స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ రోజు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ బృదం
అయోధ్యనగర్‌లో పర్యటించి అక్కడి శానిటేషన్, సైడ్ డ్రైన్లను
పరిశీలించింది. టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నగర కార్యదర్శి
యం.వి.ఆంజనేయులు, సహాయ కార్యదర్శి వి.శ్రీనివాస్, కోశాధికారి వి.ఎస్.
రామరాజు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్థానిక నాయకులు యం. వసంత ఈ
బృందంలో ఉన్నారు. ఈ బృందం అక్కడి స్థానికులతో శానిటేషన్, సైడ్ డ్రైన్లను
గురించి చర్చించింది. అయోధ్యనగర్‌లోని అనేక వీధులలో సైడ్ డ్రైన్లు
పూడిపోయి ఉండటం, డ్రైన్లు ఉన్నచోట నీరుపోయే అవకాశంలేక ఎక్కడికక్కడ నిలిచి
పోయి ఉండటాన్ని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ గమనించింది. మున్సిపల్
సిబ్బంది డ్రైన్ల పూడిక తీయటం, రోడ్లు శుభ్రం చేయటం మానివేశారని,
తగినంతమంది సిబ్బంది లేకపోవటం వలననే తాము చేయటం లేదని మున్సిపల్ సిబ్బంది
అంటున్నారని స్థానికులు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకు
వచ్చారు. భవానీ అనే గృహిణి మాట్లాడుతూ బయట డ్రైన్లు పూడుక పోయి ఉండటంతో తమ
ఇంటిలో వాడిన నీరు బయటకు పోవటం లేదని, కొన్ని సమయాలలో బయట నీరు తమ
ఇంట్లోకి వస్తున్నదని అన్నారు. తమ ఇంట్లోకి బయటి మురుగునీరు రావటాన్ని
టాక్స్ పేయర్స్ అసోసియేషన్ బృందానికి చూపించారు. తమ ఇంటి ఆవరణలో
తొమ్మిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని నీరు బయటకు పోకపోవటంతో ఇంట్లోనే
తడిలో నడవవలసి వస్తున్నదని, వృధ్ధులు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీ అనే మహిళ మాట్లాడుతూ దోమల వలన తమ ఇంటికి వచ్చిన బంధువులు సైతం
జ్వరాలపాలయ్యారని అన్నారు. గతంలో ఉన్న డ్రైన్లను సైతం కొంతమంది ఆక్రమించిన
వైనాన్ని స్థానికులు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ బృందానికి వివరించారు.
తాము స్థానిక కార్పొరేటర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటంలేదని,
కార్పొరేషన్‌కు ఫిర్యాదుచేస్తే సమస్యను పరిష్కరించకుండానే పరిష్కారమైనట్లు
వ్రాసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు కట్టకు దగ్గరలో ఉన్న
వారి పరిస్థితి మరీ నరకప్రాయంగా ఉంది. నీళ్ళన్ని అక్కడ నిల్వ చేరి
మురుగునీటి తటాకాలుగా ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది ఆ మురుగునీటి గుంటలలో
దేమల మందు చల్ల్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. ఆ
మురుగునీటి గుంటలలోనే మంచినీటి పైపులను వేసిన వైనాన్ని టాక్స్ పేయర్స్
అసోసియేషన్ పరిశీలించింది. నీరు బుడమేరులో కలవటానికి రైల్వే ట్రాక్‌కు
దగ్గరలో లాకులు ఏర్పాటు చేశారు. కాని ఏర్పాటు చేసిన లాక్‌కు తలుపు
అమర్చలేదు. వర్షం వలన బుడమేరు ఏమాత్రం వచ్చినా బుడమేటినీరు అయోధ్యనగర్‌లోకి
ప్రవేశించి అయోధ్యనగర్ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. సమస్య
పరిష్కారమయ్యేవరకు దీనిపై ఆంధోళన చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్
భావించింది. మరోసారి కార్పొరేటర్‌కు, కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేయాలని,
అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈ సమస్యలపై తదుపరి కార్యానరణను
రూపొందించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
Sunday, 23 October 2016
Sunday, 16 October 2016
ఈ రోజు (16.10.2016) టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఇచ్చిన ప్రెస్ నోట్.
విజయవాడ నగరంలో మున్సిపల్ వ్యర్ధాలను నిర్మూలించడానికి శాశ్వత చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ నగర పాలక సంస్థ పాలకులను, అధికారులను కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని పట్టణ ప్రాంతాలలో చెత్త నిర్మూలనకు శాశ్వత పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది.
ప్రజా ఉద్యమానికి తలొగ్గి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో విజయవాడ నగరంలోని చెత్త డంపింగ్ చేయటం నిలిపి వేశారు. నగర శివారు ప్రాంతాలైన కొలనుకొండ, పాతపాడు ప్రాంతాలకు విజయవాడ నగర చెత్తను తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఇది తాత్కాలిక చర్యేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది. గతంలోనే కొలనుకొండ, పాతపాడు ప్రాంతాలకు చెత్త తరలించాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించారు. అందువలన ఆనాడు ఆప్రాంతాలకు తరలించడం విరమించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మరల అదే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి ప్రజలనుండి వ్యతిరేకత మరల వ్యక్తమయ్యే అవకాశముంది. ఒక చోట ప్రజలు వ్యతిరేకిస్తే మరోచోటకు తరలించటం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
పట్టణ ప్రాంతాలలో చెత్త విషయమై మొత్తం మున్సిపల్ శాఖలోనే అవగాహనా లోపం ఉందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలు కలిపి మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ 110 పట్టణ స్థానిక సంస్థలలో వేలాది టన్నుల చెత్త ప్రతి రోజూ ఉత్పత్తి అవుతున్నది. ఇంటి నుండి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు చేర్చటంతోనే తమ బాధ్యత తీరి పోతుందన్న భావన పట్టణ స్థానిక సంస్థలలో నెలకొని ఉన్నది. డంపింగ్ యార్డుకు తరలించిన చెత్తను నిర్మూలించటం తమ బాధ్యతగా భావించడంలేదు. అందుకే చెత్త డంపింగ్ చేసే ప్రదేశాలకోసం అన్వేషిస్తున్నారు తప్ప చెత్తనిర్మూలన కోసం అనుసరించవలసిన పధ్ధతులపై సీరియస్‌గా ప్రయత్నం చేయటం లేదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది.
చెత్త ఎంతవేగంగా ఉత్పత్తి అవుతుందో, అంతే వేగంగా దానిని నిర్మూలించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనికోసం వ్యర్థాలనుండి పెల్లెట్లు తయారు చేయాలి. తయారైన పెల్లెట్ల వినియోగంపట్ల సంబంధిత వినియోగదారులకు అవగాహన కల్పించటం ద్వారా వాటిని మార్కెటింగ్ చేయాలి. కొన్నిరకాల ఫర్నెస్‌లలో పెల్లెట్ల వినియోగాన్ని నిర్బంధం చేయాలి. అలా చేసినప్పుడే ఈ చెత్త నిర్మూలించబడుతుంది. ఇవన్నీ చేయాలంటే కేవలం స్థానిక సంస్థలు చేయలేవు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేక బాధ్యతగా చేపట్టినప్పుడే ఈ సమస్య పరిష్కామవుతుంది. ప్రభుత్వం చెత్తనిర్మూలన బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నది. గుంటూరు సమీపంలోని నాయుడుపేట వద్ద చెత్త నిర్మూలనకు ప్యాక్టరీ నెలకొల్పడానికి జిందాల్ కంపెనీతో ఒప్పదం కుదుర్చుకున్నారు. లాభాలొచ్చినన్ని రోజులు ప్రైవేటు కంపెనీలు పని చేస్తాయి. లాభాలు రాక పోతే ప్రైవేటు కంపెనీలు మూసేస్తాయి. వాటికి ఏసామాజిక బాధ్యత ఉండదు. విజయవాడలో ఎక్సెల్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఎనర్జీస్ అనుభవం కూడా అదే. లాభాలు రావటంలేదని మూసి వేశారు. రేపు జిందాల్ కంపెనీ కూడా లాభం వస్తే పని చేస్తుంది. లేకుంటే మూసి వేస్తారు. మరల సమస్య పునరావృతమవుతుంది. అందువలన చెత్త నిర్మూలనను ప్రభుత్వ రంగంలో చేపట్టినప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. కాని పట్టణ ప్రాంతాలలో ఉన్న చెత్త నిర్మూలన సమస్యపై సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అనేక దేశాలు తిరుగుతున్నారు. కాని చాలా దేశాలలో చెత్త నిర్మూలనా పధ్ధతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాని వాటిని మాత్రం వీరు పరిశీలించి వాటిని అనుసరించాలన్న ఆలోచనలేదు. ఫలితంగా పట్టణాలలో చెత్త సమస్య తీవ్రమవుతున్నది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలోని పట్టణాలలో చెత్తతొలగింపు సమస్యపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలని, విజయవాడ నగరంలోని చెత్త నిర్మూలనకు శాశ్వత పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోరుతున్నది.
యం.వి.ఆంజనేయులు
కార్యదర్శి
వి.ఎస్. రామరాజు
కోశాధికారి
Sunday, 9 October 2016
09.10.2016 న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లో చెత్త డంపింగ్ ప్రాంతంలో న్యాయవాదులు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకుల పర్యటన- న్యాయపోరాటం చేయాలని నిర్ణయం.
ఈరోజు న్యాయవాదులు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులతో కూడిన బృందం సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లో చెత్త డంపింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటించింది. ఈ పర్యటనలో న్యాయవాదులు శ్రీమతి యం.వసంతగారు, శ్రీ సోముకృష్ణమూర్తిగారు, శ్రీ వల్లభనేని సత్యన్నారాయణగారు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి.సాంబిరెడ్డి గారు, కార్యదర్శి యం.వి.ఆంజనేయులు గారు, సహాయ కార్యదర్శి శ్రీ వేదాంతం శ్రీనివాస్ గారు పాల్గోన్నారు. ఎక్సెల్ ప్లాంట్ లోపలకు వెళ్ళి చెత్త డంపింగ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. అక్కడ స్తానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెత్తడంపింగ్‌వలన తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని స్తానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ వలన వెలువడుతున్న దుర్గంధాన్ని తాము భరించలేక పోతున్నామని, భోజనంకూడా చేయలేక పోతున్నామని, శరీరంపై దురదలు వస్తున్నాయని అన్నారు. కుక్కలు చెత్తను, చెత్తోబాటు కుళ్ళిన జంతు శరీరభాగాలను తీసుకవచ్చి రోడ్డు మీద పడేస్తున్నాయని, పిల్లలు భయపడుతున్నారని అన్నారు. తినేపదార్ధాలపై దుమ్ము పడుతుందని అన్నారు. దుర్వాసనకు భరించలేక కొంతమంది ఇళ్ళు ఖాళీచేసి వెళ్ళిపోతున్నారని, చుట్టాలుకూడా తమ ఇళ్ళకు రావటానికి భయపడుతున్నారని అన్నారు.. చెత్త డంపింగ్‌ను పరిశిలించి, స్తానికుల బాధలన్నీ విన్న బృందం జనావాసాల మధ్య చెత్తపోయటం అంటే అక్కడి ప్రజల జీవించే హక్కును కాలరాయటమేనని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుందని భావించింది. తక్షణమే అక్కడ చెత్తడంపింగ్ చేయటాన్ని నిలిపివేసి, డంపింగ్ యార్డును అక్కడనుండి తొలగించాలని డిమాండు చేసింది. న్యాయవాది శ్రీమతి వసంతగారు మాట్లాడుతూ, డంపింగ్‌యార్డును అక్కడనుండి తొలగించాలి లేదా అధికారులకు ఈ యార్డు ప్రక్కన నివాసాలు ఇవ్వాలని డిమాండు చేశారు. డంపింగ్‌యార్డును అక్కడనుండి తొలగించకపోతే యం.యల్.ఎలు, ఎం.పి.లుకూడా ఈ యార్డు ప్రక్కనే జనంతో పాటు నివాసం ఉండాలని డిమాండు చేశారు. ప్రజా సేవకులుగా ఉండే యం.యల్.ఎలు, ఎంపిలు, అధికారులు మాత్రం కాలుష్యంలేకుండా సుఖంగా ఉంటూ , ప్రజలనుమాత్రం కాలుష్యంలో ముంచటం దారుణమని అన్నారు. మరో న్యాయవాది శ్రీ సోముకృష్ణమూర్తిగారు మాట్లాడుతూ దీనిపై న్యాయపోరాటం చేద్దామన్నారు. హానికరమైన ఈ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్తానికులు చేస్తున్నపోరాటాలకు మద్దత్తునిస్తూ, న్యాయపోరాటం చేయాలని ఈ బృందం నిర్ణయించింది.
Monday, 1 August 2016
Sunday, 31 July 2016
Friday, 15 July 2016
ఆస్తి పన్నుసంవత్సరానికి ఒకేసారి కట్టాలని నోటీసులు పంపటం చట్టవిరుధ్దమని తెలియజేస్తూ మున్సిపల్ కమీషనర్‌కు, మేయర్‌కు వ్రాశిన లేఖ
ప్రెస్ మీట్‌లో లేఖను విడుదల చేస్తున్న టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు
లేఖ
తేదీ: 15.07.2016
తేదీ: 15.07.2016
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గారికి,
ఆర్యా,
విషయం: ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు పంపటం చట్టవిరుధ్ధమని తెలియజేస్తూ వ్రాస్తున్న లేఖ.
2016-2017 ఆర్ధిక సంవత్సరంలో మొదటి అర్ధ సంవత్సరానికి చెల్లించవలశిన ఆస్తిపన్ను నోటీసులను పంపుతున్నారు. అయితే ఆ నోటీసులలో మొదటి అర్ధ సంవత్సరానికి బదులుగా అనగా 01.04.2016 నుండి 30.09.2016 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్ చార్జీలు, సర్వీస్ చార్జీల తోబాటుగా 01.10.2016 నుండి 31.03.2017 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్ చార్జీలు, సర్వీస్ చార్జీలు కలిపి మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని ఆదేశిస్తూ డిమాండు నోటీసులను పంపుతున్నారు. ఇది చట్టవిరుధ్ధమన్న విషయాన్ని మీదృష్టికి తీసుక వస్తున్నాము.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు 1955, సెక్షన్ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది.
Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of-
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of April and October
(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.
పై సెక్షన్ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 2016-2017 లో అందుకు భిన్నంగా సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను కట్టమని నోటీసులను పంపుతున్నారు. ఒకసారి మదింపు చేసి పంపిన ఆస్తిపన్ను నోటీసులను మార్చాలంటే ముందుగా కౌన్సిల్‌లో నిర్ణయం చేయాలి. సవరణ నోటీసులను పంపటం ద్వారా గృహ యజమానులకు తెలియ జేయాలి. వారి నుండి అభ్యంతరాలను స్వీకరించాలి. పరిష్కరించాలి. ఇవేవీ చేయకుండా 2016-2017 లో సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం చట్టవిరుధ్ధం.
సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం వెనుక, నిజాయితీగా క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లించేవారిపైననే భారంమోపి వారినుండి ఒకేసారి ఆస్తిపన్ను రాబట్టుకోవాలన్న ఆతృత కనుపిస్తున్నది. కాని దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి ఇంత ఆతృత ఎందుకు చూపటంలేదని ప్రశ్నిస్తున్నాము.
పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని, సంవత్సరానికి ఒకేసారి కట్టమని ప్రస్తుతం జారీ చేస్తున్న ఆస్తిపన్ను డిమాండు నోటీసులను ఉపసంహరించుకొని, అర్ధ సంవత్సరానికి చెల్లించేవిధంగా డిమాండు నోటీసులను జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
అభివందనాలతో
వి.సాంబిరెడ్డి యంవి ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
గమనికః ఇదే లేఖను నగర మేయర్ గారికి కూడా పంపించాము.
గమనికః ఇదే లేఖను నగర మేయర్ గారికి కూడా పంపించాము.
Subscribe to:
Posts (Atom)