Sunday, 12 December 2010

Tax Payers' Association gives a call not to pay user charges for Solid waste management

చెత్త పన్ను కట్టవద్దు- ఆస్థి పన్ను మాత్రమే చెల్లించండి.

విజయవాడ నగర ప్రజలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపు
మితృలారా!


ఈ అక్టోబరునుండి అర్ధ సంవత్సరానికి మీరు చెల్లించవలసిన ఆస్థి పన్ను నోటీసులు మీకు ఈ పాటికి వచ్చే ఉంటాయి. వాటిని వెంటనే చెల్లించకండి. చెల్లించబోయే ముందు ఒక్క సారి పరిశీలించండి. ఆనోటీసులో యూజర్‌ చార్జీల పేరుతో కొంత మొత్తం కలిపి ఉంటుంది. అదే చెత్త పన్ను. ఏదైనా పన్ను లేదా చార్జీలు విధించే ముందు
సంబంధిత పన్ను చెల్లింపుదారులకు తెలియ జేయాలి. వారినుండి అభ్యంతరాలను స్వీకరించాలి. అదేంలేకుండా గుట్టు చప్పుడు కాకుండా నోటీసులలో కలిపి పంపారు. ఇది ప్రజాస్వామ్య విరుధ్ధం. నివాసగృహాలకు ఆస్థిపన్ను ఈ క్రిందివిధంగా ఉంది.


అర్ద సంవత్సరానికి ఆస్థి పన్ను (రులలో)     సంవత్సరానికి చెత్తపన్ను(రు లలో)
400 లోపు                                                         60

400 నుండి 799 వరకు                                     120

800 నుండి 1199 వరకు                                   420

1200 ఆపైన                                                    900


వ్యాపార సంస్థలు ట్రేడ్‌ లైసెన్స్‌తో బాటుగా చెత్త పన్ను రు600/-నుండి రు24000/- వరకు( వ్యాపారం కేటగిరీని బట్టి) చెల్లించాలి.


ఈ విషయం పై 10.12.2010 న అపార్టుమెంట్లు, కాలనీ అసోసియేషన్లు, వర్తకవాణిజ్య సంఘాలవారు, హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌,పీపుల్‌ ఫర్‌ ఇండియా, పౌరసంక్షేమసంఘం,ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. చెత్త తొలగింపుకు కార్పొరేషన్‌ విధిస్తున్న యూజర్‌ చార్జీలను కూలంకషంగా చర్చించి, అస్ధి పన్ను మాత్రమే కట్టాలని,చెత్త తొలగింపుకు యూజర్‌ చార్జీలు కట్టవద్దని పిలుపునిచ్చింది.ఒకవేళ యూజర్‌ చార్జీలు కట్టకుండా, ఆస్థిపన్ను తీసుకోము అంటే, అలా కట్టించుకునే వరకు పన్ను కట్టడం ఆపాలి. దానివలన కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లితే ఆ నష్టానికి ఆస్థి పన్ను కట్టించుకోని కార్పొరేషన్‌దే బాధ్యతతప్ప,ఆస్థి పన్ను కడతామనే ప్రజలది కాదని రౌండ్‌ టేబుల్‌ సమావేశం స్పష్టం చేసింది.


ఇంతకు చెత్త సేకరణకు విధించిన యూజర్‌ చార్జీలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాము?


1.చట్ట విరుధ్ధం


ఆస్థి పన్ను చెల్లింపు దారుల నుండి చెత్త తొలగింపుకై యూజర్‌ చార్జీలను వసూలు చేయటం చట్ట విరుధ్ధం. చట్టం ప్రకారం పారిశుధ్ధ్య నిర్వహణ స్థానిక సంస్థల బాధ్యత.మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టంలో ఇది స్పష్టంగా ఉంది. విజయవాడమున్సిపల్‌ కార్పొరేషన్‌ తనపని తాను చేయటానికి, ప్రజలనుండి యూజర్‌ చార్జీలు వసూలు చేయటం చట్టవిరుధ్ధం.


2.ద్వంద్వ పన్నుల విధానం


ఐదు రకాల పన్నుల కలయికే మనం చెల్లించే ఆస్థిపన్ను.అందులో కన్సర్వెన్సీ పన్ను అని ఒక పన్ను కలిసిఉన్నది. కన్సర్వెన్సీ పన్ను అంటే పారిశుధ్ధ్య నిర్వహణకు ఉద్ధేశించిన పన్ను. అంటే ఆస్థిపన్ను చెల్లిస్తున్న ప్రజలు పాశుధ్ధ్యానికి కూడా పన్నును చెల్లిస్తున్నారని స్పష్టమవుతున్నది.ఒకవైపు పారిశుధ్ధ్యానికి పన్ను చెల్లిస్తున్న ప్రజలపై మరల చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు విధించడం ద్వంద్వ పన్నుల విధానమే అవుతుంది.


3.ప్రజాస్వామ్య విరుధ్దం


చెత్త తొలగింపుకై యూజర్‌ చార్జీలను వసూలు చేయటం ప్రజాస్వామ్య విరుధ్దం.నగరంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ ముందుకు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు,నగర కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఈ ప్రతి పాదనను తిరస్కరించింది. రాజకీయపార్టీలు నగరంలో నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌లో 99శాతం ప్రజలు వ్యతిరేకించారు.నగరంలో పన్ను చెల్లింపుదారుల ప్రతినిధిగా ఉన్న టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది.అయినా పట్టువిడవకుండా మున్సిపల్‌ కమీషనర్‌ కౌన్సిల్‌ తీర్మానాన్ని రద్దు చేయమని ప్రభుత్వానికి వ్రాశారు. ప్రభుత్వం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ను సంజాయిషీ కోరింది,ఆ సంజాయిషీ లెటర్‌ను కౌన్సిల్‌లో పెట్టకుండా, జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పనులు పూర్తయిన తర్వాత విధించవచ్చని కార్పొరేటర్లు, నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మేయర్‌ గారు ఏకపక్ష సంజాయిషీ ఇచ్చారు. అంతే. రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిల్‌ తీర్మానాన్ని రద్దు చేస్తూ జీ.వో 973ను జారీ చేసింది. యూజర్‌ చార్జీలు వసూలు చేయటానికి కమీషనర్‌కు అనుమతినిచ్చింది. ఇది ప్రజాస్వామ్య విరుధ్ధమని, తక్షణమే ఈ జీ.వోను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలని కోరుతూ మేయర్‌కు, డిప్యూటీ మేయర్‌కు, కమీషనర్‌కు, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విడివిడిగా మెమొరాండాలు సమర్పించింది.ఈ జీవోలో ఉన్న ప్రజాస్వామ్య విరుధ్ద స్వభావాన్ని స్పష్టం చేస్తూ, ప్రజలపై ఇది ద్వంద్వ పన్నుల విధానంగా మారిన తీరు, జీవోను రద్దు చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ రాష్ట్రముఖ్యమంత్రిగారికి, మున్సిపల్‌ శాఖామంత్రి గారికి లేఖలు వ్రాశింది.ఈ జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ నగరంలో అపార్టుమెంట్ల అసోసియేషన్లు, కాలనీ అసోసియేషన్లు, ట్రేడ్‌ యూనియన్లు, వాకర్స్‌ అసోసియేషన్లు, పెన్షనర్లు, వివిధ వర్తక వాణిజ్య సంఘాలలాంటివారు వందలసంఖ్యలో వారివారి సభ్యులనుండి సంతకాల సేకరణ జరిపి మెమొరాండాలను రాష్ట్రముఖ్యమంత్రిగారికి, మున్సిపల్‌ శాఖామంత్రి గారికి, మేయర్‌ , కమీషనర్లకు పొస్టుద్వారా పంపారు. వివిధ రాజకీయ పార్టీలుకూడా వారివారి పధ్ధతులలో నిరసన వ్యక్తం చేసాయి.ఇంత పెద్ద ఎత్తున నగర ప్రజలనుండి నిరసన వ్యక్తమైనప్పటికీ పట్టించుకోకుండా,ప్రజాస్వామ్యబధ్ధంగా ఎన్నికైన కౌన్సిల్‌ను త్రోసిపుచ్చి,ప్రజలకు ఏమాత్రం తెలియజేయకుండా ఆస్థి పన్ను నోటీసులో చెత్తతొలగింపుకు యూజర్‌ చార్జీలను కలిపి పంపటం ప్రజాస్వామ్యవిరుధ్ధం. ఇది నగరంలోని పన్ను చెల్లింపుదారులను అపహాస్యం చేయటమే.ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నికైన స్థానిక స్వపరిపాలనా సంస్థ కౌన్సిల్‌. అలాంటి కౌన్సిల్‌ ప్రజాస్వామ్యబధ్ధంగా చేసిన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, తన నిర్ణయాలను జీ.వోల రూపంలో స్థానిక సంస్థల నెత్తిన రుద్దుతున్నది. కాని నిధులిచ్చేటప్పుడు మాత్రం స్థానికంగా వసూలు చేసుకోమంటున్నది. నిర్ణయాలు చేసేది రాష్ట్రప్రభుత్వం. భారాలు భరించేది మాత్రం మనం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యవిరుధ్ధం.


4. రావలసిన నిధులను ఇవ్వకుండా త్రొక్కిపట్టడం-నిరంకుశంగా భారాల విధింపు


ప్రజలు చెల్లించిన పన్నుల నుండి స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఆనిధులే స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయవనరు. ఎంత కేటాయించాలో నిర్ణయించడానికి రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్‌ కమీషన్‌ను ఏర్పాటుచేసారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 39.24 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలని మొదటిఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుచేసింది. ఆమొత్తంలో 30 శాతం పట్టణాలకు 70 శాతం గ్రామాలకు కేటాయించాలి.ఈ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కూడా.కాని స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులుమాత్రం ఇవ్వటంలేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థలకు 39.24శాతం నిధులను కేటాయించడంలేదు. అలా కేటాయించి ఉంటే ఏషరతులు లేని నిధులు మననగరానికి ఇప్పటికి రు1200 కోట్లు వచ్చి ఉండేవి. కాని వచ్చింది రు7 కోట్లు మాత్రమే. నిధులు ఇవ్వకుండా నగరపాలక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎండగడుతున్నది.ఇవ్వ వలసిన వాటిని ఇవ్వకుండాఅనేక ప్రజావ్యతిరేక షరతులతో కూడిన జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకాన్ని మన నగరం నెత్తిన రుద్దారు.నిధులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయని,నగరం సుందరంగా తయారవుతుందని ఊదరగొట్టారు.తీరా చూస్తే జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇచ్చినవి రు470.49 కోట్లు మాత్రమే. అందులో కేంద్రం ఇచ్చినది రు348.35 కోట్లు, రాష్ట్ర భ్రుత్వం ఇచ్చినది రు122.14 కోట్లు. వీటిలో కూడా కొంత అప్పుగానే ఇచ్చారు. అంటే ఏ షరతులులేకుండారావలసిన రు1200కోట్లకు బదులుగా షరతులతో రు470కోట్లు ఇచ్చారు. జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం పథకం క్రింద నగరానికిసరిపడా నిధులురాలేదుకాని షరతులు మాత్రం అమలవుతున్నాయి. నగరంలో ప్రజలకు కార్పొరేషన్‌ అందించే ప్రతి పనికి పూర్తిగా డబ్బులు వసూలు చేయమని ఆ షరతులద్వారా ఆదేశించారు.చెత్త తొలగింపుకు యూజర్‌ చార్జీలు వసూలు చేయటం ఆ ఆదేశాలలో భాగమే. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇచ్చి, అది చాలక పోతే, పన్నులు పెంచటం సహజం. కాని దానికి భిన్నంగా ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా, ప్రజలమీద మరిన్ని భారాలు మోపటం ప్రజలను నిలువు దోపిడీ చేయటమే. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం విజయవాడ నగరానికి నిధులు కేటాయించి ఉంటే ఇప్పుడు జరిగిన పనుల కన్నా రెట్టింపు పనులు జరిగి ఉండేవి. నగర ప్రజలపై ఈ భారాలు ఉండేవి కాదు.

ఈ యూజర్‌ చార్జీలు ఇంతటితో ఆగబోవటంలేదు.ఇది కేవలం 3 వవంతు ఖర్చు రాబట్టడానికి నిర్ణయించిన చార్జీలు. పూర్తి ఖర్చును రాబట్టడం మొదలు పెడితే ఇవి 3రెట్లు పెరుగుతాయి.కేవలం చెత్తమీదనేకాదు.ఇంకా అనేక పనులమీద యూజర్‌ చార్జీలు విధించబోతున్నారు.ఇప్పుడు మనబాధలు చెప్పుకోవడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు. ఎన్నికైన కౌన్సిల్‌ లేదు. మనమే కలసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్ణయించింది.


ఏంచేయాలి?


మితృలారా! అపార్టుమెంట్‌, కాలనీ, వర్తక వాణిజ్య వర్గావారు, ట్రేడ్‌ యూనియన్‌లు తమ అసోసియేషన్‌ సమావేశాలను తక్షణమే జరపండి. జరుగుతున్న ఈ అరాచకాన్ని మీ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళండి. చెత్తపన్నును వ్యతిరేకిస్తూ, చెత్తపన్నును చెల్లింవద్దని, రాష్ట్ర ప్రభుత్వం మననగరానికి ఇవ్వవలసిన నిధులురాష్ట్ర ప్రభుత్వం ఇచ్చితీరాలని తీర్మానాలు చేసి, మీమీ లెటరుహెడ్‌లమీద సంతకాలు సేకరించి కమీషనర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపండి. ఇది ప్రాధమికంగా చేయవలసిన పని. మీకు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏర్పడిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సహకరిస్తుంది. తదుపరి కార్యక్రమాలు జె.ఏ.సి. నిర్ణయిస్తుంది. మనది చైతన్యవంతమైన నగరం. ఈ అరాచకాన్ని మనం చూస్తూ ఊరుకోవలసిన అవసరంలేదు. కలసికట్టుగా కదులుదాం. మనమీద పడే భారాలను ఎదుర్కొందాం!


చెత్తపన్ను (యూజర్‌ చార్జీలు) కట్టవద్దు. ఆస్థి పన్ను మాత్రమే కట్టండి!


అన్న రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపును అమలు జరపవలసినదిగా కోరుతున్నాము.


తేదీ:11.10.2010    టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌, విజయవాడ          ఫోన్‌ 9440905552

No comments:

Post a Comment