2017-2018 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదనలపై
టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ విశ్లేషణ
I-రెవెన్యూ ఆదాయం
-ఆస్తిపన్ను పెంపుదల
ప్రస్తుత పాలకులు అధికారంలోకి వచ్చేనాటికి(2013-2014) ఆస్తిపన్ను రు. 70,175,85,000
ప్రస్తుతం 2017-18 నాటికి రు. 143,25,89,900
అంటే పెరుగుదల రు. 73, 08,04,900
సంవత్సరాల వారీ పెరుగుదల
2014-2015 లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 4,91,63,001
2015-2016 లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 10,25,30,335
2016-2017లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 31,61,46,664
2017-2018 లో పెరుగుదల (అంతకు ముందు సంవత్సరంపై) రు. 26,29,64,900
మొత్తం.................రు. 73,08,04,900
-Service Charges in lieu of Property Tax from Railways అని ఇంగ్లీషులో వ్రాశారు. దాని అర్ధం ''రైల్వేలనుండి ఆస్తి
పన్నుకు స్థానంలో సర్వీసు చార్జీలు'' అని అర్ధం. కాని తెలుగులో ''రైల్వే
మరియు ఇతర ప్రభుత్వ శాఖలు -సర్వీస్ చార్జీలు'' అని వ్రాశారు. కాని
ఇంగ్లీషులో '' ఇతర ప్రభుత్వ శాఖలు'' అన్నది లేదు. ఇందులో రెండు అనుమానాలు
ఉన్నాయి.
1. రైల్వేలు మరియు ఇతర ప్రభుత్వ శాఖలు ఏనాటి నుండో ఆస్తిపన్ను బకాయిలు
ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆస్తి పన్ను స్థానంలో సర్వీసు చార్జీలు
చెల్లిస్తున్నాయా? లేక ఆస్తి పన్ను బకాయీలు అలాగే ఉంచి అదనంగా సర్వీసు
చార్జీలు చెల్లిస్తున్నాయా? ఆస్తి పన్నుకు బదులు సర్వీసు చార్జీలు
చెల్లిస్తుంటే ఏ చట్టప్రకారం లేదా ఏ కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఆస్తి
పన్ను స్థానంలో సర్వీసు చార్జీలు చెల్లిస్తున్నారు?
2. ఇది రైల్వేలకే పరిమితమా? లేక ఇతర ప్రభుత్వ శాఖలుకూడా అలాగే చెల్లిస్తున్నాయా?
-వినోదపు పన్ను 2015-16లో రు.18,32,77,041 వచ్చినప్పుడు 2016-17లో
కేవలం రు. 8 కోట్లకే ఎందుకు పరిమితం కావలసి వచ్చింది? అదేవిధంగా 2017-18
అంచనాలలో కూడా రు. 8 కోట్లకే ఎందుకు పరిమితం చేశారు?
- మోటారు వాహనముల వలన నష్ట పరిహారం 2015-16లో ఎందుకు రాలేదు?
- ఆస్తిపన్నువలన నష్టపరిహారం ద్వారా ఆదాయం 2015-16లో రు.35,20,000
వచ్చింది. 2016-17 బడ్జెట్ అంచనాలలో రు. 50,00,000లుగా చూపి దానిని
సవరించిన అంచనాలలో రు. కేవలం రు.1,22,250కు కుదించారు.
సవరించిన అంచనాలలో ఎందుకు రు.48 లక్షలకు పైగా తగ్గించి చూపారు? ఇప్పుడు మరల 2017-18 బడ్జెట్‌లో రు. 50,00,000లుగా చూపారు?
-స్లాటర్ హౌస్ లీజులపై ఆదాయం సవరించిన అంచనాలలో సున్న చూపించవలసి వచ్చింది?
- పి. హెచ్. ఇతరములు/ పబ్లిక్ టాయిలెట్స్ అనే పద్దుక్రింద 2014-15లో
ఆదాయం సున్న. 2015-2016లో కూడా ఆదాయం సున్న. కాని 2016-17లో బడ్జెట్‌లో
ఆదాయం రు. 15 లక్షలుగా చూపి సవరించిన అంచనాలలో దానిని రెట్టింపు చేసి
రు.32,60,200 గా చూపారు. 2017-18 అంచనాలలో మరింత పెంచి రు. 36,22,000లు గా
చూపారు. ఈ పెంపుదలలకు ఆధారం ఏమిటి? 2014-15 మరియు 2015-16లో ఎందుకు వసూలు
చేయలేక పోయినారు?
- 2016-17 వరకు 10 శాతం గా ఉన్న ఓపెన్ స్పేస్ కాస్ట్ 2017-18లో 14 శాతానికి పెంచారు. ఇది భారం మోపటమే.
- సివరేజి చార్జీలు 2013-14లో రు.5,13,76,270, 2014-15లో రు.
13,27,80,00లు, 2015-16లో రు.8,13,44,558 వసూలు అయ్యాయి. 2016-17 అంచనాలలో
రు.52,05,00,000గా చూపించి సవరించిన అంచనాలలో రు.16,95,29,000లకు
కుదించారు. దీనిబట్టి ఏనాడూ 17 కోట్లకు చేరలేదు. అనుభవం ఇలా ఉండగా
2017-18లో మరల రు. 49,05,00,000గా చూపించారు. ఇంత పెంపుదలకు ఆధారం ఏమిటి?
- రోడ్ కటింగ్ చార్జీలు 2013-14లో రు.10,24,598లు వసూలయ్యాయి.
2014-15లో అసలేమీ వసూలు కాలేదు. 2015-16లో కేవలం రు.35,000 వసూలు అయ్యాయి.
2016-17లో రు.6ల క్షలు అంచనావేసి సవరించిన బడ్జెట్‌లో రు. 52,500లకు
కుదించారు. వాస్తవం ఇలా ఉండగా 2017-18 అంచనాలలో ఏకంగా రు.50లక్షలకు
ఏఆధారంగా పెంచారు?
-స్విమ్మింగ్ పూల్ ఫీజు మరియు జిమ్ ఫీజు 2013-14లో రు.30,75,750లు
వసూలయ్యాయి. 2014-15లో రు.30,00,000లు, 2015-16లో కేవలం రు.21,50,000లు
వసూలు అయ్యాయి. అయితే 2017-18లో రు.49,50,000లు గా అంచనా వేశారు. అంటే
ఫీజులు పెంచబోతున్నారా? లేకుంటే అమాంతం రు. 20 లక్షలకు పైగా ఎలా
పెరుగుతాయి?
- వి.యం.సి ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా ఆదాయం 2013-14లో
రు.59,90,940లు. 2014-15లో ఆదాయం సున్న. 2015-16లో కూడా ఆదాయం సున్న.
కాని 2016-17 బడ్జెట్‌లో రు.3 కోట్లుగా చూపి. సవరించిన అంచనాలలో దానిని రు.
10 లక్షలకు కుదించారు.2017-18 అంచనాలలో మరల రు.5 కోట్లుగా చూపారు. దీనికి
ఆధారం ఏమిటి?
- వాహనాల అమ్మకం ద్వారా 2013-14లో రు.7,00,000లు, 2014-15లో
రు.15,00,000లు ఆదాయం వచ్చింది. 2015-16లో కేవలం రు.5,00,000లు మాత్రమే
ఆదాయం వచ్చింది. 2016-17లో సవరించిన బడ్జెట్‌లో ఆదాయాన్ని సున్నగా చూపారు.
కాని 2017-18 అంచనాలలో రు.1,86,00,000లుగా చూపారు. ఎన్ని వాహనాలను
అమ్మబోతున్నారు? వాటికి ప్రత్యామ్నాయమేమిటి?
- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుండి రావలసిన అద్దె బకాయీలు 2012-13
లో రు. 7,08,000లు, 2013-14లో రు.1,50,690, 2014-15లో రు.24,25,916లు,
2015-16లో రు. 30,12,000లు వచ్చాయి. 2016-17 బడ్జెట్‌లో అత్యధికంగా రు.
2,55,00,000లు అంచనాగా చూపి, సవరించిన అంచనాలలో కేవలం రు, 12,50,000లుగా
చూపారు. బడ్జెట్‌లలో అతి అంచనాలు చూపుతున్నారు అనేదానికి ఇది ఉదాహరణ.
-వాటర్ వలన ఆదాయం ( టారీఫ్ ) 2012-13లో రు. 21,10,00,000లు,
2013-14లో 17,91,14,125లు, రు. 2014-15లో రు. 22,92,85,000లు, 2015-16లో
రు. 34,32,88,024లు గా ఉన్నది. 2016-17లో రు. 34,92,57,000 అంచనాలలో చూపి,
సవరించిన అంచనాలలో రు. 29,52,39,197గా చూపారు. అంటే రు.5 కోట్ల 40 లక్షలు
తక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 2017-18 బడ్జెట్‌లో సుమారు 6.98
కోట్లు పెంచి రు.36.5 కోట్లుగా అంచనావేశారు. 2013-14 నాటికి ( ఈ పాలకులు
అధికారంలోకి వచే నాటికి ) ఉన్న ఆదాయంతో 2017-18 బడ్జెట్ అంచనాలను పోల్చితే
నీటి చార్జీలు సగటున రెట్టింపు అయ్యాయి.
-పనులపై అపరాధ రుసుం క్రింద 2012-13లో రు.50 లక్షలు వచ్చాయి. ఇక
2013-14, 2014-15, 2015-16లో ఆదాయం సున్న. 2016-17 సవరించిన అంచనాలలో కూడా
సున్న చూపించారు. 2017-18లో రు.5లక్షలు గా అంచనా వేస్తున్నారు. ఇది కేవలం
బడ్జెట్‌లలో అతి అంచనాలు చూపటం కాదా? తప్పు చేస్తేనే అపరాధ రుసుం వస్తుంది.
తప్పనిసరిగా తప్పు చేయాలని భావిస్తున్నారా?
-ఇంపాక్టు ఫీజు 2012-13 లో లేదు. 2013-14, 2014-15 బడ్జెట్‌లలో
చూపలేదు. కాని 2013-14లో రు.65,68,465 లు ఆదాయం చూపారు. 2014-15 లో
34లక్షల ఆదాయం చూపారు. 2015-16లో 63,56,422 ఆదాయం చూపారు. 2016-17
బడ్జెట్‌లో రు. కోట్లు చూపి, సవరించిన డబ్జెట్‌లో రు.3,76,75,544గా చూపారు.
2017-18 అంచనాలు రు. 4 కోట్లుగా చూపుతున్నారు. ఈ ఇంపాక్టు ఫీజు ఏ
ప్రాంతాలనుండి వసూలు చేస్తున్నారు? ఎవరినుండి వసూలు చేస్తున్నారు?
- ఎలిమెంటరీ, హైస్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు 010 పద్దు క్రింద రాష్ట్ర
ప్రభుత్వం నేరుగా ఇస్తున్నది. అంతేతప్ప కార్పొరేషన్‌కు ఇవ్వటంలేదు.
అలాంటప్పుడు అది కార్పొరేషన్‌కు ఆదాయం ఎలా అవుతుంది? ఇది కేవలం బడ్జెట్‌లో
అంచనాలు పెంచటంకోసం చేసిందికాదా?
II-రెవెన్యూ ఖర్చులు
-కార్పొరేటర్లు స్టడీ టూర్ పేరుతో 2016 మే మొదటి వారంలో విహారయాతక్రు
వెళ్ళారు. 2016-17 బడ్జెట్‌లో స్టడీ టూర్లకు సవరించిన అంచనాలలో
రు.53,23,610 గా ఖర్చు చూపారు. 2017-18 అంచనాలలో ఖర్చు మరికొంత పెంచి
రు.60లక్షలుగా చూపారు. 2016లో కార్పొరేటర్లటూరు సర్వత్ర విమర్శలకు
దారితీసింది. ఆ టూరువలన ఎటువంటి మేలు కార్పొరేషన్‌కు చేకూరిందో ఈ నాటికీ
స్ఫష్టం చేయలేదు. అయినా 2017-18లో మరల టూర్లు ప్రతిపాదించటం దారుణం. ఇది
ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేయటమే.
-1/3 వంతు సర్వేయర్ సిబ్బంది జీతాలు 2012-13లో రు.8,37,000లు.
2013-14లో రు. 24,00,000లు 2014-15లో రు.32,00,000లు 2015-16లో
రు.35,00,000లు ఖర్చు చూపారు. 2016-17లో రు 40లక్షలు బడ్జెట్‌లో కేటాయించి
సవరించిన అంచనాలలో సున్న చూపారు. మరల 2017-18 అంచనాలలో రు.2,50,000లుగా
చూపారు. కారణం ఏమిటి? సిబ్బందిని తొలగించారా? సిబ్బంది ఉంటే జీతాలు ఎందుకు
తగ్గుతాయి?
-మందుల కొనుగోలు నిమిత్తం 2012-13లో రు.54,00,000లు, 2013-14లో
రు.54,00,000లు 2014-15లో రు. 33,75,250లు 2015-16లో రు. 52,86,482లు
ఖర్చు చేశారు. 2016-17లో బడ్జెట్‌లో రు.83 ల్షలుగా చూపి, సవరించిన అంచనాలలో
రు.25,71,869 గా చూపారు. 2017-18 అంచనాలలో రు. 27 లక్షలు ఖర్చుమాత్రమే
చూపారు. ప్రజారోగ్యానికి కావలసిన మందుల కొనుగోళ్ల ఖర్చు సగానికిసగం ఎందుకు
తగ్గించారు?
-అదేవిధంగా ఆసుపత్రుల నిర్వహణకు 2012-13లో రు. 7లక్షలు, 2013-14లో
రు.7లక్షలు, 2014-15,2015-16లలో లో ఏమీ ఖర్చు చేయలేదు. 2016-17లో అంచనాలలో
రు.10 లక్షలు ఖర్చు చూపి సవరించిన అంచనాలలో తగ్గించి రు.5 లక్షలు ఖర్చు
చూపారు. 2017-18 అంచనాలలో కూడా కేవలం రు.5 లక్షలు ఖర్చు మాత్రమే
చూపుతున్నారు.
పైరెండూ ప్రజారోగ్యం పట్ల కార్పొరేషన్ పాలకుల నిర్లక్ష్యధోరణికి నిదర్శనం.
-డపింగ్ యార్డు నిర్వహణ ఖర్చు 2016-17 సవరించిన అంచనాలలో రు. 3
కోట్లుగా చూపి 2017-18 బడ్జెట్‌లో కేవలం 1 కోటి 50లక్షలుగా చూపటంలో అర్ధం
ఏమిటి?
- జంతువుల నియంత్రణకు 2012-13లో రు. 5 లక్షలు, 2013-14లో రు.5 లక్షలు,
2014-15, 2015-16లలో ఏమీ ఖర్చు చేయలేదు. 2016-17లో అంచనాలలో రు.15 లక్షలు
ఖర్చు చూపి సవరించిన అంచనాలలో రు.40 లక్షలు ఖర్చు చూపారు. 2017-18 అంచనాలలో
ఏకంగా రు.90లక్షలుగా ఖర్చు చూపారు. 2017-18లో అంత అతిగా ఖర్చు పెరగటానికి
కారణ మేమిటి?
- ఆట స్ధలములు, స్టేడియంల నిర్వహణ మరియు యువజనోత్సవాలకు 2012-13,
2013-14లో ఏమీ ఖర్చు చేయలేదు. 2014-15లో కేవలం రు.1 లక్ష మాత్రమే ఖర్చు
చేశారు. 2015-16లో ఏమీ ఖర్చు చేయలేదు. 2016-17లో బడ్జెట్‌లో రు.15 ల్షలుగా
చూపి, సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2017-18 అంచనాలలో మరల రు. 15 లక్షలు
ఖర్చు చూపుతున్నారు. ఇది క్రీడల పట్ల, యువజనుల పట్ల కార్పొరేషన్ పాలకుల
నిర్లక్ష్యధోరణికి నిదర్శనం.
- విద్యుత్ చార్జీలు 2012-13లో రు.22 కోట్లు, 2013-14లో రు.12.94
కోట్లు 2014-15లో రు.31,99,42,703కోట్లు 2015-16లో రు.29.50 కోట్లు,
2016-17 (రివైజ్డ్) లో రు.30.60 కోట్లు 2017-18 అంచనాలలో రు.32 కోట్లు గా
ఉన్నది. ఇంత అనూహ్యంగా పెరగటానికి గల కారణం నీటి సరఫరాకు విద్యుత్ సంస్థలు
కమర్షియల్ రేటు చొప్పున విద్యుత్ చార్జీలు వసూలు చేయటమే. కనక మంచినీటి
సరఫరాకు విద్యుత్ చార్జీలు గృహ యజమానులనుండి వసూలుచేసే కనీస చార్జీ రేటు
చొప్పున వసూలు చేయాలని కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి.
- వృత్తిపన్ను కన్సల్టెంట్లకు గౌరవ వేతనం క్రింద రు.3 లక్షలు
కేటాయించారు. వృత్తిపన్ను చట్టప్రకారం వసూలు చేసేది. దానికి కన్సల్టెంట్ల
అవసరం ఏమిటీ?
III-కాపిటల్ ఆదాయాలు
- జె.యన్.యన్.యు.ఆర్.యం నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు
సున్న చూపారు. అంటే పూర్తిగా వచ్చాయా? అదేవిధంగా వి.యం.సి ఫేరుకూడా సున్న
చూపారు. అంటే పూర్తిగా జె.యన్.యన్.యు.ఆర్.యం నిధులు సున్న చూపారు. అంటూ
పనులన్నీ పూర్తయినాయా?
-మధ్య నియోజక వర్గంలో నీటి సరఫరా సౌకర్యముల అభివృధ్ధి మరియు తూర్పు
నియోజక వర్గంలో తాగునీటి సౌకర్యముల అభివృధ్ధి అనే రెండు పద్దుల క్రింద
ఆదాయాలు 2013-14 లో సున్న , 2014-15లో సున్న , 2015-16లో సున్న. కాని గత 3
సంవత్సరాలు ప్రతి సంవత్సరం బడ్జెట్ అంచనాలలో , సవరించిన అంచనాలలో ఆదాయం
చూపెడుతున్నారు. ఆదాయం మాత్రం రావటంలేదు. 2017-18 బడ్జెట్ అంచనాలలోకూడా ఈ
పద్దుల క్రింద రు.52 లక్షలు, రు.43లక్షలు చూపెట్టారు. ఇది రాష్ట్ర
ప్రభుత్వం ఇవ్వవలసినది. ఇవ్వటంలేదు. ఇవ్వనప్పుడు బడ్జెట్ లో చూపినందువలన
ప్రయూజనం ఏమిటి?
- రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు 2013-14లో ఏమీ రాలేదు. 2014-15లో
రు.8,07,20,000 వచ్చాయి. 2015-16లో రు. 21,36,05,000 వచ్చాయి. కాని 2016-17
అంచనాలలో రు.19.90 కోట్లు చూపి , సవరించిన అంచనాలలో సున్న చూపారు. 2017-18
బడ్జెట్‌లో రు.5 కోట్లు చూపారు. 2016-17 సవరించిన అంచనాలలో ఎందుకు సున్న
చూపారు? 2017-18 బడ్జెట్ అంచనాలలో బాగా తగ్గించి కేవలం రు.5 కోట్లే
ఎందుకు చూపారు? ఇవి ఎన్నవ ఆర్ధిక సంఘం నిధులు? ఏ ప్రాతిపదికన వస్తున్నాయి?
-అమృత్ పథకం ఆదాయం 2015-16 సవరించిన అంచనాలలో రు.33.69 కోట్లు చూపగా
కేవలం వాస్తవంగా వచ్చినవి 7.87 కోట్లు. 2016-17 అంచనాలలో మరల రు.33.69
కోట్లు చూపి, సవరించిన అంచనాలలో రు.7.50 కోట్లుగా చూపారు. అంచనాలలో కేవలం 4
వవవంతు మాత్రమే వస్తుండగా 2017-18 అంచనాలలో అత్యధికంగా రు.47 కోట్లు
చూపటంలో ఆంతర్యం ఏమిటి?
-ఇంతవరకు ఏమీ లేని మెట్రోరైలు విద్యుదీకరణకు రు. 10 కోట్లు ,
మెట్రోరైలు మౌలిక సదుపాయాలకు 10 కోట్లు ఆదాయాలలో చూపారు. అలాగే ఖర్చులలో
కూడా చూపారు. ఇంతవలరు అనుమతులే లేకుండా ఆదాయ వ్యయాలలో చూపటంలో అర్శం ఏమిటి?
- స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ( సర్కిల్-1,2,3 ఏరియా) 2014-15లో
ఆదాయం సున్న. 2015-16లో సున్న. 2016-17 అంచనాలలో రు. 3 కోట్లు చూపి,
సవరించిన అంచనాలలో బాగాపెంచి రు.39 కోట్లు గా చూపారు. 2017-18 అంచనాలలో రు.
30 కోట్లుగా చూపారు. ఇంత అతిగా అంచనాలు వేయటానికి కారణం ఏమిటి?
Iహ-కాపిటల్ ఖర్చులు
- బ్రిడ్జీలు, సబ్ వేలకు 2016-17లో రు.1 కోటి లు అంచనావేసి సవరించిన
అంచనాలలో సున్న చూపారు. 2017-18 అంచనాలలో ఏకంగా దానిని 291 కోట్లకు
పెంచారు. 2016-17లో ఎందుకు నిర్మించలేక పోయారు? ఇప్పుడు ఎక్కడెక్కడ
నిర్మించతలపెట్టారు? వివరించగలరు.
-మేయర్ భవనానికి 26.75 కోట్లు కేటాయించారు. కాని వన్ టౌన్
ప్రాంతంలో జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి (షేక్ రాజా ఆసుపత్రి)గాని,
కుట్టు శిక్షణా కేంద్రాలకుగాని, హోల్‌సేల్ చేపల మార్కెట్
అభివృధ్ధికిగానీ, మోడల్ చేపల మార్కెట్ల నిర్మాణాలకుగానీ, శానిటేషన్
పరికరాలకుగాని, ఒక్కరూపాయికూడా కూడా కేటాయించలేదు.
- ఎం.ఎల్.ఏ., ఎం.ఎల్.సి గ్రాంటు 2016-17 బడె&.ట్ అంచనాలలో ఆదాయం
రు.1 కోటిగా చూపారు. ఖర్చు రు.1 కోటిగా చూపారు. కాని సవరించిన అంచనాలలో
ఆదాయం తగ్గించి రు. 46,87,148 గా చూపి ఖర్చు సున్న చూపారు. సవరించిన అంచనాల
ప్రకారం ఆదాయం రు. 46,87,148లు వస్తుందనుకున్నప్పుడు, ఆఆదాయాన్ని ఖర్చు
చేయకుండా వదలి వేయాలనుకోవాలసిన అవసరమేమిటి? ఇక 2017-18 అంచనాలలో ఆదాయం రు.
49,21,505గా చూపి, ఖర్చులో రు 50లక్షలు చూపారు. అంటే ఆదాయం కంటే ఖర్చు
ఎక్కువ చూపారు. అది ఎలా సాధ్యం?
- కాపిటల్ ఖర్చు(04) లో ఫర్నిచర్ కోసం అన్న పద్దు క్రింద రు. 25
లక్షలు కేటాయించారు. వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్ కొనుగోలు కొరకు అన్న
పద్దు క్రింద ఏమీ కేటాయింపులు లేవని సున్న చూపారు. కాపిటల్ ఖర్చును
వివరిస్తూ ఇచ్చే 04ఎ లో వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్ కొనుగోలు కొరకు అన్న
పద్దు క్రింద కేటాయింపులు రు.25లక్షలుగా చూపారు. ఇంతకు కేటాయించిన ఆ 25
లక్షలు వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్ కొనుగోలు కోసమా? లేక జనరల్‌గా ఆఫీసు
ఫర్నిచర్ కోసమా?
- రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు కాపిటల్ ఆదాయంలో 2016-17 సవరించిన
అంచనాలలో సున్న చూపి , సవరించిన కాపిటల్ ఖర్చు(4ఎ) లో రు. 5,91,21,000గా
చూపారు. రాని డబ్బును ఖర్చు చేయటమేమిటి?
-2015-16 లో రోడ్డు గ్రాంటు ఆదాయం సున్న. అంటే రోడ్డు గ్రాంటు ఏమీ
రాలేదు. అయినా రు.4 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2016-17లో రోడ్డు
గ్రాంట్ సవరించిన ఆదాయం రు. 3 కోట్లుగా చూపి, సవరించిన ఖర్చు రు.7
కోట్లుగా చూపారు. ఇక 2017-18 ఆదాయం అంచనా రు. 10 కోట్లుగా చూపి. ఖర్చు
అంచనా రు. 20 కోట్లుగా చూపారు. ఒకే పద్దు క్రింద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా
చేయటం ఎలా సాధ్యం?
-బుడమేరు అభివృధ్ధి పనుల నిధులు 2015-16లో ఆదాయంలో లేదు. కాని ఖర్చులో
రు. 16 కోట్లు చూపారు. 2016-17 బడ్జెట్‌లో ఆదాయం అంచనాలలో సున్న చూపి ,
ఖర్చులో సవరించిన అంచనాలలో రు.28,55,29,055లు గా చూపారు. రాని నిధులను ఎలా
ఖర్చు చేస్తారు?
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి