడా పార్కుగా మారితే అది ఖచ్చితంగా ప్రైవేటు వారి చేతులలోకి వెళుతుంది. ఈ గ్రౌండును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టటానికే ఈ ఆలోచన అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
విజయవాడ రాజధానిలో భాగంగా మారింది. రాష్ట్రపాలన ఇక్కడనుండే మొదలయింది. దీనితో నగరంలోని స్థలాలపై కొంతమంది కన్ను పడింది. ఇటీవల విద్యాధరపురంలో ఉన్న ఆర్‌.టీ.సి స్థలాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రికి కాకుండా, ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఆసుపత్రికి కట్టాబెట్టాలని ఆర్‌.టీ.సి ప్రయత్నించింది. ఇప్పుడు స్వరాజ్య మైదానం వంతు వచ్చింది. ఇలా నగరంలోని ఖాళీస్థలాలన్నింటనీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతున్నది. 
నగరంలో జనసంఖ్య పెరుగుతున్నది.దానితో అవసరాలు పెరుగుతున్నాయి. అందువలన స్వరాజ్యమైదానాన్ని పూర్తిస్థాయిలో ప్రజల ప్రయోజనార్ధం ఖాళీస్థలంగానే ఉంచాలని, సభలు సమావేశాలకు ఉచితంగా ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. 

(వి.సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                కార్యదర్శి

Saturday, 5 December 2015

విజయవాడ నగరంలో ఏకైక పెద్ద గ్రౌండు స్వరాజ్యమైదానం. 
దానిని కాపాడుకోవటం మనందరి బాధ్యత 
స్వరాజ్య మైదానాన్ని (PWD గ్రౌండ్‌ను) కాపాడుకుందాం. 

సోదరీ సోదరులారా! 
మన విజయవాడ నగరం 10 లక్షల జనాభాగల పెద్దనగరం. ఇంత పెద్ద నగరంలో ప్రజల అవసరాల కోసం అనేక గ్రౌండ్లు కావాలి. కాని మన నగరానికి ఉన్న ఏకైక పెద్ద గ్రౌండు స్వరాజ్య మైదానం (ూఔణ గ్రౌండ్‌) మాత్రమే. ఇదికూడా మన చేయిజారిపోతే? ఇది అన్యాక్రాంతమైపోతే మన నగరం పరిస్థితి ఏమిటి? 
ఇది మన నగరానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నదో చూడండి. 
01. బుక్‌ ఎగ్జిబిషన్‌లాంటి విజ్ఞాన కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నది. 
02. భిన్నమతాలవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నది. 
03. ఈ గ్రౌండ్‌లో ఎందరో మహాను భావుల బహిరంగ సభలు జరిగాయి. వివిధ రాజకీయ 
పార్టీలు, ప్రజాసంఘాల బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఆవిధంగా అది 
ప్రజాస్వామ్య కార్య క్రమాలకు ఉపయోగపడుతున్నది. 
04. పారిశ్రామిక, వ్యవసాయ ఎగ్జిబిషన్‌లకు ఉపయోగపడుతున్నది. 
05. హస్తకళలను ప్రోత్సహించే హస్తకళల ఎగ్జిబిషన్‌లకు ఉపయోగపడుతున్నది. 
06. సెలవుదినాలలో పిల్లలు ఆడుకోవటానికి ఉపయోగపడుతున్నది. 
07. డ్రైవింగ్‌ నేర్చుకునేవారికి ఉపయోగపడు తున్నది. 
08. రైతుబజార్‌ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతున్నది. 
09. దీపావళి సమయంలో బాణసంచా అమ్మకాలకు ఉపయోగపడుతున్నది. 
10. గతంలో ఈ గ్రౌెండ్‌లోనే రూపావాణీ వారు గొప్పజాతీయ కళారూపాలు ప్రదర్శించారు. 11. వినోద కార్యక్రమాలైన సర్కస్‌లు లాంటివి జరుగుతున్నాయి. 
ఇలాంటి అనేక కార్యక్రమాలకు ఈ గ్రౌండు ఉపయోగపడుతున్నది. 
ఇన్నివిధాలుగా దశాబ్దాలుగా మనకు ఉపయోగపడుతున్న ఈ గ్రౌండును ఇప్పుడు మన ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా చేయబోతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి సమయంలో బాణసంచా అమ్ముకునేవారిని అనుమతించలేదు. బుక్‌ ఎగ్జిబిషన్‌ వారిని కూడా అనేక తర్జన భర్జనల అనంతరం కొద్దిభాగంలో అనుమతించారు. గతంలోలాగా మొత్తం గ్రౌండులో అనుమతించలేదు. డ్రైవింగ్‌ స్కూల్‌ వారిని జనవరిలో ఖాళీ చేయమని చెప్పినట్టు భోగట్టా. 
గతంలో ఎవరైనా హెలీకాప్టర్‌లో వస్తే వారికి హెలీపాడ్‌ ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఈ గ్రౌండులోనే హెలీపాడ్‌లు ఏర్పాటుచేశారు. రైతుబజారుతో సహా అందరినీ తొలగించి ఈ గ్రౌండును పార్కుగా మార్చబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఇది ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్ళటం ఖాయం. ఇప్పటికే నగరంలో ఉన్న లాభాలొచ్చే పార్కులను ప్రైవేటువారికి ఇచ్చారు. పార్కులను ప్రైవేటువారికి అప్పగించటం ప్రభుత్వ విధానంగా ఉన్నది.ఇప్పుడు ఇది కూడా పార్కుగా మారితే అది ఖచ్చితంగా ప్రైవేటు వారి చేతులలోకి వెళుతుంది. అంటే ఈ గ్రౌండును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారన్నమాట. 
మన నగరం రాజధానిలో భాగంగా మారింది. దీనితో నగరంలోని స్థలాలపై కొంతమంది కన్ను పడింది. ఇటీవల విద్యాధరపురంలో ఉన్న ఆర్‌.టీ.సి స్థలాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల ఆసుపత్రికి కాకుండా, ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఆసుపత్రికి కట్టాబెట్టాలని ఆర్‌.టీ.సి ప్రయత్నించింది. ఇప్పుడు స్వరాజ్య మైదానం వంతు వచ్చింది. ఇలా గ్రౌండ్‌లన్నీ ప్రజల అవసరాలకు లేకుండా చేస్తే నగర ప్రజలు కాలుతీసి కాలు పెట్టడానికి స్థలం ఉండదు. 
నగరంలో జనసంఖ్య పెరుగుతున్నది.దానితో అవసరాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు మరిన్ని గ్రౌండ్లు కావాలి. అందుకు భిన్నంగా మనకున్న ఆ ఒక్క గ్రౌెండు కూడా లేకుండా పోతే మన నగర పరిస్థితి ఏమిటి? వినోద విజ్ఞాన కార్యక్రమాలు లేకుండా, రాజకీయ, సామాజిక సభలు సమావేశాలు జరగకుండా, ఆధ్యాత్మిక అవసరాలు తీరకుండా నగరంలో మనం ఎడారి బ్రతుకులు బ్రతకాలా? ఇవన్నీ జరగాలంటే గ్రౌండ్‌ కావాలి కదా? 
అందుకే విజయవాడ పౌరులుగా మనం మేల్కొనాలి. నగరంలోని ఖాళీ స్థలాలను కాపాడుకోవాలి. నగరానికి మకుటాయమానంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని కాపాడుకోవటం నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. స్వరాజ్యమైదాన పరిరక్షణ వేదిక చేపట్టే కార్యక్రమాలలో కలసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం.సమైక్యంగా కదులుదాం.స్వరాజ్య మైదానాన్ని కాపాడుకుందాం. 
అభివందనాలతో 
స్వరాజ్య మైదాన పరిరక్షణ వేదిక-విజయవాడ 

Wednesday, 18 November 2015

PRESS NOTE                                                     DATE: 18.11.2015

          విద్యాధరపురంలోని ఆర్‌టిసికి చెందిన స్థలాన్ని ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇస్టిట్యూట్‌కు అప్పగించాలని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. ఆ స్థలం ఆర్‌టిసికి అవసరంలేకపోతే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి వేయాలని డిమాండు చేస్తున్నది. ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇస్టిట్యూట్‌ అనేది వైద్యరంగంలో ఒక కార్పొరేట్‌ వ్యాపార సంస్థ. ప్రైవేటు వ్యాపార సంస్థ కోసం ఆర్‌టిసి స్థలాన్ని ఇవ్వవలసిన అవసరం ఏమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాల నిర్వహణకోసం ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తుంది. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలు ఉంటే వాటిని కేటాయిస్తుంది. లేదా ప్రైవేటు ఆస్తులను భూసేకరణ చట్టప్రకారం సేకరించి కేటాయిస్తుంది. ఏవిధంగా కేటాయించిన్పటికీ అవి ప్రభుత్వ ఆస్తులే. అంటే ప్రజల ఉమ్మడి ఆస్తులు. ఏ ప్రభుత్వరంగ సంస్థ అయినా తనకు కేటాయించిన భూమి తన కార్యకలాపాలకు వాడుకోవాలి. తనకు అవసరంలేకపోతే తిరిగి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి వాపసుచేయాలి లేదా స్థానిక సంస్థకు అప్పగించాలి. అంతేకాని ఇష్టారాజ్యంగా ప్రైవేటుసంస్థలకు అప్పగించడానికి, అది ఆర్‌టిసి అధికారుల సొంత ఆస్తికాదు. విజయవాడను రాజధానిలో భాగంగా గుర్తించిన తర్వాత వివిధ డిపార్టుమెంట్లకు చెందిన విలువైన స్థలాలను కాజేయటానికి అనేకమంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు వాటికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పి.పి.పి విధానాలు, లీజువిధానాలు, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రైవేటు సంస్థలు కాజేయటానికి ఉపకరిస్తున్నాయి. రాష్ట్ర పరిపాలన విజయవాడనుండి సాగుతున్న తరుణంలో వివిధ కార్యాలయాలకు, క్వార్టర్సుకు స్థలాలు అవసరమవుతున్నాయి. ఆర్టీసీ తోసహా మరే ప్రభుత్వ రంగసంస్థకు చెందిన స్థలమైనా , ఆసంస్థ వినియోగించుకోకుండా నిరుపయోగంగా ఉంటే ఆ స్థలాలలో ప్రభుత్వ కార్యాలను నిర్మించుకొని వాడుకోవచ్చు. లేదా ప్రభుత్వ ఉద్యోగులకు వసతిగృహాలు నిర్మించవచ్చు. ఇళ్ళ స్థలాలుగా మార్చి ఇళ్లలేనివారికి కేటాయించవచ్చు. అంతేగాని ప్రభుత్వ అవసరాలకు గాని, సంస్థ అవసరాలకుగాని వినియోగించుకోకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే అవుతుంది. అందువలన ఆర్‌టీసికి అవసరంలేని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తమ కార్యాలయాలు లేదా ఉద్యోగుల క్వార్టర్సు నిర్మించి వినియోగించుకోవాలని, లేదా లేఅవుట్‌ వేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.