Wednesday, 17 November 2010

Press Note on GO No 450

ప్రచురణార్ధం                                                                   తేదీ:17.11.2010
                                         జీ.వో నెం. 450

కట్టడపు ఏరియాలో 10వ వంతు మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలంటూ జారీ చేసిన జీ.వో నెం. 450ని తక్షణమే రద్దు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.ఈ మేరకు మున్సిపల్‌ కమీషనర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ లేఖలు వ్రాశింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్రాసిన లేఖ కాపీలను స్థానిక శాసన సభ్యులకు కూడా అందజేసి జీ.వోను రద్దు చేయించడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరింది.ఆలేఖ కాపీలను ఈ రోజు పత్రికలకు విడుదల చేశారు.ఈ జీ.వో ప్రకారం 100చ.మీ.(అంటే సుమారుగా 120 చ.గ.) పైన ఉన్న స్థలాలలో ఇళ్ళు కట్టుకునేవారు నిర్మాణ స్థలంలో 10 శాతాన్ని తప్పని సరిగా
మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలి.ఇది నివాసగృహాలను నిర్మించుకునే పేద మధ్యతరతగతి వర్గాలకు ఇబ్బందిగా మారిందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది.అక్రమ నిర్మాణాలను అరికట్టడం కోసం ఈ జీ.వోను రూపొందించినట్లుగా ఈ జీ.వోలో పేర్కొనడాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ తప్పుపట్టింది.అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు నిర్మాణ దశలోనే ఆపవలసిన బాధ్యత మున్సిపల్‌ అధికారులదని,మున్సిపల్‌ సిబ్బంది తమ బాధ్యతను విస్మరించి సంవత్సరాలతరబడి నిర్మించే భారీ కట్టడాలను సైతం బిల్డర్లు ప్లానుకు విరుధ్ధంగా నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారని, బిల్డర్లు అమ్ముకొని సొమ్ము చేసుకొని వెళ్ళిన తరువాత వాటిని అక్రమ నిర్మాణాలంటూ కొనుక్కున్నవారిని వేధించడం, భారీగా పెనాలిటీలు విధించటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆలేఖలో పేర్కొంది. నిర్మాణ దశలో ఆపకుండా పెనాలిటీలు విధిస్తేనో, లేక తాకట్టు పెట్టించుకుంటేనో సమస్య పరిష్కారం కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆలేఖలో తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాల సమస్య పరిష్కారానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రెండు మార్గాలను సూచించింది. వ్యక్తిగతంగా చిన్న చిన్న ప్లాట్లలో నివాసగృహాలను నిర్మించుకునేవారికీ,లాభార్జనే ధ్యేయంగా కేవలం అమ్మకం కోసం నిర్మాణాలు (అపార్టుమెంట్లు) చేపట్టేవారికీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేవారికీ మధ్య బిల్డింగ్‌ రూల్స్‌లో వ్యత్యాసం చూపెడితే ఈ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది.దీని కోసం కనీసం 300 చ.మీలలోపు స్థలాలలో నివాసంకోసం ఇళ్ళు నిర్మించుకునేవారికి బిల్డింగ్‌ రూల్స్‌లో వెసులుబాటు కల్పించటం, కనీసం జీ+2 వరకూ సెట్‌ బ్యాక్‌ల విషయంలోను, ఎత్తు విషయంలోనూ, బిల్డింగ్‌ ప్లాన్‌కు ఫీజులు తదితర విషయాలలో వెసులు బాటు కల్పించటం లాంటి చర్యలు చేపడితే నివాసగృహాల అక్రమ నిర్మాణ సమస్య తగ్గుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సూచించింది.అదేవిధంగా కమర్షియల్‌ కాంప్లెక్సులు,అపార్టుమెంట్లపై నిర్మాణ ప్రారంభ దశనుండి నిఘావేశి,ప్లాను ప్రకారం లేదని ఏదశలో గమనిస్తే ఆదశలోనే మున్సిపల్‌ అధికారులు అడ్డుకుంటే అక్రమ నిర్మాణాల సమస్య పరిష్కారమవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.సొంతంగా నివాసగృహాలను నిర్మించుకునే పేద,మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారిన జీ.వో నెం.450ని తక్షణమే రద్దు చేయాలని, 300 చ.మీ.వరకు స్థలంలో నిర్మించుకునే నివాసగృహాలు జీ+2 వరకూ సెట్‌ బ్యాక్‌ల విషయంలోను, ఎత్తు విషయంలోనూ, బిల్డింగ్‌ ప్లాన్‌కు ఫీజులు తదితర విషయాలలో వెసులు బాటు కల్పించాలని,తనఖా పధ్ధతినే రద్దు చేయాలని, అక్రమ నిర్మాణాలను ప్రారంభదశలోనే నిలువరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.

                                   బెంజి సర్కిల్‌ వద్ద ఫ్లైఓవర్‌

ప్రజాభాప్రాయానికి అనుగుణంగా బెంజి సర్కిల్‌ వద్ద ఫ్లైఓవర్‌ ను జాతీయరహదారిపై మాత్రమే నిర్మించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండు చేస్తున్నది.ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఫ్లైఓవర్‌ ను బందరురోడ్డుపై నిర్మించడం కోసం శంఖుస్థాపన జరుపుతారని ప్రచారం జరిగింది. కాని జరగలేదు. బందరురోడ్డుపై నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నదని తెలుస్తున్నది. ఇది ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉన్నది.గత ఫిబ్రవరి 19వతేదీన టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఫ్లైఓవర్‌ జాతీయ రహదారిపైన నిర్మిస్తేనే సౌకర్యంగా ఉంటుందని నగర ప్రముఖులందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.ఫ్లైఓవర్‌ జాతీయ రహదారిపైన నిర్మిస్తేనే నగర ప్రజలకు ఏవిధంగా సౌకర్యంగా ఉంటుందో విశదీకరిస్తూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను వ్రాశిందిఅయినప్పటికీ బందరురోడ్డుపై నిర్మించడానికే రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవటం ప్రజావ్యతిరేక చర్య అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది.ఈ ప్రజావ్యతిరేకచర్యకు వ్యతిరేకించాలని నగరప్రజలకు, రాజకీయ పార్టీలకు, వివిధ ప్రజాసంఘాలకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేస్తున్నది.

 వి. సాంబిరెడ్డి                                                    యం.వి.ఆంజనేయులు
  అధ్యక్షులు                                                              కార్యదర్శి

No comments:

Post a Comment