Tuesday, 25 December 2012

బి.ఆర్‌ టి.యస్‌ ప్రయోజనకరంగా వినియోగించడానికి సూచనలు

                                                                    తేదీ 11.12.2012
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా,
విషయం: బి.ఆర్‌ టి.యస్‌ ప్రయోజనకరంగా వినియోగించడానికి సూచనలు

విజయవాడ నగరంలో బి.ఆర్‌.టి.యస్‌ (Bus Rapid Transit System (BRTS) వ్యవస్థను ఏర్పాటు చేసారు. దీనికోసం సుమారు 3 కి.మీ. రోడ్డు ప్రత్యేకంగా నిర్మించారు. మొత్తం బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు 15.5 కి.మీ. అందులో కొర్పొరేషన్‌ నిర్మించిన రోడ్డు 3 కి.మీ. మిగిలిన 12 కి.మీ.లు కారల్‌ మార్క్స్‌ రోడ్డు(ఏలూరు రోడ్డు), జాతీయ రహదారి (రింగ్‌ రోడ్డు), బందరు రోడ్డు (మహాత్మా గాంధీ రోడ్డు) లను వినియోగించబోతున్నారు. అవి కార్పొరేషన్‌కు సంబంధించిన రోడ్లు కావు. కనుక ఈ మొత్తం 15 కి.మీలలో సుమారు 12 కి.మీ.లు బి.ఆర్‌.టి.యస్‌ బస్సు సాధారణ రోడ్లపై నడవవవలసిందే. ఇది నగర ప్రజలకు అంత ప్రయోజనకరం కాదు. అంతే కాకుండా ఢిల్లీ లాంటి నగరాలలో ఈ వ్యవస్థ అంతగా ఉపయోగ పడలేదు. ఏ వ్యవస్థ అయినా నగర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. ఇప్పటికే దీనిపై రు|| 80 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇంత భారీ మొత్తంలో వెచ్చించిన తరువాత దాని ప్రయోజనం కూడా అదే స్థాయిలో ఉండాలి. అందువలన ఈ వ్యవస్థ నగర ప్రజలకు చేరువ అవటానికి, నగర ప్రజల నేటి అవసరాలతో బాటుగా భవిష్యత్‌ అవసరాలను కూడా సమర్ధవంతంగా తీర్చడానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కొన్ని సూచనలు చేయదలిచాము.

నగరాలలో వేగవంతమైన పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థను ఏర్పాటు చేయటం. సిటీ బస్సులను నిరాటంకంగా, వేగంగా నడపటం ఈ వ్యవస్థ ఉద్దేశ్యమని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆనాటి కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖామాత్యులు గౌెరవనీయులు శ్రీ జైపాల్‌ రెడ్డిగారు విజయవాడ నగరానికి వచ్చినసందర్భంగా స్పష్టంచేశారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం మీరు ప్రారంభించబోతున్న బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థలో ఈ క్రింది లోపాలున్నాయి.

లోపాలు
1.బి.ఆర్‌.టి.యస్‌ బస్సు రోడ్డు అంచున కాకుండా, రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్‌ డివైడర్‌కు ఇరువైపులా నిర్మించిన డివైడర్ల మధ్యన తిరగటంవలన ఈ వ్యవస్థలో ప్రజలకు అవసరమైన చోటల్లా బస్‌ స్టాప్‌లు నిర్మించుకునే అవకాశంలేదు. రోడ్ల కూడళ్ల వద్ద మాత్రమే బస్‌ స్టాప్‌ను నిర్మించాలి. ఈ బస్సు ఎక్కాలంటే రోడ్ల కూడళ్ల వరకు పోయి, జీబ్రా గీతల మీదుగా దాటి, బి.ఆర్‌.టి.యస్‌ బస్‌ స్టాప్‌లోకి ప్రవేశించాలి. దిగేటప్పుడు కూడా అదే పరిస్థితి. రోడ్ల కూడళ్ళలో దిగి, జీబ్రా గీతల మీదుగా దాటి, రోడ్టు అంచుకు చేరాలి. అందువలన ప్రజలకు అవసరమైన చోట బస్‌ స్టాప్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేదు.

2. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు ఒక సర్కులర్‌ బస్సులాగా కేవలం ఆ నిర్ణీత మార్గంలోనే తిరుగుతుంది. నివాస ప్రాంతాలనుండి బి.ఆర్‌.టి.యస్‌ బస్సు బయలు దేరే అవకాశం లేదు. నివాస ప్రాంతాల నుండి ప్రజలను ఎక్కించుకోని వేగంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేయటం చాలా అవసరం. ఇదే పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థలో కీలకం. బస్సులను కేవలం బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులోనే వేగంగా త్రిప్పటం వలన ఇది నెరవేరదు.

3.ప్రస్తుతమున్న బి.ఆర్‌.టి.యస్‌ ప్లాను ప్రకారం బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌లో బి.ఆర్‌.టి.యస్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మాత్రమే తిరుగుతాయి. వీటి చార్జీలు అధికంగా ఉంటాయి. ఢిల్లీ నగరంలో 19 కి.మీ.లు ఉన్న బి.ఆర్‌.టి.యస్‌ మార్గంలో బస్సు చార్జీ రు|| 35లవరకు ఉంది. ఇదే మామూలు బస్సులో (పల్లె వెలుగు) విజయవాడ బస్‌ స్టాండ్‌ నుండి కొండపల్లి రైల్వే స్టేషన్‌ వరకు (20 కి.మీ) చార్జీ రు|| 9/-లుగా ఉన్నది. అత్యధిక చార్జీలు సాధారణ ప్రజలు భరించ గలిగినవి కావు.

4.ఈ బస్సులో విద్యార్ధులకు, వికలాంగులకు రాయితీలు వర్తించవు. వర్తింప జేసినా అవి సాధారణ బస్సు చార్జీలతో సమానంగా కాని, అంతకన్నా ఎక్కువగాని ఉంటాయి. నెలవారీ జనరల్‌ పాస్‌ ధరకూడా అత్యధికంగా ఉంటుంది. పైగా కూడళ్ళలో తప్ప బస్సులు ఆగనందున ఈ పాస్‌లు ఇచ్చినా ప్రయోజనం ఉండదు.

5.నగరాలలో ధనవంతులు కార్లు అధికంగా కొంటున్నారని. దీనివలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎ.సి. బస్సులను త్రిప్పటంవలన, ధనవంతులు ఆ బస్సులు ఎక్కుతారని,కార్లు కొనటం తగ్గిపోతుందని వాదన వినిపించారు. ఇంతకంటే హాస్యాస్పదమైన వాదన ఇంకొకటి లేదు. కారు కొనదలుచుకున్న వారెవ్వరూ ఎక్కడో ఆగే బస్సుల కోసం ఎదుచూస్తూ నిలబడరు. కారు తన గమ్య స్థానం వరకూ తీసుకెళుతుంది. అదేవిధంగా ద్విచక్ర మోటారు వాహనాలు కూడా వారివారి గమ్యస్థానాలవరకు నేరుగా చేర్చుతారు. అందువలననే ప్రజలు వ్యక్తిగత వాహనాలు కొంటున్నారు. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు తన గమ్య స్థానం వరకు వెళ్ళదు. ఢిల్లీ లాంటి నగరాలలో కూడా ఇప్పటికిే నిర్మించిన బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులో ధనవంతులు కార్లు వదలి బి.ఆర్‌.టి.యస్‌ బస్సులో ప్రయాణం చేస్తున్న దాఖలాలులేవు. కేవలం ఒక రూట్లో వేగవంతమైన బస్సులు త్రిప్పినంత మాత్రాన ప్రజలు వ్యక్తిగత వాహనాలను కొనకుండా మానరు. నగరం మొత్తంలో అన్ని ప్రాంతాలనుండి అన్ని ప్రాంతాలకు బస్‌ నెట్‌వర్కును ఏర్పాటుచేయటం, బస్‌లు ప్రజలకనుకూలంగా సమయపాలన పాటించడం ద్వారానే వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించవచ్చు.

ఈ లోపాలను అధిగ మిస్తూ బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నాము.
01. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డుకు రెండు వైపుల ఫుట్‌ పాత్‌లను నిర్మించాలి. వాటిని ఆక్రమణలకు గురికాకుండా పాద చారులు నిరాటంకంగా నడవటానికి వీలుగా ఏర్పాటు చేయాలి. పాదచారులు ఎక్కడ పడితే అక్కడ ఫుట్‌ పాత్‌ దిగకుండా రైలింగ్‌ ఏర్పాటు చేయాలి.
02. జంక్షన్‌ వద్ద బస్‌ స్టాప్‌లు కాకుండా ప్రజలకు అవసరమైన ప్రతి చోట ఫుట్‌ పాత్‌ల వైపు బస్‌ స్టాప్‌లను నిర్మించాలి.
03. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు నడిచేటందుకు వీలుగా ప్రత్యేకమైన లేన్‌ను ఫుట్‌ పాత్‌ల వైపు డివైడర్‌ ద్వారా ఏర్పాటు చేయాలి.
04. అలా ఏర్పాటు చేసిన బి.ఆర్‌.టి.యస్‌ బస్‌ లేన్‌ లోకి మరే ఇతర వాహనాన్ని అనుమతించరాదు. మరే ఇతర వాహనమైనా ఆలేన్‌ లోకి వస్తే వాటిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి.
05. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులో అందరికీ అందు బాటులో ఉండేవిధంగా సాధారణ సిటీ బస్సులను మాత్రమే త్రిప్పాలి.
06 ఇతర ట్రాఫిక్‌ మొత్తం బి.ఆర్‌.టి.యస్‌ డివైడర్‌కు, సెంట్రల్‌ డివైడర్‌కు మధ్య వెళ్ళాలి.
07. ఎడమవైపునుండి కుడివైపుకు, కుడివైపునుండి ఎడమ వైపుకు ప్రయాణీకులు వెళ్ళటానికి రోడ్డు క్రింద సబ్‌ వేలు నిర్మించాలి.
దీని నమూనా డ్రాయింగ్‌ను చివరి పేజీలో ఇస్తున్నాము.

ఈ విధంగా బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను రూపొందిస్తే ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.

01.నగర ప్రజలకు వేగవంతమైన ప్రజారవాణా వ్యవస్థ లభిస్తుంది.
02.100 అడుగులు, 80 అడుగులు వెడల్పుగల ప్రతి రోడ్డ్లులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.
03.బి.ఆర్‌.టి.యస్‌ కోసం ప్రత్యేకమైన బస్సులను కొననవసరంలేదు. సాధారణ సిటీ బస్సులనే వేగంగా నిరాటంకంగా ఈ లేన్‌లలో త్రిప్పవచ్చు. దీనివలన అదనపు బస్సులు కొనే ఖర్చు తగ్గుతుంది.
04. బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌నుండి నగరంలోని నివాస ప్రాంతాలలోకిి కూడా బస్‌ను త్రిప్పవచ్చు. నివాస ప్రాంతంలో ప్రజలను ఎక్కించుకొని బయలు దేరిన బస్సు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు వద్దకు రాగానే బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌లోకి ప్రవేశించి వేగంగా వెళుతుంది. తిరిగి నివాస ప్రాంతంలోకి వెళ్ళాలంటే బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డునుండి ఇతర ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నివాస ప్రాంతాలవైపుకు మళ్ళుతుంది.

అందువలన విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను పైవిధంగా మార్పు చేయాలని కోరుతున్నాము.


                         అభివందనాలతో

(వి. సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                         కార్యదర్శి

No comments:

Post a Comment