Monday, 24 June 2013

నగర పాలక సంస్థ కు రావలసిన ఆదాయమార్గాలను గురించి సిటిజెన్స్ ఫోరం కమిషనర్ కు వ్రాసిన లేఖ

                                                                                               తేదీ:08.02.2013
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి
ఆర్యా,
విజయవాడ నగరపాలక సంస్థ నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న విషయాన్ని మేము గమనిస్తున్నాము. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేసే పరిస్థితి లేదు ఫలితంగా అటు ఉద్యోగులు, ఇటు కాంట్రాక్టర్లు ఆంధోళన చేయవలసి వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పి.ఎఫ్‌,నిధులను సైతం నగరపాలక సంస్థ వాడుకున్నది. చివరకు నిధులకోసం నగరపాలక సంస్థ ఆస్తులను సౖెెతం తాకట్టు పెట్టవలసి వచ్చింది. అభివృధ్ధి పనులు నిలచి పోతున్నాయి. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ విషయాలను నగరపౌరులుగా గమనిస్తున్నాము. నగరపాలక సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న మేము నగరాభివృధ్ధి కుంటు పడుతూ ఉంటే, మా మీద భారాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. అందువలననే నగరంలోని వివిధ
ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, కాలనీ, అపార్టుమెంట్ల అసోసియేషన్లతో ఏర్పాటైన సిటిజన్స్‌ ఫోరంగా నగరపాలక సంస్థకు రావలసిన ఆదాయవిషయంలో జోక్యం చేసుకోదలచాము.
ప్రజలమీద భారం వేయకుండా విజయవాడ నగరపాలక సంస్థకు ఆదాయం చేకూరడానికి ఉన్న మార్గాలను మీముందుంచుతున్నాము.

01.:ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థకు గత 2005 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వటం లేదు. ఆ నిధులు వస్తే నగరపాక సంస్థ ఆర్ధిక ఇబ్బందులలో పడేదికాదు. ఆ నిధులు రాబట్టడానికి బదులుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలపై యూజర్‌ చార్జీలపేరుతో లేదా పన్నుల పెంపులపేరుతో నగర పౌరులనుండి వసూలుచేయటం మార్గంగా ఎంచుకుంటున్నది. ఇది సరైందికాదు.

రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్నుల నుండి స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఆ నిధులే స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు. స్థానిక సంస్థలకు ఎంత కేటాయించాలో నిర్ణయించడానికి రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్‌ కమీషన్‌ను ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం(అంటే కేంద్ర నిధులు కాకుండా) లో 39.24 శాతం స్థానిక సంస్థలకు కేటాయించాలని మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుచేసింది. అలా కేటాయించిన మొత్తంలో 30 శాతం పట్టణాలకు, 70 శాతం గ్రామాలకు పంపిణీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 40.92 శాతం స్థానిక సంస్థలకు కేటాయించాలని రెండవ ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కాని స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులు మాత్రం ఇవ్వటంలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం విడుదల చేసిఉన్నట్లయితే 2005-2006 నుండి ఇప్పటివరకు మన నగరానికి సుమారు రు1200 కోట్లు వచ్చియుండేవి. కాని ఫైనాన్స్‌ కమీషన్‌ నిధులు విజయవాడ నగరానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీనితో నగరపాలక సంస్థ ఆదాయం గణనీయంగా కోల్పోతున్నది.

రాష్ట్రాభివృధ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. గ్రామాలు, స్థానికాభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృద్ధి ఉండదు. కనుక స్థానికాభివృధ్ధికోసం స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంనుండి కేటాయించాలి. అలా కేటాయించాలని భారత రాజ్యాంగం చెప్పింది. ఎంత కేటాయించాలన్నది నిర్ధారించడం కోసమే రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ను ఏర్పాటు చేయమని రాజ్యాంగం ఆదేశించింది. గ్రేటర్‌ హైదరాబాదు మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం 1955 లోకూడా ఈ విషయం పొందుపరచి ఉంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌లు ఇచ్చిన సిఫార్సులను తుంగలో త్రొక్కి స్థానిక సంస్థలకు నిధులు కుదించి వేశాయి. విజయవాడలాంటి నగరాలకు అసలు ఇవ్వటం మానేశాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. చట్టవిరుధ్ధం.

ఈవిషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు 40 శాతం కేటాయించాలని, దానిలో అర్బన్‌ స్థానిక సంస్థలకు 30 శాతం కేటాయించాలని, అర్బన్‌ స్థానిక సంస్థలకు వచ్చే మొత్తంలో జనాభా ప్రాతిపదికన నగరాలకు, పట్టణాలకు కేటాయించాలని సిటిజన్స్‌ ఫోరంగా డిమాండు చేస్తున్నాము. మా ఈ డిమాండును మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేయవలసిందిగా కోరుతున్నాము.

02. నగరంలో వసూలైన వృత్తి పన్నులో 95%, మోటారు వెహికిల్‌ టాక్స్‌లో 10 శాతం నగరానికి రావాలి. కాని అవి రావటం లేదు. వాటిని వెంటనే రాబట్టవలసిందిగా కోరుతున్నాము.
విజయవాడ నగరంలో వసూలు చేస్తున్న వృత్తిపన్ను వివరాలు



 సంవత్పరం
 విజయవాడలోవసూలైన వృత్తిపన్ను
  విజయవాడ కార్పొరేషన్‌కు రావలసినది ( వసూలైన దానిలో 95 శాతం)
 2005-2006
 08.4091
 07.9886
 2006-2007
 09.3674
 08.8990
 2007-2008
 10.1649
 09.6567
 2008-2009
 10.7204
 10.1844
 2009-2010
 14.7656
 14.0273
 2010-2011
 15.4195
 14.6485

 మొత్తం                        82.6774                          65.4045


విజయవాడ నగరంలో వసూలైన మోటారు వాహనాల పన్ను వివరాలు


 సంవత్పరం
 విజయవాడలో వసూలైన మోటారు వాహనాల పన్ను కోట్ల రు||లు
  విజయవాడ కార్పొరేషన్‌కు రావలసినది ( వసూలైన దానిలో 10 శాతం) కోట్ల రు||లు
 2005-2006
 91.24
 09.124
 2006-2007
 109.51
 10.951
 2007-2008
 122.90
 12.290
 2008-2009
 135.65
 13.565
 2009-2010
 150.24
 15.024
 2010-2011
 194.53
 19.453
 మొత్తం
 804.07
80.407
 



పై వివరాలను పరిశీలించినప్పుడు వృత్తిపన్ను, మోటారువాహనాల పన్ను రెండు పద్దుల క్రిందనే 2005-2006 నుండి 2010-2011 వరకు రు.145.81 కోట్లు రావాలి. ఇదే పద్దుల క్రింద ఇంకా 2011-2012 ఆర్ధిక సంవత్సరానికి చెందినవి కూడా రావలసి యున్నది.
కాని నాన్‌ప్లాన్‌ గ్రాంట్సు క్రింద 2005-2006 నుండి 2011-12 వరకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థకు ఇచ్చినది కేవలం రు. 44.33 కోట్లు మాత్రమే. ప్లాన్‌ గ్రాంట్స్‌ అసలు ఇవ్వలేదు.

03. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం షరతుల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విలువలను తగ్గించి, తన ఆదాయాన్ని కోల్పోకుండా భూముల విలువలను తరచు పెంచుతున్నది. రిజిస్ట్రేషన్‌ విలువలను తగ్గించడంవలన నగరపాలక సంస్థ కోల్పోయిన ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వం నగరపాలక సంస్థకు స్పెషల్‌ గ్రాంటుగా ఇవ్వాలని డిమాండుచేస్తున్నాము.

04.జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇవ్వటం మానివేస్తున్నది. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం క్రింద ఇచ్చే నిధులు అంగీకరించిన కొన్ని పధకాలకే ఇస్తారు తప్ప కార్పొరేషన్‌ మొత్తం నిర్వహణకు ఇచ్చే నిధులు కావు. అందువలన జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం క్రింద వచ్చే నిధులను, నగరపాలక సంస్థకు ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం రావలసిన నిధులలో భాగంగా చూడకూడదు. వేరుగా చూడాల్సిందే. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం కు కార్పొరేషన్‌ చెల్లించవలసిన 30 శాతం నిధులు మరియు కార్పొరేషన్‌ నిర్వహణావ్యయంకు అయ్యే ఖర్చుల మొత్తాన్ని రెండింటినీ కార్పొరేషన్‌ భరించవలసివస్తున్నది. అంతేకాకుండా అమోదించిన ప్రాజెక్టులు అయిపోగానే జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం ముగిసిపోతుంది. కాని కార్పొరేషన్‌ నిర్వహణ ఆగదు. కనుక జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను తప్పనిసరిగా రాబట్టవలసిందిగా కోరుతున్నాము.

05. పేదలకు గృహనిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది. కాని జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం లో భాగంగా గృహనిర్మాణానికి అయ్యే ఖర్చులో కూడా 30 శాతం నగరపాలక సంస్థ భరించవలసి వస్తున్నది. దీనితో నగరపాలక సంస్థ నష్టపోతున్నది. కనుక పేదలకు గృహనిర్మాణానికి అయ్యే ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండు చేస్తున్నాము.

06 జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం మరియు గృహనిర్మాణం తదితర పద్దుల క్రింద రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన ఇప్పటికే రావలసిన నిధులను తక్షణమే రాబట్టాని కోరుతున్నాము.
07. నగరపాలక సంస్థ రాష్ట్రప్రభుత్వ యంత్రాంగంలో భాగమేతప్ప వేరు కాదు. కనుక నగరపాలక సంస్థ ఉద్యోగుల వేతనాలు 010 పద్దు క్రింద రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.

08. నగరంలో సంవత్సరాలతరబడి ఆస్ధిపన్ను బకాయిలు ఉన్నవారున్నారు. మొదటి 100 మంది బకాయిదారుల బకాయిల మొత్తమే వడ్డీతో సహా రు. 25,85,53,503.65 లుగా ఉన్నది. బకాయిదారులందరి మొత్తం రెట్టింపు ఉండి ఉంటుంది. కనుక ఆమొత్తాన్ని 2013-2014 కార్పొరేషన్‌ బడ్జెట్‌లో చూపి వాటిని ఖచ్చితంగా వసూలు చేస్తే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది. వడ్డీతో సహా ఆస్తిపన్ను రు. 2,16,18,321/-లు బకాయీతో రైల్వేశాఖ మెదటి స్థానంలో ఉన్నది. బాధ్యతాయుతమైన అధికారులు పనిచేస్తున్న అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించడం లేదు. బకాయిదారులలో మొదటి 400 మంది నుండి వసూలు చేస్తే రు. 30 కోట్ల రూపాయలు వస్తాయి. తక్షణమే ఈ బకాయీలను వసూలు చేయవలసిందిగా కోరుతున్నాము.

09. నగరపాలక సంస్థకు చెందిన కళ్యాణ మంటపాలు, కమ్యూనిటీ హాళ్ళు, నగరపాలక సంస్థ మాత్రమే నిర్వహించాలి. కళ్యాణ మంటపాల అద్దెలను సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా తగ్గించాలి. దీనివలన అటు కార్పొరేషన్‌కు అదనపు ఆదాయం వస్తుంది. ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది.

10. విజయవాడ నగరంలో కనకదుర్గ దేవాలయం సుప్రసిధ్దమైనది. దాదాపు సంవత్సరం పొడవునా దేశంలోని నలుమూలలనుండి భక్తులు వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో అధికంగా వస్తుంటారు. వారందరూ నగరపాలక సంస్థకు చెందిన సౌకర్యాలను వాడుకుంటుంటారు. కనుక కనకదుర్గ దేవాలయం కూడా విజయవాడ నగరాభివృధ్ధిలో భాగాన్ని పంచుకోవలసియున్నది. కనుక దుర్గగుడి ఆదాయాన్నుండి కొంతభాగాన్ని విజయవాడ నగరపాలక సంస్థకు వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలి.

11.నగరంలో ప్రైవేటు టెలికం సర్వీసుల వారు నగరంలో ఫోన్‌ లైన్లు వేశారు. అది వ్యాపారం. కనుక వారినుండి నేల అద్దెలను వసూలు చేస్తే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా వారు కేబుల్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ను ఇస్తున్నారు.వాటిమీద పన్ను విధిస్తే ఆదాయం వస్తుంది. ఇది కూడా బడ్జెట్‌లో చేర్చవలసిందిగా కోరుతున్నాము. దీనివలన ప్రతి ఏటా ఆదాయం వస్తుంది.

12.నగరంలో భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ వారు గ్యాస్‌ సరఫరా కోసం పైపులైన్లు వేశారు. అది ప్రైవేటు సంస్థ. దానినుండి అద్దె వసూలు చేయాలి. దీనివలన ప్రతి ఏటా ఆదాయం వస్తుంది.

13. నగరపాలక సంస్థలో జరుగుతున్న దుబారాని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి. కాగ్‌ రిపోర్టులో ఎత్తిచూపిన లోపాలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి. వాటిని సరిదిద్ది దుబారాను అరికట్టాలి.

14 పనులన్నీ ఒకేసారి జరపాలనేదానికన్నా ప్రాధాన్యతను ఎంచుకొని పనులు చేయటం ద్వారా నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నిపనులు నిర్వహించవచ్చు. ఉదా|| నగరంలో పడమట, సింగ్‌ నగర్‌ ప్రాంతాలు అభివృధ్ధి చెంది దశాబ్దాలైంది. అభివృధ్ధి చెందుతున్న క్రమంలోనే అక్కడ యు.జి.డి. ఏర్పాటుచేస్తే ఏటా కొంత జరిగి పోయేది.ఏనాడో అక్కడ యు.జి.డి. ఏర్పాటు జరిగి ఉండేది. నగరపాలక సంస్థ ఆర్ధిక పరిస్థితిపై వత్తిడి ఉండేదికాదు. అభివృధ్ధి చెందుతున్న క్రమంలో వదలివేసి, ఇప్పుడు జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం క్రింద నగరం మొత్తం ఒకేసారి యు.జి.డి.పనులు, బి.ఆర్‌.టి.యస్‌.పనులు ప్రారంభించటంతో అవి పూర్తిగాని పరిస్థితి నెలకొనిఉంది. కనుక ప్రాధాన్యతను ఎంచుకొని పనులు నిర్వహించటం, ప్రణాళికాబధ్ధంగా పనులు నిర్వహించటం, వివిధ డిపార్టుమెంట్ల మధ్య సమన్వయంతో పనులు నిర్వహించటం చేయటం మూలంగా డబ్బు ఆదా అవుతుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

15. రైల్వేవారినుండి డ్రైనేజి సెస్‌ను వసూలు చేయవలసిందిగా కోరుతున్నాము.

నగరపాలక సంస్థకు ఆదాయంకోసం పైన సూచించిన చర్యలను చేపట్టవలసిందిగా కోరుతున్నాము.

అభివందనాలతో

(యం.వి.ఆంజనేయులు)
కన్వీనర్‌

No comments:

Post a Comment