Thursday, 5 October 2017

విజ‌య‌వాడ‌లోని సుమారు 47 ఎక‌రాల ప‌బ్లిక్ స్థ‌లాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు క‌ట్టబెట్టే విధంగా మున్సిప‌ల్ కౌన్సిల్ చేసిన తీర్మానాల‌కు వ్య‌తిరేకంగా 02.10.2017 న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ ప్రెస్ మీట్‌

ప్రచురణార్ధం:                                                                     తేదీ:02.10.2017
విజయవాడ నగరంలో సుమారు 47 ఎకరాల ప్రభుత్వ స్ధలాలను, నగర ప్రజల ప్రయోజనాలకు కాకుండా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం కోసం నగరపాలక సంస్థ నిర్ణయం చేయటం పట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. స్వరాజ్యమైదానం 26 ఎకరాలు, నరపాలక సంస్థ ప్రాంతంలో ఉన్న పూలమార్కెట్‌, కూరగాయల  హోల్‌సేల్‌ మార్కెట్‌ మొత్తం ఎ.3.80లు, నగరపాలక సంస్థ స్థలం ఎ.3.22లు, సబ్‌స్టేషన్‌ ఎ.1.14లు, రాజీవ్‌గాంధి పార్కు ఎ.9.01లు , రైల్వే స్థలం ఎ.3.51లు మొత్తం ఎ.46.68లు నగర ప్రజలకు దక్కకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్ట బోతున్నారు. కేవలం నగరంలోని విలువైన పబ్లిక్‌ స్థలాలను తమ అనుమాయులకు, బడా పారిశ్రామిక వేత్తలకు, విదేశీ కంపెనీలకు కట్టబెట్టటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభివర్ణిస్తున్నది. నగరంలో వాహనాలసంఖ్య నానాటికీ పెరుగుతున్నది. సరైన పార్కింగ్‌ స్థలాలులేవు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దెభవనాలలో నడుస్తున్నాయి. నగరంలో సరైన క్రీడా మైదానాలు లేవు. ఏదైనా విపత్తు సంభవిస్తే తలదాచుకోవటానికి స్థలాలు లేవు. విజ్ఞాన,వినోద కార్యక్రమాలకు స్ధలాలు లేవు. ఇలా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు స్థలాలను ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం, నగరపాలకులు, అందుకు భిన్నంగా ఇప్పటికే ఉన్న స్థలాలలో రిటైల్‌ మాల్స్‌, ఎగ్జిబిషన్‌ హాల్స్‌, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయటం, టవర్లు కట్టడం లాంటి వాటివలన చేయటం వలన ప్రైవేటు వ్యక్తుల, సంస్థల ప్రయోజనాలు నెరవేరుతాయి తప్ప నగర ప్రజల ప్రయోజనాలు నెరవేరవు. ఇప్పటికే ఆర్‌.టి.సి స్థలాలు క్రమేణా ప్రైవేటు వ్యక్తు చేతులలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్‌ స్థలాలు, నగరపాలక సంస్థ స్థలాలను కాజేయబోతున్నారు. ఇది నగరానికి తీరని నష్టం వాటిల్లుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టంచేస్తున్నది. నగర ప్రయోజనాలు ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేటర్లు కూడా కౌన్సిల్‌లో ఈ తీర్మానాలకు ఓటువేయటం దారుణం. ఇప్పటికైనా నగరప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నగరపాలక సంస్థ పాలకులు తమ నిర్ణయాలను వెనుక్కు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది. నగరానికి నిధులిచ్చి అభివృధ్ధి చేయాల్సిన ప్రభుత్వం, నిధులు ఇవ్వకపోగా, అభివృధ్ధికి వికృతి నిర్వచనాలిచ్చి, నగర ప్రజలకు ఉపయోగపడే స్థలాలను కాజేయటం మానుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

వి.సాంబిరెడ్డి                                                      యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                              కార్యదర్శి








Tuesday, 11 April 2017

Press Meet Video on 10.04.2017


Press Meet on 10.04.2017

2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేయటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించాలనటం చట్టవిరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇది చట్ట విరుధ్ధమని తెలియజేస్తూ మున్సిపల్‌ కమీషనర్‌కు, మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ లేఖలు వ్రాశింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 ప్రకారం ఆస్తి పన్నును అర్ధసంవత్సరానికి కాని లేక 3 నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలే తప్ప సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టమనే హక్కు కమీషనర్‌కు లేదు. మున్సిపల్‌ కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది తప్ప, సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడా లేని హక్కును మున్సిపల్‌ అధికారులు ఎలా అమలు జరుపుతారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నిస్తున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారులే చట్ట విరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం దారుణమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది.
మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాసి ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్లను ప్రయోగించి ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. పన్నులు చెల్లించని ఇలాంటి వారిపై అధికారులు ఈ సెక్షన్‌ల ప్రకారం చర్యలు తీసుకోనందున కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. వీరివలన కార్పొరేషన్‌ ఖజానాకు కలుగుతున్న నష్టానికి అధికారులే బాధ్యత వహించాలి.
ఆస్తి పన్ను ముందస్తుగా చలెల్లించకపోతే పోతే వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపి వేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని బెదిరిస్తే సాధారణ పన్ను చెల్లింపుదారులు బెదిరిపోయి ఆస్తిపన్ను, దానితోబాటే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలను సంవత్సరం మొత్తానికీ ఒకేసారి కట్టేస్తారన్న వ్యూహంతోనే ఈ కరపత్రాలను పంచుతున్నారని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడుతున్నది. చట్టవిరుధ్దమైన అంశాలతో, బెదిరింపులతో కూడిన ఈ కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలని, ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షత లేకుండా మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955 సెక్షన్‌ 269(2)మరియు సెక్షన్‌ 270 ప్రకారం అత్యధిక మొత్తాలలో బకాయిలున్న వారితో ప్రారంభించి అవరోహణా క్రమం(Descending order) లో బకాయిదారులపై చర్యలు చేపట్టాలని, పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటి కప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నది.

వి.సాంబిరెడ్డి                                                  యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                         కార్యదర్శి











Saturday, 8 April 2017

ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు చేస్తూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కరపత్రాల పంపిణీ చేయ‌టం పై అభ్యంతరం తెలియ‌జేస్తూ క‌మీష‌న‌ర్‌కు వ్రాశిన లేఖ‌


                                                                                                తేదీ: 06.04.2017 
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి, 
ఆర్యా, 
విషయం: 2017-2018 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని 
డిమాండు చేస్తూ కరపత్రాల పంపిణీపౖౖె అభ్యంతరం 
రిఫరెన్స్‌: 15.07.2016 న టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్రాశిన లేఖ 
2017-2018 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని, అదికూడా ఏప్రిల్‌ నెలలోనే చెల్లించాలని లేకుంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 269(2) ప్రకారం నెలకు 2శాతం చొప్పున పెనాలిటీ విధించబడుతుందని, అదేచట్టం సెక్షన్‌ 269(2) ప్రకారం అత్యవసర సర్వీసులు నిలిపి వేయ వచ్చునని, సెక్షన్‌ 270 ప్రకారం చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని పన్ను చెల్లింపుదారులను బెదిరిస్తూ విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌గా మీరు విజయవాడ నగరంలో కరపత్రాలను పంపిణి చేయిస్తున్నారు. పన్నుచెల్లింపుదారులను బెదిరిస్తూ మీరు కరపత్రాలను పంపిణీ చేయించటం పట్ల టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము అభ్యంతరం తెలియ జేస్తున్నాము. 

అభ్యంతరం 1:- ఇది చట్ట విరుధ్ధం (Against GHMC Act1955).. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది. 

Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of- 
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of    April and October 

(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.
పై సెక్షన్‌ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరం మొత్తానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్‌ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 
పై చట్టం ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి ఒకసారి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. కౌన్సిల్‌కు సైతం అర్ధ సంవత్సరం లేదా 3 నెలలు మధ్య ఎంపిక చేసుకొని నిర్ణయం చేసే హక్కు మాత్రమే ఉన్నది. అంతేకాని సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని నిర్ణయం చేసే హక్కు కౌన్సిల్‌కు కూడా లేదు. కౌన్సిల్‌కు కూడాలేని హక్కును మీరు ఏచట్ట ప్రకారం అమలు జరుపుతున్నారని ప్రశ్నిస్తున్నాము. 2016-2017 ఆర్ధిక సంవత్సరానికి సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లించమని డిమాండు నోటీసులు పంపించారు. అప్పుడే అలా నోటీసులు పంపటం చట్టవిరుధ్ధమన్న విషయాన్ని పైన రిఫరెన్స్‌లో చూపిన లేఖ ద్వారా మీదృష్టికీ, గౌరవ మేయర్‌గారి దృష్టికి తీసుక వచ్చాము. అయినప్పటికీ మీరు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కూడా చట్టవిరుధ్ధంగా సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఆస్తిపన్ను వసూలు చేయటానికి నిర్ణయించుకున్నారని మీరు పంపిణీ చేయిస్తున్న కరపత్రాలనుబట్టి స్పష్టమవుతున్నది. చట్టాన్ని కాపాడవలసిన అధికారిగా మీరే చట్టవిరుధ్ధమైన అంశాలను ప్రోత్సహించటం సరికాదని స్పష్టం చేయదలుచుకున్నాము.  
అభ్యంతరం 2:- GHMC Act1955 సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270 అమలు: 
ఈ సెక్షన్ల ప్రకారం ఆస్తిపన్ను ఆలస్యంగా చెల్లిస్తే నెలకు 2 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేయవచ్చునని, చరాస్తులను జప్తు చేసుకోవటం జరుగుతుందని కరపత్రంలో వ్రాశారు. సాధారణ పన్ను చెల్లింపుదారులకు వర్తించే ఈ సెక్షన్లు, కోట్లు, లక్షలరూపాయలు ఆస్తిపన్ను బకాయిలున్న వారికి ఇప్పటివరకు ఎందుకు వర్తింపచేయలేదని ప్రశ్నిస్తున్నాము. రైల్వేలు, ప్రభుత్వ కార్యాలయాలు కోట్లు రూపాయలు ఆస్తిపన్ను చెల్లించాలి. ఆస్తిపన్ను బకాయిదారులలో ప్రజాప్రతినిధులు ఉన్నారన్న పేరుతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ నుండి తొలగించారు. ఏళ్ళ తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న ప్రజాప్రతినిధులపై, దశాబ్దానికి పైగా బకాయిలున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై, ప్రైవేటు సంస్థలపై, ట్రస్టులపై, మత సంస్థలపై ఈసెక్షన్ల ప్రకారం చర్య తీసుకోకుండా ఉండటానికి GHMC Act1955 లో ఎలాంటి మినహాయింపులు లేవన్న విషయం మీకు తెలియంది కాదు. పన్నులు బకాయిపడిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేవన్నవిషయం తెలిసికూడా మీరు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు. వారిపై చర్యలు తీసుకోకుండా, వారినుండి పన్నులు వసూలు చేయకపోవటం ద్వారా మీరు కార్పొరేషన్‌ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని మీకు స్పష్టం చేయదలిచాము. దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వీరెవ్వరిపై చర్య తీసుకోకుండా, వడ్డీ వసూలు చేస్తామని, అత్యవసర సర్వీసులు నిలిపివేస్తామని, చరాస్తులను జప్తు చేస్తామని కరపత్రం ద్వారా ప్రచారం చేయటం సాధారణమైన పన్ను చెల్లింపుదారులను బెదిరించటమేనని, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారుల పట్ల వివక్షత చూపటమేనని స్పష్టం చేస్తున్నాము. చట్టం ముందు అందరూ సమానులే (Equality Before Law)అన్న సూత్రానికి మీచర్య విరుధ్ధమని తెలియజేస్తున్నాము. 
పై రెండు అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మీముందుంచుతున్నాము. 
01. కరపత్రాల పంపిణీని తక్షణమే నిలిపి వేయాలి 
02. GHMC Act1955 సెక్షన్‌ 264 ప్రకారం అర్ద సంవత్సరానికే ఆస్తిపన్ను డిమాండు నోటీసులు జారీచేయాలి. 
03. ఇప్పటికే దశాబ్దాల తరబడి ఆస్తిపన్ను బకాయిలున్న వారిపై వివక్షతలేకుండా GHMC Act1955  సెక్షన్‌ 269(2) మరియు సెక్షన్‌ 270 ప్రకారం అవరోహణా క్రమం(Descending order) లో చర్యలు చేపట్టాలి. తీసుకున్న చర్యలను  మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు తెలియజేయాలి 
04. పూర్తి వివరాలతో ఆస్తిపన్ను బకాయిదారుల జాబితా ఎప్పటికప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ లో ఉంచటం ద్వారా ప్రజలకు తెలియజేయాలి. 

                                                   అభివందనాలతో 

వి.సాంబిరెడ్డి                                                                యంవి ఆంజనేయులు
అధ్యక్షులు                                                                       కార్యదర్శి 


CC to Sri Koneru Sridhar
         Hon'ble Mayor
Municipal Corporation
Vijayawada 




Friday, 17 March 2017

Press Meet on Metro Rail Project Vijayawada


ప్రచురణార్ధం:                                                                                                    తేదీ:17.03.2017 
మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో ఎటువంటి మార్పులు జరగబోవని, బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు మరియు కాల్వల పైన మెట్రో నిర్మాణం సాధ్యం కాదని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ప్రకటించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఖండిస్తున్నది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని, ఏలూరు రోడ్డులో కాకుండా మెట్రో రైలు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు ద్వారా నిర్మించాలని మెట్రో రైల్‌ ప్రాజెక్టు వలన భూములు కోల్పోయే బాధితులు కోరుతున్నారు. ఆ మేరకు ప్రాజెక్టు రుణం మంజూరు చేయటానికి ముందుకు వచ్చిన జర్మనీ, ఫాన్స్‌లకు చెందిన సంస్థలకు లేఖ ఇచ్చినట్లుగా పత్రికలలో వచ్చింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు బాధితుల అభిప్రాయానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మద్దత్తు తెలియ జేస్తున్నది. 
టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కూడా మెట్రో రైలు రూట్లను మార్చాలని కోరింది. ఈ మేరకు జనవరి 31 వతేదీన అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (ఎ.యం.ఆర్‌.సి) ఛైర్మెన్‌కు లేఖ వ్రాశింది. మెట్రో రైల్‌ లక్ష్యాన్ని కేవలం ట్రాఫిక్‌ నియంత్రణకే పరిమితం కాకుండా, నగర విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో కొన్ని రూట్లను కూడా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. విజయవాడ- ఆగిరిపల్లి, విజయవాడ -పెద అవుట్‌పట్లి, విజయవాడ - జి.కొండూరు లేదా మైలవరం, విజయవాడ -కంకిపాడు. విజయవాడ - కంచిక చర్ల లేదా నందిగామ, విజయవాడ - అమరావతి (రాజధాని) మార్గాలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేన్‌ ప్రతిపాదించింది. ఇంతమంది కోరినా, ప్రత్యామ్నాయ మార్గాలున్నా, వేటినీ పట్టించుకోకుండా, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలోనే వేయాలని నిర్ణయించటం నియంతృత్వమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. 
మెట్రో రైల్‌ నిర్మాణానికిి అయ్యే ఖర్చును రాబట్టడం కోసం రాష్ట్రంలోని పెట్రోల్‌ డీజిల్‌పై మెట్రో సెస్‌ విధించాలని, ఆస్తి పన్ను మీద అదనపు సెస్‌ విధించాలని, వాహనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలపై అదనంగా మెట్రో చార్జి విధించాలని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాహనాలపై ఒకసారి గ్రీన్‌ సెస్‌ విధించాలని డి.పి.ఆర్‌. లో చేసిన ప్రతిపాదనలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. విజయవాడలో మెట్రో రైల్‌ నిర్మిస్తూ రాష్ట్ర ప్రజలందరి మీద సెస్‌ విధించాలనటం అన్యాయమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎ.యం.ఆర్‌.సి కి స్పష్టం చేసింది. ఢిల్లీ, చెన్నై, కొచ్చిన్‌ లలో మాదిరిగా విజయవాడ మెట్రోరైలును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతోనే నిర్మించాలని, ప్రైవేటు యాజయాన్యానికి అప్పగించటం, ప్రజలపై భారాలు విధించటం చేయరాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. మెట్రో రైల్‌ కోసం భూములు కోల్పోయేవారికి కొచ్చిన్‌ మెట్రో రైలు మాదిరిగా సెంటుకు గరిష్టంగా రు.52 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేసింది. 
విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రకటన నాటి నుండి నేటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే, నియంతృత్వ రీతిలో నడుస్తున్నాయని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. మెట్రో రైలు మొత్తం పట్టణ రవాణాలో ఒక భాగం. కాని విజయవాడ నగరంలో ఏర్పాటుచేసే మెట్రో రైలు గురించి విజయవాడలో ఎలాంటి చర్చ జరగలేదు. విజయవాడ నగరపాలక సంస్థలో దీనిపై చర్చ జరగలేదు. విజయవాడ నగర ప్రజలనుగానీ, నగరంలోని రాజకీయపార్టీలనుగానీ , ప్రజాసంఘాలను, అసోసియేషన్లనుగానీ కనీసం సంప్రదించలేదు, పబ్లిక్‌ హియరింగ్‌ జరపలేదు. ప్రజాభిప్రాయం కోరలేదు. ఎక్కడా చర్చ లేకుండా, ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలు తమంతటతాము చెప్పినా వినిపించుకోకుండా ముందుకు సాగటం ప్రజాస్వామ్యవిరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, పబ్లిక్‌ హియరింగ్‌ జరిపి, ప్రజాభిప్రాయం కోరాలని, దాని ఆధారంగానే మెట్రో రైల్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది. 


(వి.సాంబిరెడ్డి)                                                                                                  (యం.వి.ఆంజనేయులు) 
అధ్యక్షులు                                                                                                               కార్యదర్శి