తేదీ:05.04.2011
ఆర్యా!
విషయం:- ఆంధ్ర ప్రదేశ్ ఆస్థి పన్ను బోర్డు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ......
జీ.వో.యం.యస్ నెంబర్ 107 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ఆస్థిపన్ను బోర్డును ఏర్పాటు చేసిన విషయం మీదృష్టికి వచ్చే ఉంటుంది. రాష్ట్రంలో ఆస్థిపన్ను పెంపుదలకు టైంటేబుల్ నిర్ణయిస్తూ జీ.వో.యం.యస్ నెంబర్ 117 ను విడుదల చేశారు. దీనిపై టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 03.04.2011 న విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మున్సిపల్ పట్టణాలలో అస్థిపన్నును నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బోర్డు ఏర్పాటును తక్షణమే నిలిపి వేయాలని,జీ.వో 107ను రద్దు చేయాలనీ ఈ సమావేశం డిమాండు చేసింది. ఈ డిమాండుకు గల కారణాలను తమ పరిశీలనార్థం మీముందుంచుతున్నాము.
1996 ఆగస్టులో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన విధాన పత్రంలో మున్సిపాలిటీలకు రాష్ట్ర బడ్జెట్‌లనుండి ఇస్తున్న నిధులను నిలిపివేయాలని, పటణాభివృధ్ధి పథకాలన్నింటినీ వ్యాపారాత్మకంగా మార్చాలని పేర్కొంది. దీనిని అమలు చేయటంలో భాగంగా ముందుగా స్థానిక సంస్థలకు నిధులను ఇవ్వటం బాగా తగ్గించివేశారు. స్థానిక సంస్థలు నిధులు లేక సౌకర్యాలు కల్పించలేక , నిర్వహణ భారంగా మారుతున్న తరుణంలో జె.యన్.యన్.యు.ఆర్.యం. పథకాన్ని ఎరగా వేశారు. జె.యన్.యన్.యు.ఆర్.యం. లో రెండు ప్రధాన షరతులను విధించారు.
Mandatory Reforms
1. (c) Reform of property tax with GIS. It becomes a major source of revenue for ULBs and arrangements for its effective implementation so that collection efficiency reaches at least 85 per cent within next seven years.
(d) Levy of reasonable user charges by ULBs and Parastatals with the objective that the full cost of O&M or recurring cost is collected within the next seven years. However, cities and towns in the North East and other special category States may recover only 50 per cent of O&M charges initially. These cities and towns should graduate to full O&M cost recovery in a phased manner.
పై షరతులలో ఆస్థిపన్నును మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రధానమైన ఆదాయ వనరుగా చేయాలని, కార్పొరేషన్ చేసే ప్రతిపనికీ పూర్తి స్థాయి ఖర్చును రాబట్టేవిధంగా యూజర్ చార్జీలను వసూలు చేయాలనీ జె.యన్.యన్.యు.ఆర్.యం. పథకంలో షరతులు విధించారు.
పైన సూచించిన మాండేటరీ రిఫార్మ్స్‌లో రెండవ అంశాన్ని యూజర్ చార్జీలపేరుతో అమలు జరపటం ఈపాటికే మొదలు పెట్టారు. మొదటి అంశాన్ని అమలు చేయటం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దానిలో భాగంగానే ఈబోర్డును ఏర్పాటు చేశారు. చట్టాలను సవరిస్తున్నారు. వాటినిగురించి, వాటి ప్రభావాన్నిగురించి మీముందుంచదలచాము.
01. 2007 లో ఆస్తిపన్ను సవరణ జరిగినప్పుడు, 2002 నాటి పన్నుపై 100 నుండి 300 శాతం వరకు పన్నులు పెరిగాయి. అయితే ఆనాడు ఆ పెరుగుదల నివాసగృహాలకు 75 శాతానికి, నివాసేతరగృహాలకు 150 శాతానికి మించి పెరగకుండా సీలింగ్ విధించారు. అంటే 75 శాతం మించి పెరిగిన నివాస గృహాలన్నింటికీ 75 శాతం మాత్రమేవిధించారు. ఇప్పుడు ఆస్తిపన్ను పెంపుదల మీద ఉన్న ఆ సీలింగ్‌ను ఎత్తివేస్తూ 2011మార్చి 5 వతేదీన జీ.వో 88 ని విడుదల చేశారు. దీనితో ఆస్తిపన్ను ఇష్టారాజ్యంగా పెంచటానికి మార్గం సుగమమైంది.
02.దీని తదుపరి చర్యగా 107 జీవోద్వారా ఆస్తిపన్ను నిర్ణయానికి రాష్ట్ర స్థాయి బోర్డును ఏర్పాటు చేశారు. అంటే ఆస్థిపన్ను నిర్ణయించే అధికారం ప్రజలు ఎన్నుకున్న మున్సిపల్ కౌన్సిళ్ళనుండి తప్పించారు. వెంటనే 2007 లో సీలింగ్ విధించి వసూలు చేసిన ఆస్తుల జాబితాను తయారు చేసి, సీలింగ్ లేకుండా పన్ను మొత్తాన్ని తయారు చేసి జూన్ నాటికి క్రొత్త నొటీసులు జారీ చేయమని ఆ బోర్డు మున్సిపల్ కమీషనర్లను ఆదేశిస్తూ 117 జీవో జారీ చేసింది. దీనితో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాలలో ఇళ్లపన్నులు భారీగా పెరగబోతున్నాయి.
03. ఈ చర్యల పరంపరలోనే మూడవ చర్యగా రెంట్ కంట్రోల్ చట్టాన్ని సవరించారు. ప్రాపర్టీ మొత్తంవిలువలో 6 శాతం రెంటల్ వాల్యూగా నిర్ణయించారు. నిజానికి ఈ రెంట్ కంట్రోల్ చట్ట సవరణ వలన అద్దెలకుండేవారికి ఒరిగిందేమీ లేదు. ఈ సవరణ ప్రకారం సామాన్య గృహస్తు డెవడూ అద్దెకు ఉండ లేడు. ఈ నింధనల ప్రకారమైతే ఇల్లు అద్దెకు ఇచ్చేవారుకూడా ఖాళీ చేయించలేమన్న భయంతో ఇల్లు అద్దెకు ఇవ్వరు. అందువలన అద్దెలకుండే గృహస్తులకు ఏమాత్రం ప్రయోజనంలేదు.
నిజానికి ఈ సవరణ ఆస్తి పన్ను పెంపుదలకు ఉద్దేశించినది. ఆస్తిపన్ను నిర్ణయంలో రెంటల్ విలువ కీలకం. ఇప్పటివరకు రెంటల్ విలువను మున్సిపల్ కౌన్సిళ్ళు నిర్ణయిస్తున్నవి. ఆయానగరాలు పట్టణాలగురించి అక్కడ ఉండే మున్సిపల్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలుసు గనుక ఇప్పటి వరకు అక్కడ రెంటల్ విలువలను వారు నిర్ణయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆస్తిపన్ను నిర్ణయాధికారం మున్సిపాలిటీల చేతులనుండి హైదరాబాదులో ఏర్పడిన రాష్ట్రస్థాయి బోర్డు చేతులలోకి మారినది. ఇప్పటివరకు జరిగిన పధ్ధతులలో రాష్ట్ర వ్యాపితంగా అన్ని పట్టణాలలో రెంటల్ విలువలను లెక్కించటం హైదరాబాదులో కూర్చున్న బోర్డు అధికారులకు సాధ్యపడదు. అంతే కాకుండా భారీగా (అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా మొత్తం మున్సిపాలిటీ ఖర్చునంతా ప్రజలే భరించే విధంగా) ఆస్తిపన్నును పెంచటం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. ఈ రెండు కారణాల వలన ఈ రెంట్ కంట్రోల్ చట్టంలో సవరణ చేసి ప్రాపర్టీ మొత్తం విలువలో 6 శాతం రెంటల్ వాల్యూగా నిర్ణయించారు. రెంటల్ విలువలో 22 శాతంగా (విజయవాడలో 22 శాతం. ఇది కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 20% గా ఉంది) ఆస్తి పన్నును లెక్కిస్తారు. ఇది జరిగితే ఆస్తిపన్ను ఎంత భారీగా పెరుగుతుందో విజయవాడలోని కొన్ని ఉదాహరణల ద్వారా మీదృష్టికి తేదలుచుకున్నాము.
ఉదా|| 01 విజయవాడ సూర్యారావు పేటలోని ఒక గృహం.
స్థలం విస్తీర్ణం 200 చ.గ.
అందులో ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ 1077 చ. అ., మొదటి అంతస్తు 1077 చ. అ..
రిజిష్ట్రేషన్ శాఖ రికార్టు ప్రకారం స్థలం విలువ= రు.33,00,000 (చదరపుగజం రు. 16,500/- విలువ)
కట్టడంవిలువ= రు. 11,05,002
మొత్తం ఆస్తి విలువ = రు. 44,05,002
ప్రస్తుతం రెంట్ కంట్రోల్ చట్టంలో జరిపిన చట్టప్రకారం రెంటల్ విలువ= రు.44,05,002x6%=రు.2,64,300/-
విజయవాడలో ఆస్థిపన్ను రెంటల్ విలువలో 22 శాతంగా ఉంది.
దీని ప్రకారం ఆస్తిపన్ను రు.2,64,300/-x 22%= రు. 58,146/-( సంవత్సరానికి)
ప్రస్తుతం ఆగృహానికి చెల్లిస్తున్న ఆస్తిపన్ను =రు.4,962/- (సంవత్సరానికి)
అంటే సంవత్సరానికి రు.4,962/- లు చెల్లించే ఆగృహయజమాని రెంట్ కంట్రోల్ చట్టం ప్రకారం లెక్కిస్తే సంవత్సరానికి రు.58,146/- లు చెల్లించవలసి వస్తుంది.
ఉదా. 02 విజయవాడ ఒన్ టౌన్‌లోని ఒక గృహం.
స్థలం విస్తీర్ణం 41చ.గ.
అందులో ఒకే ఫ్లోర్ 367 చ. అ.
రిజిష్ట్రేషన్ శాఖ రికార్టు ప్రకారం స్థలం విలువ= రు. 2,46,000 (చదరపుగజం రు. 6000/- విలువ)
కట్టడంవిలువ= రు. 1,98,180
మొత్తం ఆస్తి విలువ = రు. 4,44,180
ప్రస్తుతం రెంట్ కంట్రోల్ చట్టంలో జరిపిన చట్టప్రకారం రెంటల్ విలువ= రు.4,44,180x6%=రు.26,651/-
విజయవాడలో ఆస్థిపన్ను రెంటల్ విలువలో 22 శాతంగా ఉంది.
దీని ప్రకారం ఆస్తిపన్ను రు.26,251/-x 22%= రు. 5,863/-( సంవత్సరానికి)
ప్రస్తుతం ఆగృహానికి చెల్లిస్తున్న ఆస్తిపన్ను =రు.522/- (సంవత్సరానికి)
అంటే సంవత్సరానికి రు.522/- లు చెల్లించే ఆగృహయజమాని రెంట్ కంట్రోల్ చట్టం ప్రకారం లెక్కిస్తే సంవత్సరానికి రు.5,863- లు చెల్లించవలసి వస్తుంది.
ఇది కేవలం విజయవాడ నగరంలోనేకాదు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాలలో ఇదే పరిస్థితి ఏర్పడ బోతున్నది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీదృష్టికి తేదలుచుకున్నాము. ఆస్తిపన్నును కార్పొరేషన్‌లకు ప్రధానమైన ఆదాయ వనరుగా చేయాలని జె.యన్.యన్.యు.ఆర్.యం. పథకంలో షరతులు విధించారు. ఇది తప్పు. ఏస్థానిక సంస్థకు కూడా ఆస్తిపన్ను ప్రధానమైన ఆదాయవనరు కాదు. పట్టణాలలో ఎక్కువ ఇళ్ళు ఉంటాయి కనుక ఎక్కువ ఆస్తిపన్ను వసూలౌతుంది. కాని గ్రామ పంచాయతీలలో తక్కువ ఇళ్ళు ఉంటాయి. ఉదాహరణకు మనకు 200 ఇళ్ళతో ఉన్నగ్రామ పంచాయితీలు కూడా ఉన్నాయి. వారికి కూడా రోడ్లు, మంచినీరు, మురుగునీటి పారుదల తదితర సౌకర్యాలు కావాలి. స్థానిక సంస్థకు ఆస్తిపన్ను ప్రధానమైన ఆదాయవనరు గనుక అయినట్లయితే ఆ గ్రామస్తులు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికి కొన్ని వందల రెట్లు ఆస్తిపన్ను చెల్లించాలి. సైధ్ధాంతికంగానే కాకుండా ఇది ఆచరణాత్మకంగాకూడా ఇది తప్పుడు వాదన.
స్థానిక సంస్థకు ప్రధానమైన ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్‌గా స్పష్టం చేస్తున్నాము.రాష్ట్ర అభివృధ్ధి కోసమే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. స్థానిక అభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి లేదు. స్థానిక అభివృద్ధి అంటే ప్రజల నివాస ప్రాంతాలలో జరిగే అభివృధ్ధి. ప్రజలు చెల్లించే పన్నులలో నివాసప్రాంతాల అభివృధ్ధికి కూడా వాటాకూడా కలిసి ఉన్నది. ఉదాహరణకు రాష్ట్రంలో విద్య, వైద్యఅభివృధ్ధిలో నివాసప్రాంతాల విద్య వైద్య అభివృధ్ధి ఇమిడి ఉన్నట్లుగానే, రాష్ట్ర మౌలిక సౌకర్యాల అభివృద్ధిలోనే నివాసప్రాంతాలలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది. అందువలన రాష్ట్ర కేటాయింపులలో స్థానికాభివృద్దికి కేటాయింపులు కూడా కలిసి ఉండాలి. అయితే ఆకేటాయింపులు ఇష్టారాజ్యంగా కాకుండా, ఒక క్రమమైన పద్ధతిలో ఎంత ఉండాలన్నవిషయాన్ని రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ నిర్ణయించింది. రాష్ట్ర సొంత ఆదాయంలో స్థానిక సంస్థలకు 39.24%కేటాయించాలని, అలా కేటాయించిన మొత్తంలో 70% గ్రామాలకు, 30% పట్టణాలకు కేటాయించాలని మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సు చేసింది.కాని రాష్ట్ర ప్రభుత్వకేటాయింపులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
సం|| రాష్ట్ర సొంత మొదటిఫైనాన్స్‌కమీషన్ స్థానిక సంస్థలకు ఫైనాన్స్‌కమీషన్ అందులో జనాభా విజయవాడ
ఆదాయం సిఫార్సులప్రకారంస్థానిక వాస్తవంగా ప్రకారంఇస్తే ప్రాతిపదికన కార్పొరేషన్‌కు
సంస్థలకుఇవ్వవలసిది కేటాయించినది పట్టణాలకు విజయవాడ వాస్తవంగా
(39.24%) (గ్రామాలకు,పట్టణాలకు ఇవ్వవలసినది కార్పొరేషన్‌కు విడుదల
కలిపి కేటాయించినది) (3వకాలంలో 30%) రావలసినది చేసిన మొత్తం
(కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో)
ఆదాయం సిఫార్సులప్రకారంస్థానిక వాస్తవంగా ప్రకారంఇస్తే ప్రాతిపదికన కార్పొరేషన్‌కు
సంస్థలకుఇవ్వవలసిది కేటాయించినది పట్టణాలకు విజయవాడ వాస్తవంగా
(39.24%) (గ్రామాలకు,పట్టణాలకు ఇవ్వవలసినది కార్పొరేషన్‌కు విడుదల
కలిపి కేటాయించినది) (3వకాలంలో 30%) రావలసినది చేసిన మొత్తం
(కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో) (కోట్ల రు.లలో)
2005-2006 23898.77 9377.88 3355.94 (14.04%) 2813.36 115.07 లేదు
2006-2007 30414.05 11934.47 4545.82 (14.95%) 3580.34 146.43 లేదు
2007-2008 35858.18 14070.75 5881.53 (16.40%) 4221.23 172.65 7.24
2008-2009 43041.69 16889.56 9856.64 (22.90%) 5066.87 207.23 లేదు
2009-2010 42978.94 16864.94 9057.41 (21.07%) 5059.48 206.93 లేదు
2010-2011 58530.24(RE) 22967.27 11490.90 (19.63%) 6890.18 281.80 లేదు
( బ్రాకెట్లలో ఇచ్చిన అంకెలు రాష్ట్ర ఆదాయంలో వాస్తవ కేటాయింపుల శాతం) 1130.11
4వ కాలంలోని అంకెలు పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు 39.24% నిధులను కేటాయించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అలా కేటాయించి ఉంటే ఏషరతులు లేని నిధులు2005-2006 నుండి ఇప్పటివరకు విజయవాడ నగరానికి రు.1130 కోట్లు వచ్చి ఉండేవి ( ఏఏ సం||కి ఎంతెంత వచ్చి ఉండేవో 6 వ కాలంలో ఇచ్చాము). కాని వచ్చింది రు.7 కోట్లు మాత్రమే. రు.1130 కోట్లకు బదులు 7 కోట్లు ఇచ్చారు. అదికూడా నాన్ ప్లాన్ గ్రాంటులో భాగంగానే. అంతేకాకుండా నగరాలలో పట్టణాలలో వసూలైన వృత్తిపన్ను, మోటారు వెహికిల్ టాక్స్ కాంపెన్సేషన్ ఇవ్వటం లేదు. ఉదాహరణకు 2005-2006 నుండి 2009-2010 వరకు విజయవాడ నగరంలో వసూలైన వృత్తిపన్ను 50.27 కోట్లు. దీనిలో 95% అంటే 47.75 కోట్లు కార్పొరేషన్‌కు ఇవ్వాలి. ఈ కాలంలోనే విజయవాడ నగరంలో వసూలైన మోటారు వెహికిల్ టాక్స్ 609.54 కోట్లు. ఇందులో 10 శాతం అంటే 60.95 కోట్లు నగరానికి ఇవ్వాలి. అదీ ఇవ్వలేదు. ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎండగడుతున్నది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల పరిస్థితి ఇంచుమించు ఇదే.
ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా, అనేక ప్రజావ్యతిరేక షరతులతో కూడిన జె.యన్.యన్.యు.ఆర్.యం పథకాన్ని నగరాల నెత్తిన రుద్దారు. నిధులు ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయని, నగరం సుందరంగా తయారవు తుందని ప్రచారం చేశారు.ఉదాహరణకు విజయవాడ నగరాన్ని తీసుకుంటే, జె.యన్.యన్.యు.ఆర్.యం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇచ్చినవి రు. 470.49 కోట్లు మాత్రమే. అందులో కేంద్రం ఇచ్చినది రు.348.35 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినది రు. 122.14 కోట్లు. వీటిలో కూడా కొంత అప్పుగానే ఇచ్చారు. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం ఇస్తే ఒక్క రాష్ట్ర ప్రభుత్వంనుండి ఏ షరతులు లేకుండా రు.130 కోట్లు విజయవాడకు వచ్చిఉండేవి. అనేక షరతులుపెట్టి కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి విజయవాడకు ఇచ్చింది రు. 470 కోట్లు మాత్రమే.
జె.యన్.యన్.యు.ఆర్.యం పథకం క్రింద ఇచ్చే నిధులు అంగీకరించిన కొన్ని పధకాలకే ఇస్తారు తప్ప కార్పొరేషన్ మొత్తం నిర్వహణకు ఇచ్చే నిధులు కావు. అందువలన జె.యన్.యన్.యు.ఆర్.యం క్రింద వచ్చే నిధులను, నగరపాలక సంస్థకు ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం రావలసిన నిధులలో భాగంగా చూడకూడదు. వేరుగా చూడాల్సిందే. జె.యన్.యన్.యు.ఆర్.యం కు కార్పొరేషన్ చెల్లించవలసిన 20 శాతం నిధులు మరియు కార్పొరేషన్ నిర్వహణావ్యయంకు అయ్యే ఖర్చుల మొత్తాన్ని, ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం వచ్చే నిధులు మరియు కార్పొరేషన్ వసూలు చేసే పన్నుల మొత్తాన్నుండి భరించవలసిందే. అంతేకాకుండా అమోదించిన ప్రాజెక్టులు అయిపోగానే జె.యన్.యన్.యు.ఆర్.యం ముగిసిపోతుంది. కాని కార్పొరేషన్ నిర్వహణ ఆగదు. కనుక జె.యన్.యన్.యు.ఆర్.యం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారంనిధులు ఇవ్వవలసిందే.
వీటన్నింటిని పరిశీలించిన అనంతరం స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేనిధులు రాష్ట్ర ప్రభుత్వ దయాబిక్ష కాదని, అవి రాష్ట్ర ప్రజలు రాష్ట్రాభివృద్ధికి చెల్లిస్తున్న పన్నులలో స్థానికాభివృధ్ధికి ఇచ్చే వాటా అని, స్థానికాభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృద్ధి లేదనీ, రాష్ట్ర పన్నులలో స్థానిక సంస్థలకు వాటా పొందటం రాష్ట్ర ప్రజల హ్కని 03.04.2011 న విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం స్పష్టం చేసింది.
మరోవిషయమేమంటే 13 వ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రాన్నుండి రావలసిన రు.664.23 కోట్లు రాష్ట్రానికి రావటం కోసం జీ.వో 88ని. జీ.వో.107లను ఇస్తున్నామని ఆ జీ.వోలలోనే పేర్కొన్నారు. ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రు.664.23 కోట్లు తీసుకురావటం కోసం రాష్ట్రంలోని పట్టణ ప్రజలమీద రు.1000 కోట్లకు పైగా భారాన్ని మోపతలపెట్టారు. రు.664 కోట్లు కోసం ప్రజలపై రు.1000కోట్ల భారం మోపవలసిన అవసరం లేదు.13వ ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రాన్నుండి నిధులు తెచ్చుకోవటంకోసం ఏపని చేయటానికైనా వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం, మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు ఇవ్వలసిన నిధులను మాత్రం ఇవ్వటం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థిపన్ను బోర్డు ఏర్పాటును తక్షణమే నిలిపివేసి స్థానిక సంస్థల హక్కులను, ప్రజాస్వామ్యవ్యవస్థను కాపాడాలని, మొదటి ఫైనాన్స్ కమీషన్ సిఫార్సుల ప్రకారం మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఇవ్వవలసిన నిధులను తక్షణమే ఇవ్వాలని, ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇక రాష్ట్ర స్థాయి ఆస్తి పన్ను బోర్డు వలన నగరాలలో పట్టణాలలో ఆస్థిపన్నును నిర్ణయించే అధికారాన్ని మున్సిపల్ కౌన్సిళ్ళు కోల్పోతాయి. పట్టణాలలో, నగరాలలో ఎంత ఆస్థి పన్ను వసూలు చేయాలో రాష్ట్ర స్థాయి బోర్డు నిర్ణయిస్తుంది. ఆస్థిపన్ను కేవలం స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం. స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన అంశాలను రాష్ట్రస్థాయి బోర్డుకు అప్పగించడమంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమే అవుతుంది. ఇలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం అసెంబ్లీలో చర్చకుకూడా పెట్టలేదు. నేరుగా జీ.వో 107 ను విడుదల చేశారు. గత కొంతకాలంగా మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం 1955 లో ఉన్న 679-ఎ క్లాజును దుర్వినియోగం చేస్తూ జీ.వోలద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల మీద పెత్తనం సాగిస్తున్నది. ఇప్పుడు నేరుగా స్థానిక సంస్థలను ప్రక్కనబెట్టేవిధంగా ఈ ఆస్థిపన్ను బోర్డును ఏర్పాటు చేస్తున్నది. స్థానిక సంస్థలు నిర్వహించవలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి బోర్డులు నిర్ణయిస్తే, ఇక స్థానిక స్వపరిపాలకు అర్ధం లేకుండా పోతుంది. స్థానిక సంస్థలు నిర్ణయాధికారాలను కోల్పోయి, కేవలం బట్వాడా కార్యాలయాలుగా మారతాయి. ఇది రాజ్యాంగం 73,74 వ రాజ్యాంగ సవరణల స్పూర్తికి విరుధ్ధం.ప్రజాస్వామ్యవ్వవస్థకు విఘాతం. ఇది కేంద్రీకృత వ్యవస్థకు దారితీస్తున్నది.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్ ఆస్తి పన్ను బోర్డును రద్దు చేయాలని డిమాండు చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము. సమస్య చాలా తీవ్రమైనదైనందువలన, విషయాన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకురావాలని, ఆస్తి పన్ను బోర్డును రద్దు విషయంలో రాజకీయ పార్టీల జోక్యం కోరాలనీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. దానిలో భాగంగా మీకు ఈ లేఖను వ్రాస్తున్నాము. సి.పిఐ(యం), సిపిఐ, తెలుగుదేశం,లోక్ సత్తా పార్టీలకు కూడా లేఖలను వ్రాశాము. మీరు ఈ విషయాన్ని పరిశీలిస్తారని, ఆస్తి పన్ను బోర్డును రద్దుకు తగిన ప్రయత్నాలను చేస్తారని ఆశిస్తున్నాము.
అభివందనాలతో
వి. సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment