Wednesday, 3 September 2014

టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 25.05.2014 న జరిగిన
సర్వసభ్యసమావేశం ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలు

                                           తీర్మానం నెంబరు-1

2014 మార్చి 30 వతేదీన జరిగిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో
ఎన్నికైన కార్పొరేటర్లందరికీ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్యసమావేశం అభినందనలు
 తెలియ జేస్తున్నది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ ఛైర్మెన్‌లకు ఈ సభ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నది.

2010 సెప్టెంబర్‌ 7 వతేదీనుండి ఇటీవలి ఎన్నికలు జరిగేవరకు కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారి పాలన సాగింది. ఈ పాలనలో ప్రజలపై అనేక భారాలు పడినాయి. నిరంకుశ పాలన సాగింది. నగరప్రజలు ప్రజాతంత్రపాలన కోసం ఎదురు చూశారు. కోర్టు జోక్యంతో విధిలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను జరపింది. ప్రజలు ఇకనైనా భారాలు తగ్గుతాయని తమ భాధలు తీరతాయని, తమనగరం అభివృధ్ధి చెందుతుందని భావించారు. తాము ఎన్నుకున్న కౌన్సిల్‌ పైన, కార్పొరేషన్‌ పాలక వర్గంపైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలను నెరవేర్చవలసిన భాధ్యత నూతన కౌన్సిల్‌పై ఉన్నదని ఈ సభ భావిస్తున్నది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, నగరప్రజలపై భారాలను తగ్గించటం కోసం అలాగే నగరాభివృధ్ధికోసం నూతన కౌన్సిల్‌ తక్షణం మరియు దీర్ఘకాలికంగా
చేపట్టవలసిన చర్యలను ఈ సభ గౌరవనీయులైన నగర మేయర్‌ ద్వారా నూతన కౌన్సిల్‌కు ప్రతిపాదించాలని ఈ సభ తీర్మానిస్తున్నది.
                                             తీర్మానం నెంబరు-2
                                               మంచినీటి చార్జీలు
వ్యక్తిగత గృహాలకు నీటి చార్జీలు : ప్రత్యేక అధికారి పాలనలో విజయవాడ నగరంలో మంచినీటి చార్జీలు విపరీతంగా పెంచారు. వ్యక్తిగత గృహాలకు మొదటిసారిగా ఇంటిపన్ను ఆధారంగా నీటి చార్జీలు నిర్ణయించే క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇంటిపన్ను పెరిగితే నీటి చార్జీలు కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతాయి. 01.04.2013 కు ముందు వ్యక్తిగత గృహానికి నెలకు రు||80లు చొప్పున నీటి చార్జీలను వశూలు చేసేవారు. ఇప్పుడు ఇంటి పన్నుకు ముడి పెట్టడంతో భారం ఈ క్రిందివిధంగా ఉంది. .
ఇంటిపన్ను      31.03.2013 వరకు     1.4.2013నుండి   31.03.2013 వరకు సం||కి 1.4.13 నుండిసం||కు
(అర్థ సం||కు)   నెలకు చెల్లిస్తున్నది    చెల్లించవలసింది       చెల్లించింది                          చెల్లిస్తున్నది
    రు||                   రు||                 రు||           రు||                                      రు||
175లోపు                  50                 70              600                                    840 (40%)
176-500                   80                 110             960                                  1320 (37.5%)
501-1000                 80                 175             960                                   2100 (118.75%)
1001-1500               80                 200             960                                   2400 (150%)
1501-5000               80                 300             960                                   3600 (275%)
5001 ఆపైన               80                 400             960                                   4800 (400%)
                                 (బ్రాకెట్లలో ఇచ్చినవి పెరుగుదల శాతం)
ఇంటి పన్నును బట్టి నీటి సరఫరా జరుగుతుందా?

నిజానికి ఇంటిపన్నుకు నీటి చార్జీలకు ఎలాంటి సంబంధంలేదు. భారీగా ఇంటిపన్ను కట్టే ధనవంతుని గృహానికైనా, అతతక్కువ ఇంటిపన్ను కట్టే పేదవాని గృహానికైనా కార్పొరేషన్‌ 1/2 అంగుళం నీటి కుళాయినే ఇస్తుంది. నీరిచ్చే సమయం కూడా ఇంటిపన్నును బట్టి మారదు. అందరికి ఉదయం సాయంత్రం 1గంట చొప్పున మాత్రమే నీటిని సరఫరా చేస్తారు. ఇంటి పన్ను ఎక్కువ చెల్లించేవారికి, తక్కువ చెల్లించేవారికి సరఫరా చేసే నీటి పరిమాణంలో తేడా ఉండదు. ఒకే పరిమాణంలో ఉంటుంది. అందువలన నీటి సరఫరాకు ఇంటిపన్నుకు సంబంధంలేదని ఈ సభ భావిస్తున్నది.
అపార్టుమెంట్లకు నీటి చార్జీలు
ఇప్పటికే అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి 3 కిలో లీటర్లకు 100 రు||, ఆ పైన ప్రతి కిలో లీటరుకు రు||8.25లు చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని ఈ క్రింది విధంగా మార్చారు.
మీటర్‌ రీడింగ్‌        చార్జీ రు||లలో                                  31.3.2013 వరకు     1.4.13నుండి
                                                                                   చెల్లించినది             చెల్టిస్తున్నది
                                                             రు||లలో           రు||లలో
0-9 కిలోలీ||         300                                                 100.00-149.50          300
10-18కిలో లీ||    300+ప్రతి కిలోలీటర్‌కు రు||12లు      157.75-223.75      312-408
19-25కిలో లీ||    408+ప్రతి కిలోలీటర్‌కు రు||15లు      232.00-281.50     423-513
26-50కిలో లీ||    513+ప్రతి కిలోలీటర్‌కు రు||20లు      289.75-487.75      533-1013
50 కిలో లీ|| పైన  1013+ప్రతి కిలోలీటర్‌కు రు||50లు   496.00 ఆ పైన      1063 ఆపైన

అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లో ఫ్లాట్‌ల సంఖ్య ఎక్కువ అయ్యేకొలది కుటుంబాల సంఖ్య కూడా పెరుగుతుంది. కుటుంబాల సంఖ్యను బట్టి నీటి వాడకం ఉంటుంది. ప్రతికుటుంబానికి ఒకేరకంగా నీరు వస్తున్నప్పటికీ మీటరు రీడింగు పెరగటంతో స్లాబ్‌ రేటు మారిపోయి, ప్రతి కుటుంబం అధిక రేటును చెల్లించవలసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వాడుతున్న నీటి పరిమాణం పెరగకుండానే స్లాబుల మూలంగా అధిక రేటు చెల్లించవలసి వస్తున్నది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, నీటి ఛార్జీలను తక్షణమే 31.03.2013 నాటికి పూర్వం ఉన్న ధరకు తగ్గించాలని, ఆమేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో ఒక తీర్మానం చేయాలని, ఈ సభ కోరుతున్నది. అదేవిధంగా నీటి కనెక్షకు డొనేషన్‌ విధానాన్ని రద్దు చేసేవిధంగా కౌన్సిల్‌లో ఒక తీర్మానం చేయాలని ఈ సభ కోరుతున్నది. మంచినీటి సరఫరాకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మున్సిపల్‌ ఫండు నుండి భరించాలని, మున్సిపల్‌ ఫండుకు రావలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వంనుండి తెప్పించుకోవాలని ఈ సభ కౌన్సిల్‌కు సూచిస్తున్నది.
తీర్మానం నెంబరు-3
మంచినీటి సరఫరా
స్వఛ్ఛమైన నీరు పొందటం విజయవాడ నగర ప్రజలహక్కు. స్వఛ్ఛమైన నీరు అందించటం మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాధ్యత. కనుక మున్సిపల్‌ కార్పొరేషన్‌ విజయవాడ నగర ప్రజలకు స్వఛ్ఛమైన నీరు సరఫరా చేయాలి. ఏ మాత్రం రంధ్రాలు లేని నాణ్యమైన పైపులనే నీటి సరఫరాకు వాడాలి. తద్వారా నీటి వృధా అరికట్టాలి. నగర ప్రజలకు పూర్తిగా కృష్ణా నదిలోని పారుదల నీళ్లనే సరఫరా చేయాలి.విజయవాడ పరిధిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరియు మినరల్‌ వాటర్‌ కంపెనీల ఆధీనంలోని బోరు బావులను మూసివేయటం ద్వారా భూగర్భ జలాల పరిరక్షణను చేపట్టాలి. ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలని ఈ సభ కోరుతున్నది.
త్రాగునీరు, వాడుక నీరు, చిన్న పరిశ్రమలకు నీటి సరఫరా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు విజయవాడ నగరానికి ఏటా 5 టి.యం.సీల నీరు అవసరమున్నది. కృష్ణ నదిమీదనున్న ప్రకాశం బ్యారేజినుండి ప్రతి ఏటా 400 నుండి 800 టి.యం.సీల వరకు నీరు వృధాగా సముద్రంలో కలసి పోతున్నది. అందువలన విజయవాడ నగరానికి 5 టి.యం.సీల పైగా నీటి నిల్వ సామర్ధ్యమున్న రిజర్వాయర్లు అవసరం. 5 టి.యం.సీల నీటిని నిల్వ ఉంచడానికి ప్రకాశం బారేజికి దిగువ భాగాన కృఫ్ణ నదికి చెక్‌ డామ్‌ను నిర్మించాలని ఈ సభ నూతన కౌన్సిల్‌ను కోరుతున్నది. ఆ మేరకు ఒక తీర్మానాన్ని కౌన్సిల్‌లో ఒక తీర్మానం చేయాలని ఈ సభ కౌన్సిల్‌ ను కోరుతున్నది. విజయవాడ నగరం మొత్తానికి కృష్ణ నది నీటిని సరఫరా చేయాలని ఈ సభ కోరుతున్నది.
గతంలో నివాస గృహాలకు నీటి మీటర్లు పెట్టాలని కార్పొరేషన్‌ ప్రయత్నించింది. ప్రజల ప్రతిఘటనతో ఆగింది. ఆ తరువాత షాపులకు నీటిమీటర్లు పెట్టారు. నివాస గృహంలో ఒక పోర్షన్‌ షాపుకు అద్దెకు ఇచ్చినా, నీటి వినియోగంతో సంబంధం లేకుండా, ఆ మొత్తం ఇంటిని కమర్షియల్‌గా పరిగణించి నీటిమీటర్లను పెట్టారు. ఎక్కువ పోర్షన్లు ఉండి అద్దెలకు ఇచ్చారన్న సాకుతో నివాసగృహాలకు నీటి మీటర్లు పెట్టే ప్రయత్నం కార్పొరేేషన్‌ చేసింది. ఎట్టిపరిస్థితులలోనూ నివాసగృహాలకు నీటి మీటర్లను పెట్టే ప్రతిపాదనలను ఆమోదించరాదని ఈ సభ నూతన కౌన్సిల్‌ను కోరుతున్నది.షాపులలో వ్యాపారం జరుగుతుంది కాబట్టి నీటి మీటర్లు పెట్టరాదు. నీటి వినియోగం కమర్షియల్‌గా ఉన్నప్పుడే మీటర్లు పెట్టాలి. షాపులలో త్రాగునీరు, టాయిలెట్స్‌ అవసరాలకు వినియోగించే నీటిని కమర్షియల్‌గా పరిగణించరాదని ఈ సభ నూతన కౌన్సిల్‌ను కోరుతున్నది. ఇప్పటికే త్రాగునీరు, టాయిలెట్స్‌ అవసరాలకు తప్ప మరే ఇతర అవసరాలకు నీటిని వినియోగించని షాపులకు అద్దెకు ఇచ్చిన నివాసగృహాలకు అమర్చిన నీటి మీటర్లను తొలగించేవిధంగా కౌన్పిల్‌లో ఒక తీర్మానం చేయాలని, ఈ సభ కోరుతున్నది.
అద్దెలకుండే వారికి కూడా నీటిని సరఫరా చేయవలసిన బాధ్యత కొర్పోరేషన్‌దే నన్న వాస్తవాన్ని గుర్తించాలని, అద్దెలకుండే వారు లేకుండా నగరం, నగరంగా ఉండదని, అద్దెలకుండేవారుకూడా నగరంలో ఒక భాగమని, వారు కూడా యజమానులతో సమానంగా రాష్ట్ర అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని అందువలన అందువలన ఎక్కువ పోర్షన్లు ఉండి అద్దెలకు ఇచ్చారన్న సాకుతో నివాసగృహాలకు నీటి మీటర్లు పెెట్టే ప్రతిపాదనలను ఏమైనా కౌన్సిల్‌ముందుకు వస్తే వాటిని తిరస్కరించాలని ఈ సభ నూతన కౌన్సిల్‌ను కోరుతున్నది.
జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం. పథకం క్రింద పేదలకు అపార్టుమెంట్ల రూపంలో నిర్మించి ఇచ్చిన ఇళ్ళకు పై అంతస్తువరకు నీటిని చేర్చే బాధ్యత కార్పొరేషన్‌దే నని, అందువలన పై అంతస్తువరకు నీటిని చేర్చడానికి కార్పొరేషన్‌ తగిన చర్యలు చేపట్టాలని,. అందుకు అయ్యే ఖర్చు మొత్తం కార్పొరేషనే భరించాలని, సాధారణ నివాస గృహానికి వసూలు చేస్తున్న విధంగానే వీరినుండి కూడా నీటి చార్జీలు వసూలు చేయాలని దానికి తగిన విధంగా కౌన్పిల్‌లో తీర్మానం చేయాలని, ఈ సభ కోరుతున్నది.
మంచినీటి సరఫరా ఎట్టి పరిస్థితులలో ప్రైవేటీకరించరాదని, ప్రైవేటీకరణ కోసం అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కౌన్సిల్‌ దానిని వ్యతిరేకించాలని ఈ సభ కోరుతున్నది.
తీర్మానం నెంబరు-4
డ్రైనేజి చార్జీలు
ప్రత్యేక అధికారి పాలనలో విజయవాడ నగరంలో భూగర్భ డ్రైనేజి చార్జీలను రెట్టింపు చేశారు. 31.03.2013 నాటికి టాయిలెట్‌కు నెలకు రు|| 15 లుగా ఉన్న భూగర్భ డ్రైనేజి చార్జీని 01.04.2013 నుండి నెలకు రు|| 30లు చేశారు. అంటే సంవత్సరానికి టాయిలెట్‌కు రు|| 180ల నుండి రు|| 360లకు పెంచారు. ఈ చార్జీలను చెల్లించడం కన్నా లెట్రిన్‌ బావులను వాడుకోవటం చౌక అవుతుంది. ప్రజారోగ్యంలో భాగంగా భూగర్భ డ్రైనేజి ఏర్పాటు చేస్తారు. కనుక భూగర్భ డ్రైనేజి నిర్వహణకు నిధులు చాలక పోతే అవసరమైననిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్యశాఖనుండి తెప్పించుకోవాలే తప్ప ప్రజలమీద భారాలను వేయరాదని ఈ సభ కోరుతున్నది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భ డ్రైనేజి చార్జీలను 31.03.2013 స్థాయికి తగ్గించడానికి తగిన చర్యలను తీసుకోవలసిందిగా ఈ సభ నూతన కౌన్సిల్‌ను కోరుతున్నది.
తీర్మానం నెంబరు-5
చెత్తపన్ను
ప్రత్యేక అధికారి పాలనలో విజయవాడ నగరంలో యూజర్‌ చార్జీల పేరుతో చెత్తపన్నును విధించారు. గతంలో కౌన్సిల్‌ తిరస్కరించినప్పటికీ ఈ పన్నును విధించారు. ఇది చ్టటవిరుధ్ధం మరియు అప్రజాస్వామికం. కనుక యూజర్‌ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న చెత్తపన్నును తక్షణమే రద్దు చేయటానికి నూతన కౌన్సిల్‌ తగిన చర్యలను చేపట్టవలశిందిగా ఈ సభ కోరుతున్నది.
తీర్మానం నెంబరు-6
ఆస్తిపన్ను పెంపుదల
కార్పొరేషన్‌ పరిధిలో వివిధ రూపాలలో ఆస్తి పన్నును భారీగా పెంచుతూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం 1955 కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఇంటికి సెట్‌ బ్యాక్‌ ( ప్లాను ప్రకారం చుట్టూ వదలవలసిన స్థలం) వదలటంలో 10 శాతం వరకు అతిక్రమిస్తే పెనాలిటీగా ఆస్తిపన్ను ఇప్పుడున్న దానిపై 25 శాతం పెంచుతారు 10 శాతానికి మించి అతిక్రమిస్తే పెనాలిటీగా ఆస్తిపన్ను ఇప్పుడున్న దానిపై 50 శాతం పెంచుతారు. వాస్తుపేరుతోనో, మరేపేరుతోనో కొద్దో గొప్పో డీవియేషన్‌తో ఉండే గృహాలే నగరంలో అత్యధికంగా ఉంటాయి. అంటే నగరంలోని అత్యధిక గృహాలకు ఆస్తిపన్నును భారీగా పెంచబోతున్నారు.
ఇంటిపై అసలు ప్లాను లేకుండా చిన్న గది వేసినా ఆ ఇంటి మొత్తాన్ని అక్రమంగా పరిగణించి ఇప్పుడున్న పన్నుకు 100 శాతం పెంచుతారు.అంటే రెట్టింపు చేస్తారు.అపార్టుమెంట్లపై బిల్డర్‌ ప్లానులేకుండా పెంట్‌ హౌస్‌ వేస్తే ఆ అపార్టుమెంట్‌ మొత్తాన్ని ప్లాను లేనిదిగా పరిగణించి అ అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లోని అన్ని ఫ్లాట్‌లకు ఆస్తిపన్ను రెట్టింపు చేస్తారు. బిల్డర్లు అధికారులు కుమ్మక్కై చేస్తున్న తప్పుకు అపార్టుమెంట్లను కొనుక్కున్నవారిని బలి చేయబోతున్నారు.
ఇప్పటివరకు ఆయా ప్రాంతాలలోని అద్దె విలువలను తీసుకొని దానిలో 22 శాతంగా ఆస్తి పన్నును లెక్కిస్తున్నారు. ఇకమీదట అద్దె విలువ కాకుండా, ఆస్తి విలువను తీసుకొని (అంటే ఇల్లు అమ్మితే రిజిస్ట్రార్‌ ఆఫీసులో స్టాంపు డ్యూటీ కోసం లెక్కించే విలువను తీసుకొని) దానిలో శాతంగా ఆస్తిపన్నును లెక్కిస్తారు ఈ చర్యలన్నీ భారీగా ఆస్తిపన్నును పెంచటానికి ఉద్దేశించినవేనని ఈ సభ స్పష్టం చేస్తున్నది. ఇది అమలు జరిగితే నగరంలో నివశించటమే కష్టమౌతుంది. ఇళ్ల పన్నులు కట్టలేక గృహ యజమానులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. అందువలన ఈ చట్టసవరణలను రద్దు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నూతన కౌన్సిలో తీర్మానించవలసిందిగా ఈ సభ కోరుతున్నది.

తీర్మానం నెంబరు-7
కమ్యూనిటీ హాళ్ళు-కర్మల భవన్‌లు- కళ్యాణ మంటపాలు
విజయవాడ నగరంలో కమ్యూనిటీ హాళ్ళు, కర్మల భవన్‌లు, కళ్యాణ మంటపాలను ప్రత్యేకఅధికారి పాలనలో ప్రైవేటు కాంట్రాక్టక్టర్లకు అప్పగించింది. విజయవాడ నగరంలో అద్దెలకుండే వారు గాని సొంత ఇళ్ళవారు కాని ఇళ్ళ వద్ద శ్రార్ధఖర్మలు చేసుకునే అవకాశం లేనందున, శ్రార్ధఖర్మలు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాలు అవసరమైనందువలననే కర్మల భవన్‌లను కార్పొరేషన్‌ ఏర్పాటు చేయవలసి వచ్చిందని ఈ సభ స్పష్టం చేస్తున్నది. నగరంలో ఇంకా అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేయవలసి ఉండగా, ఉన్న కర్మల భవన్‌లను ప్రైవేటువారికి అప్పగించటం సరైందికాదని,. ప్రస్తుతం కార్పొరేషన్‌ తీసుకుంటున్నచర్య చనిపోయినవారికి శ్రార్ధఖర్మలను నిర్వహించుకోవడానికి, పిండ ప్రదానాలను పెట్టుకోవడానికి కూడా ప్రైవేటు వారిమీద ఆధారపడవలసిన దుస్థితికి నెట్టింది.

భారత రాజ్యాంగం ఆర్టికల్‌19(1) (ప) ప్రకారం సభలు సమావేశాలు జరుపుకోవటం నగర పౌరులకున్న ప్రాధమిక హక్కు. కళ్యాణ మంటపాలను, కమ్యూనిటీ హాళ్ళను ప్రైవేటీకరిస్తే, ప్రజలు ఆహక్కుకు దూరమవుతారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో 17 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రజలు తాము నివశించే ప్రాంతాలలో తాము ఒకచోట చేరి వివిధ అంశాలపై చర్చించుకోవలసియున్నది. అలాగే నగరంలో ఉన్న ట్రేడ్‌ యూనియన్లు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంఘాలు, రాజకీయ పార్టీలు సభలు,సమావేశాలు జరుపుకోవలసి యున్నది. సభలూ సమావేశాలు జరిగినప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాతంత్రహక్కు అమలు జరుగుతుంది. అందుకోసమే ప్రతి డివిజన్‌లో కమ్యూనిటీ హాళ్ళు, ఖాళీ స్థలాలు అవసరమని ఈ సభ భావిస్తున్నది.
ఈ ప్రైవేటీకరణ వలన కళ్యాణ మంటపాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తిగా సాధారణ ప్రజలకు అందు బాటులో లేకుండా పోతున్నాయి దీనివలన బాగుపడేది ప్రైవేటు వ్యక్తులు తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని ఈ సభ భావిస్తున్నది. మున్సిపల్‌ కళ్యాణ మంటపాలు ప్రైవేటు వారికి ఇవ్వటంతో ఔత్సాహికులైన కళాకారులకు డబ్బు ఉంటే తప్ప వేదికలు అందు బాటులో లేని పరిస్థితి నగరంలో ఏర్పడింది. కళా రూపాలు జాతి సంపద లని వాటిని ప్రోత్సహించకపోతే అవి నశించి పోతాయని, కళారూపాలు నశించటం అంటే జాతిలో జీవ కళ నశించడమే అవుతుందని ఈ సభ భావిస్తున్నది. అందువలన కళాకారులు కళను నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి నగరంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని వాటికి కమ్యూనిటీ హాళ్ళను కళ్యాణ మంటపాలను అందుబాటులో ఉంచాల్సియున్నది.
అందువలన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారుల పాలనలో లీజుపేేరుతో ప్రైవేటు వారికి అప్పగించిన కర్మల భవన్‌లు,కమ్యూనిటీ హాళ్ళు, కళ్యాణ మంటపాల లీజులను రద్దు చేశి తిరిగి కార్పొరేషన్‌ నిర్వహించేవిధంగా చర్యలు చేపట్టాలని ఈ సభ కౌన్సిల్‌ను కోరుతున్నది.
తీర్మానం నెంబరు-8
నగర విస్తరణకై మెట్రో రైలు
దేశంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం, పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థ ఏర్పాటులో భాగంగా అనేక నగరాలలో మెట్రో రైలును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కలకత్తా, ఢిల్లీ నగరాలలో మెట్రో రైళ్ళు నడుస్తున్నాయి. బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు నగరాలలో కూడా మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆనగరాలు విపరీతంగా పెరిగి పోవటంతో మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయటానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. మెట్రో రైలు వ్యవస్థ మన విజయవాడ నగరానికి కూడా అవసరమున్నది. దీని వలన ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదు. నగర ప్రజలు వేగంగా ప్రయాణించడానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
విజయవాడ నగరంలో ఈ దిగువ సూచించిన మార్గాలలో మెట్రో రైలు వేయవచ్చు.
01.కొండపల్లి-ఇబ్రహింపట్నం- గుంటుపల్లి- గొల్లపూడి- విజయవాడ రైల్వేస్టేషన్‌-సాంబమూర్తి రోడ్డు లేదా బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు- ఏలూరు రోడ్డు- గుణదల- రామవరప్పాడు జంక్షన్‌- ప్రసాదంపాడు- నిడమానూరు- గన్నవరం.
02.రామవరప్పాడు జంక్షన్‌- ప్రసాదంపాడు- ఆటోనగర్‌- యనమల కుదురు- కంకిపాడు
03.రామవరప్పాడు జంక్షన్‌- రింగురోడ్డు- నిర్మలా కాన్వెంట్‌-పంటకాల్వ-ఆటోనగర్‌- యనమల కుదురు- కంకిపాడు.
04.కంకిపాడు-ఆటోనగర్‌- నిర్మలా కాన్వెంట్‌ - కృష్ణ లంక రోడ్డు లేదా బందరురోడ్డు- బస్‌ స్టాండ్‌- విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా కొండపల్లి
05. విజయవాడ రైల్వేస్టేషన్‌- అయోధ్య నగర్‌- న్యూరాజరాజేశ్వరీ పేట- సింగ్‌ నగర్‌- పాయకా పురం- పాతపాడు-నున్న- ముస్తాబాద్‌-ఆగిరిపల్లి- నూజివీడు.
ఇవి కొన్ని సూచనలు మాత్రమే. మరింత ప్రయోజనకరంగా ఉంటాయనుకుంటే వీటిలో మార్పు చేసుకోవచ్చు.
విజయవాడ నగరంలో మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇదే సరైన సమయం. కారణం ఇప్పుడు వేస్తే తక్కువ ఇబ్బందితో ఏర్పాటు చేయవచ్చు. నగరం మరింతగా పెరిగిన తర్వాత వేయాలంటే చాలాఖర్చవుతుంది, విపరీతమైన ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడైతే ఖర్చు, ఇబ్బంది రెండూ తక్కువగానే ఉంటాయి.
మెట్రో రైలు వ్యవస్థ కేవలం ప్రస్తుతమున్న ట్రాఫిక్‌ సమస్య సరిష్కారానికి మాత్రమే కాదు. నగర విస్తరణకు కూడా మెట్రో రైలు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రైలు రూట్లను చుట్టుకొని నగరం పెరుగుతుంది. కనుక ఇది నగరాభివృద్ధికి దోహదపడుతుంది. అందువలన విజయవాడ నగరానికి మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్‌లో ఒక తీర్మానం చేయవలసిందిగా ఈ సభ నూతన కౌన్సిల్‌ను కోరుతున్నది.
తీర్మానం నెంబరు-9
నగర పాలక సంస్థకు నిధులు
నగర పాలక సంస్థ నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నది. నగరం ఏ పని జరగాలన్న నిధులు అవసరం. నిధులు లేవన్న సాకుతో కార్పోరేషన్‌ ప్రజలమీద విపరీతంగా పన్నులు భారాలు మోపుతున్నది. కాని కార్పోరేషన్‌కు రాష్ట్రప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇవ్వటంలేదు. రాష్ట్రాభివృధ్ధి కోసం మనం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము. స్థానికాభివృధ్ధి లేకుండా రాష్ట్రాభివృధ్ధి ఉండదు. కనుక స్థానికాభివృధ్ధికోసం స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయరనుండి నిధులు కేటాయించాలి. వాటిలో విజయవాడ అభివృధ్దికి రావలసిన మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయరనుండి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్లు తేల్చి చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇచ్చి, అవి చాలక పోతే అప్పుడు పన్నులు పెంచినా అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులను ఇవ్వకుండా దారిమళ్ళిస్తూ, స్థానికావసరాల కోసం మరల ప్రజలమీద భారాలు మోపటం సరైందికాదని ఈ సభ భావిస్తున్నది.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్ను, పన్నేతర ఆదాయాలనుండిి స్థానిక సంస్థలకు 40 శాతం వాటా ఖచ్చితంగా ఇవ్వాలని, అందులో 70 శాతం పంచాయతీ సంస్థలకు, 30 శాతం పట్టణ స్థానిక సంస్థలకు ఇవ్వాలని ఈ సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. అదేవిధంగా రోడ్డు టాక్స్‌లో 10 శాతం, ఎంటర్‌టైన్‌మెంట్‌ టాక్స్‌లో 90 శాతం, రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వాటా తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఇవ్వాలని ఈ సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. మున్సిపల్‌ ఉద్యోగులకు జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
నగర పాలక సంస్థ చేసే ప్రతి సేవకు, ప్రతి పనికీ విడివిడిగా ఆదాయ వ్యయాలు లెక్కగట్టే పధ్ధతిని విరమించుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానికాభివృధ్ధికై స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన వాటాను నిలిపి వేయటం కోసం నగరపాలక సంస్థకు ఆస్తిపన్నును ప్రధానమైన ఆదాయ వనరుగా చేయాలన్న కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ఆలోచనలను ఈ సభ తిరస్కరిస్తున్నది. , కార్పొరేషన్‌ అందించే ప్రతి సేవకు, ప్రతి పనికీ పూర్తిఖర్చును యూజర్‌ చార్జీల పేరుతో నగర ప్రజలనుండే రాబట్టాలన్న కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఈ సభ కోరుతున్నది.
నగరపాలక సంస్థకు ప్రతి ఏటా విధిగా ఆడిట్‌ నిర్వహించాలని. ఆడిట్‌ రిపోర్టును ప్రజలకు బహిరంగ పరచాలని, అవసరమైతే సోషల్‌ ఆడిట్‌ నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని ఈ సభ కోరుతున్నది.
నగరానికి పెనుభారంగా పరిణమించిన జె.యన్‌,యన్‌.యు. ఆర్‌.యం పథకంనుండి విజయవాడనగరాన్ని తొలగించాలని ఈ సభ కోరుతున్నది.
తీర్మానం నెంబరు-10
గ్రీన్‌ సిటీ
విజయవాడ నగరంలో రేడియేషన్‌ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. నగరంలో వృక్షజాతి నశించటం దీనికి కారణం. విజయవాడ నగరంలో గతంలో రోడ్ల ప్రక్కన చెట్టు ఉండేవి. రోడ్ల వెడల్పు పేరుతో వాటిని కొట్టివేశారు. తిరిగి మొక్కలను నాటలేదు. అదేవిధంగా ఇళ్ళకు ప్లాను ఇచ్చే టప్పుడు ఇంటిముందు మెక్కలు నాటాలనే నిబంధన అమలు జరగటంలేదు. ఫలితంగా నగరంలో రేడియేషన్‌ విపరీతంగా పెరుగుతున్నది. ఈ పరిస్థితి మారాలని ఈ సభ భావిస్తున్నది.దేశంలో అనేక నగరాలలో విపరీతంగా చెట్లు పెంచుతుండగా మన నగరంలో మాత్రం చెట్లకు బదులు అక్కడక్కడా చిన్న చిన్న మొక్కలు మాత్రం పెంచుతున్నారు. ఇది నగరంలో ఉష్ణతాపాన్ని తగ్గించటానికి ఏ మాత్రం చాలవు. అందువలన నగరంలో వృక్షజాతుల పెంపకానికి చర్యలు చేపట్టాలని నగరాన్ని గ్రీన్‌ సిటీగా తయారుచేయాలని ఈ సభ కోరుతున్నది. దీనికోసం నగరంలో డివైడర్ల మధ్యలో పూల మెక్కలకు బదులుగా వృక్ష జాతులు ముఖ్యంగా వేప, రావి తదితర వృక్షజాతులు పెంచాలని, నగరంలో 250 గజాలకు పైన స్థలాలలో ఇళ్ళు నిర్మించేవారు విధిగా మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపట్టాలని , వీలైనన్ని చోట్ల మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపట్టాలని ఈ సభ కౌన్సిల్‌ను కోరుతున్నది.


తీర్మానం నెంబరు-11
సోలార్‌ సిటీగా అభివృద్ధి
రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రం కాబోతున్నది.విద్యుత్‌ ఉత్పత్తిని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వటంతో విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. దీనితో నగర ప్రజలపై విపరీతంగా భారం పడుతున్నది. నగర పాలక సంస్థపై కూడా విపరీతంగా భారం పెరుగుతున్నది. ఈ భారాలను తగ్గించుకోవలసిన అవసరమున్నది. అదేవిధంగా రాష్ట్రంలో ధర్మల్‌ విద్యుత్‌ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటంలో మననగర పాత్ర కూడాఉండాలని ఈ సభ భావిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో సోలార్‌ విద్యుత్‌ ప్రత్యామ్నాయంగా ఉన్నది. కావున నగరంలో సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని నగరాన్ని సోలార్‌ సిటీగా అభివృధ్ధి చేయాలని ఈ సభ కౌన్సిల్‌ను కోరుతున్నది.
తీర్మానం నెంబరు-12
ఫ్లై ఒవర్‌లు- బ్రిడ్జిలు
బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌
నగరంలో ఫ్లై ఓవర్‌ల నిర్మాణం కార్యరూపం దాల్చడంలేదు. గతంలో విజయవాడ నగరంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పోలీస్‌ కంట్రోల్‌ రూంనుండి వినాయకుని గుడివరకు 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్లైఓవర్‌ నిర్మించారు. కాని అది ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించక పోగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ సమస్యకు అదే కారణమవుతున్నది. ప్రస్తుతం పాల ఫ్యాక్టరీ వద్ద రైల్వే లైను పై నిర్మించిన ప్లై ఓవర్‌ ప్రయోజనకరంగా ఉన్నప్పటికి నగరంలో ఉన్న ట్రాఫిక్‌ సమస్యకు పూర్తి పరిష్కారం చూపేదిగా లేదు.
ఎప్పటి నుండో బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణం ప్రతిపాదన ఉన్నది. 5,9 నెంబర్ల జాతీయ రహదారి నుండి వచ్చే ట్రాఫిక్‌, బందరు రోడ్డు నుండి వచ్చే ట్రాఫిక్‌ బెంజి సర్కిల్‌ వద్ద కలవటంతో విపరీతంగా రద్దీ ఏర్పడి ట్రాఫిక్‌ నిలిచి పోతున్నది. దీనితో నగరవాసులకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది.అందువలన బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ ను నిర్మించాలని విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా కోరుతున్నారు. అయినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు..
ప్రధానంగా జాతీయ రహదారి మీద వస్తున్న భారీ వాహనాల వలననే బెంజి సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతున్నది. కారణమేమంటే మహాత్మా గాంధీ రోడ్డు మీద బెంజి సర్కిల్‌ వద్ద ఎలాంటి వాహనాలు ఆగవు. ఆగే అవసరం కూడా లేదు. అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే స్థానిక వాహనాల వలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తడం లేదు. ట్రాఫిక్‌ సమస్యకు కారణం జాతీయ రహదారి మీద వస్తున్న భారీ వాహనాలే. కనుక భారీ వాహనాలను మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చేస్తే అక్కడ ట్రాఫిక్‌ సమస్య ఉండదు. జాతీయ రహదారిపై ప్లైఓవర్‌ను నిర్మిస్తే ఈసమస్య పరిష్కారమౌతుంది..జాతీయ రహదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. బెంజ్‌ సర్కిల్‌తో బాటుగా నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు, ప్రభుత్వ ఐ.టి.ఐ.నుండి గురునానక్‌నగర్‌ వెళ్ళే రోడ్డు జాతీయ రహదారిని దాటుతున్నాయి. ఈ మధ్యలో ఉన్న కాలనీలలో ఇంకా అనేక చిన్న రోడ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక ముఖ్యమైన విద్యాలయాలు కూడా ఉన్నాయి. జాతీయ రహదారిమీద స్క్యూ బ్రిడ్జినుండి మొదలై హెల్త్‌ యూనివర్శిటీవరకు ప్లైఓవర్‌ నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారి వలన, నగరం జాతీయ రహదారికి తూర్పు, పడమర ప్రాంతాలుగా చీలి ఉన్నది. జాతీయ రహదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ రెండు ప్రాంతాలు కలిసి పోతాయి. ఆటోనగర్‌లోకి భారీ వాహనాలు ప్రవేశించడానికి గురునానక్‌ రోడ్డు ప్రత్యామ్నాయ రోడ్డుగా అభివృద్ధి చెంది, పడమటలో ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది. రోడ్డుకు ఇరు వైపులనున్న కాలనీల నుండి వచ్చే రోడ్లు కలిసి పోవడంతో కొన్ని రోడ్ల మీదనే ఏర్పడుతున్న ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది.
నగరంలో నిర్మించే ప్లైఓవర్‌ నగర ప్రజలకు సౌకర్యయుతంగా ఉండటమే కాకుండా, నగర అందాన్ని ఇనుమడింపజేసేదిగా కూడా ఉండాలి. జాతీయ రహదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తేనే నగర ప్రజలకు సౌకర్యంతో బాటుగా, నగరానికి వన్నె తెచ్చేదిగా ఉంటుంది.
అంతే కాకుండా జాతీయ రహదారిపై ప్లైఓవర్‌ను నిర్మించవలసింది జాతీయ రహదారుల సంస్థ(చీనూI). అది జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు నగరపాలక సంస్థకు ఆర్ధిక భారం తప్పుతుంది. నగర ప్రయోజనం నెరవేరుతుంది.
ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్‌
నగరంలో మరో ముఖ్యమైన ఫ్లై ఓవర్‌ ఇంద్రకీలాద్రి వద్ద నిర్మించవలసి యున్నది. విజయవాడ నగరం ఒక యాత్రా స్థలం. ఇంద్ర కీలాద్రి వద్ద నిరంతరం భక్తులతో రద్దీగా ఉంటుంది. దీనితో బాటుగా ఈ మార్గం జాతీయ రహదారి కావటంతో గట్టువెనుక నుండి వచ్చే ట్రాఫిక్‌ యావత్తూ ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఫలితంగా నిరంతం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. ఇక్కడ ఫ్లై ఓవర్‌ నిర్మించవలసిన అవసరం ఉన్నది. అయితే ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలంటే ఎక్కువ సమయంపట్టడం వలన అంతకాలం ట్రాఫిక్‌ను ఆపటం కుదరదని, అందువలన ఫ్లై ఓవర్‌ను నిర్మించడం సాధ్యపడదని కొంతమందినుండి వస్తున్న వాదన అసంబధ్ధ మైనదని ఏదైనా ఒక ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరిగేటప్పుడు ట్రాఫిక్‌ను మళ్ళించవలసి ఉంటుంది. ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు కనీస స్థాయిలో ఉండేవిధంగా చూడాలే తప్ప అసలు ఇబ్బందులు లేకుండా ఏ ఫ్లై ఓవర్‌ లేదా ప్రాజెక్టుల నిర్మాణం జరగదు. ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపడితే ట్రాఫిక్‌ను మళ్ళించడానికి అవకాశం ఉంది. జాతీయ రహదారిమీద వచ్చే వాహనాలను కబేళా మీదుగా పాలప్యాక్టరీ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ మీదుగా సింగ్‌ నగర్‌ పైపుల రోడ్డు, పాయకా పురం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ,రామవరప్పాడు వద్ద చెన్నై, విశాఖ వైపు వెళ్ళే వాహనాలు వెళ్ళ వచ్చు. లేదా పైపుల రోడ్డునుండి సింగ్‌ నగర్‌ , గవర్నమెంట్‌ ప్రెస్‌, బి.ఆర్‌.టి.స్‌ రోడ్డు మీదుగా రామవరప్పాడు చేరవచ్చు. ఆ విధంగా ట్రాఫిక్‌ను మళ్ళించడం ద్వారా ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని ఈ సభ కోరుతున్నది.
నగరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుందన్న వాదన కూడా ఉంది. ఇది కూడా పూర్తిగా వాస్తవంకాదు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేస్తే దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు మాత్రం నగరంలోకి రాకుండా పోతాయి. అంతే తప్ప, బస్సులు, మినీ లారీలు, ఆటోలు, చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నగరంలోనే తిరుగుతాయి. నగరంలో అవసరమున్న లారీలు కూడా నగరంలోకి రాక తప్పదు. ఉదాహరణకు గృహనిర్మాణం జరుగుతున్నప్పుడు, ఇసుక, సిమెంట్‌ లారీలు, మట్టి తోలే ట్రాక్టర్లు నగరంలోకి రావలసిందే. బస్సులు, ఆటోలు, చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల సంఖ్య ఏటా పెరుగుతున్నది.అందువలన ఔటర్‌ రింగ్‌ రోడ్డు మూలంగానే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమౌతుందన్న వాదన సరైందికాదు. హైదరాబాదు, గుంటూరు, విశాఖ పట్టణం, ఢిల్లీ లాంటి నగరాలను తీసుకున్నా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వలన ట్రాఫిక్‌ సమస్య పరిష్కారర కాలేదు. ప్లైఓవర్‌ల నిర్మాణం ప్రస్తుత అవసరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వేసేది కాదు. భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వేస్తారు. కనుక నగరంలో ప్లైఓవర్‌ల నిర్మాణం తప్పనిసరియని ఈ సభ భావిస్తున్నది.
చిట్టినగర్‌ కేదారేశ్వరపేట రైల్వే ఓవర్‌ బ్రిడ్జి.
చిట్టినగర్‌ కేదారేశ్వరపేటలను కలుపుతూ రైల్వే ట్రాక్‌పై ఉన్న ఓవర్‌ బ్రిడ్జి పాతదై పోవటంతో బాటుగా ప్రస్తుత ట్రాఫిక్‌కు సరిపోవటంలేదు. ఇది ఒన్‌ టౌన్‌, టూ టౌన్‌ లను కలుపుతూ ఉన్న ప్రధానమైన మార్గంగా ఉన్నది. అందువలన ఈ ఓవర్‌ బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల నూతన ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి తగిన చేపట్టాని ఈ సభ కోరుతున్నది.
కృష్ణ నదిపై బ్రిడ్జి:
కృష్ణానదికి దక్షిణం వైపున మంగళగిరి, అమరావతి మధ్యలో అనేక గ్రామాలున్నాయి. వీరిలో అత్యధికులు ప్రతి రోజు విజయవాడ ఏదో ఒక పనిమీద వచ్చి పోతుంటారు. ముఖ్యంగా సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌,ఎర్రుబాలెం, పెనుమాక, నవులూరు, కృష్ణాయపాలెం తదితర గ్రామాలనుండి ప్రతి రోజు విజయవాడ వచ్చి పనులు చేసుకొని పోతుంటారు. వీరిలో అత్యధికులకు నివాసం ఆ గ్రామాలలో ఉంటే, ఉపాధి మాత్రం విజయవాడలో ఉంటుంది.అందువలన వీరు అనివార్యంగా విజయవాడ రావలసియున్నది.
గతంలో ఈ గ్రామాలనుండి ప్రకాశం బ్యారేజిమీదుగా అత్యధికంగా బస్సులు ఉండేవి. అవి ఆప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేవి. ఆ తరువాత ప్రకాశం బ్యారేజిమీద బస్సులరాక పోకలను నిలిపి వేశారు. దీనితో ఆప్రాంత ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. కేవలం మంగళగిరినుండి మాత్రమే కనక దుర్గమ్మ వారధి మీదుగా బస్సులు రావటానికి వీలుంది. కాని సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌, నవులూరు,ఎర్రుబాలెం,పెనుమాక, కృష్ణాయపాలెం, అమరావతి తదితర గ్రామాలనుండి నేరుగా విజయవాడకు బస్సులు రావటానికి మార్గం లేదు. ఒకటి రెండు బస్సులు మాత్రం ఉండవల్లి సెంటరునుండి కాలువ కట్టమీదుగా, రైలు పట్ల్టాల క్రిందుగా తిరిగి జాతీయ రహదారిలో కలసి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడకు రావలసి వస్తున్నది. ఇది చుట్టు తిరుగుడు ప్రయాణంగా ఉండటం, సమయం అధికంగా తీసుకోవటం, సౌకర్యంగా లేకపోవటంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించవలసి వస్తున్నది. కొంతమంది ఆ గ్రామాలలో ఉన్న తమ ఇళ్లను వదలి విజయవాడలో అద్దెకు ఇళ్ళు తీసుకొని నివశిస్తున్నారు. విజయవాడ వచ్చి పోవటానికి సరౖౖెన రహదారిలేక పోవటం వలననే ఆ ప్రాంతాల ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది.
ఏనగరానికైనా ఇతర ప్రాంతాలనుండి ప్రజలు నిరంతరం వచ్చి పోతుంటేనే ఆ నగరం అభివృధ్ధి చెందుతుంది. కనుక ప్రజలు నగరానికి వచ్చి పోవటానికి తగిన రహదారి ఏర్పాటు చేయవలసి ఉన్నది. అంతే కాకుండా విజయవాడ నగరం గన్నవరం, కంకిపాడుల వైపుమాత్రమే విస్తరిస్తున్నది. కాని దక్షిణం వైపు విస్తరించడానికి కృష్ణానది అడ్డుగా ఉన్నది. నగరం దక్షిణం వైపుకూడా విస్తరించాలంటే నదికి దక్షిణం ప్రాంతంలోని గ్రామాలను విజయవాడ నగరంతో అనుసంధానం చేస్తూ రహదారి ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాలనుండి సత్వర రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి.
అంతే కాకుండా విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలుగా ఉన్నాయి. కృష్ణా,గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఈ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి లేదు. ఉన్న కనకదుర్గమ్మ వారధి జాతీయ రహదారులకు చెందినది. జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అది ఉపయోగించుకునే అవకాశంలేదు. కనుక ఈ ప్రాంతంలో కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి అవసరం ఉంది.
రాష్ట్ర విభజన అనంతరం మన విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని ఏర్పడుతుందని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఈ బ్రిడ్జికి మరింత ప్రాధాన్యత ఉన్నదని ఈ సభ భావిస్తున్నది.
కృష్ణా నదికి దక్షిణం వైపున ఉన్న సీతానగరం నుండి, నదికి ఉత్తరం వైపున ఉన్న శనైశ్వరస్వామి గుడివరకు కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మిస్తే నదికి దక్షిణం వైపు ఉన్న గ్రామాల నుండి రాక పోకలు సజావుగా సాగుతాయి. బస్సు సౌకర్యం ఏర్పడుతుంది. రాక పోకలు సజావుగా సాగితే ఆగ్రామాల ప్రజలు విజయవాడకు నివాసం మార్చే అవసరం ఉండదు. విజయవాడ నగరం దక్షిణం వైపుకు కూడా విస్తరించడానికి ఈ బ్రిడ్జి దోహద పడుతుంది. కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టాలని ఈ సభ కౌన్సిల్‌ను కోరుతున్నది.
ఇతర ఫ్లై ఓవర్‌లు.
బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణంతో బాటుగా నగరంలో మరికొన్ని ఫ్లై ఓవర్‌లను నిర్మించవలసి యున్నది. వాంబే కాలనీ నుండి, మధురానగర్‌ వరకు రైల్వే ట్రాక్‌, బుడమేరు లపై ఫ్లైఓవర్‌ నిర్మించవలసి యున్నది.మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రైల్‌ అండర్‌ బ్రిడ్జి నిర్మించాలి. కృష్ణలంక రాఘవయ్య పార్కు సమీపంలో సబ్‌ వే నిర్మాణం కాని లేదా బందరు లాకుల వద్ద నుండి గౌతమీ నగర్‌ వరకు ఫ్లై ఓవర్‌ నిర్మించడం ద్వారా కృష్ణలంక వాసులకు బందరు రోడ్డు లోకి వచ్చే మార్గాన్ని కల్పించాలని ఈసభ కోరుతున్నది.


(వి.సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి














No comments:

Post a Comment