Sunday, 8 May 2016

నీటి మీట‌ర్ల‌పై టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో 08.05.2016 న జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానం

08.05.2016 న జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానం 
అమృత్‌ పధకంలోని షరతులకు అనుగుణంగా విజయవాడ నగరంతో సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలలో నీటి మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు జరుగుతున్న రౌండ్‌టేబుల్‌ సమావేశం తీవ్రంగా పరిగణిస్తున్నది. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ నాయకత్వంలోయున్న యు.పి.ఎ. ప్రభుత్వం జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకాన్ని ప్రవేశపెట్టింది. దానిని రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు జరపటం ప్రారంభించింది. విజయవాడ నగరపాలక సంస్థలో ఆనాటి కాంగ్రెస్‌ నాయకత్వంలో ఉన్న కౌన్సిల్‌లో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకంలోని అన్ని షరతులను ఆమోదించారు. నీటి మీటర్లు పెట్టాలన్న షరతు జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకంలో ఉన్నది. దానికనుగుణంగానే ప్రజలు కోరక పోయినప్పటికీ 24 గంటలు నీటి సరఫరా చేస్తామని, 24 గంటలు నీటి సరఫరా జరిగితే ప్రజలు విచ్చలవిడిగా వాడేస్తారుగాబట్టి, నీటి వినియోగాన్ని నియంత్రించటం కోసం నీటి మీటర్లు పెడతామని ప్రకటించారు. ఆనాడు నీటి మీటర్లు పెట్టే ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 
నేడు కేంద్రంలోని బి.జె.పి. నాయకత్వంలో నడుస్తున్న యన్‌.డి.ఎ. ప్రభుత్వం అమృత్‌ పేరుతో మరో క్రొత్తపథకాన్ని ప్రవేశ పెట్టింది. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకంలో ఉన్న అన్నిషరతులు మైల్‌ స్టోన్స్‌ పేరుతో అమృత్‌ పథకంలో పొందుపరచారు. అమృత్‌ పథకంలో నీటి మీటర్లు ఏర్పాటు చేయాలన్న షరతు కూడా ఉన్న విషయాన్ని ఈ సమావేశం గుర్తిస్తున్నది. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో 31 పట్టణాలను అమృత్‌ పధకంలో చేర్చింది. విజయవాడ నగరం కూడా అమృత్‌ పథకంలో ఉన్న నగరాలు, పట్టణాల జాబితాలో ఉన్నది. ఏప్రిల్‌ 4, 2016 న జరిగిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో నీటిమీటర్లతో సహా అమృత్‌ పథకంలో పొందుపరచిన అన్ని షరతులను ఆమోదించారు. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అనుసరించిన విధానానికి, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి, రాష్ట్రంలో, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం అనుసరిస్తున్న విధానాలకు తేడా లేదని ఈ సమావేశం భావిస్తున్నది. 
గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయవాడలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం కార్పొరేటర్లు వ్యతిరేకించారు. తెలుగుదేశంపార్టీగా విజయవాడలో ఆందోళనలు చేశారు. అదే తెలుగు దేశంవారు నేడు అమృత్‌ పథకంపేరుతో నీటిమీటర్లు పెెట్టబోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే అమలు పరచడం రివాజుగా మారిందని ఈ సమావేశం గుర్తిస్తున్నది. . కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్య ఉన్నవి రాజకీయ విబేధాలేగాని, విధానపరమైన విబేధాలు కాదని ఈ సమావేశం అభిప్రాయపడుతున్నది. 
విజయవాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలనలో పెంచిన నీటిచార్జీలు కట్టలేక ఇప్పటికే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి చార్జీల పెంపు దారుణమని, తాము అధికారంలోకి వస్తే నీటిచార్జీలు తగ్గిస్తామని వాగ్దానంచేసి అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్‌ పాలకులు, ఏటా 7 శాతం పెంచుతున్నారు. ఇప్పుడు నగరమంతటా ఇంటింటికీ నీటి మీటర్లు పెట్టడానికి సిధ్దపడుతున్నారు. ఇది ప్రజలను మోసం చేయటమేనని ఈ సమావేశం భావిస్తున్నది. 
విజయవాడ నగరంలో ప్రజలు నీటిమీటర్లు వ్యతిరేకిస్తున్నందున, ఎలాగైనా నీటి చార్జీలు పెంచాలన్న ఆలోచనతో వ్యక్తిగత గృహాలకు ఇంటిపన్ను ఆధారంగా నీటి చార్జీలు పెంచారు. అపార్టుమెంట్లకు విద్యుత్‌ చార్జీల మాదిరిగా స్లాబు పధ్ధతిని ఏర్పాటు చేశారు. దీనివలన నీటి చార్జీలు విజయవాడ నగరంలో విపరీతంగా పెరిగి పోయాయి. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకుకూడా నీటి మీటర్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నీటి మీటర్లు పెడితే నీటి చార్జీలు రెట్టింపవుతాయి. నీటిని వ్యాపార సరుకుగా మార్చుతున్న పాలకుల విధానాలను ఈ సమావేశం తిరస్కరిస్తున్నది. నీటి మీటర్లు పెట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని ఈ సమావేశం పాలకులను కోరుతున్నది. 
దక్షిణ భారత దేశం ఉష్ణ ప్రదేశం. అలాగే నీటితో సాంస్కృతిక అవసరాలున్నాయి. భౌతికంగా, సాంస్కృతికంగా నీటి అవసరం ఎక్కువ. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని, నీటి మీటర్లు పెట్టి నీటి వినియోగాన్ని కుదించడానికి బదులుగా, అవసరాలకు సరిపడా నీరు అందించడానికి ఏర్పాటు చేయాలని ఈ సమావేశం పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నది. 
విజయవాడ 10 లక్షల జనాభాగలిగిన నగరం. రాజధానిలో భాగంగా గుర్తించబడిన అనంతరం ఈ నగరజనాభా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. విజయవాడ నగరానికి ఎల్లప్పుడూ నీరు లభించే విధంగా నీటివనరులు కావలసి యున్నది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్‌లో నీరు అట్టడుగు మట్టానికి చేరింది. ఈ పరిస్థితి మారాలని, విజయవాడ నగరానికి నిరంతరంగా నీటి లభ్యత హామీ ఉండాలని ఈ సమావేశం అభిప్రాయ పడుతున్నది. దీనికోసం ఈ సమావేశం కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుతున్నది. 
విజయవాడ నగరానికి 5 టి.యం.సిల నీరు అవసరమున్నది. కృష్ణానదిలో ప్రతి సంవత్సరం వందలాది టి.యం.సిల 
విజయవాడ నగరానికి 5 టి.యం.సిల నీరు అవసరమున్నది. కృష్ణానదిలో ప్రతి సంవత్సరం వందలాది టి.యం.సిల నీరు సాధారణ వరదగా సముద్రంలో కలిసి పోతున్నది. సముద్రంలో కలిసి పోయే నీటిలో విజయవాడ నీటి అవసరాలకోసం 5 టి.యం.సిల నీటిని నిల్వ ఉంచుకునే ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రకాశం బ్యారేజినుండి వ్యవసాయానికి ఇవ్వవలసి యున్నది. వి.టి.పియస్‌.కు కృష్ణా నదినుండే నీరు ఇవ్వవలసి ఉన్నది. ఈ అవసరాలన్నీ తీరాలంటే వరదనీటిని నిల్వ ఉంచే ఏర్పాటు చేయాలి. వరదనీటిని నిల్వ ఉంచాలంటే కృష్ణా నదిపై 2 చెక్‌డ్యాంలు నిర్మించాలి. ఇబ్రహింపట్నంకు దిగువన ఒకచెక్‌ డ్యాం నిర్మిస్తే దానిలో నిల్వ ఉండే నీరు వి.టి.పి.యస్‌కు సరిపోతుంది. దానితో వి.టి.పి.యస్‌ కోసం ప్రకాశం బ్యారేజీలో నీరు నిల్వ ఉంచనవసరం లేదు. ప్రకాశం బ్యారేజికి దిగువన పెదపులిపాక పరిసర ప్రాంతాలో ఒకచెక్‌ డ్యాం నిర్మిస్తే దానిలో నిల్వ ఉండే నీరు విజయవాడ నీటి అవసరాలకు సరిపోతుంది. విజయవాడ నీటి అవసరాలకోసం పూర్తిగా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌పై ఆధార పడవలసిన అవసరం ఉండదు. కేవలం చెక్‌ డ్యాంలో నీళ్ళు లేనప్పుడు మాత్రమే ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ నీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ చెక్‌ డ్యాంలన్ని కృష్ణ నదికి సాధారణ వరద వచ్చినప్పుడు నిండుతాయి. అందువలన కృష్ణా నదిపై ఇబ్రహింపట్నంకు దిగువన, పెదపులిపాక పరిసర ప్రాంతాలో చెక్‌ డ్యాంలను నిర్మించవలసిందిగా ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. 
విజయవాడ నగరంలో నీటి సరఫరా ఖర్చును తగ్గించడానికి చేపట్టవలసిన చర్యలను కూడా ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నది. 
01.విద్యుత్‌ సంస్థలు మంచినీటి సరఫరాకు వసూలు చేస్తున్న రేట్లు అత్యధికంగా ఉన్నాయి. ప్రైవేటు వ్యాపారాలు, ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు విద్యుత్‌ నిస్తున్నారు. ఉదాహరణకు 1 యూనిట్‌ కు ఆక్వా కల్చర్‌కు, చెరకు క్రషింగ్‌కు రు.3.75 పై., ఫౌల్ట్రీ, హైచరీస్‌ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్టాంట్లకు రు4.75 పై., ధార్మిక ప్రదేశాలకు రు.4.70పై., పుట్టగొడుగులు కుందేళ్ళ ఫారాలకు , పూలమొక్కలపెంపకానికి రు5.74 పై., చొప్పున వసూలు చేయబోతున్నారు. ఇవన్నీ ప్రైవేటు వ్యాపారాలే.కాని పేద ధనిక బేధంలేకుండా పట్టణ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందించే రక్షిత మంచినీటి పథకాలకు మాత్రం విద్యుత్‌ చార్జీలు మున్సిపాలిటీలలో యూనిట్‌కు రు.5.75 పై, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో యూనిట్‌కు రు.6.28 పై లు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ప్రైవేటు వ్యాపారాలకు, ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ధరన్నా అధికంగా ఉన్నాయి. పట్టణ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన నీటిని అందించడం కోసం, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడంకోసం ఏర్పాటు చేసినవి రక్షిత మంచినీటి పథకాలు. రక్షిత మంచినీటి పథకాలు ప్రజారోగ్యంలో భాగం. ప్రజారోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. రక్షిత మంచినీటి పథకాలకు విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచడంతో పట్టణ స్థానిక సంస్ధలు అందించే నీటిఖర్చు విపరీతంగా పెరిగి పోతుంది. ఫలితంగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లపై విపరీతంగా భారం పడుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో రక్షిత మంచినీటి పథకాలకు విద్యుత్‌ చార్జీలను స్లాబుపధ్ధతి కాకుండా స్థిరంగా యూనిట్‌కు రు.2.60పైసలు చొప్పున (ఇది గృహావసరాలకు సీ గ్రూపులో వసూలు చేస్తున్న కనీస చార్జీ) వసూలు చేసేవిధంగా సవరించాలని ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. 
విజయవాడ నగరంలో ఇంకా అనేక ప్రాంతాలలో పాతకాలం నాటి నీటి పైపులే ఉన్నాయి. పాతవాటి స్థానంలో నాణ్యమైన నీటి పైపులను ఏర్పాటు చేయటం ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని ఈ సమావేశం భావిస్తున్నది. 
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ముందుంచుతున్నది. 
డిమాండ్లు 
01. నీటిమీటర్ల ప్రతిపాదనను విరమించుకోవాలి. నీటి చార్జీలను 31.3.2013 కు ముందున్న స్థాయికి తగ్గించాలి 
02. కృష్ణా నదిపై ఇబ్రహింపట్నంకు దిగువన, పెదపులిపాక పరిసర ప్రాంతాలో చెక్‌ డ్యాంలను నిర్మించాలి. 
03. రక్షిత మంచినీటి పథకాలకు విద్యుత్‌ చార్జీలను స్లాబులతో సంబంధంలేకుండా స్థిరంగా యూనిట్‌కు రు.2.60పైసలు చొప్పున (ఇది గృహావసరాలకు సీ గ్రూపులో వసూలు చేస్తున్న కనీస చార్జీ) మాత్రమే వసూలు చేయాలి. 
04. విజయవాడనగరంలో నీటిసరఫరా పైపులను పాతవాటిని మార్చి నాణ్యతగల క్రొత్త పైపులను ఏర్పాటు చేయాలి. 
ఈ డిమాండ్ల సాధనకోసం పోరాడాలని ఈ సమావేశం తీర్మానిస్తున్నది

No comments:

Post a Comment