Sunday, 16 August 2015

ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ను విశాఖ పట్టణాన్నుండి ప్రారంభించడం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం

ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ను రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడనుండి కాకుండా విశాఖ పట్టణాన్నుండి ప్రారంభించడం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. విశాఖ పట్టణాన్నుండి ప్రారంభించడానికి రైల్వేశాఖ, ప్రజా ప్రతినిధులు చెప్పిన కారణం సహేతుకంగాలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. విజయవాడనుండి బయలుదేరితే కేవలం అరగంటలోనే తెలంగాణోకి ప్రవేశిస్తుందని, దానివలన ఆంధ్ర ప్రజలకు ఒరిగేదేమీలేదని, అదే విశాఖ పట్టణాన్నుండి బయలు దేరితే ఆంధ్రలో కొన్ని జిల్లాలకు ఉపయోగమని అందుకే విశాఖపట్టణం నుండి ప్రారంభించామని చెబుతున్నారు. నిజానికి ఈ వాదనే నిజమైతే అనంతపురం నుండి విఖాఖపట్టణంమీదుగా నడిపితే రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలకు ఈ రైలు ఉపయోగపడుతుంది. విశాఖపట్టణం నుండే నడుపవలసిన అవసరంలేదు. నిజానికి విశాఖ పట్టణాన్నుండి ఢిల్లీకి వెళ్ళటానికి సమత ఎక్స్‌ప్రెస్‌ ( నం.12807), స్వర్ణజయంతి ఎక్స్‌ ప్రెస్‌ ( నం.12803), విశాఖ-న్యూ డిల్లీ ఎక్స్‌ ప్రెస్‌ ( నం.22415), లింక్‌ దక్షిణ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ( నం.12861), విశాఖ -అమృత్‌ సర్‌ ఎక్స్‌ ప్రెస్‌ ( నం.12507) లు ఉన్నాయి. ఆవన్నీ విశాఖ పట్టణం నుండి బయలు దేరేవే. ఇప్పుడు మరో క్రొత్త రైలును విశాఖనుండే ప్రారంభించనవలసరంలేదు. కాని దేశరాజధానికి విజయవాడనుండి బయలుదేరే ఒక్క ఎక్స్‌ప్రెస్‌కూడా లేదు. విజయవాడనుండి దేశరాజధానికి ఒక సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న డిమాండు ఎప్పటి నుండో ఉన్నది. ప్రజాప్రతి నిధులు కాని, రైల్వే శాఖ కాని ఏనాడూ ఆ డిమాండును పట్టించుకోలేదు. కాని విజయవాడ రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ విజయవాడనుండి ప్రారంభమవుతుందని విజయవాడ ప్రజలు భావించారు. 2014 లో విజయవాడనుండి ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ నడుస్తుందని కేంద్రమంత్రులు ప్రకటించడంతో విజయవాడ నగర ప్రజల ఆకాంక్షకు బలం చేకూరింది. ఇప్పుడు విజయవాడనుండి కాకుండా విశాఖ నుండి ప్రారంభించడంతో విజయవాడ నగర ప్రజల ఆశలు అడియాశలుగా మారాయి. నిజానికి ఈ దౌర్భాగ్యస్థితి దేశంలో ఏరాష్ట్ర రాజధానికీలేదు. రాష్ట్ర రాజధాని విజయవాడ నుండి నడవవలసిన ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ను విశాఖపట్టణంనుండి నడపడానికి కారణం కేవలం విశాఖ పట్టణంలో జి.జే.పీ.కి చెందిన పార్లమెంటు సభ్యుడు ఉండటమే తప్ప మరో కారణంలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ విజయవాడనుండి కాకుండా విశాఖకు తరలి పోవటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుని వైఫల్యంకూడా ఇందులో కొట్టొచ్చినట్లుగా కనుపిస్తున్నది. రాష్ట్ర రాజధానినుండి దేశరాజధానికి బయలు దేరే రైలు లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం కూడా సిగ్గుపడవలసిన విషయం. ఇప్పటికైనా ఎ.పి ఎక్స్‌ ప్రెస్‌ విజయవాడనుండి నడపటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

(యం.వి.ఆంజనేయులు)
కార్యదర్శి

No comments:

Post a Comment