Wednesday, 5 August 2015

Letter To Corporators of Viojayawada Municipal Corporation on SMART CITIES

                                                                                                  తేదీ: 31.07.2015
గౌరవనీయులైన కార్పొరేటర్‌ గారికి
ఆర్యా,
5.8.2015 న మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగ బోతున్నది. ఈ సమావేశంలో విజయవాడ నగరాన్ని స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో చేర్చటానికి కౌన్సిల్‌ ఆమోదం కోరుతూ ఆఫీసువారు ఒక ప్రతిపాదనను పెట్టి యున్నారు. అలా ప్రతిపాదన పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం 30.06.2015 న గౌరవనీయులైన మున్సిపల్‌ కమీషనర్‌కు, గౌరవనీయులైన మేయర్‌గారికి ఒక సర్క్యులర్‌ పంపింది. దానికి అనుగుణంగానే ఈ ప్రతిపాదనను ఆఫీసువారు ఎజెండాలో పెట్టియున్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదించకుండా, తిరస్కరించవలసిందిగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మిమ్ములను కోరుతున్నాము. తిరస్కరించమని మిమ్ములను కోరటానికి గల కారణాలను ఈ లేఖద్వారా మీముందుంచదలుచుకున్నాము.
స్మార్ట్‌ సిటీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినపథకం. ఈ పథకాన్ని 25.06.2015న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకంలో ఉన్న ముఖ్యాంశాలు.
01. స్మార్ట్‌ సిటీ ద్వారా సమకూరే సదుపాయాలు:- నిరంతర నీటిసరఫరా, ఖచ్చితమైన విద్యుత్‌ సరఫరా, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటు, రవాణాసదుపాయాలు, గృహనిర్మాణం, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, ఈ గవర్నెన్స్‌, పర్యావరణం, పౌరులకు రక్షణ, విద్యవైద్యంలాంటి సదుపాయాలు ఉంటాయి.
ఇవన్నీ వింటానికి బాగానే ఉన్నాయి. ఇందులో చాలవిషయాలు ఇప్పటికే ఉన్నవే. వీటిని ఏర్పాటు చేయవలసింది మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాలి. అందుకు భిన్నంగా స్మార్ట్‌ సిటీల పేరుతో ఏం చేయబోతున్నారన్నది దిగువన ఇస్తున్నాము.
02. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేసే ఈ పనులను నిర్వహించటం కోసం, ఇకమీదట ప్రతిపనికీ ఒక కంపెనీని ఏర్పాటుచేస్తారు. అంటే నీటి నిర్వహణకు ఒక కంపెనీ, పారిశుధ్ద్యానికి ఒక కంపెనీ, రవాణాకు ఒక కంపెనీ- ఇలా ప్రతి పనికీ ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీలను 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఈ కంపెనీలు షేర్లు అమ్ముకోవచ్చు. షేర్లు అమ్మాలంటే ముందు కంపెనీలో కొంత ప్రారంభ పెట్టుబడి కావాలి. దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుతాయి.
03. ఈ కంపెనీలే నగరంలో పనులను నిర్వహిస్తాయి. పనులు నిర్వహించటమే కాదు. ఆ పనులకయ్యే ఖర్చును పూర్తిగా మననుండే వసూలు చేస్తాయి. ఇకమీదట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో అభివృధ్ధి పనులకు నిధులు ఇవ్వవు. పనులకయ్యే ఖర్చును, వాటి నిర్వహణకయ్యే ఖర్చును ఎంతయిందో లెక్కగట్టి, ఆ మొత్తాలను పూర్తిగా నగరప్రజలనుండే ఈ కంపెనీలు యూజర్‌ చార్జీలపేరుతో వసూలు చేస్తాయి. యూజర్‌ చార్జీలను నిర్ణయించేది వసూలు చేసేదీ ఈ కంపెనీలే తప్ప మున్సిపాలిటీ కాదు.
04.మున్సిపల్‌ చట్ట ప్రకారం ఈ పనులన్నీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేయాలి. కాని ఆపనులను కంపెనీలు చేయాలంటే చట్టం అడ్డు వస్తుంది. ఈ అడ్డు తొలగించుకోవటం కోసం ఏం వ్రాసి ఉందోచూడండి.
అ) స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కు సంబంధించిన పనులకు సంబంధించి మున్సిపల్‌ కౌన్సిల్‌ కు ఉన్న హక్కులు, బాధ్యతలు ఆకంపెనీలకు బదలాయించాలి.
ఆ) మున్సిపల్‌ చట్టప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఉన్న నిర్ణయాలు చేసే హక్కును ఆ కంపెనీలకు బదలాయించాలి.
ఇ) పట్టణాభివృధ్ధి శాఖకు ఉన్న నిర్ణయం చేసేహక్కు ,ఆమోదించే హక్కులను ఆకంపెనీల బోర్డు డైరక్టెర్లకు బదలాయించాలి.
ఈ) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అవసరమైన విషయాలలో, ఆమోదించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాన్నుండి ఈ
స్మార్ట్‌ సిటీలకోసం ఏర్పడే రాష్ట్ర స్థాయి హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీకి బదలాయించాలి.
అంటే మున్సిపాలిటీకి, మున్సిపల్‌ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులన్నీ ఈ కంపెనీలకు బదలాయించాలన్నమాట.
ఇందులో మేము వ్రాస్తున్న ప్రతి అంశము స్మార్ట్‌ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గైడ్‌ లైన్స్‌లో ఉన్నవే తప్ప మా సొంతంకాదు. ఇప్పుడు కార్పొరేషన్‌ అధికారులు చేసిన ప్రతిపాదనను కౌన్సిల్లో అమోదిస్తే వీటన్నింటికీ మీరు ఆమోదించడమమే అవుతుంది. ఇది మీరు ఆమోదిస్తే నగరం మొత్తం కంపెనీల పాలనలోకి వెళుతుంది. నగరపాలనకు సంబంధించి కౌన్సిల్‌, మున్సిపల్‌ డిపార్టుమెంటు, రాష్ట్ర ప్రభుత్వం తన హక్కులను పూర్తిగా కోల్పోతాయి.కార్పొరేషన్‌ ఇక చేయగలిగింది ఏముండదు. ఇక ఎన్నికైన కార్పొరేటర్‌గా మీరు ఏపని చేయాలన్నా కంపెనీ దయాదాక్షిణ్యాలమీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఏపని కావాలన్నా మున్సిపల్‌ అధికారులు కూడా ఆ కంపెనీలమీదనే ఆధారపడాలి. నగర ప్రజలమీద విపరీతంగా భారాలు పడతాయి. నగర ప్రజలు నిలువు దోపిడీకి గురవుతారు.
రాష్ట్రాభివృధ్ది కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. ఆ పన్నులనుండి మన నగరాభివృధ్ధికి ఖచ్చితంగా వాటా ఇవ్వాలి. మననగరానికేకాదు. రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా జరిగే అభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి ఉండదు. కనక స్థానిక అభివృధ్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిధులు ఇవ్వవలసిందే. ఈ పథకంలో చేరితే ఇక మీదట నగరానికి రూపాయిరాదు. ప్రతిపనీ మనండబ్బులిచ్చి చేయించుకోవలసిందే. చివరకు నగరపాలనే అస్తవ్యప్తంగా మారుతుంది. గతంలో 2005 నుండి 2010 వరకు జరిగిన కౌన్సిల్‌లో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. పథకాన్ని సి.పి.యం సభ్యులు మినహా మిగతా అందరూ ఆమోదించారు. దాని షరతుల ఫలితంగా నగరపాలక సంస్థ ఎంత దెబ్బతిన్నదో చూచాము. ఇప్పుడు ఈ స్మార్ట్‌ సిటీ పథకాన్ని ఆమోదిస్తే నగర పరిస్థితి మరింత దిగజారుతుంది. నగర ప్రజలు ప్రజాతంత్ర హక్కులను కోల్పోతారు. కంపెనీల పాలన మొదలవుతుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించే రాజధానికి '' కాపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌'' పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తూ 02.05.2015 న జీ.వో. నెం.109 ఇచ్చింది. అదేరోజు ఈ కంపెనీ కి కొన్ని అధికారాలు ఇస్తూ జీ.వో. నెం.110 ఇచ్చింది. ఈ జీవోలో నగరంలో యూజర్‌ చార్జీలు, నగర మెయింట్‌నెన్స్‌ చార్జీలు వసూలు చేసే అధికారాన్ని, మార్కెట్‌లో షేర్లు అమ్మే అధికారాన్ని, అప్పులు చేసే అధికారాన్ని ఆ కంపెనీకి ఇచ్చారు. చివరకు నగరంలో అభివృధ్ధి చేయాల్సిన స్థలాలను ఇతర కంపెనీలకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ కంపెనీకి కట్టబెట్టారు. అలాగే పట్టణాలలో ఉన్న మున్సిపల్‌ ఖాళీ స్థలాలలను ప్రైవేటీకరించటం కోసం '' ఎ.పి. అర్బన్‌ గ్రీనింగ్‌ & బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌'' ఏర్పాటు చేశారు. దీనిక్రిందకు పట్టణాలలో ఉన్న మున్సిపల్‌ ఖాళీ స్థలాలు, ఇతర ఖాళీ స్థలాలు, పార్కులు, గ్రీన్‌ జోన్‌లో వస్తాయి. ఇవి కేవలం ప్రారంభంమాత్రమే. మీరు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే మననగరం కూడా ఇలాగే కంపెనీల క్రిందకు పోతుంది. చివరకు ప్రజలు హక్కులు కోల్పోతారు. కంపెనీల ధనదాహానికి బలవుతారు. ప్రజాతంత్ర వ్యవస్థ నశించిపోతుంది. అందుకే ఈ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు ప్రతిపాదనను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము.

నగర ప్రయోజనాల రీత్యా ఈ స్మార్ట్‌ సిటీ ప్రతిపాదనను మీరు కూడా వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాము.
అభివందనాలతో

(యం.వి. ఆంజనేయులు)                            (వి.శ్రీనివాస్‌)
సెక్రెటరీ                                                 జాయింట్‌ సెక్రెటరీ

No comments:

Post a Comment