విజయవాడ నగరంలో మున్సిపల్ వ్యర్ధాలను నిర్మూలించడానికి శాశ్వత చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ నగర పాలక సంస్థ పాలకులను, అధికారులను కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని పట్టణ ప్రాంతాలలో చెత్త నిర్మూలనకు శాశ్వత పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది.
ప్రజా ఉద్యమానికి తలొగ్గి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో విజయవాడ నగరంలోని చెత్త డంపింగ్ చేయటం నిలిపి వేశారు. నగర శివారు ప్రాంతాలైన కొలనుకొండ, పాతపాడు ప్రాంతాలకు విజయవాడ నగర చెత్తను తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఇది తాత్కాలిక చర్యేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది. గతంలోనే కొలనుకొండ, పాతపాడు ప్రాంతాలకు చెత్త తరలించాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించారు. అందువలన ఆనాడు ఆప్రాంతాలకు తరలించడం విరమించుకోవలసి వచ్చింది. ఇప్పుడు మరల అదే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడి ప్రజలనుండి వ్యతిరేకత మరల వ్యక్తమయ్యే అవకాశముంది. ఒక చోట ప్రజలు వ్యతిరేకిస్తే మరోచోటకు తరలించటం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
పట్టణ ప్రాంతాలలో చెత్త విషయమై మొత్తం మున్సిపల్ శాఖలోనే అవగాహనా లోపం ఉందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు , మున్సిపాలిటీలు కలిపి మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ 110 పట్టణ స్థానిక సంస్థలలో వేలాది టన్నుల చెత్త ప్రతి రోజూ ఉత్పత్తి అవుతున్నది. ఇంటి నుండి చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు చేర్చటంతోనే తమ బాధ్యత తీరి పోతుందన్న భావన పట్టణ స్థానిక సంస్థలలో నెలకొని ఉన్నది. డంపింగ్ యార్డుకు తరలించిన చెత్తను నిర్మూలించటం తమ బాధ్యతగా భావించడంలేదు. అందుకే చెత్త డంపింగ్ చేసే ప్రదేశాలకోసం అన్వేషిస్తున్నారు తప్ప చెత్తనిర్మూలన కోసం అనుసరించవలసిన పధ్ధతులపై సీరియస్‌గా ప్రయత్నం చేయటం లేదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది.
చెత్త ఎంతవేగంగా ఉత్పత్తి అవుతుందో, అంతే వేగంగా దానిని నిర్మూలించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనికోసం వ్యర్థాలనుండి పెల్లెట్లు తయారు చేయాలి. తయారైన పెల్లెట్ల వినియోగంపట్ల సంబంధిత వినియోగదారులకు అవగాహన కల్పించటం ద్వారా వాటిని మార్కెటింగ్ చేయాలి. కొన్నిరకాల ఫర్నెస్‌లలో పెల్లెట్ల వినియోగాన్ని నిర్బంధం చేయాలి. అలా చేసినప్పుడే ఈ చెత్త నిర్మూలించబడుతుంది. ఇవన్నీ చేయాలంటే కేవలం స్థానిక సంస్థలు చేయలేవు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేక బాధ్యతగా చేపట్టినప్పుడే ఈ సమస్య పరిష్కామవుతుంది. ప్రభుత్వం చెత్తనిర్మూలన బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నది. గుంటూరు సమీపంలోని నాయుడుపేట వద్ద చెత్త నిర్మూలనకు ప్యాక్టరీ నెలకొల్పడానికి జిందాల్ కంపెనీతో ఒప్పదం కుదుర్చుకున్నారు. లాభాలొచ్చినన్ని రోజులు ప్రైవేటు కంపెనీలు పని చేస్తాయి. లాభాలు రాక పోతే ప్రైవేటు కంపెనీలు మూసేస్తాయి. వాటికి ఏసామాజిక బాధ్యత ఉండదు. విజయవాడలో ఎక్సెల్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఎనర్జీస్ అనుభవం కూడా అదే. లాభాలు రావటంలేదని మూసి వేశారు. రేపు జిందాల్ కంపెనీ కూడా లాభం వస్తే పని చేస్తుంది. లేకుంటే మూసి వేస్తారు. మరల సమస్య పునరావృతమవుతుంది. అందువలన చెత్త నిర్మూలనను ప్రభుత్వ రంగంలో చేపట్టినప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. కాని పట్టణ ప్రాంతాలలో ఉన్న చెత్త నిర్మూలన సమస్యపై సమీక్షా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అనేక దేశాలు తిరుగుతున్నారు. కాని చాలా దేశాలలో చెత్త నిర్మూలనా పధ్ధతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాని వాటిని మాత్రం వీరు పరిశీలించి వాటిని అనుసరించాలన్న ఆలోచనలేదు. ఫలితంగా పట్టణాలలో చెత్త సమస్య తీవ్రమవుతున్నది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలోని పట్టణాలలో చెత్తతొలగింపు సమస్యపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలని, విజయవాడ నగరంలోని చెత్త నిర్మూలనకు శాశ్వత పరిష్కారదిశగా చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోరుతున్నది.
యం.వి.ఆంజనేయులు
కార్యదర్శి
వి.ఎస్. రామరాజు
కోశాధికారి
No comments:
Post a Comment