Friday, 17 February 2017

17.02.2017 విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై న జ‌రిగిన ప్రెస్‌మీట్‌

ప్రచురణార్ధం:                                                                                          తేదీ:17.02.2017
రేపు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టబోతున్న 2017-2018 వార్షిక బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్రమైన బడ్జెట్‌ను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగర కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నది. ఈ రోజు బడ్జెట్‌పై తన విశ్లేషణను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విడుదల చేస్నున్నది. బడ్జెట్‌ ప్రతిపాదననలో అనేక లోపాలు ఉన్నట్లుగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గుర్తించింది. అనేక అంశాలకు సంబంధించి అంచనాలు రూపొందించటంలో తార్కికత లేకపోవటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గమనించింది.కొన్ని చోట్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చూపారు. ఉదాహరణకు 2015-16 లో రోడ్డు గ్రాంటు ఆదాయం సున్న. అంటే రోడ్డు గ్రాంటు ఏమీ రాలేదు. అయినా రు.4 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. 2016-17లో రోడ్డు గ్రాంట్‌ సవరించిన ఆదాయం రు. 3 కోట్లుగా చూపి, ఖర్చు రు.7 కోట్లుగా చూపారు. ఇక 2017-18 ఆదాయం అంచనా రు. 10 కోట్లుగా చూపి. ఖర్చు అంచనా రు. 20 కోట్లుగా చూపారు. ఒకే పద్దు క్రింద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేయటం ఎలా సాధ్యమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. అదేవిధంగా బుడమేరు అభివృధ్ధి పనుల నిధులు 2015-16లో ఆదాయంలో లేదు. కాని ఖర్చులో రు. 16 కోట్లు చూపారు. 2016-17 బడ్జెట్‌లో ఆదాయం అంచనాలలో సున్న చూపి, ఖర్చులో రు.28,55,29,055లు గా చూపారు. రాని, లేని నిధులను ఎలా ఖర్చు చేస్తారు? గత అనుభవాలను కూడా పట్టించుకోకుండా కొన్ని చోట్లు ఆదాయాలలో అతిగా చూపారు. ఉదాహరణకు సివరేజి చార్జీలు 2013-14నుండి 2016-17 సవరించిన అంచనాలవరకు ఏ సంవత్సరమూ 17 కోట్లకు చేరలేదు. అనుభవం ఇలా ఉండగా 2017-18లో మరల రు. 49.5 కోట్లు గా చూపించారు. అదేవిధంగా రోడ్‌ కటింగ్‌ చార్జీలు 2013-14లో రు.10.24లక్షలు 2014-15లో సున్న, 2015-16లో రు.35 వేలు 2016-17లో రు. 52 వేలుగా ఉన్నది. వాస్తవం ఇలా ఉండగా 2017-18 అంచనాలలో ఏకంగా రు.50లక్షలు చూపారు. ఇలా తార్కికతలేని అతి అంచనాలు అనేకం ఉన్నాయి.
2016 లో కార్పొరేటర్లు స్టడీ టూర్‌ పేరుతో చేసిన యాత్ర సర్వత్ర విమర్శలకు దారితీసింది. అధికారులు, కార్పొరేటర్లు చేసిన టూర్లకు రు. 53 లక్షలకు పైగా ఖర్చయిందని బడ్జెట్‌ తెలియజేస్తున్నది. 2017లో మరో యాత్రకు కార్పొరేటర్లు సిధ్ధమవుతున్నారని ప్రస్తుత బడ్జెట్‌లో రు.60 లక్షలు కేటాయించటం ద్వారా అర్ధమవుతున్నది. కాని మందుల కొనుగోళ్ళకు, ఆసుపత్రుల నిర్వహణకు సగానికి సగం కేటాయింపులు తగ్గించడం ద్వారా కార్పొరేటర్ల యాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజారోగ్యానికి కార్పొరేషన్‌ పాలకులు ఇవ్వటం లేదని అర్ధమవుతున్నది. ఆట స్ధలములు, స్టేడియంల నిర్వహణ మరియు యువజనోత్సవాలకు 2012-13, 2013-14, 2015-16లో ఏమీ ఖర్చు చేయకపోవటం, 2016-17లో బడ్జెట్‌లో రు.15 ల్షలుగా చూపి, సవరించిన అంచనాలలో సున్న చూపటం, క్రీడల పట్ల, యువజనుల పట్ల కార్పొరేషన్‌ పాలకుల నిర్లక్ష్యధోరణి స్పష్టంగా కనుపిస్తున్నది. 2017-18 అంచనాలలో మరల రు. 15 లక్షలు కేటాయించినా అనుభవాన్ని బట్టి చూస్తే ఖర్చు చేయటం సందేహాస్పదమే.
కార్పొరేషన్‌ నూతన భవనాలకు 26.75 కోట్లు కేటాయించారు. కాని వన్‌ టౌన్‌ ప్రాంతంలో జనరల్‌ ఆసుపత్రి నిర్మాణానికి (షేక్‌ రాజా ఆసుపత్రి)గాని, కుట్టు శిక్షణా కేంద్రాలకుగాని, హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ అభివృధ్ధికిగానీ, మోడల్‌ చేపల మార్కెట్ల నిర్మాణాలకుగానీ, శానిటేషన్‌ పరికరాలకుగాని, ఒక్కరూపాయికూడా కూడా కేటాయించలేదు. వి.యం.సి.స్కూళ్ళలో ఫర్నిచర్‌ కొనుగోలు కొరకు అన్న పద్దు క్రింద ఏమీ కేటాయింపులు లేవని సున్న చూపారు. న్యూ రాజరేశ్వరీపేటలో నూతన హైస్కూల్‌ భవనానికి ప్రహరీ కట్టిస్తే, కోట్ల రూపాయల విలువైన భవనం వినియోగంలోకి వస్తుంది. దానికి కేటాయింపులు లేవు.
మధ్య నియోజక వర్గంలో నీటి సరఫరా సౌకర్యముల అభివృధ్ధి మరియు తూర్పు నియోజక వర్గంలో తాగునీటి సౌకర్యముల అభివృధ్ధి అనే రెండు పద్దుల క్రింద రాష్ట్ర ప్రభుత్వంనుండి వస్తాయని గతమూడు సంవత్సరాలుగా బడ్జెట్‌ అంచనాలలో కొంత మొత్తాలను చూపుతున్నారు. కానిఆదాయం మాత్రం రావటంలేదు. అయినా సరే 2017-18 బడ్జెట్‌ అంచనాలలోకూడా ఈ పద్దుల క్రింద రు.52 లక్షలు, రు.43లక్షలు చూపెట్టారు. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనుకోవటానికి ఆధారం ఏమిటో కార్పొరేషన్‌ పాలకులు వివరించాలి. పశ్ఛిమ నియోజకవర్గాన్ని గురించి బడ్జెట్‌లలో ఎందుకు ప్రతినాదనలు ఉండటంలేదో పాలకులు చెప్పాలి.
ఆస్తిపన్నుపై ఆదాయం 2014 మార్చినాటికి రు.70 కోట్లుగా ఉంటే అది నేటికి రు.143 కోట్లు అయింది. 2014 మార్చినాటికి రు.17.91 కోట్లుగా ఉండే నీటి చార్జీల ఆదాయం 2017-18 నాటికి రు.36.5 కోట్లు గా ఉండబోతున్నది. అంటే ఈ కౌన్సిల్‌ కాలంలో ఈ రెండూ రెట్టింపయ్యాయి. నగరంలో మరల ఆస్తిపన్ను పెంచబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆస్తిపన్ను పెరిగితే దానితోపాటే నీటి చార్జీలు కూడా పెరుగుతాయి. ఇదే జరిగితే ఇవి ప్రజలకు శాపంగా మారతాయటంలో సందేహంలేదు.
ఇలాంటి అవకతవకలు ఈ బబ్జెట్‌లో అనేకం ఉన్నాయి. నగరపాలక సంస్థ బడ్జెట్‌ వాస్తవికతకు దగ్గరగా ఉండాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవటం, స్థానిక సంస్థల పాలకులకు ప్రజల పాట్లపట్ల శ్రధ్ధలేక పోవటం ఈ బడ్జెట్‌లో ప్రతిబింబిస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది. అందువలన ఈ విషయాలన్నింటినీ కౌన్సిల్లో చర్చించి, సమగ్రమైన బడ్జెట్‌ను రూపొందించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నది.






No comments:

Post a Comment