Thursday, 2 December 2010

పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు - సంపన్నులకు సదుపాయాలు- ఇవే పట్టణ సంస్కరణలు

 కేంద్రం జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ (జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం) పథకంలో తొలుత హైదరాబాద్‌,విశాఖపట్టణం,విజయవాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.తరువాత దశలో ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తామన్నది.ఈ సంస్కరణలతో పట్టణాల రూపు రేఖలే మారిపోతాయని చెప్పింది. పౌరసదుపాయాలకు కరువే ఉండదని నమ్మబలికింది.కాని గత ఐదేళ్ళ అనుభవం చూస్తే అంతా తలకిందులైంది.నిధుల ఆశచూపి ప్రపంచ బ్యాంకు షరతులు రుద్దింది.పట్టణ ప్రజల జీవితాలను అతలాకుతలం .పట్టణాల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు,కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయని ఊదర
గొట్టారు.కేంద్రం జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ (జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం)పథకంలో తొలుత హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తరువాత దశలో ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తామన్నది.ఈ సంస్కరణలతో పట్టణాల రూపు రేఖలే మారిపోతాయని చెప్పింది.పౌరసదుపాయాలకు కరువే ఉండదని నమ్మబలికింది.కాని గత ఐదేళ్ళ అనుభవం చూస్తే అంతా తలకిందులైంది.నిధుల ఆశచూపి ప్రపంచ బ్యాంకు షరతులు రుద్దింది.పట్టణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది.ఉదాహరణకు విజయవాడ నగరాన్నే తీసుకుంటే 2005 - 06 లో దీనిని జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకంలో చేర్చారు. నిధుల 'వరద' వస్తుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వాన్ని రు 7,300 కోట్లు కోరగా రు.1422 కోట్లు మాత్రమే మంజూరు చేశామంది. అందులోనూ 70 శాతం మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. వారు ఇచ్చే నిధులలో 20 నుండి 40శాతం వరకు అప్పుగా ఇస్తారు. తిరిగి వడ్డీతో సహా చెల్లించాలి. కానీ ఇప్పటివరకు వచ్చింది కేవలం రు. 470 కోట్లు మాత్రమే. ఇందులో గృహనిర్మాణానికి రు. 205 కోట్లు పోగా పౌరసదుపాయాల కల్పనకు నికరంగా ఇచ్చింది రు. 265 కోట్లే. ఇందులో అప్పు రు. 52 కోట్లు కాగా, గ్రాంటుగా విదిల్చింది రు. 213 కోట్లు మాత్రమే. అంటే ఐదు సంవత్సరాలలో సగటున సంవత్సరానికి ఇచ్చింది రు. 43 కోట్లేనన్నమాట.

                                      స్తంభించిన అభివృద్ధి


కేంద్ర ప్రభుత్వం నుండి విజయవాడకు నిధులు వస్తున్నాయనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వవలసిన గ్రాంట్లను నిలిపేసింది.ప్రజలపై అదనపు భారాలు మోపింది.వృత్తిపన్ను,తలసరి గ్రాంట్లు, తదితరాలు గ్రాంట్లరూపంలో నగరానికి రావాల్సిన రు. 60కోట్లను గత నాలుగు సంవత్సరాల నుండి ఇవ్వడం ఆపేసింది. బడా, విదేశీ రియల్టర్ల కోసం స్టాంప్‌ డ్యూటీని 13శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని ప్రపంచబ్యాంకు,కేంద్ర ప్రభుత్వమూ షరతు పెట్టాయి. స్టాంప్‌డ్యూటి తగ్గించటం వల్ల ఈ కాలంలో కార్పొరేషన్‌ ఆదాయానికి రు.50కోట్ల మేర గండిపడింది.అన్ని మునిసిపాలిటీలలో ఉద్యోగుల వేతనాలను రాష్ట్రప్రభుత్వమే భరించాలని నిర్ణయించినా జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పేరుతో విజయవాడను మినహాయించడం వల్ల ఈభారాన్ని నగర పాలక సంస్థ మోస్తున్నది.పేదల గృహ నిర్మాణానికి ఇచ్చే నిర్మాణవ్యయం శాంక్షన్‌ అయినదానికంటే ఒక్కొక్క ఇంటికి రు. లక్షదాకా అదనంగా పెరిగింది. ఈ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉన్నప్పటికీ, భరించకుండా నగరపాలక సంస్థపైకి నెట్టివేసింది. ఫలితంగా 15వేల ఇళ్ళకు సుమారు రు.100 కోట్లు భారం పడింది. మొత్తం మీద గ్రాంట్లు తగ్గించడం, ఆదాయంలో వాటా తగ్గటం, అదనపు భారం మోపటం వలన నగర పాలక సంస్థ రు. 250 కోట్లు కోల్పోయింది. ఈ కాలంలో వచ్చిన సహాయం మాత్రం రు. 213 కోట్లు మాత్రమే.ఈ ప్రాజెక్టులో 30శాతం నిధులు(సుమారు రు. 420 కోట్లు) నగర పాలక సంస్థ భరించాలి.


జవహర్‌లాల్‌ నెహ్రు పథకంలో ఖర్చుపెట్టిన మేరకు కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయలేదు. కేంద్రం, రాష్ట్రం రు.150 కోట్లు బకాయిపడ్డాయి. పైపెచ్చు యూజర్‌ చార్జీల విధింపు తదితర షరతులు సకాలంలో అమలు చేయలేదనే పేరుతో చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులను కేంద్రం నిలిపి వేసింది.దీనితో ప్రస్తుతం వేతనాలకు కూడా డబ్బులేదు. కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయాయి. మంచినీటి సరఫరా, భూగర్భడ్రైనేజీ, రోడ్లు తదితర అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

                                    సంస్కరణలకు బలైన పేదలు


పట్టణ సంస్కరణలకు పేదలు బలిపశువులుగా మారారు. వారిపై భారాలు పెరిగాయి. సౌకర్యాలు కుదించబడ్డాయి. మురికివాడలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీస పన్ను పేరుతో గుడిసెలపై ఇంటి పన్నును రు.50 నుంచి రు. 153కి పెంచారు.మరుగుదొడ్లను ప్రైవేటీకరించడం వల్ల మురికివాడలలోని వ్యక్తిగత మరుగుదొడ్లులేని పేదలు ప్రతి కుటుంబం నెలకు 300ల నుండి 500 వరకు దొడ్ల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనన, మరణ ధృవీకరణ పత్రాల రేట్లు రు.5నుంచి రు.50లకు పెంచేశారు.రోడ్లపై వ్యాపారాలు చేసుకొని బతికే చిరువ్యాపారులపైనా ఆసీళ్ళు (ఫీజు)విధించి పీడించారు.ఆఖరుకు మున్సిపల్‌ స్కూళ్ళలో పేదలు పెళ్ళిళ్లు,ఫంక్షన్లు జరుపుకొనే అవకాశం లేకుండా ఫీజులు రు.100నుండి రు.1000లకు పెంచారు.భూగర్భ డ్రైనేజి సదుపాయం పేరుతో భారీగా డొనేషన్లు విధించారు. దోమల నిర్మూలన చర్యలు చేపట్టడంలో కార్పొరేషన్‌ చేతులెత్తేశారు. పేదలు ప్రతి ఇంటిలో రోజుకు కనీసం రు. 5 దోమల నివారణకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద సంస్కరణలు పేదల జీవితాలను అతలా కుతలం చేస్తున్నాయి.

                                   లాభపడుతున్న ధనికులు


సంస్కరణల పేరుతో వీధి దీపాలు,మరుగుదొడ్ల నిర్వహణ ఒకటేమిటి అన్నిటినీ ప్రైవేట్‌ పరం చేస్తున్నారు. విలువైన ప్రభుత్వ, నగర పాలక సంస్థల స్థలాల్లో అపార్టుమెంట్‌లు కట్టుకొని అమ్ముకోవడానికి, హోటళ్ళు, నిర్మించుకోవడానికి బడా వ్యక్తులకు అవకాశం కల్పించారు.కొంత కంట్రిబ్యూషన్‌ భరిస్తున్నారని చెప్పి సంపన్నుల కాలనీలలో రోడ్లు,మంచినీరు ఇతర సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆ కాలనీలకు 24గంటలు నీరు అందించే 24×7స్కీమ్‌ ప్రవేశపెడుతున్నారు.ఈ కాలనీలలో పార్కులు కళకళలాడుతున్నాయి. డబ్బున్నవారికి అన్ని సేవలు లభ్యమవుతున్నాయి. అందుకే ధనిక వర్గాలు, కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు, రాజకీయనేతలు ఈ సంస్కరణల పట్ల మహదానందంగా వున్నారు.

                             షరతుల పేరిట ప్రజలపై భారాలు

ప్రపంచబ్యాంకు,కేంద్ర ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరిట దాదాపు ఒకేరకమైన షరతులు విధించాయి.పౌరసదుపాయల కల్పనకు,అయిన ఖర్చు నూటికి నూరుశాతం ప్రజల నుంచే రాబట్టాలని హుకుం జారీచేశాయి.స్థానిక సంస్థలు తన వాటా భరించటానికి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ఆదేశించాయి.దీనివలన ఐదేళ్ళ కాలంలో విజయవాడ నగర ప్రజలపై తీవ్ర భారాలు పడ్డాయి.మంచినీటి సరఫరా నష్టాలు పూడ్చుకోవాలనే సాకుతో నీటి మీటర్ల ఏర్పాటుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. చలివేంద్రాలకు నీటి సరఫరాకు రేటు విధించారు. గతంలో వున్న డ్రైనేజీ చార్జీలకన్నా ఒక్కొక్కొ మరుగుదొడ్డికి 100శాతం పెంచారు. ఆదాయం కోసం చివరికి ' చెత్తను కూడా వదిలిపెట్టలేదు. సంవత్సరానికి రు. 8 కోట్లు చెత్తపన్ను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ. కూడా జారీ చేసింది. వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్స్‌ఫీజులు పెంచింది. ఈ ఐదేళ్ళలో వడ్డీ పేరుతో ప్రజలనుంచి రు. 4.65 కోట్లు పిండారు.. బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌(బి.పి.ఎస్‌.)లో భాగంగా రు. 45 కోట్లు గుంజారు. మొత్తం మీద గడచిన ఐదు సంవత్సరాల కాలంలో అదనంగా రు. 190 కోట్ల మేర పన్నులు, ఫీజులు, యూజర్‌చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దారు.
                                     మృగ్యమైన స్వపరిపాలన

74వ రాజ్యాంగ సవరణ స్పూర్తితో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని, మరిన్ని అధికారాలు కల్పిస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. సంస్కరణల పేరిట ప్రపంచబ్యాంకు షరతులను స్థానిక సంస్థలపై రుద్దారు.స్థానిక సంస్థలను స్వయం నిర్ణయాలు చేసే సంస్థలుగా కాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, షరతులు అమలు చేసి సంస్థలుగా దిగజార్చారు.సిటీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ మీద,విషమషరతులతో కూడిన ఒప్పందం మీద కౌన్సిల్‌కు తెలియకుండానే కమీషనర్‌ సంతకంచేశారు. ఆతరువాత మొక్కుబడిగా వివరాలు లేకుండా ఏకపక్షంగా కౌన్సిల్‌లో ఆమోదింపచేసుకున్నారు.సి.పి.ఎం.బహిర్గతం చేసిన తరువాత కానీ కార్పొరేటర్లకు, ప్రజలకు ఈ కాపీలు అందలేదు. చెత్త పన్ను వద్దని, ఆస్తిపన్ను పేరు మార్పిడికి ఫీజులలో పేదలకు రాయితీలు ఇవ్వాలని కౌన్సిల్‌ చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ జీ.ఓలు జారీచేసింది.కృష్ణా కరకట్టన వున్న పేదల గుడిసెలను తొలగించవద్దని కౌన్సిల్‌ ఏకగ్రీవంగా తీర్మానిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఖాతరు చేయలేదు.స్థానిక సంస్థలకు అధికారాలు, స్వపరిపాలన, నేతిబీరకాయలో నెయ్యి చందంగా మారింది. సంస్కరణల ముసుగులో పచ్చి నిరంకుశ విధానాలు అమలుజరుగుతున్నాయి. ఇది ఒక్క విజయవాడలోనే కాదు.అన్ని నగరాలలోనూ తరత మ స్థాయిలో జరుగుతున్నదిదే.
                                         
                                   నాడు - నేడు

జవహర్‌లాల్‌ నెహ్రూ పథకం ప్రవేశపెట్టినప్పుడు విజయవాడ కౌన్సిల్‌లో సి.పి.ఎం.మినహా అన్ని పక్షాలు ఆమోదించాయి. పాలక కాంగ్రెస్‌(ఐ) పార్టీ నగరానికి ఇది వరం అని గొప్పలు చెప్పింది. సి.పి.ఐ.,టి.డి.పి లు బలపరిచాయి. నిధులు వెల్లువగా వస్తాయని ఆశించారు.సి.పి.ఎం.ఒక్కటే దీనిని నికరంగా వ్యతిరేకించింది.అందులో వున్న షరతుల ప్రమాదం గురించి హెచ్చరించింది. సి.పి.ఎం నిధులను అడ్డుకుంటున్నదని, అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని పాలకులు దుష్ప్రచారం చేశారు. సి.పి.ఎం వైఖరి కాలపరీక్షలో నూటికి నూరుపాళ్లు నిజమని తేలింది. సి.పి.ఐ,టి.డి.పిలు భారాలపై జరిగే ఆందోళనలో కలిసిరాక తప్పలేదు. సి.పి.ఎం నిర్వహించిన పోరాటాలవల్ల సంస్కరణల వేగానికి ఎప్పటికప్పుడు బ్రేకులు పడ్డాయి.నీటి మీటర్లు వంటివి తాత్కాలికంగా నిలిచిపోయాయి.చెత్తపన్ను ఐదేళ్లనుంచి వాయిదా పడుతూ వచ్చింది.సంస్కరణలు ఆపడం ఎవరితరం కాదు, మరోప్రత్యామ్నాయం లేదనే వాదనలు తప్పని ఆచరణలో నిరూపితమైంది..ఈ పోరాటం మరింత ముందుకు సాగాలి.అన్ని పట్టణాలలో సాగాలి.
                                                                       - సిహెచ్‌ బాబూరావు  
                                               
                                      (రచయిత సి.పి.ఐ(యం) రాష్ట్ర కమిటీ సభ్యులు)
                                      ప్రజాశక్తి లో 03.12.2010 న ప్రచురితమైన వ్యాసం   

No comments:

Post a Comment