ప్రచురణార్ధం: తేదీ:18.12.2016
విజయవాడ, గుంటూరు నగరాలో మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రైవేటీకరించటం కోసమే '' విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్ కార్పొరేషన్''ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలోని నగరాలను పట్టణాలను ప్రైవేటీకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన '' ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ ( APUIAML) '' అనే కంపెనీని గత జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు, పట్టణాలలో జరిగే పనులకు సంబంధించిన ప్రాజెక్టులను రూపొందిస్తుంది. కావలసిన ఆర్ధిక వనరులను ఈ కంపెనీయే సమకూర్చుకుంటుంది. పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ ప్రాంత రవాణా, ఘనవ్యర్ధాల నిర్వహణ, ఆకర్షణీయ నగరాల ఏర్పాటు, జలవనరుల సంరక్షణ, నదీ అభిముఖ ప్రాంతాల అభివృధ్ధి తదితర ప్రాజెక్టులను ఈ కంపెనీ చేపడుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు, నిర్వహణకు అయ్యే ఖర్చుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వవు. పూర్తిగా ఆ నగర ప్రజలనుండే వసూలు చేస్తారు. ఈ కంపెనీకి అనుబంధంగానే విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్ కార్పొరేషన్'' ఏర్పాటు చేస్తున్నారని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. ఆ కంపెనీ ఏర్పాటు చేస్తే విజయవాడ, గుంటూరు నగరాలలో ఉండే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఈ కంపెనీ క్రిందకు వెళ్లి పోతాయి.
'' ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (APUIAML) '' అనేది కంపెనీ చట్టం ప్రకారం రిజిస్టర్ చేయబడిన కంపెనీ. ఈ కంపెనీలో ప్రైవేటు కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టి ఈక్విటీ వాటాను పొందటం ద్వారా భాగస్వాములు కావచ్చు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, ప్రైవేటు కంపెనీలు పెట్టే పెట్టుబడులు అన్నీ కూడా ఈ కంపెనీలో మూలధనపు వాటాలుగానే ఉంటాయి. అంటే ఈ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు వాటా దారులుగా ఉంటారన్నమాట. ఇక ఈ కంపెనీ చేపట్టే పనులు అన్నీ ప్రైవేటు భాగస్వామ్యం తోనే జరుగుతాయి. మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పట్టణ ప్రాంత రవాణా, ఘన వ్యర్ధాల నిర్వహణ ఆకర్షణీయ నగరాల ఏర్పాటు, జల వనరుల సంరక్షణ, నదీ అభిముఖ ప్రాంతాల అభివృద్ది లాంటి పౌర సదుపాయాలన్నింటినీ వ్యాపారమయం చేసి, ప్రజల ముక్కుపిండి వసూలు చేసినప్పుడే లాభాలు వస్తాయి. మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణకు అయ్యే ఖర్చులతోబాటుగా వాటాదారుల లాభాలు కూడా నగర ప్రజలనుండే వసూలు చేస్తారు. ఎంత ఎక్కువగా వీటి చార్జీలు పెంచితే, ఎంత ఎక్కువగా ప్రజల మీద భారం వేస్తే అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టిన వారికి అంత ఎక్కువగా డివిడెండ్లు వస్తాయి. అందువలన ఈ కంపెనీ వాటా దారుల లాభాలను దృష్టిలో పెట్టుకొని నగరంలో ఏర్పాటుచేసే పౌర సదుపాయాల చార్జీలను, ధరలను నిర్ణయిస్తారు. ఇది నగరాలలో. పట్టణాలలో ఉండే పేద, మధ్యతరగతి ప్రజలకు మరణ శాసనం కాబోతున్నది. ఈపథకంలో భాగంగా ముందుగా విజయవాడ గుంటూరు నగరాల ప్రజల బ్రతుకులను కంపెనీకి అప్ప జెప్పబోతున్నారు. దీని కోసమే APUIAMLకు అనుబంధంగా '' విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్ కార్పొరేషన్''ను ఏర్పాటు చేస్తున్నారని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది.
విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలను కలిపి '' విజయవాడ, గుంటూరు ఇన్ఫ్రాడెవలప్‌మెంట్ కార్పొరేషన్''ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అర్బన్ లాండ్ సీలింగ్ చట్టాన్ని 2008 లోనే రద్దు చేశారు. కాని గ్రామాలలో ఇప్పటికీ లాండ్ సీలింగ్ చట్టం ఉంది. ఇప్పుడు చుట్టు ప్రక్కల గ్రామాలను గుంటూరు, విజయవాడలలో కలిపితే ఆ గ్రామాల భూములు లాండ్ సీలింగ్ చట్ట పరిధిలో ఉండవు. తద్వారా ఆ భూములు ధనవంతులకు, కంపెనీలకు అందుబాటులోకి వస్తాయి. ఆ గ్రామాల ప్రజలుకూడా నగరాల పరిధిలోకి వస్తారు. అప్పుడు ఈ కంపెనీకి మరిన్ని లాభాలు వస్తాయి. కేవలం భూములకోసం, కంపెనీ లాభాలకోసం ఈ నిర్ణయం చేశారని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే ప్రజల బ్రతుకులు కంపెనీల పాలవుతాయి. ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ప్రజలెన్నుకున్న మున్సిపల్ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయి ప్రజాసామ్యం నశించి పోతుంది. కేవలం కంపెనీల లాభాలకోసమే ప్రజలు బ్రతకవలసి వస్తుంది. ఇది నియంతృత్వచర్య. ప్రజలకు కావలసింది ప్రజాస్వామ్యపాలనే కాని కంపెనీల పాలనకాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయాన్ని ప్రతిఘటించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు పిలుపునిస్తున్నది.
(వి.సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment