విజయవాడ నగరం ఎన్నో కళారూపాలకు నెలవుగా ఉంది. ఎందరో కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు ఈ నగరంలో ఉన్నారు. కాని నేడు విజయవాడ నగరంలో ఔత్సాహికులైన కళాకారులు, కళారూపాలను నేర్చుకోవాలన్నా, ప్రదర్శించాలన్నా హాళ్ళకు వేలాది రూపాయలు చెల్లించవలసివస్తున్నది. మున్సిపల్ కళ్యాణ మంటపాలు కూడా ప్రైవేటు వారికి ఇవ్వటంతో అవి కూడా డబ్బు ఉంటే తప్ప అందు బాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా అనేక కళారూపాలు మరుగున పడి పోతున్నాయి. ఏదైనా ఒక కళారూపం నేర్చుకోవాలన్నా, ప్రదర్శించాలన్నా హాలుకు వేలాది రూపాయలు చెల్లించాలి. దీనితో డబ్బు ఉన్న వారే వీటిని ప్రదర్శించగలుగుతున్నారు. కోలాటం, చెక్క భజన, తప్పెట గుళ్లు, తోలు బమ్మలాట, రుంజ వాయిద్యం తదితర జనపద కళారూపాలు మరుగున పడి పోతున్నాయి. వాటిని నేర్పేవారూ కరువవుతున్నారు. నేర్చుకోవాలంటే తగిన అవకాశాలూ లేవు. సంప్రదాయ నృత్యరీతులను ఆధునిక ఇతివృత్తాలతో మేళవించి సుసంపన్నంచేయాలన్నా వాటిని నేర్చుకోవటానికి తగిన అవకాశాలు లేవు. ఆధునిక ఇతివృత్తాలను రూపొందించాలంటే తగిన సాహిత్యవేదికలు నిర్వహించాలి. సాహితీవేత్తల సమ్మేళనాలు జరగాలి. దానికి తగిన సదుపాయాలు అవసరమున్నది. కళా రూపాలు జాతి సంపద. జాతి సృష్టించుకున్నవి. కళారూపాలు నానాటికి అభివృధ్ధి చెందాలే తప్ప నశించకూడదు. కళారూపాలు నశించటం అంటే జాతిలో జీవ కళ నశించడమే అవుతుంది. అందువలన కళాకారులు కళను నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి నగరంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు కావాలని ఈ సభ భావిస్తున్నది.
విజయవాడ నగర పరిసర ప్రాంతాలలోనే నూతన రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ నగరం పాలనారాజధానిగా మాత్రమే కాకుండా సాంస్కృతిక రాజధానిగా కూడా ఎదగాలని ఈ సభ కోరుకుంటున్పది. సాంస్కృతిక రాజధానిగా ఎదగాలంటే సాధారణంగా రోజువారీ తమ వృత్తులు చేసుకుంటూనే కళలు నేర్చుకోవటానికి వీలుగా తగిన సౌకర్యాలు ఉండాలి. గతంలో రాజులు, జమీందారులు కళా పోషకులుగా ఉండేవారు.అంటే ఆనాటి పరిపాలకులే కళా పోషకులుగా ఉండేవారు. నేటి ప్రజాతంత్ర దేశంలో ప్రభుత్వాలే కళా పోషకులుగా ఉండాలి. విజయవాడ నగరంలో కళా పోషణ బాధ్యతను మున్సిపల్ కార్పొరేషన్ స్వీకరించాలని ఈ సభ మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరుతున్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత నివ్వాలని ఈసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది . కళా పోషణ అనేది ఒక రోజు వ్యవహారం కాదు. అది నిరంతరం జరగాలి. నగరంలో కళను నేర్చుకోవటం పట్ల మక్కువ ఉన్న ప్రతి వ్యక్తికి, నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి అనువైన వాతావరణం కల్పించాలి. కార్పోరేషన్ స్థలాలు, కళ్యాణ మంటపాలు ఉచితంగా అందుబాటులో ఉంచాలి. నగరంలోని వివిధ డివిజన్‌లలో ఉన్న కమ్యూనిటీ హాళ్లను ఆయాడివిజన్లలో ఉన్న ఔత్సాహికులైన కళాకారులు కళారూపాలు నేర్చుకోవటానికి ఉచింతంగా అందుబాటులో ఉంచాలని, క్రీడలకు కోచ్‌లను నియమించిన విధంగానే కళలలోని వివిధ విభాగాలను నేర్పే గురువులను ఏర్పాటు చేయాలని ఈ సభ మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరుతున్నది.
No comments:
Post a Comment