Monday, 23 September 2013

Letter written to Chief Minister of AP on Information Technology Investment Region

                                                                   తేదీ: 23.09.2013

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి,

ఆర్యా,

హైదరాబాద్‌ నగరంలో ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐ.టి.ఐ.ఆర్‌) ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో ఐ.టి., ఐటి ఆధారిత సేవలు మరియు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు వస్తాయని. వీటిద్వారా రు. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 55.9 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంత భారీగా ఉపాధి లభించే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఆహ్వానించదగినదే. కాని ఈ పరిశ్రమలను హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేయటాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రంలోని ఇతర నగరాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. మా డిమాండ్‌కు గల కారణాలను మీముందుంచుతున్నాము.

సంస్కరణలపేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వంనుండి నేటి మీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు కేంద్రీకృత ఆర్ధిక విధానాలనే అమలు జరుపుతూవచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలను బలిపెట్టి హైదరాబాదును అభివృధ్ధి చేశారు. రాష్ట్రం లోకి వచ్చిన పరిశ్రమలను, కేంద్ర ప్రభుత్వ సంస్ధలను అన్నింటినీ హైదరాబాదులోనే కేంద్రీకరించారు. ఈ పరిశ్రమలకోసమని మౌలిక సదుపాయాలను సైతం హైదరాబాదులోనే అభివృధ్ధి చేశారు. కేంద్రీయ యూనివర్శిటీలతో బాటుగా అనేక ముఖ్యమైన యూనివర్శిటీలను హైదరాబాదులోనే నెలకొల్పారు. చివరకు తెలుగు యూనివర్శిటీని సైతం ఉర్దూ ప్రాంతమైన హైదరాబాదులోనే నెలకొల్పారు. ఇప్పుడు మరల హైదరాబాదును ఎడ్యు కేషన్‌ హబ్‌గా తయారు చేస్తామని ప్రకటించారు. ఏ క్రొత్త పరిశ్రమ వచ్చినా దానిని హైదరాబాదుకే ఆహ్వానించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఫలితంగా పరిశ్రమల కేంద్రీకరణ, విద్య కేంద్రీకరణ, సౌకర్యాల కేంద్రీకరణ, సంపద కేంద్రీకరణ అంతా హైదరాబాదులోనే జరిగింది. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు పారిశ్రామిక ఎడారులుగా మారాయి. ప్రపంచీకరణలో భాగంగా మీరనుసరించిన విధానాలవలన అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చేతివృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిపట్టణాలలో ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. పరిశ్రమలు, విద్య, సంపద, సౌకర్యాలు అన్నీ హైదరాబాదులో కేంద్రీకరించటం మూలంగా ఉపాధి అవకాశాలు హైదరాబాదులోనే పెరిగాయి. దీనితో ఉపాధి వెతుక్కుంటూ రాష్ట్రంలోని అన్ని పట్టణాలనుండి విద్యాధికులు, చేతివృత్తులవారు, కార్మికులు అందరూ హైదరాబాదుకు రావలసివచ్చింది. ఫలితంగా హైదరాబాదులో స్థలం చాలక చుట్టు ప్రక్కల ఉన్న మున్సిపాలిటీలను, గ్రామాలను కలిపి గ్రేటర్‌ హైదరాబాదు చేయవలసివచ్చింది. దీనిని స్వార్ధపరులు అవకాశంగా తీసుకొని తమకు ఉపాధి లేకపోవటానికి కారణం మరో ప్రాంతంవారేనని తెలంగాణా ప్రజలను రెచ్చ గొట్టారు. ఫలితంగా విభజన వాదం తలెత్తింది. రాష్ట్రం విడిపోతే తమ విద్య ఉపాధి పరిస్తితేమిటని కోస్తా రాయలసీమ ప్రాంత వాసులకు భయంపట్టుకున్నది. ఫలితంగా రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృధ్ధి చేసినట్లయితే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదికాదు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృధ్ది కలిస్తే రాష్ట్రాభివృధ్ది అభివృధ్ధి అవుతుంది తప్ప, కేవలం హైదరాబాదు అభివృధ్ధే రాష్ట్రాభివృధ్ది కాదన్న విషయం మీకు తెలియందికాదు. తెలుగు దేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరించిన ఈ కేంద్రీకరణ విధానాల వలననే రాష్ట్రానికి ఈ దుర్గతి దాపురించింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఈ కేంద్రీకరణ విధానాలు విడనాడి, పారిశ్రామిక వికేంద్రీకరణ, సౌకర్యాల వికేంద్రీకరణ. విద్యావికేంద్రీకరణ జరపాలని, రాష్ట్రంలోని 181 మున్సిపల్‌ పట్టణాలలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము డిమాండు చేస్తున్నాము. దీనివలన అన్ని పట్టణాలలో ఎక్కడివారికి అక్కడే ఉపాధి లభిస్తుందని, తద్వారా విభజన ఉద్యమాలు సమసిపోతాయని స్పష్టం చేస్తున్నాము.

ఇప్పటికే హైదరాబాదులో ఐటీ పరిశ్రమ ఉన్నది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు వాటిలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రాబోతున్న ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐ.టి.ఐ.ఆర్‌) ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 70 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ సంఖ్య హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న జనసంఖ్యతో సమానం. ఇన్ని లక్షల మంది మరల హైదరాబాదుకు చేరితే హైదరాబాదుతో బాటుగా రాష్ట్రం మరింత ధ్వంసం అవుతుందని స్పష్టం చేస్తున్నాము.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఐ.టి.ఐ.ఆర్‌ పేరుతో రాష్ట్రానికి రానున్న ఐ.టి., ఐటి ఆధారిత సేవలు మరియు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలను ఒకే చోట కాకుండా, విభజించి, హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని ఇతర 18 మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగరాలలో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

ఇక మీదట ఏ పరిశ్రమ వచ్చినా హైదరాబాదులో కాకుండా రాష్ట్రంలోని ఇతర మున్సిపల్‌ పట్టణాలు,నగరాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కొన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాము.

విజయవాడలో ఐ.ఐ.టీ ని ఏర్పాటుచేయాలని, గన్నవరం ఐ.టి. పార్కును అభివృద్ధి చేయాలని, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలను ఏర్పాటుచేయాలని డిమాండు చేస్తున్నాము.
                          అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి)                                    (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                  కార్యదర్శి



Friday, 23 August 2013

విజయవాడ నగరాభివృద్ధి-పౌర ఎజండా Vijayawada City Development-Citizen’s Agenda


విజయవాడ నగరాభివృద్ధి-పౌర ఎజండా

Vijayawada City Development-Citizen’s Agenda

విజయవాడనగరం అభివృద్ది చెందవలసిన రీతిలో అభివృధ్ధి చెందటంలేదు. ఎక్కడనుండో వచ్చిన అధికారులు తమకు తోచిన చర్యలు తీసుకుని ఇదే అభివృధ్ధి అనుకోమంటున్నారు. ప్రజల అభిప్రాయానికి చోటు లేకుండా పోతున్నది. మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఆంధోళన చేయటం, ఆతర్వాత మిన్నకుండటం జరుగుతున్నది. నగర సమగ్రాభివృధ్ధికి ఏమి కావాలో సూచించే ఎజండా లేదు. అదికారులుగాని, పాలకులుగాని ఆపనికి పూనుకోలేదు. ఉడా లాంటి సంస్థలు రూపొందించిన మాస్టర్‌ ప్లాను కేవలం ప్రభుత్వాలు తలపెట్టిన ప్రైవేటీకరణవిధానాలను అమలు జరపడం, ప్రజల మీద భారలను మోపడానికి ఉద్దేశించినదే తప్ప నగరాభివృద్ధికి ఏమాత్రం దోహదపడేది కాదు. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకొని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర సమగ్రాభివృధ్ధికి ఒక ఎజండా ముసాయిదాను తయారు చేసింది. ఈ ముసాయిదాను పబ్లిక్‌ అభిప్రాయాల కొరకు చర్చకు పెడుతున్నది.
ఈ ఎజండా ముసాయిదా పూర్తిగా ఆ సైట్‌లో పోస్టు చేయటానికి సాధ్యపడదు. అందువలన గూగుల్‌ లింక్‌ ఈ దిగువ నిస్తున్నాము. ఈ లింకును మీ బ్రౌజరులోని అడ్రసు బార్‌లో కాపీ చేసి ఎంటర్‌ కొడితే ముసాయిదా ఒపేన్‌ అవుతుంది. మీరు దానిని చదివి మీ అభిప్రాయాలను మాకు ఈ మెయిల్‌ ద్వారా పంపండి


ముసాయిదా లింక్‌
https://docs.google.com/file/d/0B25Ypk7Mlc0qRkw5cUJCX2pBU2M/edit?usp=sharing


అభిప్రాయాలు పంపవలసిన ఈ మెయిల్‌ అడ్రస్‌ 
veeranjaneyulumatcha@gmail.com



Monday, 24 June 2013

నగర పాలక సంస్థ కు రావలసిన ఆదాయమార్గాలను గురించి సిటిజెన్స్ ఫోరం కమిషనర్ కు వ్రాసిన లేఖ

                                                                                               తేదీ:08.02.2013
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి
ఆర్యా,
విజయవాడ నగరపాలక సంస్థ నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న విషయాన్ని మేము గమనిస్తున్నాము. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేసే పరిస్థితి లేదు ఫలితంగా అటు ఉద్యోగులు, ఇటు కాంట్రాక్టర్లు ఆంధోళన చేయవలసి వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పి.ఎఫ్‌,నిధులను సైతం నగరపాలక సంస్థ వాడుకున్నది. చివరకు నిధులకోసం నగరపాలక సంస్థ ఆస్తులను సౖెెతం తాకట్టు పెట్టవలసి వచ్చింది. అభివృధ్ధి పనులు నిలచి పోతున్నాయి. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ విషయాలను నగరపౌరులుగా గమనిస్తున్నాము. నగరపాలక సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న మేము నగరాభివృధ్ధి కుంటు పడుతూ ఉంటే, మా మీద భారాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. అందువలననే నగరంలోని వివిధ

నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను వ్యతిరేకించండి.


మున్సిపల్‌ కార్పొరేన్‌ నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను భారీగా పెంచింది. మొదటిసారిగా
ఇంటిపన్ను ఆధారంగా నీటి చార్జీలు నిర్ణయించే క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే
ఇంటిపన్ను పెరిగితే నీటి చార్జీలు కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతాయన్నమాట.
ఇప్పటివరకు మనం వ్యక్తిగత గృహానికి నెలకు  రు.80లు చొప్పున చెల్లిస్తున్నాము.
ఇక మీదట ఈ క్రింది విధంగా చెల్లించాలి.


 ఇంటిపన్ను (అర్థ సం||కు)రు. 
  ప్రస్తుతం నెలకు
చెల్లిస్తున్నది
రు. 
  1.6.2013నుండి
నెలకు చెల్లించవలసింది
రు.
ప్రస్తుతం సం||కి చెల్లిస్తున్నది
రు. 
  1.6.13 నుండిసం||కు చెల్లించవలసింది
రు.
 175లోపు
 50
 70
 600
 840
 176-500
 80
 110
 960
 1320
 501-1000
 80
 175
 960
 2100
 1001-1500
 80
 200
 960
 2400
 1501-5000
 80
 300
 960
 3600
 5001ఆపైన
 80
 400
 960
 4800





 

నిజానికి ఇంటిపన్నుకు నీటి చార్జీలకు ఎలాంటి సంబంధంలేదు. భారీగా ఇంటిపన్ను కట్టే ధనవంతుని గృహానికైనా, అతతక్కువ ఇంటిపన్ను కట్టే పేదవాని గృహానికైనా కార్పొరేషన్‌ అర అంగుళం నీటి కుళాయినే ఇస్తుంది. నీరిచ్చే సమయం కూడా ఇంటిపన్నును బట్టి మారదు. అందరికి ఉదయం సాయంత్రం 1గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తారు. ఇంటి పన్ను ఎక్కువ చెల్లించేవారికి, తక్కువ చెల్లించేవారికి సరఫరా చేసే నీటి పరిమాణంలో తేడా ఉండదు. ఒకే పరిమాణంలో ఉంటుంది. అందువలన నీటి సరఫరాకు ఇంటిపన్నుకు సంబంధంలేదు. మరల మరల నీటిచార్జీలు పెంచేపని లేకుండా, ఇంటి పన్ను పెరిగిన ప్రతిసారి నీటి చార్జీలు వాటంతటవే పెరగటానికి వీలుగా కార్పొరేషన్‌ వేసిన ఎత్తుగడే ఇది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఆస్తి పన్ను రివిజన్‌ జరిగే అవకాశం ఉంది.ఆస్తి పన్నుపెరగగానే వాటితో బాటే నీటి చార్జీలు కూడా పెరుగుతాయి.
ఇక అపార్టుమెంట్ల విషయానికి వస్తే, ఇప్పటికే అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి 3 కిలో లీటర్లకు 100 రు, ఆ పైన ప్రతి కిలో లీటరుకు రు8.25లు చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని ఈ క్రింది విధంగా మార్చారు.


 మీటర్‌ రీడింగ్‌
 చార్జీ రు.లలో
 ఇప్పటివరకు చెల్లించినది రు.లలో
 1.6.13నుండి  చెల్లిం చవలసినది రు.లలో
 0-9 కిలో లీ||
 300
 100.00-149.50
 300
 10-18కిలో లీ||
 300+ప్రతి కిలోలీటర్‌కు రు12లు
 157.75-223.75
 312-408
 19-25కిలో లీ||
 408+ప్రతి కిలోలీటర్‌కు రు15లు
 232.00-281.50
 423-513
 26-50కిలో లీ||
 513+ప్రతి కిలోలీటర్‌కు రు20లు
 289.75-487.75
 533-1013
 50 కిలో లీ|| పైన
 1013+ప్రతి కిలోలీటర్‌కు రు50లు
 496.00 ఆపైన
 1063ఆపైన
 

దీనిని బట్టి అపార్టుమెంట్లకు కూడా నీటి చార్జీల పెంపుదల రెట్టింపుకు పైగా ఉందని స్పష్టమవుతున్నది.పైధరలను పరిశీలించినప్పుడు నగరంలోని అన్నిరకాల నివాసగృహాలపై విపరీతమైన భారాన్ని మోపారని స్పష్టమవుతున్నది.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి చార్జీలను నివాసగృహాలకు ఒక్కొక్క మరుగు దొడ్డికి రు 15లనుండి రు 30లకు పెంచారు. అంటే ఇక మీదట రెట్టింపు చెల్లించాలన్నమాట. ఈ చార్జీలను చెల్లించేకన్నా లెట్రిన్‌ బావులను ఉపయోగించడమే చౌక అవుతుంది.
ఈ చార్జీల పెపుదలకు కార్పొరేషన్‌ చెప్పేవాదన కూడా అసంబధ్దంగా ఉంది.మంచినీటి చార్జీల నిర్వహణ కోసం కార్పొరేషన్‌కు రు 34 కోట్లు ఖర్చు అవుతుండగా, పెంచిన ధరల ప్రకారం కూడా ఆదాయం రు25.9 కోట్లు మాత్రమే వస్తుందని, ఇంకాలోటు రు8.1కోట్లు ఉంటుందని కార్పొరేషన్‌ వాదిస్తున్నది. అదేవిధంగా డ్రైనేజీ నిర్వహణకు రు9.6 కోట్లు ఖర్చు అవుతుండగా పెంచిన చార్జీల ప్రకారం కూడా ఆదాయం రు5 కోట్లు మాత్రమే రానున్నదని, ఇంకాలోటు రు4.6 కోట్లు ఉంటుందని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. చార్జీలు పెంచిన తర్వాత కూడా ఈ రెండిటి మీద లోటు ఇంకా రు12.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు.
మంచినీరు, డ్రైనేజి, శానిటేషన్‌ నిర్వహణకు అయ్యేఖర్చును ఎవరు భరించాలన్నదే ప్రశ్న. మొత్తం ప్రజలే భరించాలని కార్పొరేషన్‌ అధికారులు వాదిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగానే నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు పెంచారు. అందుకు భిన్నంగా ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము భావిస్తున్నాము. కారణాలు

01. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లలో మంచినీటికి, శానిటేషన్‌కు నిధులు ప్రతి ఏటా కేటాయిస్తుంది. గత ఏడాదికూడా కేటాయించింది. ఆ కేటాయింపులనుండి విజయవాడ నగరంలో మంచినీటికి, శానిటేషన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.

02.అంతేకాకుండా మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌ ప్రజారోగ్యంలో భాగం. ప్రజారోగ్య నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వబాధ్యత. అందువలన విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా కేటాయించాలి.

03. రాష్ట్రాభివృధ్ధి కోసం మనం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము. వాటినుండి స్థానికాభివృధ్ధికోసం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. వాటిలో విజయవాడ అభివృధ్దికి రావలసిన మొత్తాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇచ్చి, అవి చాలక పోతే అప్పుడు పన్నులు పెంచినా అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులను ఇవ్వకుండా దారిమళ్ళిస్తూ, స్థానికావసరాల కోసం మరల ప్రజలమీద భారాలు మోపుతుంటే ఆభారాన్ని మనం ఎందుకు మోయాలి?

ఈ 3 కారణాల రీత్యా నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అంటున్నాము. అంతేగాకుండా నీటి చార్జీలకు ఇంటిపన్నును ఆధారంగా చేయటం, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటంలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిపై సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజల తరఫున చర్చ జరపడానికి ఎన్నికైన కౌన్సిల్‌ లేదు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.ఎన్నికైన కౌన్సిల్‌ లేని సమయంలో కేవలం కొద్దిమంది అధికారులు కూర్చొని విధాన పరమైన నిర్ణయాలు చేయటం ప్రజాస్వామ్య విరుధ్దం. దీనిని మనం వ్యతిరేకించాలి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచింది. రవాణా చార్జీలను పెంచింది. దీనితో అన్నిరకాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. భూముల విలువలనుపెంచింది. ఇప్పుడు నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను పెంచి మనలను భరించమంటున్నారు.ఎంతవరకు మనం భరించగలం?
అందుకే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను ప్రారంభంలోనే మనం ఎదుర్కోవాలి. దీనికై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ చేసే కృషిలో మీరూ భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాము.


Tuesday, 25 December 2012

బి.ఆర్‌ టి.యస్‌ ప్రయోజనకరంగా వినియోగించడానికి సూచనలు

                                                                    తేదీ 11.12.2012
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా,
విషయం: బి.ఆర్‌ టి.యస్‌ ప్రయోజనకరంగా వినియోగించడానికి సూచనలు

విజయవాడ నగరంలో బి.ఆర్‌.టి.యస్‌ (Bus Rapid Transit System (BRTS) వ్యవస్థను ఏర్పాటు చేసారు. దీనికోసం సుమారు 3 కి.మీ. రోడ్డు ప్రత్యేకంగా నిర్మించారు. మొత్తం బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు 15.5 కి.మీ. అందులో కొర్పొరేషన్‌ నిర్మించిన రోడ్డు 3 కి.మీ. మిగిలిన 12 కి.మీ.లు కారల్‌ మార్క్స్‌ రోడ్డు(ఏలూరు రోడ్డు), జాతీయ రహదారి (రింగ్‌ రోడ్డు), బందరు రోడ్డు (మహాత్మా గాంధీ రోడ్డు) లను వినియోగించబోతున్నారు. అవి కార్పొరేషన్‌కు సంబంధించిన రోడ్లు కావు. కనుక ఈ మొత్తం 15 కి.మీలలో సుమారు 12 కి.మీ.లు బి.ఆర్‌.టి.యస్‌ బస్సు సాధారణ రోడ్లపై నడవవవలసిందే. ఇది నగర ప్రజలకు అంత ప్రయోజనకరం కాదు. అంతే కాకుండా ఢిల్లీ లాంటి నగరాలలో ఈ వ్యవస్థ అంతగా ఉపయోగ పడలేదు. ఏ వ్యవస్థ అయినా నగర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. ఇప్పటికే దీనిపై రు|| 80 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇంత భారీ మొత్తంలో వెచ్చించిన తరువాత దాని ప్రయోజనం కూడా అదే స్థాయిలో ఉండాలి. అందువలన ఈ వ్యవస్థ నగర ప్రజలకు చేరువ అవటానికి, నగర ప్రజల నేటి అవసరాలతో బాటుగా భవిష్యత్‌ అవసరాలను కూడా సమర్ధవంతంగా తీర్చడానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కొన్ని సూచనలు చేయదలిచాము.

నగరాలలో వేగవంతమైన పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థను ఏర్పాటు చేయటం. సిటీ బస్సులను నిరాటంకంగా, వేగంగా నడపటం ఈ వ్యవస్థ ఉద్దేశ్యమని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆనాటి కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖామాత్యులు గౌెరవనీయులు శ్రీ జైపాల్‌ రెడ్డిగారు విజయవాడ నగరానికి వచ్చినసందర్భంగా స్పష్టంచేశారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం మీరు ప్రారంభించబోతున్న బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థలో ఈ క్రింది లోపాలున్నాయి.

లోపాలు
1.బి.ఆర్‌.టి.యస్‌ బస్సు రోడ్డు అంచున కాకుండా, రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్‌ డివైడర్‌కు ఇరువైపులా నిర్మించిన డివైడర్ల మధ్యన తిరగటంవలన ఈ వ్యవస్థలో ప్రజలకు అవసరమైన చోటల్లా బస్‌ స్టాప్‌లు నిర్మించుకునే అవకాశంలేదు. రోడ్ల కూడళ్ల వద్ద మాత్రమే బస్‌ స్టాప్‌ను నిర్మించాలి. ఈ బస్సు ఎక్కాలంటే రోడ్ల కూడళ్ల వరకు పోయి, జీబ్రా గీతల మీదుగా దాటి, బి.ఆర్‌.టి.యస్‌ బస్‌ స్టాప్‌లోకి ప్రవేశించాలి. దిగేటప్పుడు కూడా అదే పరిస్థితి. రోడ్ల కూడళ్ళలో దిగి, జీబ్రా గీతల మీదుగా దాటి, రోడ్టు అంచుకు చేరాలి. అందువలన ప్రజలకు అవసరమైన చోట బస్‌ స్టాప్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేదు.

2. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు ఒక సర్కులర్‌ బస్సులాగా కేవలం ఆ నిర్ణీత మార్గంలోనే తిరుగుతుంది. నివాస ప్రాంతాలనుండి బి.ఆర్‌.టి.యస్‌ బస్సు బయలు దేరే అవకాశం లేదు. నివాస ప్రాంతాల నుండి ప్రజలను ఎక్కించుకోని వేగంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేయటం చాలా అవసరం. ఇదే పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థలో కీలకం. బస్సులను కేవలం బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులోనే వేగంగా త్రిప్పటం వలన ఇది నెరవేరదు.

3.ప్రస్తుతమున్న బి.ఆర్‌.టి.యస్‌ ప్లాను ప్రకారం బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌లో బి.ఆర్‌.టి.యస్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మాత్రమే తిరుగుతాయి. వీటి చార్జీలు అధికంగా ఉంటాయి. ఢిల్లీ నగరంలో 19 కి.మీ.లు ఉన్న బి.ఆర్‌.టి.యస్‌ మార్గంలో బస్సు చార్జీ రు|| 35లవరకు ఉంది. ఇదే మామూలు బస్సులో (పల్లె వెలుగు) విజయవాడ బస్‌ స్టాండ్‌ నుండి కొండపల్లి రైల్వే స్టేషన్‌ వరకు (20 కి.మీ) చార్జీ రు|| 9/-లుగా ఉన్నది. అత్యధిక చార్జీలు సాధారణ ప్రజలు భరించ గలిగినవి కావు.

4.ఈ బస్సులో విద్యార్ధులకు, వికలాంగులకు రాయితీలు వర్తించవు. వర్తింప జేసినా అవి సాధారణ బస్సు చార్జీలతో సమానంగా కాని, అంతకన్నా ఎక్కువగాని ఉంటాయి. నెలవారీ జనరల్‌ పాస్‌ ధరకూడా అత్యధికంగా ఉంటుంది. పైగా కూడళ్ళలో తప్ప బస్సులు ఆగనందున ఈ పాస్‌లు ఇచ్చినా ప్రయోజనం ఉండదు.

5.నగరాలలో ధనవంతులు కార్లు అధికంగా కొంటున్నారని. దీనివలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎ.సి. బస్సులను త్రిప్పటంవలన, ధనవంతులు ఆ బస్సులు ఎక్కుతారని,కార్లు కొనటం తగ్గిపోతుందని వాదన వినిపించారు. ఇంతకంటే హాస్యాస్పదమైన వాదన ఇంకొకటి లేదు. కారు కొనదలుచుకున్న వారెవ్వరూ ఎక్కడో ఆగే బస్సుల కోసం ఎదుచూస్తూ నిలబడరు. కారు తన గమ్య స్థానం వరకూ తీసుకెళుతుంది. అదేవిధంగా ద్విచక్ర మోటారు వాహనాలు కూడా వారివారి గమ్యస్థానాలవరకు నేరుగా చేర్చుతారు. అందువలననే ప్రజలు వ్యక్తిగత వాహనాలు కొంటున్నారు. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు తన గమ్య స్థానం వరకు వెళ్ళదు. ఢిల్లీ లాంటి నగరాలలో కూడా ఇప్పటికిే నిర్మించిన బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులో ధనవంతులు కార్లు వదలి బి.ఆర్‌.టి.యస్‌ బస్సులో ప్రయాణం చేస్తున్న దాఖలాలులేవు. కేవలం ఒక రూట్లో వేగవంతమైన బస్సులు త్రిప్పినంత మాత్రాన ప్రజలు వ్యక్తిగత వాహనాలను కొనకుండా మానరు. నగరం మొత్తంలో అన్ని ప్రాంతాలనుండి అన్ని ప్రాంతాలకు బస్‌ నెట్‌వర్కును ఏర్పాటుచేయటం, బస్‌లు ప్రజలకనుకూలంగా సమయపాలన పాటించడం ద్వారానే వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించవచ్చు.

ఈ లోపాలను అధిగ మిస్తూ బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నాము.
01. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డుకు రెండు వైపుల ఫుట్‌ పాత్‌లను నిర్మించాలి. వాటిని ఆక్రమణలకు గురికాకుండా పాద చారులు నిరాటంకంగా నడవటానికి వీలుగా ఏర్పాటు చేయాలి. పాదచారులు ఎక్కడ పడితే అక్కడ ఫుట్‌ పాత్‌ దిగకుండా రైలింగ్‌ ఏర్పాటు చేయాలి.
02. జంక్షన్‌ వద్ద బస్‌ స్టాప్‌లు కాకుండా ప్రజలకు అవసరమైన ప్రతి చోట ఫుట్‌ పాత్‌ల వైపు బస్‌ స్టాప్‌లను నిర్మించాలి.
03. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు నడిచేటందుకు వీలుగా ప్రత్యేకమైన లేన్‌ను ఫుట్‌ పాత్‌ల వైపు డివైడర్‌ ద్వారా ఏర్పాటు చేయాలి.
04. అలా ఏర్పాటు చేసిన బి.ఆర్‌.టి.యస్‌ బస్‌ లేన్‌ లోకి మరే ఇతర వాహనాన్ని అనుమతించరాదు. మరే ఇతర వాహనమైనా ఆలేన్‌ లోకి వస్తే వాటిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి.
05. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులో అందరికీ అందు బాటులో ఉండేవిధంగా సాధారణ సిటీ బస్సులను మాత్రమే త్రిప్పాలి.
06 ఇతర ట్రాఫిక్‌ మొత్తం బి.ఆర్‌.టి.యస్‌ డివైడర్‌కు, సెంట్రల్‌ డివైడర్‌కు మధ్య వెళ్ళాలి.
07. ఎడమవైపునుండి కుడివైపుకు, కుడివైపునుండి ఎడమ వైపుకు ప్రయాణీకులు వెళ్ళటానికి రోడ్డు క్రింద సబ్‌ వేలు నిర్మించాలి.
దీని నమూనా డ్రాయింగ్‌ను చివరి పేజీలో ఇస్తున్నాము.

ఈ విధంగా బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను రూపొందిస్తే ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.

01.నగర ప్రజలకు వేగవంతమైన ప్రజారవాణా వ్యవస్థ లభిస్తుంది.
02.100 అడుగులు, 80 అడుగులు వెడల్పుగల ప్రతి రోడ్డ్లులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.
03.బి.ఆర్‌.టి.యస్‌ కోసం ప్రత్యేకమైన బస్సులను కొననవసరంలేదు. సాధారణ సిటీ బస్సులనే వేగంగా నిరాటంకంగా ఈ లేన్‌లలో త్రిప్పవచ్చు. దీనివలన అదనపు బస్సులు కొనే ఖర్చు తగ్గుతుంది.
04. బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌నుండి నగరంలోని నివాస ప్రాంతాలలోకిి కూడా బస్‌ను త్రిప్పవచ్చు. నివాస ప్రాంతంలో ప్రజలను ఎక్కించుకొని బయలు దేరిన బస్సు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు వద్దకు రాగానే బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌లోకి ప్రవేశించి వేగంగా వెళుతుంది. తిరిగి నివాస ప్రాంతంలోకి వెళ్ళాలంటే బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డునుండి ఇతర ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నివాస ప్రాంతాలవైపుకు మళ్ళుతుంది.

అందువలన విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను పైవిధంగా మార్పు చేయాలని కోరుతున్నాము.


                         అభివందనాలతో

(వి. సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                         కార్యదర్శి

డి&ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ పై యూజర్‌ చార్జీల విధింపుకు అభ్యంతరములు తెలియజేస్తూ మునిసిపల్ కమిషనర్ కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్రాశిన లేఖ

                                                                 తేదీ 27.11.2012
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా,
విషయం: డి&ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ పై యూజర్‌ చార్జీల విధింపుపై అభ్యంతరములు

మీరు వ్యాపార సంస్థలకు డి&ఓ ట్రేడ్‌ లైసెన్స్‌పై యూజర్‌ చార్జీలను విధించి ఉన్నారు. సదరు వ్యాపార సంస్థలవారు కొన్ని అభ్యంతములు మీ ముందుంచినారు. వాటికి మీకార్యాలయం 19.10.2012 తేదీతో RCF9-144147 నెంబరుగల ఎండార్సుమెంట్‌ ద్వారా జవాబును పంపియున్నారు. సదరుఎండార్సుమెంట్‌ లో మీ కార్యాలయం పేర్కొన్న అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కొన్ని విషయాలను మీ ముందుంచుతున్నాము.

01. మీ కార్యాలయం వ్రాశిన సదరు ఎండార్సుమెంట్‌ లో ''నగర ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు పారిశుధ్ధ్యముపై ప్రత్యేక దృష్టితో ప్రతి దినము మురుగు కాల్వలు శుభ్ర పరచుట , రోడ్లు ఊడ్చుట, ప్రధాన ప్రాంతములలో 24 గంటలు శానిటేషన్‌ నిర్వహించుట, ప్రతి ఇల్లు మరియు వ్యాపార సంస్థల వారి వద్ద నుండి స్వయముగా పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌ల ద్వారా చెత్తను సేకరించుట జరుగుచున్నది. చెత్త సేకరించువారికి వృత్తిపరమైన రక్షణ చర్యలతో బాటు, పరిశుభ్రమైన పరిస్థితులలో వ్యర్ధములను సేకరించుట, తరలించుట సురక్షిత విధానములో డిస్పోజ్‌ చేయు ప్రక్రియలు నిర్దేశిత నిబంధనలమేర అమలు చేయవలసిన ఆవశ్యకత కలదు'' అని పేర్కొనియున్నారు. ఇది Solid Waste Management Rules మరియు GHMC Act 1955 ప్రకారం నగరంలో శానిటేషన్‌ నిర్వహించ వలసిన పధ్ధతిని తెలియ జేస్తున్నది. ఇందులో ప్రత్యేకత ఏదీలేదు. నగరంలో పబ్లిక్‌ హెల్త్‌ను కాపాడవలసిన బాధ్యత కార్పొరేషన్‌కు ఉన్నది. దానికి ఎటువంటి పధ్ధతులనవలంబించాలన్నది కార్పొరేషన్‌ మరియు అర్బన్‌ మంత్రిత్వ శాఖలలోని నిపుణులు నిర్ణయించే అంశాలు. దీనికీ, మీరు విధిస్తున్న యూజర్‌ చార్జీలకు సంబంధంలేదు. కార్పొరేషన్‌ నిర్వహణలో శానిటేషన్‌ ఒక భాగం. కార్పొరేషన్‌ నిర్వహణకు కావలసిన ఆదాయ మార్గాలుకూడా GHMC Act 1955లో ఇవ్వబడినవి.Solid Waste Management Rules  లోగాని, GHMC Act 1955 లోగాని ఎక్కడా శానిటేషన్‌కు యూజర్‌ చార్జీలు విధించమని పేర్కొనలేదు. కనుక కార్పొరేషన్‌గా చట్టప్రకారం నిర్వహించవలసిన బాధ్యతను నిర్వహించడానికి, చట్టపరిధిలో లేని యూజర్‌ చార్జీలను ప్రజలనుండి వసూలు చేయటం సరైంది కాదని తెలియ జేస్తున్నాము.

02. వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము (Solid Waste Management Rules)నందు, ఆవ్యర్ధాల ఉత్పత్తికి కారణమైనవారు, ఆవ్యర్థ పదార్ధముల తొలగింపునకు అగు ఖర్చు భరించవలసియుండునని సదరుఎండార్సుమెంట్‌లో పేర్కొన్నారు. వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము(Solid Waste Management Rules) అనునది వ్యర్థపదార్ధములను నశింపజేయుటకు ఉద్దేశించిన విధానమును నిర్దేశించినదేతప్ప, ఆర్థిక వ్యవహారాలను నిర్ధేశించలేదు(Solid Waste Management Rules deal with only the procedural aspect of the disposal of Solid Waste, but do not deal with financial aspect).. కనుక వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము(Solid Waste Management Rules)  ప్రకారము యూజర్‌ చార్జీలను వసూలు చేయుట చట్టవిరుధ్ధమని తెలియ జేయుచున్నాము.

03.వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి అగు చెత్త (Trade Refuse) తొలగింపునకు మరల ప్రత్యేకముగా వసూలు చేయరాదని శ్రీయుత ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టువారు Laxmi Lodge, Warangal and others vs Government of AP and another (2002 (6) ALD 605- W.P. NO 20789/1998)  కేసులో తీర్పు వెల్లడించిన విషయం మీదృష్టికి తీసుక వస్తున్నాము. ఈ తీర్పును కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా GHMC Act 1955 ప్రకారం వ్యాపార సంస్థలనుండి ఉత్పత్తి అగు చెత్తను (Trade Refuse) కూడా తొలగించవలసిన బాధ్యత కార్పొరేషన్‌దేనన్న విషయం మీకు తెలియందికాదు.

04. జీ.వో ఆర్‌టి నెంబర్‌ 973 తేదీ 21.08.2010 అనేది ప్రభుత్వం జారీ చేసిన చట్ట బధ్ద ఉత్తర్వులని మీరు ఆ ఎండార్సుమెంట్‌ లో పేర్కొన్నారు. అది చట్టవిరుధ్ధమని మేము భావిస్తున్నాము. అది చట్టబధ్ధమా లేక చట్ట విరుధ్ధమాయన్న విషయాన్ని తేల్చవలసింది న్యాయస్థానము మాత్రమే. అందువలననే ఈ వివాదాన్ని నెం.33550/2011గా గల రిట్‌ పిటీషన్‌ ద్వారా శ్రీఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు వారిముందు ఉంచిన విషయం మీకు తెలుసు. ఈ రిట్‌ పిటీషన్‌ శ్రీ హైకోర్టు వారి వద్ద పెండింగులో ఉన్నది. ఆ వివాదం పరిష్కారమయ్యేవరకు వేచిచూడకుండా, సదరు జీ.వో చట్టబధ్దమేనన్న వాదనను సమర్ధించుకుంటూ యూజర్‌ చార్జీలను విధించుకుంటూ కొన సాగుతున్నారు. వివాదం కోర్టు పరిధిలో ఉండగా మీరు కొనసాగించడం సరైందికాదు. కనుక కోర్టువారి తీర్పు వెలువడేవరకు ఈ జీ.వో అమలును నిలిపి వేయాలని కోరుతున్నాము.

పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని కోర్టు తీర్పు వెలువడే వరకు యూజర్‌ చార్జీలను వసూలును నిలిపి వేయవలసినదిగా కోరుతున్నాము.
అభివందనాలతో

(వి. సాంబిరెడ్డి)                                            (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                             కార్యదర్శి

Sunday, 8 April 2012

కృష్ణానదిపై 4 లైన్ల రోడ్డు బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీలకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్రాసిన లేఖ

                                                                 తేదీ:16.03.2012
గౌరవనీయులైన కృష్ణా జిల్లా కలెక్టరు గారికి,
ఆర్యా!
విషయం:- కృష్ణ నదిపై 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణాన్ని గురించిన ప్రతిపాదన

     విజయవాడ నగరం నానాటికి పెరుగుతున్నది. దీనితో విజయవాడ నగరానికి బయటి ప్రాంతాలనుండి వచ్చిపోయే వారి సంఖ్యకూడా పెరుగుతున్నది. కృష్ణానదికి దక్షిణం వైపున మంగళగిరి, అమరావతి మధ్యలో అనేక గ్రామాలున్నాయి. వీరిలో అత్యధికులు ప్రతి రోజు విజయవాడ ఏదో ఒక పనిమీద వచ్చి పోతుంటారు. ముఖ్యంగా సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌,ఎర్రుబాలెం, పెనుమాక, నవులూరు, కృష్ణాయపాలెం తదితర గ్రామాలనుండి ప్రతి రోజు విజయవాడ వచ్చి పనులు చేసుకొని పోతుంటారు. వీరిలో అత్యధికులకు నివాసం ఆగ్రామాలలో ఉంటే, ఉపాధి మాత్రం విజయవాడలో ఉంటుంది.అందువలన వీరు అనివార్యంగా విజయవాడ రావలసియున్నది.

       తంలో ఈ గ్రామాలనుండి ప్రకాశం బ్యారేజిమీదుగా అత్యధికంగా బస్సులు ఉండేవి. అవి ఆప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేవి. ఆతరువాత ప్రకాశం బ్యారేజిమీద బస్సుల రాక పోకలను నిలిపి వేశారు. దీనితో ఆప్రాంత ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. కేవలం మంగళగిరినుండి మాత్రమే కనక దుర్గమ్మ వారధి మీదుగా బస్సులు రావటానికి వీలుంది. కాని సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌, నవులూరు,ఎర్రుబాలెం,పెనుమాక, కృష్ణాయపాలెం, అమరావతి తదితర గ్రామాలనుండి నేరుగా విజయవాడకు బస్సులు రావటానికి మార్గం లేదు. ఒకటి రెండు బస్సులు మాత్రం ఉండవల్లి సెంటరునుండి కాలువ కట్టమీదుగా, రైలు పట్ల్టాల క్రిందుగా తిరిగి జాతీయ రహదారిలో కలసి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడకు రావలసి వస్తున్నది. ఇది చుట్టు తిరుగుడు ప్రయాణంగా ఉండటం, సమయం అధికంగా తీసుకోవటం, సౌకర్యంగా లేకపోవటంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించవలసి వస్తున్నది. కొంతమంది ఆ గ్రామాలలో ఉన్న తమ ఇళ్లను వదలి విజయవాడలో అద్దెకు ఇళ్ళు తీసుకొని నివశిస్తున్నారు. విజయవాడ వచ్చి పోవటానికి సరౖౖెన రహదారిలేక పోవటం వలననే ఆ ప్రాంతాల ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది.

      నగరానికైనా ఇతర ప్రాంతాలనుండి ప్రజలు నిరంతరం వచ్చి పోతుంటేనే ఆ నగరం అభివృధ్ధి చెందుతుంది. కనుక ప్రజలు నగరానికి వచ్చి పోవటానికి తగిన రహదారి ఏర్పాటు చేయవలసి ఉన్నది. అంతే కాకుండా విజయవాడ నగరం గన్నవరం, కంకిపాడుల వైపుమాత్రమే విస్తరిస్తున్నది. కాని దక్షిణం వైపు విస్తరించడానికి కృష్ణానది అడ్డుగా ఉన్నది. నగరం దక్షిణం వైపుకూడా విస్తరించాలంటే నదికి దక్షిణం ప్రాంతంలోని గ్రామాలను విజయవాడ నగరంతో అనుసంధానం చేస్తూ రహదారి ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాలనుండి సత్వర రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి.

       అంతే కాకుండా విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలుగా ఉన్నాయి. కృష్ణా,గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఈ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి లేదు. ఉన్న కనకదుర్గమ్మ వారధి జాతీయ రహదారులకు చెందినది. జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అది ఉపయోగించుకునే అవకాశంలేదు. కనుక ఈ ప్రాంతంలో కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి అవసరం ఉంది.

  పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా ఒక ప్రతిపాదనను మీ ముందుంచుతున్నాము. కృష్ణా నదికి దక్షిణం వైపున ఉన్న సీతానగరం నుండి, నదికి ఉత్తరం వైపున ఉన్న శనైశ్వరస్వామి గుడివరకు కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మిస్తే నదికి దక్షిణం వైపు ఉన్న గ్రామాల నుండి రాక పోకలు సజావుగా సాగుతాయి. బస్సు సౌకర్యం ఏర్పడుతుంది. రాక పోకలు సజావుగా సాగితే ఆగ్రామాల ప్రజలు విజయవాడకు నివాసం మార్చే అవసరం ఉండదు. విజయవాడ నగరం దక్షిణం వైపుకు కూడా విస్తరించడానికి ఈ బ్రిడ్జి దోహద పడుతుంది. కనుక కనుక మా ప్రతిపాదనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము.
                             అభివందనాలతో

 వి. సాంబిరెడ్డి                                      యం.వి.ఆంజనేయులు 
అధ్యక్షులు                                                 కార్యదర్శి

టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఈ బ్రిడ్జి విషయమై క్రింది వారికి లేఖలను వ్రాశింది.
కృష్ణా జిల్లా
01. కలెక్టర్‌, కృష్ణా జిల్లా
02. మున్సిపల్‌ కమీషనర్‌, విజయవాడ
03. వైస్‌ ఛైర్మెన్‌, వి.జి.టి.యం. ఉడా
04. శ్రీ లగడపాటి రాజగోపాల్‌, యం.పి. విజయవాడ
05. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్‌, శాసన సభ్యులు, విజయవాడ పశ్చిమం.
06. శ్రీ మల్లాది విష్ణు, శాసన సభ్యులు, విజయవాడ సెంట్రల్‌.
07. శ్రీ యలమంచిలి రవి, శాసన సభ్యులు, విజయవాడ తూర్పు.
08. కాంగ్రెస్‌ (ఐ) పార్టీ, విజయవాడ
09. తెలుగు దేశం పార్టీ, విజయవాడ
10. సి.పి.ఐ., విజయవాడ
11. సి.పి.ఐ(యం), విజయవాడ
12. లోక్‌ సత్తా పార్టీ, విజయవాడ

గుంటూరు జిల్లా
01. కలెక్టర్‌, గుంటూరు జిల్లా
02. మున్సిపల్‌ కమీషనర్‌, తాడేపల్లి
03. మున్సిపల్‌ కమీషనర్‌,మంగళగిరి   
04. శ్రీ రాయపాటి సాంబశివరావు, ఎం.పి. గుంటూరు
05. శ్రీమతి కె.కమల, శాసన సభ్యురాలు, మంగళగిరి.