Tuesday, 26 November 2019

Memorandum Submitted to Sri Botsa Satuyanarayana, Minister for Urban Development

                                                                                                                                     తేదీ:13.09.2019
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ & అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ శాఖామాత్యులు శ్రీ బొత్స సత్యన్నారాయణ గారికి,
ఆర్యా,
విషయం: విజయవాడ నగరం లోని వివిధ అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న మెమొరాండం.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో మున్సిపల్‌ శాఖా మాత్యులుగా అధికారాన్ని చేపట్టిన మీకు ముందుగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా అభినందనలు తెలియజేస్తున్నాము. విజయవాడ నగరానికి సంబంధించిన 3 ప్రధానమైన అంశాలను మీదృష్టికి తీసుకు వస్తున్నాము.
01.నీటి చార్జీల తగ్గింపు
2014 మున్సిపల్‌ ఎన్నికలకు ముందు సుమారు 4 ఏళ్లపాటు సాగిన స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో విజయవాడలో మంచినీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను పెంచుతూ తీర్మానం చేశారు. ఇవి 1.4.2013 నుండి అమలులోకి వచ్చాయి. మంచినీటి చార్జీలను పెంచిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నది. పెంచకముందు వ్యక్తిగత గృహాలకు (టాప్‌ కనెక్షన్‌)కుళాయికి నెలకు రు.80లు చొప్పున వసూలు చేసేవారు. అపార్టుమెంట్లకు మీటర్లు ఉన్నాయి. పెంచకముందు నెలకు 3 కిలో లీటర్లకు రు.100/-లు ఆపైన కిలోలీటరుకు రు.8.25లు చొప్పున వసూలు చేసేవారు.
పెంచిన అనంతరం వ్యక్తిగత గృహాలకు ఇచ్చే నీటి చార్జీలకు, ఇంటి పన్నుకు ముడి పెట్టారు. దీనితో వ్యక్తిగత గృహాలకు 40 శాతం నుండి 400 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు 120 శాతంనుండి 400 శాతం వరకు పెరిగాయి. నిజానికి ఇంటిపన్నును బట్టి నీటి వాడకం ఉండదు. ఏ వ్యక్తిగత గృహానికైనా ఇచ్చేది 1/2'' (అరంగుళం) పైపు తోనే నీరు ఇస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నీరు ఇచ్చే కాలపరిమితికూడా ఒకటిగానే ఉంటుంది. నిర్థిష్ట కాలపరిమితిలో అరంగుళం పైపుద్వారా ఒకే పరిమాణం గల నీరు డిశ్చార్జ్‌ అవుతుంది తప్ప, ఇంటి నిర్మాణాన్ని బట్టి, విస్తీర్ణాన్ని బట్టి, పన్నునుబట్టి నీరు రాదు. అందువలన నీటి చార్జీలను ఇంటిపన్నుతో ముడి పెట్టడం అసమంజసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము.
అదేవిధంగా అపార్టుమెంట్లకు ( మీటర్‌ కనెక్షన్‌) శ్లాబు పధ్దతిని ఏర్పాటు చేశారు. అపార్టుమెంట్‌ భవనంలోని ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొలది నీటి చార్జీల రేటు పెరుగుతుంది. ఎన్ని ప్లాట్లు ఉన్నా, ప్రతికుటుంబం వాడుకునే నీరు మారదు. అదేనీరు వాడుకుంటున్నప్పటికీ ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొలది మీటరు రీడింగ్‌ పై శ్లాబులకు వెళ్ళటంతో నీటి చార్జీలు భారీగా పెరుగుతున్నవి. దీనితో కుటుంబాలపై అదనపు భారం పడుతున్నది. అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లో ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ అయ్యే కొలది అదనపు నీరు వాడకుండానే కుటుంబంపై భారం పడుతున్నది. ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్టు మెంట్‌ బిల్డింగ్‌లో ఉండటం నేరమన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా వ్యక్తిగత గృహాలకు, అపార్టుమెంట్లకు నీరిచ్చే సమయంలో తేడా ఉండదు. కనుక అదనంగా వాడుకునే పరిస్థితి కూడా లేదు.
అంతేకాకుండా నగరంలో ఉన్న ప్రతి అపార్టుమెంట్‌ వారు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేసే నీటిని కేవలం త్రాగునీటికే వాడుకుంటారు. ఇతర గృహావసరాలకు పూర్తిగా బోరు బావుల ద్వారా తీసిన నీటిని వాడుకుంటారు. అపార్టుమెంట్లలోని అన్ని ఫ్లాట్ల వారు, వ్యక్తిగత గృహాలవారి మాదిరిగా నీటిని తీసుకుంటే నగరంలో ప్రస్తుతమున్న నీటి సరఫరా చాలదు. నీటిని సరఫరా చేయటం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చాలా కష్టమౌతుంది. అలా వాడుకుంటే ఈ శ్లాబు పధ్ధతి ప్రకారం ప్రతి ఫ్లాటుకు వేల రూపాయలు నీటి చార్జీలకు చెల్లించవలసి వస్తుంది. అందువలన అపార్టుమెంట్లకు శ్లాబు పధ్దతిద్వారా నీటి చార్జీలు వసూలు చేయటం అసంమంజసమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము.
దీనితోబాటుగా పెంచిన మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను మరల మరల పెంచే పని లేకుండా ఏటా అటోమాటిక్‌గా 7 శాతం పెరిగే విధంగా కూడా సదరు 2013 స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలోనే తీర్మానం చేశారు. అంటే 1.4.2013 నుండి నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెరిగాయి. ఆ పెరిగిన నీటి చార్జీల మీద ఏటా 7 శాతం కాంపౌండింగ్‌ పధ్ధతిలో పెంచుతున్నారు. ఇది కూడా ప్రస్తుతం అమలు జరుగుతున్నది. 1.4.2013న పెంచిన చార్జీల అసలు పెంపుదల మీద 7 శాతం కాంపౌండింగ్‌ పధ్ధతిద్వారా పెంచిన ఈ అదనపు పెరుగుదలే ప్రస్తుతం 40 శాతానికి చేరింది.
నీటి చార్జీలను పాత పధ్దతికి మార్చాలని కోరుతూ ప్రజలు ఎన్ని సార్లు గత ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ చార్జీలను పాత పధ్ధతికి మార్చాలని కౌన్సిల్లో తీర్మానం చేసినప్పటికీ, ఆతీర్మానాలను ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నూతన ప్రభుత్వంగా తమరు ఈ చార్జీలపై పునరాలోచించి, నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటి పధ్ధతికి మార్చవలసిందిగా కోరుతున్నాము.

4వ రాష్ట్ర ఆర్ధిక సంఘం (4thSFC)ఏర్పాటునోటిఫికేషన్‌ -టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 4వ రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని (4th SFC)ఏర్పాటు చేస్తూ 16.5.2018న గజెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.ఈ గజెట్‌ నోటిఫికేషన్‌ టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 4Vలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని 4th SFCని కోరియున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌లోని ఈ అంశాలను పరిశీలిస్తే త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్థాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి, నాటిి ప్రభుత్వం ముందే నిర్ణయంతీసుకొని దానికి తగిన విధంగా సిఫార్సులు చేయమని 4th SFC ని కోరినట్లుగా ఉన్నది. అంతేతప్ప ఆ వ్యవస్థలను మెరుగుపరచటానికి సిఫార్సులను కోరలేదు. అందువలన ఈ అంశాలను ఆనాడే టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా వ్యతిరేకించాము. మేము వ్యతిరేకించటానికి గల కారణాలను మీదృష్టికి తీసుకు వస్తున్నాము..
భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 11 మరియు 12 ప్రకారం త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లు వగైరాలు స్థానిక సంస్థలు నిర్వహించాలి. నిర్వహించటం అంటే వ్యాపారం చేయటం కాదని మేము అభిప్రాయ పడ్డాము. పైగా ప్రభుత్వాలు కాని, స్థానిక సంస్థలు కాని వాణిజ్య దుకాణాలు కావు. పౌరులు ఆదుకాణాల కస్టమర్లు కాదు. పౌర సౌకర్యాలను కలుగజేయటం కోసం పౌరుల పన్నులతో ఏర్పాటు చేసుకున్న ప్రజా సంస్థలు. ప్రజలు చెల్లించిన పన్నులతో వాటిని నడపవలసియున్నది. మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన త్రాగునీరు, పారిశుధ్యం చాలా కీలకమైనవి. వీటిని వ్యాపారమయం చేయటం దారుణం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు ఇవ్వాలి. మనది ఉష్ణ ప్రదేశం. పైగా అనేక సంప్రదాయాలున్న ప్రదేశం. వీటన్నింటి కోసం ఇంకా ఎక్కువ నీరు అవసరమవుతుంది. 72 సంవత్సరాల స్వతంత్రం అనంతరంకూడా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసి వస్తున్నది. అనేక పట్ణణాలలో రోజు ఇచ్చే పరిస్థితిలేదు. రెండు మూడు రోజులకొకసారి నీరు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య. అందుకే దీనిని మేము వ్యతిరేకించాము.
2010 జులై 28 న త్రాగునీరు, పారిశుధ్యం అనేవి మానవ హక్కులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది (Water and Sanitation are  recognised as Human Rights by UNO General Assembly through resolution No 64/292 dated 28th July 2010 ). ఐక్యరాజ్య సమితిలో భారతదేశంకూడా భాగ స్వామిగా ఉన్నది. కాని తాగు నీటిని, పారిశుధ్యాన్ని ప్రజల హక్కుగా చూడకుండా వ్యాపార సరుకుగా చూడటం సరైందికాదని మేము భావిస్తున్నాము. అందుకే వీటిని వ్యాపార సరుకుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాము.
ఈ విషయాలను వివరిస్తూ 06.06.2019న 4th SFC ఛైర్మెన్‌ గారికి ఒక మెమొరాండాన్ని కూడా సమర్పించాము. ఈ విషయాలను కూడా మీదృష్టికి తీసుక రావటం సందర్భోచితంగా ఉంటుందని భావించి మీదృష్టికి తీసుకు వస్తున్నాము.

02. విజయవాడ అవసరాలకోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు
విజయవాడ నగరానికి నీటి సరఫరా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీదనే ఆధారపడి యున్నది. అది ఇరిగేషన్‌కు సంబంధించిన రిజర్వాయర్‌. 10 లక్షలపైగా జనాభా ఉన్న ఈ నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేక రిజర్వాయర్‌ లేదు. వ్యవసాయానికి, నగరంలోని నీటి అవసరాలకు ఈ రిజర్వాయర్‌నుండే నీటిని వాడుకోవాలి. ఇటీవల వేసవిలో ఆ రిజర్వాయర్‌లో నీరు 5 అడుగులకు పడి పోయింది. ఇంకొక్క అడుగు పడిపోయినట్లయితే విజయవాడ నగరం నీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన వలసి వచ్చేది. ఎప్పుడో విజయవాడ జనాభా లక్షలోపు ఉన్న రోజులలో విజయవాడ నీటి అవసరాలకోసం ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా ఉన్న ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీద ఆధారపడటం సమంజసమే. కాని జనాభా 10 లక్షలకు పైగా ఉన్న నేటి పరిస్థితులలో ఈ నగరానికి ఏడాదికి సుమారు 5 టి.యం.సిల నీరు (ఆవిరైపోయే నీటితో సహా) అవసరమవుతుంది. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ నుండి అంతనీటిని తీసుకోవటం సాధ్యపడదు. అందువలన నగరానికి నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా నీటి రిజర్వాయర్లు కావాలి. పెద్ద పులిపాక ప్రాంతంలో చెక్‌ డ్యాం నిర్మించి వరద నీటిని నిల్వ చేయవచ్చు. లేదా వివిధ ప్రాంతాలలో 1 లేదా 2 చెరువులను నిర్మించి కృష్ణానది వరద నీటిని వాటికి తరలించవచ్చు. ఇలాంటి ఏదో ఒక పధ్దతిలో విజయవాడ కోసం ఉపరితల నీటిని 5 టియంసిలు నిల్వ ఉంచే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
03. చెత్త నిర్వహణ
విజయవాడలో చెత్తను నశింపజేసే సమస్య తీవ్రంగా ఉన్నది. నగరంలో చెత్త తొలగింపు కొంతమేరకు బాగానే ఉన్నప్పటికీ ఆ చెత్తను నశింప చేయటానికి కావలసిన ఏర్పాట్లు మాత్రం అవసరమైన మేరకు జరగటంలేదు.నగరమంతటా తొలగించిన చెత్తను సింగ్‌ నగర్‌ ప్రాంతంలో పోస్తున్నారు. ఆ డంపింగ్‌ యార్డు వెదజుల్లుతున్న దుర్వాసన, దుమ్ము ధూళితో అక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతుండటంతో తీవ్రమైన ఆందోళనలు చేశారు. అయినా ఆసమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు ముస్తాబాద, సవారిగూడెం గ్రామాల ప్రక్కన పోయాలని కార్పొరేషన్‌ ప్రయత్నిస్తుంటే అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. డంపింగ్‌ యార్డు వెదజల్లే దుర్వాసన, దుమ్ము ధూళి వాటివలన వచ్చే రోగాలు ఎక్కడైనా ఒకటే. అందువలన ఇది పరిష్కారం కాదని భావిస్తున్నాము. అదేవిధంగా తడి చెత్తను అపార్టుమెంట్ల ఆవరణలోనే కుళ్ల బెట్టుకోమని కార్పొరేషన్‌ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది అనారోగ్యం మాత్రమే కాకుండా పరిష్కారంకూడా కాదు. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు చేయాలి. తడి చెత్తనుండి మెన్యూర్‌ తయారు చేయాలి. ఆ ఎరువును పొలాలకు వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలి. అందు కోసం రైతులను చైతన్య పరచాలి. పొడి చెత్తనుండి విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. పెల్లెట్లను బొగ్గు వాడే బాయిలర్స్‌ ఉన్న పరిశ్రమలలో, సిమెంట్‌ పరిశ్రమలలో బొగ్గుకు బదులు ఈ పెల్లెట్లు వాడే విధంగా ప్రోత్సహించాలి. ఇవి జరిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రోజుకు 500టన్నులకు పైగా విజయవాడ నగరంలో చెత్త ఏర్పడుతున్నది. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.
ఈ చెత్తను జనావాసాలకు దూరంగా పోయాలని, నగరానికి ప్రత్యేకంగా చెత్త నుండి విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.
పై మూడు అంశాలలో నీటిచార్జీలను తగ్గించే విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతులలో ఉన్నది. అదే విధంగా నగరానికి ప్రత్యామ్నామ నీటి వనరుల ఏర్పాటు, చెత్త నశింపజేయటానికి కావలసిన యార్డులు, విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీల ఏర్పాటు జరగాలంటే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక్కటే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే ఇది సాధ్యపడగలదు. అందువలన ఈ విషయాలను మీ ముందుంచుతున్నాము.
కోరుతున్న అంశాలు సంక్షిప్తంగా...
01. నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను 31.03.2013 నాటి పధ్ధతికి మార్చాలి.
02. విజయవాడ నగర అవసరాలకోసం ఉపరితల నీటిని 5 టియంసిలు నిల్వ ఉంచే విధంగా ప్రత్యామ్నాయ రిజర్వాయరు ఏర్పాటు చేయాలి.
03. నగరంలో ఏర్పడుతున్న చెత్త నశింపజేయటానికి కావలసిన యార్డులు, విద్యుత్‌, పెల్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలి.

అభివందనాలతో

(వి.సాంబిరెడ్డి)                                    (యం.వి. ఆంజనేయులు)
అధ్యక్షులు                                                     కార్యదర్శి

Memorandum Submitted to 4th State Finance Commission

                                                                                                            తేదీ:06.06.2019
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ 4 వ రాష్ట్ర ఆర్ధిక సంఘం ఛైర్మెన్‌ శ్రీ గుమ్మడి నాంచారయ్య గారికి,
గరుడ ఎన్‌క్లేవ్‌, తాడేపల్లి-522 501
ఆర్యా,
విషయం: 4 వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సుల తయారీ సందర్భంగా పరిగణనలోకి తీసుకొవలసిన అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ సమర్పిస్తున్న మొమొరాండం.
నాల్గవ రాష్ట్ర ఆర్ధిక సంఘం ఛైర్మెన్‌గా నియమితులైనందుకు ముందుగా మీకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా అభినందనలు తెలియజేస్తున్నాము. మిమ్ములను ఛైర్మెన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన గజెట్‌ నోటిఫికేషన్‌ తేదీ 16.05.2018లో ఇచ్చిన టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ పై మాఅభిప్రాయాలను ఈ మొమొరాండం ద్వారా మీముందుంచుతున్నాము.
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 1లో ఇచ్చిన అంశాలపై మా అభిప్రాయం మరియు మా డిమాండు
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 1లో ఇచ్చిన దాని ప్రకారం పన్నుల ద్వారా, డ్యూటీల ద్వారా, టోల్‌ ద్వారా, ఇతర ఫీజుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయాన్ని స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏవిధంగా పంపిణీ చేయాలన్నది 4 వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సు చేయవలసి యున్నది. దీనిపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మా అభిప్రాయాన్ని మీముందుంచుతున్నాము.
స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి. స్థానిక సంస్థల పనివిధానానికి సంబంధించి, దేశవ్యాపిత సారూప్యత, ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రాలు రకరకాల నిర్ణయాలు తీసుకోవటం, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం లాంటివి జరుగుతున్న నేపధ్యంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయటం కోసం 1992 లో భారత ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ (పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు సంబంధించినది) మరియు 74వ రాజ్యాంగ సవరణ (మున్సిపల్‌ వ్యవస్థకు సంబంధించినది) చేశారు. ఈ రాజ్యాంగ సవరణలలో అత్యంత కీలకమైన విషయాలు.
01. స్థానిక సంస్థలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తించటం: దేశంలో ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో నివశిస్తారు. జనావాసాలన్నీ గ్రామాలలోగాని, పట్ణణాలలోగాని ఉంటాయి. ప్రజలకు మంచినీరు రోడ్లు, పారిశుధ్యం, ఆరోగ్యం, విద్య లాంటి ప్రాధమిక సౌకర్యాలు కలుగ జేయవలసి యున్నది. ఇవన్నీ ఉన్నప్పుడే గ్రామాలుకాని, పట్టణాలుగాని నివాస యోగ్యాలుగా ఉంటాయి. ప్రజలు హాయిగా జీవించాలంటే ఇవన్నీ కావాలి. ఇవి చేయవలసింది స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలు అన్ని విధాలా పటిష్టంగా ఉంటేనే ఈ పనులు చేయగలవు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే స్థానిక సంస్థలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని అనాటి పాలకులు గుర్తించి 73,74 రాజ్యాంగ సవరణలు చేశారు. దేశ వ్యాపితంగా స్థానిక సంస్థలు నిర్వహించే విధులను రూపొందించారు. గ్రామ పంచాయితీలు నిర్వహించవలసిన విధులను రూపొందించి భారత రాజ్యాంగం 11 వ షెడ్యూల్‌లో చేర్చారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు నిర్వహించవలసిన విధులను రూపొందించి భారత రాజ్యాంగం 12 వ షెడ్యూల్‌లో చేర్చారు. దీనితో స్థానిక సంస్థలు నిర్వహించవలసిన విధులకు దేశ వ్యాపితంగా సారూప్యత రావటంతో బాటుగా, ఆ విధులకు రాజ్యాంగ బధ్దత ఏర్పడింది. కనుక ఈ షెడ్యూళ్లలో ఇచ్చిన విధులను తప్పని సరిగా అమలు జరప వలసిందే.
02. నిధులు: రాజ్యాంగం అప్పగించిన విధులను నెరవేర్చాలంటే స్థానిక సంస్థలకు నిధులు కావాలి. స్ధానిక సంస్థలకు ఇంటిపన్ను మినహా ఆదాయాలు ఉండవు. ఇది బహు స్వల్పం. స్థానిక సంస్థలు విధులు నిర్వహించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిందే. కేటాయించటం అనేది అనివార్యం అన్నది పాలకులు గుర్తించారు. ఎంత కేటాయించాలి అన్నది తేల్చటం కోసమే రాష్ట్ర ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారతరాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 243-I ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
స్ధానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించటం వెనుక మరొక ముఖ్యాంశం ఇమిడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అనేక రకాలుగా పన్నులు చెల్లిస్తున్నారు. ప్రజలకు కావలసిన ఉమ్మడి పనులను నిర్వహించటం కోసమే రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు (Tax is an individual contribution determined by law for Common works for the progress of community). రాష్ట్ర ప్రభుత్వం తమవద్దకు చేరిన నిధులను ముందుగా జన నివాసాలవద్ద సౌకర్యాలకు (అంటే గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో సౌకర్యాలకు) ఖర్చు చేయాలి. ఆ తర్వాత జనావాసాలకు-జనావాసాలకు మధ్య (Between one village/Town to another village/Town) జరిగే పనులకు, ఆ తర్వాత రాష్ట్రం మొత్తంగా జరిగే పనులకు ఖర్చు పెట్టాలి. ఇందులో జన నివాసాలవద్ద సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయటం మానవ సమాజ అభివృధ్ధికి అత్యంత కీలకం. రాష్ట్ర నిధులలో కొంత భాగాన్ని స్థానిక సంస్థలకు కేటాయించటం అనివార్యం కనుకనే, కేటాయించ వలసిన ఆ భాగాన్ని నిర్ణయించటం కోసం ఆర్ధిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
తప్పుడు ప్రచారంఅయితే మన ప్రభుత్వాలు గత దశాబ్ద కాలంగా స్థానిక సంస్థలకు కేటాయించవలసిన నిధులను నిలిపి వేయటం కోసం, ''ఆస్తిపన్ను స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు'' అని ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము. స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేనని, స్థానిక సంస్థలకు ఆ నిధులు ఇవ్వటం ప్రభుత్వాల దయాబిక్ష కాదని, తాము చెల్లించిన పన్నుల నుండి స్థానికావసరాలకు నిధులను పొందటం రాష్ట్ర ప్రజల హక్కు అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము స్పష్టం చేస్తున్నాము.
గత రాష్ట్ర ఆర్ధిక సంఘాలుభారత రాజ్యాంగం ఆర్టికిల్‌ 243-I ప్రకారం ఇప్పటికి 3 ఆర్ధిక సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొదటి ఆర్ధిక సంఘం రాష్ట్ర ఆదాయంలో ఏటా 39.24 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలని, ఆ వచ్చిన మొత్తంలో 30 శాతం పట్టణ స్థానిక సంస్థలకు, 70 శాతం పంచాయతీరాజ్‌ సంస్థలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. రెండవ రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆదాయంలో ఏటా 40.92 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలని, ఆ వచ్చిన మొత్తంలో 18.5 శాతం పట్టణ స్థానిక సంస్థలకు, 81.5 శాతం పంచాయతీరాజ్‌ సంస్థలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. మూడవ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆదాయంలో శాతంగా కాకుండా కేవలం నిధుల మొత్తాలను మాత్రమే సిఫార్సు చేసింది. 2010 నుండి 2015 వరకుగల 5 ఏళ్ళకు గాను కేవలం పట్టణ స్థానిక సంస్థలకు రు. 489.34 కోట్లు, పంచాయతీరాజ్‌ సంస్థలకు రు. 1274.34 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. 4 వ ఆర్ధిక సంఘం సకాలంలో వేయలేక పోయినందున తదుపరి కాలానికి ఇవ్వవలసిన మొత్తాన్ని నిర్థారించటంకోసం ఏర్పాటుచేసిన ఉప సంఘం 2010 నుండి 2015 వరకు పట్టణ స్థానిక సంస్థలకు రు. 515.24 కోట్లు, పంచాయతీరాజ్‌ సంస్థలకు రు. 1597.04 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది.
పై 3 ఆర్థిక సంఘాల సిఫార్సులను పరిశీలించినప్పుడు.మొదటి ఆర్థిక సంఘం సిఫార్సులు స్థానిక సంస్థలకు ఊతమిచ్చేవిగా ఉన్నాయి. రెండవ ఆర్ధిక సంఘం సిఫార్సులు స్థానిక సంస్థలకు ఊతమిచ్చేమిగా ఉన్నప్పటికీ, పట్టణ స్థానిక సంస్థలకు కోత విధించింది. మూడవ ఆర్ధిక సంఘం సిఫార్సులలో రాష్ట్ర ఆదాయంనుండి శాతంగా కాకుండా కేవలం కొద్ది మొత్తాలను ఇచ్చి చేతులు దులుపుకున్నట్లుగా స్పష్టం అవుతున్నది. ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నది. కాని స్థానిక సంస్థలకు ఇచ్చే మొత్తాలలో భారీగా కోత విధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏనిష్పత్తిలో పెరుగుతుందో అదే నిష్పత్తిలో స్థానిక సంస్థలకు కూడా వాటా పెరగాలి. అందుకు భిన్నంగా మూడవ ఆర్ధిక సంఘం సిఫార్సులు కొద్ది మొత్తాలను మాత్రమే కేటాయించటం, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటమే నని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము భావిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు Urbans are growth Engines అని ప్రచారం చేస్తున్నాయి. పట్టణాలు (Urbans) growth Engines గా మారాలంటే అక్కడి మౌలిక సౌకర్యాలు ప్రపంచస్థాయిలో అభివృధ్ధి చెందాలి. అలా అభివృధ్ధి చెందాలంటే నిధులు కావాలి. ఒకవైపు Urbans are growth Engines అని చెబుతూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను కుదించటం పరస్పర విరుధ్ధమని మేము భావిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్‌ లో అక్కడక్కడ కొద్ది పాటి పరిశ్రమలున్నప్పటికీ, ప్రధానంగా వ్యవసాయిక రాష్ట్రం. ఆర్ధిక వ్యవస్థకూడా వ్యవసాయాధారితంగానే ఉన్నది. అందువలన స్థానిక సంస్థలకు అదనపు ఆదాయాలు వచ్చే అవకాశాలు లేవు. కనుక స్థానిక సంస్థలు రాష్ట్ర ఆదాయంనుండి వచ్చే వాటా మీదనే ప్రధానంగా ఆధారపడవలసి యున్నది.
పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంనుండి 40 శాతం స్థానిక సంస్థలకు ఖచ్చితంగా విడుదల చేయాలని, అందులో 30 శాతం ఖచ్చితంగా పట్టణ స్థానిక సంస్థలకు, 70 శాతం పంచాయతీరాజ్‌ సంస్థలకు కేటాయించాలని కోరుతున్నాము. మా ఈ డిమాండును మీ సిఫార్సులలో పొందుపరచవలసిందిగా కోరుతున్నాము.
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ 4V లో ఇచ్చిన అంశాలపై మా అభిప్రాయం మరియు మా డిమాండు
టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌ 4Vలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని మిమ్ములను కోరియున్నారు. అదే విధంగా ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటానికి కూడా సిఫార్సులు చేయమని కోరియున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌లోని ఈ అంశాలను పరిశీలిస్తే త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్థాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి, ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం ముందే నిర్ణయంతీసుకొని దానికి తగిన విధంగా సిఫార్సులు చేయమని ఆర్ధికసంఘాన్ని కోరినట్లుగా ఉన్నది. అంతేతప్ప ఆవ్యవస్థలను మెరుగుపరచటానికి సిఫార్సులను కోరలేదు. అందువలన ఈ అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మా వ్యతిరేకతకుగల కారణాలను ఈ దిగువ నిస్తున్నాము.
01. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 11 మరియు 12 ప్రకారం త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లు వగైరాలు స్థానిక సంస్థలు నిర్వహించాలి. వాటిని వ్యాపారాత్మకంగా మార్చాలన్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వాలు కాని, స్థానిక సంస్థలు కాని వాణిజ్య దుకాణాలు కావు. పౌరులు ఆదుకాణాల కస్టమర్లు కాదు. పౌర సౌకర్యాలను కలుగజేయటం కోసం పౌరుల పన్నులతో ఏర్పాటు చేసుకున్న ప్రజా సంస్థలు. ప్రజలు చెల్లించిన పన్నులతో వాటిని నడపవలసియున్నది. ప్రభుత్వం, స్థానిక సంస్థలు వాణిజ్య దుకాణాలైనచో ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించనవసరంలేదు. మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన త్రాగునీరు, పారిశుధ్యం చాలా కీలకమైనవి. వీటిని వ్యాపారమయం చేయటం దారుణం. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు ఇవ్వాలి. మనది ఉష్ణ ప్రదేశం. పైగా అనేక సంప్రదాయాలున్న ప్రదేశం. వీటన్నింటి కోసం ఇంకా ఎక్కువ నీరు ఇవ్వవలసియున్నది. 72 సంవత్సరాల స్వతంత్రం అనంతరంకూడా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసి వస్తున్నది. అనేక పట్ణణాలలో రోజు ఇచ్చే పరిస్థితిలేదు. రెండు మూడు రోజులకొకసారి నీరు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య. అందుకే దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము.
మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే పారిశుధ్యం అవసరం. కాని పట్టణాలన్నీ చెత్తతో సతమతమవుతున్నాయి. చెత్తను నశింపజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. ఒక జనావాసాల వద్ద సేకరించిన చెత్తను మరో జనావాసాల దగ్గరలో పోస్తున్నారు. అక్కడ ప్రజలకు అనారోగ్యంగా మారుతుండటంతో ఆప్రాంతాలలో ప్రజలు ఆంధోళనలకు దిగుతున్నారు. ఈ సమస్యను ఏపట్టణ స్థానిక సంస్థకు ఆ పట్టణ స్థానిక సంస్థ సొంతంగా పరిష్కరించుకోలేవు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే పరిష్కరించబడగలవు. అదేవిధంగా పట్టణాలలో భూగర్భ డ్రైనేజికూడా నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కొన్ని పట్టణాలలో అసలు భూగర్భ డ్రైనేజి లేదు. చాలా పట్టణాలలో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు లేవు. ఉన్న చోటకూడా అవి పనిచేయవు. పూడికలు తీసే నాధుడులేడు. ఈ సమస్యను పరిష్కరించ వలసిన విధానాన్ని గురించి సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, పారిశుధ్ధ్యంతో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం దారుణం. అందుకే దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము.
2010 జులై 28 న త్రాగునీరు, పారిశుధ్యం అనేవి మానవ హక్కులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది ((Water and Sanitation are  recognized as Human Rights by UNO General Assembly through resolution No 64/292 dated 28th July 2010 ). ఐక్యరాజ్య సమితిలో భారతదేశంకూడా భాగ స్వామిగా ఉన్నది. కాని మన పాలకులు త్రాగు నీటిని, పారిశుధ్యాన్ని ప్రజల హక్కుగా చూడకుండా వ్యాపార సరుకుగా చూడటం దారుణం. అందుకే వీటిని వ్యారసరుకుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, పారిశుధ్యం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన చర్యల గురించి సిఫార్సులు చేయవలసినదిగా కోరుతున్నాము.
ప్రజారవాణా వ్యవస్థ ఆవశ్యకత
రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.
జనాభా ఎక్కువ ఉన్న మనలాంటి దేశంలో Mass Transport System  యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. రవాణా అన్నది మానవ నాగరికతకు, సమాజ అభివృద్ధికి కీలకమైనది. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే, చౌకగా, సురక్షితంగా, బాధ్యతాయుతంగా, అన్ని ప్రాంతాలను కలిపేదిగా ఉంటుందని ఋజువయింది. ప్రైవేటీకరిస్తే ప్రజలకు భారంగా మారుతుంది. లాభాలొచ్చే రూట్లలో తప్ప, ఇతర ప్రాంతాలకు విస్తరించదు. లాభంవచ్చినా రాక పోయినా, అవసరం అయితే నష్టాన్ని సబ్సిడీగా భరించి అయినా ప్రజల సౌకర్యార్ధం అన్ని గ్రామాలకు అన్ని రూట్లలో బస్సులను తిప్పగలిగేది ప్రభుత్వమే. ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే,
01. అన్ని గ్రామాలకు అన్ని రూట్లలో బస్సు సౌకర్యం ఏర్పడుతుంది.
02. ప్రజలకు రావాణా చార్జీలు అందుబాటులో ఉంటాయి.
03. ఉద్యోగులకు , ఉద్యోగ భరోసా ఉంటుంది.
04. ఉద్యోగులు గౌరవ ప్రదంగా జీవించగలుగుతారు
05. వివిధ వర్గాల ప్రజలు రాయితీ ధరలలో ప్రయాణం చేయగలుగుతారు.
06. ప్రజలకు సురక్షిత ప్రయాణం అందుతుంది.
ఇవేవీ ప్రైవేటు రంగంలో ఉండవు. ప్రైవేటురంగంలో లాభమే పరమావధిగా ఉంటుంది తప్ప ప్రజా శ్రేయస్సు, ప్రజల అవసరాలు పరమావధిగా ఉండదు. అందుకే ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండవలశిందేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ గా భావిస్తున్నాము. మేము మీ ముందుంచుతున్న ఈవిషయాలను పరిశీలించి ప్రజారవాణా వ్యవస్థ ప్రైవేటీకరణకు దారితీసే విధంగా సిఫార్సులు చేయవద్దని కోరుతున్నాము. ప్రభుత్వ రంగంలోనే ఉంచి, మరింత సమర్ధవంతంగా పని చేసేవిధంగా సిఫార్సులు చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇతర అంశాలు.
ఈ సందర్భంగా మరికొన్ని అంశాలను మీ ముందుంచుతున్నాము.
స్థానిక సంస్థల ఆదాయాలను లాగేసుకోవటం
ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వానికి స్థానిక సంస్థల మధ్య ఎలా పంచాలి అన్న విషయంపై సిఫార్సుల కోసం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమిస్తూనే , మరో వైపు స్థానిక సంస్థల ఆదాయాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంటున్నది. ఉదాహరణకు ఆస్తిపన్ను స్థానిక సంస్థల పరిధిలోనిది. ఇది స్థానిక సంస్థల ఆదాయం. పట్టణాలలో ఆస్తిపన్ను వసూలు చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్ధలనుండి కమీషనర్‌ & డైరెక్టరేట్‌ ఆప్‌ మున్సిపల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (సి.డి.ఎం.ఏ) కు బదలాయించారు. ఇప్పుడు సి.డి.ఎం.ఏ తిరిగి స్థానిక సంస్థకు ఆమొత్తాన్నిబదలాయిస్తే సరేసరి, లేకుంటే లేదు.
అదేవిధంగా వృత్తిపన్ను స్థానిక సంస్థలకు చెందిన ఆదాయం. 1990 వదశకంలో వృత్తిపన్ను వసూలు చేసే బాధ్యతను కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంటుకు అప్పగించారు. వసూలైన మొత్తంలో 95శాతం తిరిగి స్థానిక సంస్థలకు చెల్లించాలన్నది నిబంధన . ఆ రోజుల్లో కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంటు వారు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు. ప్రభుత్వం వాటిని సక్రమంగా స్థానిక సంస్థలకు ఇచ్చేదికాదు. ఇటీవల కాలంలో తిరిగి స్థానిక సంస్థలే వసూలు చేసేవిధంగా అనుమతించారు. అయితే ఈమొత్తాన్ని స్థానిక సంస్థలు వాడుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ ట్రెజరీలో జమచేయాలి. మరల ప్రభుత్వం ఇచ్చినప్పుడే తీసుకోవాలి. త్వరలో నీటిచార్జీలు, డ్రైెనేజి చార్జీలుకూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేపరిస్థితి కనుపిస్తున్నది. ఈవిధంగా స్థానిక సంస్థల ఆదాయ మార్గాలనుకూడా రాష్ట్ర ప్రభుత్వం హరిస్తున్నది. స్థానిక సంస్థలను అంతకంతకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడేటట్లు చేయటమే అవుతుంది.
ఇక ఆస్తిపన్ను 1980వ దశకంనుండి కూడా బకాయిలున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలు వాటిని వసూలు చేయలేకపోతున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఆస్తులకు దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను చెల్లించటం లేదు. పట్టణాలలో రోడ్లప్రక్కన బుట్టలలో పళ్ళు అమ్ముకునేవారినుండి ఆశీళ్ళు వసూలు చేస్తున్నారు. కాని ప్రైవేటుసంస్థలు రోడ్లు త్రవ్వి కేబుళ్ళు, పైపులైన్లు వేస్తున్నాయి. కాని స్థానిక సంస్థలు వాటినుండి అద్దెను వసూలు చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నది. ఈ విధంగా స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడుతున్నది.
అదేవిధంగా తలసరిగ్రాంటు, రోడ్డు గ్రాంటులు కూడా ఇవ్వటం లేదు. ఈవిషయాలనుకూడా తమరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాము.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను స్థానిక సంస్థలపై రుద్దటం
ఇక రాష్ట్ర ప్రభుత్వం తాను చేయవలసిన ఖర్చునుకూడా స్థానిక సంస్థలపై రుద్దుతున్నది. ఉదాహరణకు పేదలకు గృహ నిర్మాణం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం.పథకం అనంతరం గృహనిర్మాణానికి అయ్యే ఖర్చులో 30 శాతం స్థానిక సంస్థలపై రుద్దారు. ఫలితంగా స్థానిక సంస్థలపై అదనపుభారం పడింది.
ఉద్యోగుల వేతనాలు
అదే విధంగా స్థానిక సంస్థ అనేది ప్రజల స్థానిక అవసరాలు చూడటానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగం. కలెక్టర్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం, ఎలాగో స్థానిక సంస్థ కూడా అలాంటిదే. కనుక స్థానిక సంస్థ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే. అయితే స్థానిక సంస్థ ఉద్యోగుల జీతాలు స్థానిక సంస్థ మీదనే రుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది. జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం.పథకం పేరుతో విజయవాడ లాంటి చోట్ల అమలు చేశారు. దీనితో స్థానిక సంస్థలు జీతాలు చెల్లించలేని స్తితికి పడిపోయినవి. ఉద్యోగులు ఆంధోళనలు చేయవలసి వచ్చింది. ఇతర సంస్థలలో ఉద్యోగుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు, స్థానిక సంస్థల ఉద్యోగుల వేతనాలుకూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.
మున్సిపల్‌ ఫండ్‌ VS లాభనష్టాలు లెక్కించటం
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్నిConsolidate Fund అన్నవిధంగానే మున్సిపల్‌ సంస్థకు వచ్చిన ఆదాయాన్ని (అది ప్రభుత్వంనుండి నుండి వచ్చిన ఆదాయం కావచ్చు, లేక స్థానిక పన్నుల నుండి వచ్చి ఆదాయం కావచ్చు) Municipal Fund అంటాము. నిజానికి ఇది మున్సిపల్‌ సంస్థ మొత్తం ఆదాయం అవుతుంది. ఇది మున్సిపల్‌ సంస్థ యొక్క Consolidate Fund . దీనినుండి వివిధ పనులకు ఖర్చు చేయాలి. అయితే అందుకు భిన్నంగా గత దశాబ్ద కాలంగా మున్సిపల్‌ సంస్థ నిర్వహించే ప్రతిపనికీ, ఆపనికి వచ్చే ఆదాయ వ్యయాలను లెక్కించి, లాభనష్టాలను లెక్కగడుతున్నారు. టెర్మ్స్‌ ఆప్‌ రిఫరెన్స్‌ 4హలో త్రాగునీటి వ్యవస్థను , పారిశుధ్ధ్యాన్ని, వీధిలైట్లు వగైరాలను పూర్తి స్తాయిలో వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలు విధించటం, లెవీలను, పన్నులను, ఫీజులను పెంచటం ఏవిధంగా చేయాలో సిఫార్సు చేయమని మిమ్ములను కోరటం ఆ విధానంలో భాగంగానే. ఈ విధానాన్నే మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రతి పనికి లాభ నష్టాలను లెక్కగట్టి ప్రజలనుండి వసూలు చేయాలని సంకల్పించినప్పుడు, ఇక ప్రభుత్వానికి విడిగా పన్నులు చెల్లించవలసిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాము. ఎవరు ప్రభుత్వ సేవలను పొందుతారో వారే ఖర్చు మొత్తాన్ని భరించాలన్న ఫిలాసఫీని ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. అంటే ఆ సేవలను పొందనివారికి ఆ ఖర్చుతో కూడా సంబంధంలేదని ప్రభుత్వం చెబుతున్నది.ఈ ఫిలాసఫీని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇదే నిజమైతే పట్టణాలలో నివశించేవారు వ్యవసాయోత్పత్తులను కొనుక్కుంటున్నారు. కాని వ్యవసాయంతో వారికి సంబంధంలేదు. గ్రామీణ రోడ్ల వ్యవస్థ, గ్రామీణ త్రాగునీటి వ్యవస్థతో వారికి సంబంధంలేదు. తాముకట్టిన పన్నులనుండి వ్యవసాయానికి ఎందుకు సబ్సిడీ ఇవ్వాలని, గ్రామీణ రోడ్లకు ఎందుకు ఖర్చు చేయాలని, గ్రామీణ త్రాగునీటి ప్రాజెక్టులకు ఎందుకు ఖర్చు చేయాలని పట్టణ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడితే అది అశాంతికి, అస్తవ్యస్త పరిస్థితికి దారితీస్తుంది. అందువలన Consolidate Fund నుండి (అంటే Municipal Fund నుండి) వివిధ పనులకు ఖర్చులు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా భావిస్తున్నాము. ఈ విషయాలను కూడా మీ సిఫార్సుల సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
స్థానిక సంస్థల విధులను లాగేసుకోవటం
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను, వృత్తిపన్ను వగైరాలను తన చేతులలోకి తీసుకున్న విధంగానే స్థానిక సంస్థలలో జరిగే పనులను కూడా నెమ్మది నెమ్మదిగా లాగేసుకుంటున్నది. ఉదాహరణకు భూగర్భ డ్రైనేజి, స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణం స్థానిక సంస్థలు చేయవలసిన పనులు. అవసరమైతే దానికి ప్రభుత్వం సహకరించవచ్చు. కాని 2015లో కేంద్ర ప్రభుత్వం గుంటూరులో భూగర్భ డ్రైనేజి కోసం, విజయవాడలో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణం కోసం నిధులను విడుదల చేసింది. ఆ నిధులను గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థలకు బదలాయించకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టులు పిలచి, కాంట్రాక్టర్లకు అప్పగించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఆదాయ మార్గాలను లాగేసుకుంటున్న విధంగానే, పనులనుకూడా లాగేసుకుంటున్నదన్న విషయం స్పష్టమవుతున్నది. ఇది స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటమే అవుతుంది. ప్రజాస్వామ్యవస్వస్థకు విఘాతం. ఈ విషయాలనుకూడా మీసిఫార్సుల సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
స్థానిక సంస్థలలో ఔట్‌ సోర్సింగ్‌వలన పనులు నాశిరకంగా జరగటమే కాకుండా స్థానిక సంస్థలు విపరీతంగా నఫ్టపోతున్నాయి. అందువలన ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విడనాడాలని కోరుతున్నాము.
స్థానిక సంస్థలు బలోపేతం కావాలని, స్థానిక స్వపరిపాలన సజావుగా నడవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కోరుకుంటున్నాము. మీరు సిఫార్సులను చేసేటప్పుడు మేము ఇచ్చిన ఈ వివరాలను దృష్టిలో ఉంచుకోవలసిందిగా కోరుతున్నాము.
పైన ఇచ్చిన అంశాల సారాంశాన్ని క్లుప్తంగా ఈ దిగువనిస్తున్నాము.
01. రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు 40 శాతం నిధులను కేటాయించాలి. వచ్చిన మొత్తంలో 30 శాతం పట్టణ స్థానిక సంస్థలకు, 70 శాతం పంచాయితీ రాజ్‌ సంస్థలకు కేటాయించాలి.
02. త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లతో సహా 11,12 వ షెడ్యూళ్ళలో ఉన్న విధులను వేటీనీ వ్యాపారాత్మకంగా మార్చటం కాని, ప్రైవేటీకరించటం కానీ చేయరాదు.
03. ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించరాదు. ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేయాలి.
04. ఆస్తిపన్ను, వృత్తిపన్ను, వినోదపుపన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వాటా తదితర స్థానిక సంస్థల ఆదాయాలను స్థానిక సంస్థలకే వదిలేయాలి. రోడ్డు టాక్స్‌లో 10 శాతం వాటాను స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
05. రోడ్లు త్రవ్వి కేబుళ్ళు, పైపులైన్లు వేసే ప్రైవేటు సంస్థలనుండి అద్దెను వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
06.విద్యుత్‌ సంస్థలు మంచినీటి సరఫరాకుసైతం స్థానిక సంస్థలనుండి కమర్షియల్‌ రేటుతో విద్యుత్‌ చార్జీలు వసూలు చేస్తున్నవి. మంచినీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌కు గృహావసరాలకు వసూలుచేసే చార్జీలనే వసూలు చేయాలి. లేదా విద్యుత్‌ స్థంభాలు, కేబుల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్లకు వినియోగించిన స్థలాలకు అద్దె వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
07. పేదలకు గృహనిర్మాణానికి అయ్యే ఖర్చును స్థానిక సంస్థలపై రుద్దరాదు. పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి.
08. స్థానిక సంస్థలలోని ఉద్యోగుల జీత భత్యాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
09. ప్రతిపనికి లాభ నష్టాలను లెక్కగట్టి ప్రజలనుండి వసూలు చేయాలనే విధానాన్ని విడనాడాలి. Municipal Fund  ను ఏర్పాటుచేసి, దాని నుండి మాత్రమే ఖర్చు చేసే విధానాన్ని అమలు జరపాలి.
10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో స్థానిక సంస్థలు చేయవలసిన పనులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా చేపట్టరాదు. స్థానిక సంస్థల ద్వారానే ఆ పనులను చేయించాలి.
11. ఆస్తిపన్ను. డ్రైనేజిచార్జీలు, నీటిచార్జీలు తదితర పన్నులు, చార్జీలను వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకే ఉండాలి.
12. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులకు చెల్లించవలసిన ఆస్తిపన్ను చెల్లించక పోతే స్థానిక సంస్థ కఠిన చర్యలు తీసుకొనే విధంగా చట్టసవరణలు చేయాలి.
13. స్థానిక సంస్థలలో ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విడనాడాలి.
14. పట్ణణాలు, గ్రామాల అభివృధ్ధికి ఒక నిర్థిష్టమైన యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు జరపాలి.
మీ సిఫార్సులను రూపొందించే సమయంలో పై విషయాలను పరిగణన లోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి)              (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు                          కార్యదర్శి

Saturday, 8 June 2019

Press meet on 7.6.19


ప్రచురణార్ధం:                                                         తేదీ:07.06.2019 

రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు 40 శాతం నిధులను కేటాయిస్తూ సిపార్సులను చేయవలసిందిగా టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ ఆంధ్రపదేశ్‌ 4 వ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ ను కోరింది. ఈ మేరకు టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ ప్రతినిధిబృందం ఫైనాన్స్‌ కమీషన్‌ ఛైర్మెన్‌ ను కలిసి మొమొరాండం సమర్పించింది. ఫైనాన్స్‌ కమీషన్‌ తన సిఫార్సులను రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలను ఆ మెమొరాండం
లో పొందుపరచింది. త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లను పూర్తిస్థాయి వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలను, పన్నులను ఎంత పెంచాలో సూచించమని రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌కు టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో ఇవ్వటాన్ని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ తప్పుబట్టింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసివస్తన్నదని, అనేక పట్ణణాలలో రెండు మూడు రోజులకొకసారి మాత్రమే నీరు ఇస్తున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య అని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ స్పష్టం చేసింది. త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లతో సహా రాజ్యాంగంలోని 11,12 వ షెడ్యూళ్ళలో ఉన్న విధులను వేటీనీ వ్యాపారాత్మకంగా మార్చటం కాని, ప్రైవేటీకరించటం కానీ చేయరాదని ఫైనాన్స్‌ కమీషన్‌ను కోరింది. 
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటంకోసం సిఫార్సులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరటాన్ని కూడా టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ తప్పుబట్టింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేయాలని కోరింది. ఆస్తిపన్ను, వృత్తిపన్ను, వినోదపుపన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వాటా తదితర స్థానిక సంస్థల ఆదాయాలను స్థానిక సంస్థలకే వదిలేయాలని,రోడ్డు టాక్స్‌లో 10 శాతం వాటాను స్థానిక సంస్థలకు ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ కోరింది. రోడ్లు త్రవ్వి కేబుళ్ళు, పైపులైన్లు వేసే ప్రైవేటు సంస్థలనుండి అద్దెను వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఉండాలని, మంచినీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌కు గృహావసరాలకు వసూలుచేసే చార్జీలనే వసూలు చేయాలని కోరింది.పేదలకు గృహనిర్మాణానికి అయ్యే ఖర్చును స్థానిక సంస్థలపై రుద్దరాదని, స్థానిక సంస్థలలోని ఉద్యోగుల జీత భత్యాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరింది. ఆస్తిపన్ను. డ్రైనేజిచార్జీలు, నీటిచార్జీలు తదితర పన్నులు, చార్జీలను వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకే ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులకు చెల్లించవలసిన ఆస్తిపన్ను చెల్లించక పోతే, స్థానిక సంస్థ కఠిన చర్యలు తీసుకొనే విధంగా చట్టసవరణలు చేయాలని కోరింది. స్థానిక సంస్థలలో ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విడనాడాలని, పట్ణణాలు, గ్రామాల అభివృధ్ధికి ఒక నిర్థిష్టమైన యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు జరపాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో స్థానిక సంస్థలు చేయవలసిన పనులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా చేపట్టరాదని, స్థానిక సంస్థల ద్వారానే ఆ పనులను చేయించాలని కోరింది. సిఫార్సులు చేసేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ను కోరింది.





Friday, 26 April 2019

రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలలో ఎన్నో రకాల సబ్సిడీలు భరిస్తున్నది. ఎలాంటి ఉత్పాదక ప్రయోజనం లేకుండానే ఉచితంగా డబ్బులిచ్చే పథకాలు కూడా ప్రకటిస్తున్నది. ప్ర‌జోప‌యోగ‌మైన ఆర్‌.టి.సి. న‌ష్టాల‌ను ఎందుకు ప్ర‌భుత్వం స‌బ్సిడీగా ప్ర‌భుత్వం స‌బ్సిడీగా భ‌రించ‌దు? - టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ సూటి ప్ర‌శ్న‌

ప్రచురణార్ధం:                                                                                     తేదీ:26.04.2019
          రాష్ట్రంలో ఆర్‌.టి.సి. బస్‌ చార్జీలు పెంచవలసిన అవసరం ఉందని, అధికారంలోకి రాబోయే ప్రభుత్వం బస్‌ చార్జీలు పెంచటానికి అనుమతినివ్వాలని ఆర్‌.టి.సి. యం.డి. సురేంద్రబాబు ప్రకటించటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో 128 బస్‌ డిపోలకుగాను116 బస్‌ డిపోలు నష్టాలలో ఉన్నాయని, లాభాలలో ఉన్న డిపోలు కూడా బస్‌ స్టాండ్‌లు వాణిజ్య కార్యక్రమాలు ఇవ్వటం వలన లాభాలలో ఉన్నాయని సురేంద్రబాబు వెల్లడించారు. ఆర్‌.టి.సి నష్టాలలో ఉన్నది ప్రయాణీకులు లేక కాదని, యాజమాన్య లోపం వల్లనేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఆర్‌.టి.సి వినియోగించే డిజిల్‌ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించటం, విచ్చలవిడిగా ప్రైవేటు బస్సులకు అనుమతి నివ్వటం, రాష్ట్రంలోని అన్ని గ్రామాలను కలిపేలా బస్సులను నిర్వహించకపోవటం, అస్థవ్యస్తంగా ఉన్న రోడ్ల నిర్మాణం, ప్రైవేటీకరణ విధానాలు ఆర్‌.టి.సిని దెబ్బతీస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. ''అమరావతి యాత్రకు, పోలవరం యాత్రకు, సి.యం.సభలకు జనాన్ని తరలించటానికి వినియోగించిన బస్‌లకు అయిన ఖర్చు, ఆ ఖర్చుకుగాను ప్రభుత్వం తిరిగి ఎంత చెల్లించింది'' అన్న వివరాలు ప్రజల ముందుంచాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేస్తున్నది. ప్రభుత్వం వివిధ రకాల ప్రజలకు ఆర్‌.టి.సి. చార్జీలలో రాయితీలు ప్రకటిస్తున్నది. ఆ రాయితీలు ప్రకటించేది ప్రభుత్వం కనుక ఆ రాయితీల వలన కలిగిన నష్టం మొత్తాన్ని ప్రభుత్వం ఆర్‌.టి.సి.కి తిరిగి చెల్లించాలి. ఆవిధంగా ప్రభుత్వం తిరిగి చెల్లించిందా లేదా అన్న విషయాన్ని బహిర్గతం చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేస్తున్నది. బస్‌ స్టాండ్‌లను వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం వలన కొన్ని డిపోలు లాభాలలో ఉన్నాయని చెప్పటం, నష్టాలను పూడ్చుకోవాలన్న పేరుతో రాష్ట్రంలో మరిన్ని బస్‌ స్టాండ్లను ప్రైవేటువ్యక్తులకు అప్పగించటానికేనని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో ఇంకా 1000 బస్సుల అవసరం ఉందని, సొంత బస్సుల వలన కిలో మీటరుకు రు 6లు నష్టం వస్తున్నందున క్రొత్త బస్సులు కొనటానికి బదులుగా అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సురేంద్రబాబు చెప్పారు. ఇది కేవలం ఆర్‌.టి.సి.కి సొంత బస్సులు లేకుండా చేసి ఆర్‌.టి.సి.ని నిర్వీర్యం చేయటానికి ఉద్దేశించిన చర్య. ప్రజారవాణా వ్యవస్ధను ప్రైవేటీకరించటానికి అనుసరించవలన విధానాలను సిఫార్సులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్ర 4వ ఆర్ధిక సంఘాన్ని కోరింది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్ధను ప్రైవేటీకరించటానికి నిర్ణయించిందని స్పష్టమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగానే ఆర్‌.టి.సి.ని నిర్వీర్యం చేయటానికి, ప్రజారవాణాను ప్రైవేటీకరించటానికి రకరకాల సాకులను ఆర్‌.టి.సి.పాలక వర్గం ప్రజలముందు ఉంచుతున్నదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. 
     రవాణా మానవ నాగరికతకు, సమాజ అభివృద్ధికి కీలకమైనది. అందువలన రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందులో అధిక జనాభా ఉన్న మనలాంటి దేశాలలో ప్రజారవాణా చాలా కీలకమైనది. ఛార్జీలు పెంచితే ప్రజలు ప్రజారవాణాకు దూరమవుతాయి. ఇది సమాజం మీద దుష్ప్రభావాలను చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలలో ఎన్నో రకాల సబ్సిడీలు భరిస్తున్నది. ఎలాంటి ఉత్పాదక ప్రయోజనం లేకుండానే ఉచితంగా డబ్బులిచ్చే పథకాలు కూడా ప్రకటిస్తున్నది. ఎన్నికల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, యాజయాన్య లోపాలవలన ఆర్‌.టి.సి.కి నష్టాలు వస్తే మాత్రం ప్రజలమీద ఎందుకు రుద్దాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. రాబోయే నూతన ప్రభుత్వం చార్జీల పెంపుదలకు అనుమతి నివ్వరాదని, ఆర్‌.టి.సి.కి వచ్చే నష్టం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిిమాండ్‌ చేస్తున్నది. 

(వి.సాంబిరెడ్డి)                                                       (యం.వి.ఆంజనేయులు) 

అధ్యక్షులు                                                                     కార్యదర్శి






                                                    






Tuesday, 23 April 2019

రాష్ట్రంలో నీటి ఎద్ద‌డి పై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ ప్రెస్ మీట్ 23.04.2019

ప్రచురణార్ధం: తేదీ:23.04.2019
విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలలో నీటి సరఫరాలో కొరత ఏర్పడటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. న్యూరాజరాజేశ్వరీ పేట, రాజీవ్‌నగర్‌, వాంబే కాలనీలలో ఇప్పటికే నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నది. విజయవాడ నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం ఏప్రిల్‌ నెలలోనే 6 అడుగులకు పడిపోయింది. మండు వేసవిగా ఉండే మే, జూన్‌ నెలలో నీటి మట్టం మరింతగా పడిపోయే అవకాశం ఉంది. దీనితో నగరంలో నీటి సరఫరా పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ సాగునీటికి ఉద్దేశించినది. దాని నుండే నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలో సుమారు 10 లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ నగరానికి సరిపడా నీటిని నిల్వ ఉంచుకునేటందుకు ప్రత్యేక రిజర్వాయర్‌ లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉండగానే ప్రకాశం బ్యారేజికి దిగువన కృష్ణా నదిపై చెక్‌ డ్యాం నిర్మించి నీటిని నిల్వ ఉంచాలన్న ప్రతి పాదన వచ్చింది. ఇది నిర్మిస్తే వరద నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అప్పుడు విజయవాడ నగరం పూర్తిగా ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. రాష్ట్ర విభజన అనంతరం పాలకులు ఆ ప్రతిపాదనను గాలికొదిలేశారు. భవిష్యత్తులో ఎప్పుడో అమరావతికిి చేరే జనానికి కావలసిన నీటి కోసం ఇప్పుడే వైకుంఠపురం వద్ద చెక్‌ డ్యాం నిర్మించడానికి పూనుకుంటున్న పాలకులు,ఇప్పటికే 10 లక్షలకు పైగా జనం ఉన్న విజయవాడ నగర ప్రజలకు కావలసిన నీటి అవసరాల కోసం చెక్‌ డ్యాం నిర్మించాలన్న ఆలోచన చేయక పోవటం దారుణం.
త్రాగునీటి సమస్య కేవలం విజయవాడ నగరానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో త్రాగు నీటి సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడి పోయాయి. కొన్ని మండలాలలో చలమలు, ఊటల నుండి కొబ్బరి చిప్పలతో, డబ్బాలతో తోడి పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 12 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడి పోయాయి. తిరుపతిలో ట్యాంకర్లద్వారా నీటిని తెప్పించుకోవలసి వస్తున్నది. ఉత్తరాంధ్రలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపుర్లం, గుంటూరు జిల్లా వినుకొండలలో 3 రోజులకొకసారి నీరిస్తున్నారు. విశాఖ రూరల్‌లో 126 గ్రామాలలో నీటి కొరత ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో దాదాపు జిల్లా అంతటా నీటి సమస్య తీవ్రంగాఉన్నది.గిద్దలూరులో రోజూ 20లక్షల లీటర్ల లోటు ఉందని వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ, మాచర్ల, గురజాల, కృష్ణా జిల్లాలో తిరువూరు, మైలవరం, గంపలగూడెం లాంటి మండలాలలో నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రం మొత్తం త్రాగునీటి సమస్య తీవ్రమవుతున్నది. ప్రభుత్వాలు త్రాగునీటి సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసిన దాని ఫలితంగానే త్రాగునీటి కరువు ఏర్పడుతున్నది. మన పాలకులు సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, త్రాగునీటి ప్రాజెక్టులకు ఇవ్వటం లేదు. వేసవి రాగానే సమీక్షల మీద సమీక్షలు జరపటం అక్కడక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటం మినహా, ఈ సమస్యను శాశ్వితంగా పరిష్కరించాలన్న దృక్ఫథంలేదు. ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించటంలో వైఫల్యం చెందిన పాలకులు అభివృధ్ధిని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.
ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం రాష్ట్రంలో మంచి నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత నివ్వాలని, విజయవాడ నగరానికి మంచినీటి సరఫరా కోసం కనీసం 5 టి.యం.సిల నీటిని నిల్వ ఉంచేవిధంగా చెక్‌ డ్యాంలు నిర్మించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది. ఈ వేసవిలో విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా సజావుగా జరిగేటందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నది.


వి.సాంబిరెడ్డి                                                        యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                      కార్యదర్శి




Monday, 4 March 2019

ఓట్ల తొల‌గింపుపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ స్పంద‌న‌- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ‌


ప్రెస్ నోట్                                                                   తేదీ:04.03.2019

ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ల ఓట్లు తొలగిస్తున్నారన్న అభిప్రాయం రాష్ట్రంలో బలంగా ఉన్న నేపధ్యంలో అర్హులైన ప్రతి పౌరుని పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత అని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టంచేసింది. ఈ అభిప్రాయం ప్రజలనుండి తొలగి పోవాలంటే పక్కా ఓటర్ల జాబితా రూపొందించటమే ఏకైక మార్గమని, అందుకోసం ఎన్నికల సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓట్ల వెరిఫికేషన్‌ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని మరోసారి డిమాండ్‌ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గాపాలకృష్ణ ద్వివేదికి ఒక లేఖ వ్రాశింది. హైదరాబాద్‌లో ఐ.టి.గ్రిడ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థపై సైబరాబాద్‌ పోలీసులు చేసిన దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 3 కోట్లమంది ఓటర్ల జాబితాలు, ఆధార్‌ డేటాలు ఆ సంస్థ వద్ద దొరకటం, ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగు దేశం పార్టీకి ఐటి సేవలందించేదిగా ఉండటంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ల పేర్లు ఓటర్ల జాబితానుండి తొలగిస్తున్నారన్న జనాభిప్రాయానికి బలం చేకూరిందని ఆలేఖలో స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఓటర్ల జాబితానుండి పేర్లు తొలగించటం సాధ్యంకాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ప్రకటనను ఆలేఖలో తప్పుబట్టింది. కొంతమంది ఆన్‌ లైన్‌ ద్వారా ఇతరుల ఓట్ల తొలగింపుకు దరఖాస్తు చేస్తున్నారని, మరి కొన్ని చోట్ల ఇతరుల ఓట్ల తొలగింపుకు నేరుగా ఫారం 7లో దరఖాస్తులు చేస్తున్నారని వస్తున్న వార్తలను బట్టి ఎవరైనా ఇతరుల ఓట్ల తొలగింపుకు దరఖాస్తు చేయవచ్చునని స్పష్టమవుతున్నదని ఆ లేఖలో పేర్కొంది. అలా దరఖాస్తు చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసినంత మాత్రాన జరిగిన నష్టం పూడదని, అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా చేర్చినప్పుడే జరిగిన నష్టం సరిదిద్దబడుతుందని ఆ లేఖలో తెలియజేసింది. రెండు నెలల క్రితమే ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి వ్రాతపూర్వకంగా తీసుకు వచ్చింది. ఇంటింటికి తిరిగి ఓట్ల వెరిఫికేషన్‌ చేపట్టడం ద్వారా అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా చేర్చే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకొనటం ద్వారా ఆ సమస్యను పరిష్కరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పట్టించుకోలేదు. యధావిధిగా ఓట్లను చేర్పించే బాధ్యతను రాజకీయ పార్టీలకు వదలి వేశారు. మీరే వచ్చి ఓటరుగా చేరండని ప్రజలకు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యతా రాహిత్యం వలననే అక్రమంగా ఓట్లు తొలగించే ప్రకియ జోరందుకున్నదని స్పష్టమవుతున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృస్టికి తీసుకు వస్తూ, ఇప్పటికైనా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓట్ల వెరిఫికేషన్‌ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మరోసారి డిమాండ్‌ చేసింది. 

వి. సాంబి రెడ్డి                                                                     యం.వి.ఆంజ‌నేయులు
అధ్య‌క్షులు                                                                                 కార్య‌ద‌ర్శి










Memorandum dated 03.03.2019 to Chief Election Office Andhra Pradesh on deletion of Votes from Voter Lists

Date: 03.03.2019
To
Sri Gopala Krishna Dwivedi, IAS
Chief Electoral Officer
Room No: 192, Ground Floor,
Building No 5, A.P. Secretariat,
Velagapudi, AMARAVATHI
PIN: 522 238

Respected sir,
Sub: Deletion of Votes in Andhra Pradesh from electoral rolls.
We, Tax Payers Association, Vijayawada,  wrote a letter dated 11.12.2018 to Sri R.P. Sisodia, IAS, the then  Chief Electoral Officer explaining the flaws in Voter lists including the pervasive opinion of the people about the deletion of their names from Voter Lists.  As the letter is self explanatery, we are enclosing the copy of the letter for your ready reference.
Later we went thorough the news papers that you had asserted that it is not possible to anybody to delete the Votes from Voter Lists.  In making such statement, your office had covinently forgotten that it is the responsibility of the Election Commission to dispel the fears existing in the minds of the people that the ruling party, weilding its power, is managing the election staff in deleting the votes of the cizens who are against the ruling party or who are for the opposition parties.  This can be done only by arranging to make door to door verification of voters by the Election Staff. Insted of doing this,  Election Commission simply passed the responsibility on to the people to enrol themselves and left the matter to political parties. It is nothing but abdication of the democratic responsibility by the Election Commission.
Adding fuel to the fears existing in the minds of the people,  today's News Papers carreid a news item that the Cyberabad Police had raided the office of " IT GRIDS India Ltd" located at Hyderabad which is working for Government of Andhra Pradesh in making Apps and working for ruling Telugu Desam Party as well and this institution had the voterlists in their possession containg  3 cr votes of Andhra Prtadesh with AADHAAR numbers shared by the Government of Andhra Pradesh.  So it seems that somthing is happening to the voterlists. News are coming that some people are applying impersonally for the deletion of other's votes.  Whether " IT GRIDS India Ltd" Company has committed a crime or not will be decided by Judiciary.  But the chances of  impersonation for applying for the deletion of the Votes can not be ruled out.  Media has reported that CEO of AP has ordered for filing cases against perpetrators.  Mere filing cases can not repair the damage caused hitherto.  The damage can be repaired only by making door-to-door verification of the votes by election staff.  Additions and deletions can be made only during this verification.
Two months back, we brought it to the notice of CEO, AP  and demanded for door-to-door verification. But our demand has been paid no heed.  The main aim of our demand is that any eligible citizen of Andhra Pradesh should not forego his vote and the right to choose his representative in State Assembly and Loksabha. So, we  once again urge your goodselves to pay heed to our demand and order to conduct door-to-door verification of the votes in order to save the democracy. 
Thanking you
Yours truly

V. Sambi Reddy   M.V. Anjaneyulu
  President          Secretary