Saturday, 4 November 2017

Press Meet on 03.11.2017

ప్రచురణార్ధం:                                                                తేదీ:03.11.2017

రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం కోసం నగరపాలక సంస్థ చేత అప్పు చేయించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నది. విజయవాడలో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం.-బి.ఎస్‌.యు.పి పథకం క్రింద బలహీన వర్గాల కోసం జి+3 ఇళ్ళు నిర్మించుటకై రు. 100 కోట్లు అప్పు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఈ ఋణం తీసుకోవటానికి వడ్డీ రేట్ల వివరాలను తెలియజేయవలసిందిగా బ్యాంకర్లను కోరుతూ ఈనెల 1 వ తేదీన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక దిన పత్రికలో ప్రకటన ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్‌కు ఒక లేఖను వ్రాశింది. 
బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం, పౌరులకు గృహ వసతి కల్పించటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి. విజయవాడ నగరపాలక సంస్థకు బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికీ సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనికి నగరపాలక సంస్థ అప్పు చేయటం ఏమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆ లేఖలో ప్రశ్నించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఋణం నగరపాలక సంస్థకు భారంగా మారనున్నదని ఆలేఖలోస్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని పనికి నగరపాలక సంస్థ అప్పుచేయటం నగర ప్రజల నెత్తిన అప్పును రుధ్దటమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. 
వర్షం వస్తే నగరం జలాశయంలా మారటం, డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉండటం, పారిశుధ్ధ్యం నానాటికీ దిగజారటం, రోడ్లు అధ్వాన్నంగా తయారవటం, ట్రాఫిక్‌ ఇబ్బందులు నానాటికీ తీవ్రమవటం, ఫుట్‌ పాత్‌లు లేకపోవటం లాంటి అనేక సమస్యల పరిష్కారానికిి నిధులు కావలసి యుండగా, వాటిని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనులకు కార్పొరేషన్‌ అప్పులు చేయటం దారుణమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ అప్పును తీర్చవలసింది విజయవాడ నగర ప్రజలేనని, ఈ అప్పు తీర్చటం కోసం భవిష్యత్తులో నగర ప్రజలపై భారాన్ని మోపవలసి వస్తుందని స్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని పనికి నగర పాలక సంస్థ అప్పుచేస్తే, దానిని నగర ప్రజలు ఎందుకు భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు, నగర ప్రజలకు భారంగా మారే ఈ ఋణ ప్రతి పాదనను తక్షణమే విరమించుకోవలసినదిగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మున్సిపల్‌ కమీషనర్‌ను కోరింది. 
రాష్ట్ర పౌరులకు గృహవసతి కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ భాధ్యత. కనుక బలహీన వర్గాల కోసం నిర్మించే జి+3 ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.





విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌బ్లిక్ స్థ‌లాల ప్రైవేటీక‌ర‌ణ‌పై టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ విడుద‌ల చేసిన క‌ర‌ప‌త్రం



Thursday, 5 October 2017

విజ‌య‌వాడ‌లోని సుమారు 47 ఎక‌రాల ప‌బ్లిక్ స్థ‌లాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు క‌ట్టబెట్టే విధంగా మున్సిప‌ల్ కౌన్సిల్ చేసిన తీర్మానాల‌కు వ్య‌తిరేకంగా 02.10.2017 న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ప్రెస్ మీట్‌

ప్రచురణార్ధం:                                                                     తేదీ:02.10.2017
విజయవాడ నగరంలో సుమారు 47 ఎకరాల ప్రభుత్వ స్ధలాలను, నగర ప్రజల ప్రయోజనాలకు కాకుండా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం కోసం నగరపాలక సంస్థ నిర్ణయం చేయటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. స్వరాజ్యమైదానం 26 ఎకరాలు, నరపాలక సంస్థ ప్రాంతంలో ఉన్న పూలమార్కెట్‌, కూరగాయల  హోల్‌సేల్‌ మార్కెట్‌ మొత్తం ఎ.3.80లు, నగరపాలక సంస్థ స్థలం ఎ.3.22లు, సబ్‌స్టేషన్‌ ఎ.1.14లు, రాజీవ్‌గాంధి పార్కు ఎ.9.01లు , రైల్వే స్థలం ఎ.3.51లు మొత్తం ఎ.46.68లు నగర ప్రజలకు దక్కకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్ట బోతున్నారు. కేవలం నగరంలోని విలువైన పబ్లిక్‌ స్థలాలను తమ అనుమాయులకు, బడా పారిశ్రామిక వేత్తలకు, విదేశీ కంపెనీలకు కట్టబెట్టటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభివర్ణిస్తున్నది. నగరంలో వాహనాలసంఖ్య నానాటికీ పెరుగుతున్నది. సరైన పార్కింగ్‌ స్థలాలులేవు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దెభవనాలలో నడుస్తున్నాయి. నగరంలో సరైన క్రీడా మైదానాలు లేవు. ఏదైనా విపత్తు సంభవిస్తే తలదాచుకోవటానికి స్థలాలు లేవు. విజ్ఞాన,వినోద కార్యక్రమాలకు స్ధలాలు లేవు. ఇలా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు స్థలాలను ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం, నగరపాలకులు, అందుకు భిన్నంగా ఇప్పటికే ఉన్న స్థలాలలో రిటైల్‌ మాల్స్‌, ఎగ్జిబిషన్‌ హాల్స్‌, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయటం, టవర్లు కట్టడం లాంటి వాటివలన చేయటం వలన ప్రైవేటు వ్యక్తుల, సంస్థల ప్రయోజనాలు నెరవేరుతాయి తప్ప నగర ప్రజల ప్రయోజనాలు నెరవేరవు. ఇప్పటికే ఆర్‌.టి.సి స్థలాలు క్రమేణా ప్రైవేటు వ్యక్తు చేతులలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్‌ స్థలాలు, నగరపాలక సంస్థ స్థలాలను కాజేయబోతున్నారు. ఇది నగరానికి తీరని నష్టం వాటిల్లుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టంచేస్తున్నది. నగర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేటర్లు కూడా కౌన్సిల్‌లో ఈ తీర్మానాలకు ఓటువేయటం దారుణం. ఇప్పటికైనా నగరప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ పాలకులు తమ నిర్ణయాలను వెనుక్కు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. నగరానికి నిధులిచ్చి అభివృధ్ధి చేయాల్సిన ప్రభుత్వం, నిధులు ఇవ్వకపోగా, అభివృధ్ధికి వికృతి నిర్వచనాలిచ్చి, నగర ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కాజేయటం మానుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

వి.సాంబిరెడ్డి                                                      యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                              కార్యదర్శి








Tuesday, 11 April 2017

Press Meet Video on 10.04.2017


Press Meet on 10.04.2017

2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేయటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించాలనటం చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇది చట్ట విరుధ్ధమని తెలియజేస్తూ మున్సిపల్‌ కమీషనర్‌కు, మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ లేఖలు వ్రాశింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 ప్రకారం ఆస్తి పన్నును అర్ధసంవత్సరానికి కాని లేక 3 నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలే తప్ప సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టమనే హక్కు కమీషనర్‌కు లేదు. మున్సిపల్‌ కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది తప్ప, సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడా లేని హక్కును మున్సిపల్‌ అధికారులు ఎలా అమలు జరుపుతారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే చట్ట విరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం దారుణమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది.
మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాసి ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్లను ప్రయోగించి ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. పన్నులు చెల్లించని ఇలాంటి వారిపై అధికారులు ఈ సెక్షన్‌ల ప్రకారం చర్యలు తీసుకోనందున కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. వీరివలన కార్పొరేషన్‌ ఖజానాకు కలుగుతున్న నష్టానికి అధికారులే బాధ్యత వహించాలి.
ఆస్తి పన్ను ముందస్తుగా చలెల్లించకపోతే పోతే వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపి వేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తే సాధారణ పన్ను చెల్లింపుదారులు బెదిరిపోయి ఆస్తిపన్ను, దానితోబాటే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలను సంవత్సరం మొత్తానికీ ఒకేసారి కట్టేస్తారన్న వ్యూహంతోనే ఈ కరపత్రాలను పంచుతున్నారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. చట్టవిరుధ్దమైన అంశాలతో, బెదిరింపులతో కూడిన ఈ కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలని, ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షత లేకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 269(2)మరియు సెక్షన్‌ 270 ప్రకారం అత్యధిక మొత్తాలలో బకాయిలున్న వారితో ప్రారంభించి అవరోహణా క్రమం(Descending order) లో బకాయిదారులపై చర్యలు చేపట్టాలని, పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటి కప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                  యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                         కార్యదర్శి