స్మార్ట్ సిటీ
''స్మార్ట్ సిటీ'' ఇది అత్యంత ఆకర్షణీయమైన పేరు. భ్రమలకు వేదిక. ఆకాశాన్నంటే భవంతులు, విశాలమైన రోడ్లు, రయ్యిన దూసుకు వెళ్ళే కార్లు, మెట్రో రైళ్ళు, ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లోకూర్చునే ఏపనైనా సమకూర్చుకునే విధంగా పధ్ధతులు, అందమైన పార్కులు, నీటి ఫౌంటైన్లు, ఈత కొలనులూ, పచ్చటి చెట్లు, జిగేల్ మనే లైట్లు- 'వావ్' ఎంత అందమైన నగరం. ఇలాంటి నగరం కావాలని ఎవరికి మాత్రం ఉండదూ? ఇవన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. నిజంగా ఇవన్నీ స్మార్ట్ సిటీలో ఉంటాయా? లేక స్మార్ట్ సిటీ అన్న భ్రమలో మరేమైనా జరుగ బోతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలంటే 25.06.2015 న ప్రధాన మంత్రి విడుదలచేసిన స్మార్ట్ సిటీ మార్గదర్శకాలను ( గైడ్ లైన్స్) క్షుణ్ణంగా పరిశీలించవలశిందే.
భారత దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలు రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో 500 పట్టణాలను అమృత్ పథకం క్రింద అభివృధ్ధి చేస్తామని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో 3 నగరాలను, తెలంగాణాలో 2 నగరాలను స్మార్ట్ సిటీలు గా ఎంపిక చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో విశాఖ పట్టణం, కాకినాడ, తిరుపతి నగరాలను, తెలంగాణాలో హైదరాబాద్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ సిటీలో చేరాలంటే ముందుగా ''స్మార్ట్ సిటీలో చేరటానికి ఆమోదిస్తున్నామని'' కౌన్సిల్ తీర్మానం చేయాలి, అలా తీర్మానం చేయమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లను ఆదేశింవచింది. విజయవాడ నగరపాలక సంస్థ ఇమేరకు ఒకతీర్మానం కూడా చేసింది. ఈ పధకం 2015-16 నుండి 2019-2020 వరకు అంటే 5 ఏళ ్ళపాటు అమలులో ఉంటుంది.
అసలు స్మార్ట్ సిటీ అంటే ఏమిటీ? ఈ ప్రశ్నకు సర్వత్రా ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదని, భిన్న ప్రజలకు భిన్న సౌకర్యాలు ఉంటాయని గైడ్ లైన్స్ ప్రారంభంలోనే పేర్కొన్నారు. అంటే నిర్ధిష్టమైన నిర్వచనమేమీ లేదన్నమాట. అయితే 10 ముఖ్యమైన అంశాలుంటాయని పేర్కొన్నారు. అవి 01) అవసరాలకు సరిపడా నీటిసరఫరా, 02) నిరంతర విద్యుత్ సరఫరా, 03) సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటుతో సహా పారిశుధ్యం , 04)ప్రజారవాణాతో సహా సమర్ధవంతమైన రవాణాసదుపాయాలు,05) భరించగలిగిన ధరలలో, ముఖ్యంగా పేదవారికి గృహ సదుపాయం 06) బలమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటలైజేషన్, 07) సుపరిపాలన ముఖ్యంగా ఈ గవర్నెన్స్-ప్రజల భాగస్వామ్యం, 08) మంచి పర్యావరణం, 09) పౌరులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, వృధ్ధులకు రక్షణ, 10) విద్య వైద్యం. ఈ 10 సదుపాయాలు ఉంటాయని ఆ గైడ్ లైన్స్‌లో స్పష్టంచేశారు,
ఈ 10 పనులను గమనిస్తే అందులో కొన్ని స్థానిక సంస్థలు చేసేవి, కొన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి ఉన్నాయి ఇందులో క్రొత్తగా ప్రతిపాదించిన సదుపాయాలేమీ లేవు. ఇవన్నీ ఇప్పటికే నగరాలలో ఎంతో కొంత మేర అమలు జరుగుతున్నాయి. కాకుంటే వాటిని మరింత పటిష్టంగా అమలు జరపటానికి చర్యలు తీసుకుంటామనేది వారి భావనగా పరిగణిద్దాం..
ఈ 10 అంశాలను అమలు జరపటం కోసం కొన్ని స్మార్ట్ పరిష్కారాలనుకూడా చూపించారు. ఉదాహరకు నీటిసరఫరాకు స్మార్ట్ నీటి మీటర్లు బిగించటం, లీకేజీలను అరికట్టడం, నీటి నాణ్యతను పరిశీలించటం, అలాగే పారిశుధ్ధ్యం కోసం చెత్తనుండి విద్యుత్‌తయారీ, చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చటం, మరుగునీటిని శుధ్ధి చేయటం- ఇలా పై 10అంశాలకు స్మార్ట్ పరిష్కారాలను పేర్కొన్నారు. స్థలాభావంవలన 10 పనులకు వారు పేర్కొన్న స్మార్ట్ పరిష్కారాలను పూర్తిగా ఇవ్వటం సాధ్యం కావటం లేదు. నిజానికి గైడ్ లైన్స్‌లో పేర్కొన్న ఈ స్మార్ట్ పరిష్కారాలను పరిశీలిస్తే ఇప్పటివరకు ప్రభుత్వాలు చెబుతున్న పాత పరిష్కారాలే తప్ప ప్రత్యేకించి క్రొత్త పరిష్కారాలేవీ లేవు.
పని, పరిష్కారం రెండూ క్రొత్తవి కానప్పుడు మరి స్మార్ట్‌సిటీ పధకంలో క్రొత్త ఏమిటి?
క్రొత్త ఏమిటంటే ఈ పనులను చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయటం. ఇప్పటివరకూ ఈ పనులను మున్సిపాలిటీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం చూశాము. ఇక మీదట ఈ పనులన్నీ కంపెనీ నిర్వహిస్తుంది. దీనిని మరింత లోతుగా పరిశీలిద్దాం.
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో ఇచ్చిన పనులను అమలు జరపడం కోసం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన ప్రతి నగరానికీ ఒక కంపెనీని ఏర్పాటు చేస్తారు.దీనికి స్పెషల్ పర్పస్ వెహికిల్ అని ముద్దు పేరు పెట్టారు. ఈ కంపెనీ 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు అవుతుంది. దీనికి ఒక పూర్తికాలపు సి.ఇ.వో (ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ఉంటాడు. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కొంతమంది, వీటితో సంబంధంలేనివారు కొంతమంది డైరెక్టర్లుగా ఉంటారు. ఈ కంపెనీలో ప్రాధమికంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ చెరిసగం వాటాలను (50:50) కలిగి ఉంటాయి. అతరువాత ఆ కంపెనీ 40 శాతం వరకు షేర్లు అమ్మవచ్చు. అంటే ఈ కంపెనీని ప్రభుత్వం నెలకొల్పినప్పటికీ, షేర్లు కొనటం ద్వారా ప్రైవేటు సంస్థలు కంపెనీ యాజమాన్యంలోకి చేరతాయన్నమాట.
ఈ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును నిర్వహించటానికి దేశ స్థాయిలో ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో 8 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ఇందులో బ్యూరోక్రాట్లే తప్ప ఎన్నికైన ప్రజా ప్రతినిధులెవరూ ఉండరు. వీరు తమ సమావేశాలకు ఐక్యరాజ్య సమితీ ప్రతినిధులను, ప్రపంచబ్యాంకు, టి.ఇ.ఆర్.ఐ. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, బెంగుళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్మార్ట్ సిటీస్‌కు చెందిన ప్రతినిధులను ఆహ్వానించవచ్చు. అలాగే ద్వైపాక్షిక, బహుళ పాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న వారి ప్రతినిధులను, పట్టణ ప్రణాళిక నిపుణులను పిలువవచ్చు,. అలాగే రాష్ట్ర స్థాయిలో 8 మంది బ్యూరోక్రాట్లతో కూడిన హైపవర్ స్టీరింగ్ కమిటీ ఉంటుంది, నగర స్థాయిలో 2013 కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన కంపెనీ ఉంటుంది. ఈ మొత్తంలో ఎక్కడా ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు స్థానంలేదు.
2013 కంపెనీ చట్టం ప్రకారం నగర స్థాయిలో ఏర్పాటు చేసిన కంపెనీ స్మార్ట్‌సిటీలో జరిగే పనులను నిర్వహిస్తుంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబధ్ధమైన కొన్ని అధికారాలు ఉన్నాయి. నిర్ణయాలు చేసే అధికారాలు ఉన్నాయి. వీటికి చట్టబధ్దమైన అధికారాలున్నంతకాలం కంపెనీ స్వేఛ్చగా పని చేయలేదు. అందుకోసం స్మార్ట్ సిటీ గైడ్ లైన్స్‌లో ఒక స్మార్ట్ పరిష్కారాన్ని పొందుపరిచారు.
1) స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ కు ఉన్న హక్కులు, బాధ్యతలు నగరస్థాయి కంపెనీకి బదలాయించాలి.
2) మున్సిపల్ చట్టప్రకారం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉన్న నిర్ణయాలు చేసే హక్కును ఆ కంపెనీకి బదలాయించాలి.
3) పట్టణాభివృధ్ధి శాఖకు ఉన్న నిర్ణయం చేసేహక్కు ,ఆమోదించే హక్కులను ఆకంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు బదలాయించాలి.
4) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అవసరమైన విషయాలలో, ఆమోదించే హక్కును రాష్ట్ర ప్రభుత్వాన్నుండి ఈ స్మార్ట్ సిటీలకోసం ఏర్పడే రాష్ట్ర స్థాయి హైపవర్ స్టీరింగ్ కమిటీకి బదలాయించాలి.
అంటే మున్సిపాలిటీకి, మున్సిపల్ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులన్నీ ఈ కంపెనీలకు బదలాయించాలన్నమాట. నగరపాలనకు సంబంధించి కౌన్సిల్, మున్సిపల్ డిపార్టుమెంటు, రాష్ట్ర ప్రభుత్వం తన హక్కులను పూర్తిగా కోల్పోతాయి.కార్పొరేషన్ ఇక చేయగలిగింది ఏమీ ఉండదు. ఎన్నికైన కౌన్సిళ్ళు ఏపని చేయాలన్నా కంపెనీల దయాదాక్షిణ్యాలమీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఏపని కావాలన్నా మున్సిపల్ అధికారులు కూడా ఆ కంపెనీలమీదనే ఆధారపడాలి.
నగరంలో జరిగే ఈ పనులన్నింటికీ సంబంధించి ప్లానింగ్, మదింపు, ఆమోదం, నిధులు విడుదలచేయటం, అమలు జరపటం, నిర్వహించటం లాంటి సర్వాధికారాలు ఈకంపెనీకే ఉంటాయని స్మార్ట్ సిటీ గైడ్ లైన్స్‌లో స్పష్టం చేసారు. మరి ఈ కంపెనీకి నిధులు ఎలా వస్తాయి?
కేంద్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రు|| 194 కోట్లు, అక్కడనుండి ప్రతి ఏటా రు|| 98 కోట్ల చొప్పున 3 ఏళ్ళు ( అంటే 294 కోట్లు) ఇస్తుంది. అంటే మొత్తం 4 ఏళ్ళలో 488 కోట్లు ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, దానికి మ్యాచింగ్ గా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చేది ప్రాజెక్టు ఖర్చులో కొద్ది భాగం మాత్రమేనని గైడ్ లైన్స్‌లోనే స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే ఇది కంపెనీకి కార్పస్ ఫండ్ మాత్రమే. ప్రాజెక్టు ఖర్చును యూజర్ చార్జీలు. లబ్ధి దారుల చార్జీలు, ఇంపాక్టు ఫీజులు, భూవినియోగం,అప్పులు చేయటం, లోన్లు తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలి. 14వ ఆర్ధిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే డబ్బును వాడుకోవాలి. మున్సిపల్ బాండ్లను విడుదలచేయటం, పన్నులనిరంతర పెంపుదల వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా సమకూర్చుకోవాలి. అంటే స్మార్ట్ సిటీకి అయ్యే ఖర్చు మొత్తం వివిధ రూపాలలో ప్రజలు చెల్లించాల్సిందే.
స్మార్ట్ సిటీని ఆమోదిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది. నగరపాలన కంపెనీ పాలనగా మారుతుంది. నగరంలో జరిగే పనులకు అయ్యేఖర్చును పూర్తిగా నగర ప్రజలే భరించవలసి వస్తుంది. నగరంలో జరిగే పనులకు అయ్యేఖర్చును మాత్రమే కాదు. కంపెనీలో షేర్ ¬ల్డర్ల లాభాలనుకూడా నగర ప్రజలే భరించాలి. రాష్ట్రాభివృధ్ది కోసం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. ఆ పన్నులనుండి నగరాల అభివృధ్ధికి ఖచ్చితంగా వాటా ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా జరిగే అభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి ఉండదు. కనక స్థానిక అభివృధ్ధికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా నిధులు ఇవ్వవలసిందే. నిజానికి రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ సిఫార్సులలో పేర్కొన్న విధంగారాష్ట్ర ప్రభుత్వం ఆదాయంనుండి 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు కేటాయిస్తే, స్మార్ట్ సిటీ పథకంతో సంబంధంలేకుండా ఆంధ్ర, తెలంగాణాలలోని అన్ని పట్టణాలను,నగరాలను స్మార్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరితే ఇక మీదట నగరానికి రూపాయిరాదు. ప్రతిపనీ నగరప్రజలు డబ్బులిచ్చి చేయించుకోవలసిందే. చివరకు నగరపాలనే అస్తవ్యప్తంగా మారుతుంది. నగర ప్రజలు ప్రజాతంత్ర హక్కులను కోల్పోతారు. కంపెనీల పాలన మొదలవుతుంది.
నగరాల అభివృధ్ధికి లక్షల కోట్ల రూపాయలు కావాలని, ప్రభుత్వాల వద్ద అంత డబ్బు లేదని అందుకే ప్రైవేటు వారిని ప్రోత్సహించాలని, ప్రైవేటు వారు సౌకర్యాలు ఏర్పాటు చేసి, వారిలాభాలతో సహా ప్రజలనుండి వారే వసూలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది నిజం కాదు. గత 10 ఏళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం బడా కంపెనీలకు, బహుళ జాతి కంపెనీలకు రు|| 43 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చింది. జాతీయ బ్యాంకులలో 2014 డిశంబరు నాటికి ఉన్న మొండి బకాయీలు రు|| 2,60,531 కోట్లు. ఇవన్నీ బడా బాబులు ఎగ్గొట్టినవే. వీటన్నింటిలో 10 వ వంతు వసూలు చేసినా దేశంలోని పట్టణాలన్నింటినీ స్మార్ట్ గా మార్చవచ్చు. ఇలా లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలివ్వటం, బ్యాంకుల వద్దనున్న ప్రజాధనాన్ని ప్రజల అవసరాలకు కాకుండా కార్పొరేట్ అవసరాలకు వాడటం, వారు ఎగ్గొడితే చూస్తూ ఊరుకోవటం చేస్తుంటే ప్రభుత్వం వద్ద డబ్బెలా ఉంటుంది? కార్పొరేట్ కంపెనీలకిస్తున్న లక్షలకోట్ల పన్ను రాయితీలను రద్దు చేయటం, బ్యాంకులకు బకాయిలున్న సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి ఆడబ్బును బ్యాంకులకు జమ చేయటం, జీవిత బీమా సంస్థ, బ్యాంకులలో ఉన్న ప్రజల ధనాన్ని ప్రజల సౌకర్యాల కోసం వాడటంచేస్తే ప్రభుత్వం వద్ద నగరాల అభివృధ్ధికి నిధులు సమకూరుతాయి. అప్పుడు స్మార్ట్ సిటీలు మాత్రమే కాదు గ్రామాలను కూడా స్మార్ట్ గా చేయవచ్చు. దేశమంతా సౌకర్యాలు కల్పించవచ్చు
స్మార్ట్ సిటీ గైడ్ లైన్స్‌లో ఇచ్చిన అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు జరపడం ప్రారంభించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా నిర్మించే రాజధానికి '' కాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్'' పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేస్తూ 02.05.2015 న జీ.వో. నెం.109 ఇచ్చింది. అదేరోజు ఈ కంపెనీ కి కొన్ని అధికారాలు ఇస్తూ జీ.వో. నెం.110 ఇచ్చింది. ఈ జీవోలో నగరంలో యూజర్ చార్జీలు, నగర మెయింట్‌నెన్స్ చార్జీలు వసూలు చేసే అధికారాన్ని, మార్కెట్‌లో షేర్లు అమ్మే అధికారాన్ని, అప్పులు చేసే అధికారాన్ని ఆ కంపెనీకి ఇచ్చారు. చివరకు నగరంలో అభివృధ్ధి చేయాల్సిన స్థలాలను ఇతర కంపెనీలకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చే అధికారాన్ని కూడా ఈ కంపెనీకి కట్టబెట్టారు.
నగరంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, నీటి కుళాయి కావాలన్నా. రోడ్డు కావాలన్నా, విద్యుత్ కావాలన్నా, ఏం కావాలన్నా స్మార్ట్ సిటీలో కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధార పడవలసిందే. స్మార్ట్ సిటీ గైడ్ లైన్స్‌లో ఇచ్చిన అంశాలన్నీ యధాతధంగా అమలు జరిగితే నగరం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. ఆ నగరంలో సామాన్యులకు బ్రతుకు ఉండదు. నిరంకుశత్వం నగరంమీద రాజ్య మేలుతుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కాలపరిమితి 5 ఏళ్ళు మాత్రమే. కాని అది ఏర్పాటు చేసిన కంపెనీ మాత్రం శాశ్వితంగా ఉంటుంది, కంపెనీ పాలన శాశ్వితంగా కొనసాగుతుంది. అందుకే స్మార్ట్ సిటీ కంపెనీలకు, ధనవంతులకు స్మార్ట్. అత్యధికులైన సాధారణ ప్రజలకు నష్టం. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం.
-యం.వి. ఆంజనేయులు
సెక్రెటరీ
టాక్స్ పేయర్స్ అసోసియేషన్
No comments:
Post a Comment