Friday, 8 April 2011

2011-2012 విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్‌ కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ చేసిన సూచనలు

                                                                    తేదీ : 14.02.2011
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫీసర్‌ గారికి


విషయం : 2011-2012 ఆర్ధిక సంవత్సరానికి విజయవాడ నగరపాలక సంస్థ
బడ్జెట్‌ రూప కల్పన సందర్భంగా టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న సూచనలు

ఆర్యా

    2011-2012 ఆర్ధిక సంవత్సరానికి విజయవాడ నగరపాలక సంస్థ రూపొందిస్తున్న బడ్జెట్‌పై సూచనలు తెలియజేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు.

    బడ్జెట్‌ అనేది కేవలం ఆదాయవ్యయపట్టిక మాత్రమేకాదు. అది సంస్థ అనుసరించే విధానాలనుకూడా తెలియజేస్తుంది. గత 5 సంవత్సరాల బడ్జెట్‌ను విశ్లేషించినప్పుడు మేముకొన్ని విషయాలనుగమనించాము. అవి ఈసారిబడ్జెట్‌లో సరిదిద్దబడాలన్న ఉద్దేశంతో మీముందుంచుతున్నాము.

01.మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థకు గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వటం లేదు. ఆ నిధులు వస్తే నగరపాక సంస్థ ఆర్ధిక ఇబ్బందులలో పడేదికాదు. ఆ నిధులు రాబట్టడానికి బదులుగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలపై యూజర్‌ చార్జీలపేరుతో లేదా పన్నుల పెంపులపేరుతో నగర పౌరులనుండి వసూలుచేయటం మార్గంగా ఎంచుకుంటున్నది. ఇది సరైందికాదు.

    రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్నుల నుండి స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఆ నిధులే స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు. స్థానిక సంస్థలకు ఎంత కేటాయించాలో నిర్ణయించడానికి రాజ్యాంగం
ప్రకారం ఫైనాన్స్‌ కమీషన్‌ను ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం(అంటే కేంద్ర నిధులు కాకుండా) లో 39.24 శాతం స్థానిక సంస్థలకు కేటాయించాలని మొదటి ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుచేసింది. అలా కేటాయించిన మొత్తంలో 30 శాతం పట్టణాలకు, 70 శాతం గ్రామాలకు పంపిణీ చేయాలి. ఈ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. కాని స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులు మాత్రం ఇవ్వటంలేదు. 
      రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం 2005-2006 నుండి ఇప్పటివరకు మన నగరానికి రు.1200 కోట్లు రావలసియున్నది.కాని వచ్చింది రు.7 కోట్లు మాత్రమే. దీనితో నగరపాలక సంస్థ ఆదాయం కోల్పోతున్నది. నగరపాలక సంస్ధ బడ్జెట్‌లలో 2007-2008 వరకు కాపిటల్‌ ఆదాయాలలో కనీసం  రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ ప్రస్థావన కనుపించేది. ఆతర్వాత బడ్జెట్‌లలో అసలు ఆవిషయాన్ని ప్రస్థావించడమే మానేశారు. ఇది సరైందికాదు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సులప్రకారం నగరానికి రావలసిన నిధులను బడ్జెట్‌లో చూపించాలి. రాకపోతే దానికోసం follow-up చేయాలి. ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్‌కు రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులలో స్ధానికావసరాల వాటా తప్ప రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడే గ్రాంటులు కాదు. అందువలన ఈ సారి బడ్జెట్‌లోనైనా రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ నిధులను చేర్చవలసిందిగా కోరుతున్నాము.     అదేవిధంగా ఆనిధులు రాబట్టడం కోసం follow-up చేయవలసిందిగా కోరుతున్నాము.


02. నగరంలో వసూలైన వృత్తిన్నులో 95%, మోటారు వెహికిల్‌ టాక్స్‌లో 10 శాతం నగరానికి రావాలి. కాని అవి రావటం లేదు. విజయవాడ నగరంలో ఉన్న కమర్షియల్‌ టాక్స్‌ కార్యాలయాలం మరియు ఉపరవాణా కమీషనర్‌ కార్యాలయాలనుండి వసూలైన వృత్తిపన్ను మరియు మోటార్‌ వెహికల్‌ టాక్స్‌ వివరాలు తీసుకొని వాటి ఆధారంగా బడ్జెట్‌లో పొందుపరచవలసినదిగా కోరుతున్నాము.


03.నగరంలో సంవత్సరాలతరబడి ఆస్ధిపన్ను బకాయిలు ఉన్నవారున్నారు. మొదటి వందమంది బకాయిదారుల బకాయీల మొత్తమే రు.17,96,47,529 లుగా ఉన్నది. బకాయిదారులందరి మొత్తం రెట్టింపు ఉండి ఉంటుంది. కనుక ఆమొత్తాన్ని బడ్జెట్‌లో చూపి వాటిని  ఖచ్చితంగా వసూలు చేస్తే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది.


04. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం షరతుల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విలువలను తగ్గించింది. ఫలితంగా నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయం తగ్గిపోతున్నది. ఈతగ్గుదలను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.  కనుక ఆమొత్తాన్ని బడ్జెట్‌లో చూపి రాష్ట్ర ప్రభుత్వాన్ని follow-up   చేయాలి.


05.నగరంలో ప్రైవేటు టెలికం సర్వీసుల వారు నగరంలో ఫోన్‌ లైన్లు వేశారు. అది వ్యాపారం. కనుక వారినుండి నేల అద్దెలను వసూలు చేస్తే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా వారు కేబుల్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ను ఇస్తున్నారు.వాటిమీద పన్ను విధిస్తే ఆదాయం వస్తుంది. ఇది కూడా బడ్జెట్‌లో చేర్చవలసిందిగా కోరుతున్నాము.


06.నగరంలో భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ వారు గ్యాస్‌ సరఫరా కోసం పైపులైన్లు వేస్తున్నారు. అది ప్రైవేటు సంస్థ. దానినుండి  అద్దె వసూలు చేయాలి.

07. నగరపాలక సంస్థలో జరుగుతున్న దుబారాని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

08. పనులన్నీ ఒకేసారి జరపాలనేదానికన్నా ప్రాధాన్యతను ఎంచుకొని పనులు చేయటం ద్వారా నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నిపనులు నిర్వహించవచ్చు. ఉదా|| నగరంలో పడమట, సింగ్‌ నగర్‌ ప్రాంతాలు అభివృధ్ధి చెంది దశాబ్దాలైంది. అభివృధ్ధి చెందుతున్న క్రమంలోనే  అక్కడ యు.జి.డి. ఏర్పాటుచేస్తే ఏటా కొంత జరిగి పోయేది.ఏనాడో అక్కడ యు.జి.డి. ఏర్పాటు జరిగి ఉండేది. నగరపాక సంస్థ ఆర్ధిక పరిస్థితిపై వత్తిడి ఉండేదికాదు. అభివృధ్ధి చెందుతున్న క్రమంలో వదలివేసి, ఇప్పుడు జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం క్రింద నగరం మొత్తం ఒకేసారి యు.జి.డి.పనులు, బి.ఆర్‌.టి.యస్‌.పనులు ప్రారంభించటంతో అవి పూర్తిగాని పరిస్థితి నెలకొనిఉంది. కనుక ప్రాధాన్యతను ఎంచుకొని పనులు నిర్వహించటం, ప్రణాళికాబధ్ధంగా పనులు నిర్వహించటం, వివిధ డిపార్టుమెంట్ల మధ్య సమన్వయంతో పనులు నిర్వహించటం చేయటం మూలంగా డబ్బు ఆదా అవుతుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

09. రాష్ట్ర ప్రభుత్వంనుండి రావలసిన నిధులను రాబట్టడం, దుబారా అరికట్టడం, ప్రస్తుతమున్న పన్నులను సక్రమంగా వసూలు చేయటం, ప్రాధాన్యతను ఎంచుకొని పనులు నిర్వహించటం ద్వారా అదాయాలను సమకూర్చుకోవాలేతప్ప మరల నూతన పన్నులను విధించరాదు.

10. నగరపాలక సంస్థ రాష్ట్రప్రభుత్వ యంత్రాంగంలో భాగమేతప్ప Separate entity  కాదు. కనుక నగరపాలక సంస్థ ఉద్యోగుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.

11. చెత్త తొలగింపుకు యూజర్‌ చార్జీల వసూళ్ళను నిలిపి వేయాలి. మరేవిధమైన పనులకు యూజర్‌ చార్జీలను విధించరాదు.

12. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం షరతుల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ విలువలను తగ్గించి, తన ఆదాయాన్ని కోల్పోకుండా భూముల విలువలను తరచు పెంచుతున్నది.దీనితో ఖాళీ స్థలాల పన్ను (VLT) కూడా పెరుగుతున్నది.  కనుక ఙఉఊ ని తగ్గించాలి. 300 చ||గ|| లలోపు స్థలాలకు ఙఉఊ మినహాయించాలి.

13. స్థిరాస్థులకు సంబంధించి మున్సిపల్‌ రికార్డులలో పేరు మార్పు ( Title Change) కొరకు ఆస్ధి విలువ ప్రతి లక్ష రూపాయలకు రు. 250 ల చొప్పున వసూలు చేస్తున్నారు. పుస్తకాలలో పేరుమార్పు కోసం అంత మొత్తం వసూలు చేయటం సరైందికాదు. రిజిస్ట్రేషన్‌ చార్జీలలోనే నగరపాలక సంస్థవాటాను కొనుగోలు దారులనుండి వసూలు చేస్తున్నారు. మరల పేరు పేరు మార్పు (Title Change) కోసం చార్జీలను వసూలు చేయటం సరైందికాదు. అంతేకాకుండా తండ్రి ఆస్థిని బిడ్డల పేరుమీద మార్చడానికి కూడా ఈ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం. కావున ఈ చార్జీలను రద్దు చేయవలసినదిగా కోరుతున్నాము.

14. SC సంక్షేమానికి 15 శాతం, ST  సంక్షేమానికి 7.5 శాతం, మహిళా సంక్షేమానికి 15 శాతం, నిధులు తప్పనిసరిగా బడ్జెట్‌లో కేటాయించాలి.


15. నగరపాలక సంస్థకు చెందిన కళ్యాణ మంటపాలు, కమ్యూనిటీ హాళ్ళు, నగరపాలక సంస్థ మాత్రమే నిర్వహించాలి. కళ్యాణ మంటపాల అద్దెలను సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా తగ్గించాలి.

16. నగరంలో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు పిల్లలకు ఆల స్థలాలుగా, సభలు సమావేశాలు జరుపుకోవటానికి వీలుగా అభివృధ్ది పరచాలి. వాటికి ఈ బడ్జెట్‌లో తగిన ప్రొవిజన్‌ కల్పించాలి.


17. బడ్జెట్‌లో ఉన్న పనులకు ప్రాధాన్యతనిచ్చి నగరంలో పనులు నిర్వహించాలి.

18. విజయవాడ నగరంలో కనకదుర్గ దేవాలయం సుప్రసిధ్దమైనది. దాదాపు సంవత్సరం పొడవునా దేశంలోని   నలుమూలలనుండి భక్తులు వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో అధికంగా వస్తుంటారు. వారందరూ నగరపాలక సంస్థకు చెందిన సౌకర్యాలను వాడుకుంటుంటారు. కనుక కనకదుర్గ దేవాలయం కూడా విజయవాడ నగరాభివృధ్ధిలో భాగాన్ని పంచుకోవలసియున్నది. కనుక దుర్గగుడి ఆదాయాన్నుండి కొంతభాగాన్ని విజయవాడ నగరపాలక సంస్థకు వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలి.

19.జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇవ్వటం మానివేస్తున్నది. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం క్రింద ఇచ్చే నిధులు అంగీకరించిన కొన్ని పధకాలకే ఇస్తారు తప్ప కార్పొరేషన్‌ మొత్తం నిర్వహణకు ఇచ్చే నిధులు కావు. అందువలన జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం క్రింద వచ్చే నిధులను, నగరపాలక సంస్థకు ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం రావలసిన నిధులలో భాగంగా చూడకూడదు. వేరుగా చూడాల్సిందే. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం కు కార్పొరేషన్‌ చెల్లించవలసిన 20 శాతం నిధులు మరియు కార్పొరేషన్‌ నిర్వహణావ్యయంకు అయ్యే ఖర్చుల మొత్తాన్ని, కార్పొరేషన్‌ భరించవలసిందే. అంతేకాకుండా అమోదించిన ప్రాజెక్టులు అయిపోగానే జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం ముగిసిపోతుంది. కాని కార్పొరేషన్‌ నిర్వహణ ఆగదు. కనుక  జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను తప్పనిసరిగా రాబట్టవలసిందిగా కోరుతున్నాము.

ముగింపు

    నగరపాలక సంస్థ బడ్జెట్‌లో పొందుపరచవలసిన కొన్ని సూచనలు చేశాము.  ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం నగరపాలక సంస్థకు రావలసిన నిధులు మరియు రాష్ట్రప్రభుత్వం నుండి రావలసిన ఇతర నిధులను రాబట్టడానికి తగిన ప్రాధాన్యత నివ్వవలసిందిగా కోరుతున్నాము. నగరాభివృధ్ధికి నిధులు కీలకం. కావున నగరాభివృధ్ధిని దృష్టిలో ఉంచుకొని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ చేస్తున్న ఈ సూచనలను బడ్జెట్‌ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము.

                    అభివందనాలతో

                             

      వి. సాంబిరెడ్డి                                       యం.వి.ఆంజనేయులు
        అధ్యక్షులు                                                 కార్యదర్శి       



No comments:

Post a Comment