Thursday, 8 December 2016

పెద్దనోట్ల రద్దు నల్లడబ్బు వెలికి తీయటం కోసమేనా?

 
పాలకులు తమ దోపిడీని కొనసాగించటం కోసం ప్రజలకు సమస్యలు సృష్టిస్తారు. ప్రజలకు సమస్యలు సృష్టించకపోతే తమ దోపిడీ కొనసాగదు. ఆ సమస్యలతో ప్రజలు బాధపడుతూ వారిలో అసహనం పెరుగుతున్నప్పుడు, ఆ సమస్యలకు తామే పరిఫ్కర్తలమని గొంతు చించుకొని అరుస్తారు.ప్రజలను నమ్మిస్తారు. ఆ సమస్యలనే ఆయుధంగా చేసుకొని మరింత దోపిడీకి పాల్పడతారు. అలాంటి వాటిలో ఒక సమస్యే నల్లధనం సమస్య.
.
పెద్దనోట్లు చెల్లవు అని ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత డబ్బులకోసం బ్యాంకుల వద్ద, ఎ.టీ.యంల వద్ద జనం పడిగాపులు పడటం తెలిసిందే. ఒక బ్యాంకువద్ద క్యూలో నిలబడిన ఒక వ్యక్తి అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ '' మమ్మల్ని కొల్లగొట్టి, దేశాన్ని దోచి నల్ల డబ్బు సంపాదించారు. వాళ్ళని వదిలేసి మమ్ములను ఎందుకు ఇక్కట్ల పాలు చేస్తున్నారు? మమ్ములను తిప్పలు పెడితే నల్లధనం బయటకు వస్తుందా? ఆ నల్లధనం బయటకు వచ్చినందున నాకొరిగేదేంటి? నల్లధనం బయటకు వస్తే మాదగ్గర కొల్లగొట్టిన డబ్బు మాకిస్తారా? ఇక మీదట మమ్మల్ని దోచుకు తినటం ఆపేస్తారా? దేశాన్ని దోచుకు తినటం ఆపేస్తారా?ఇక మీదట నల్లధనం ఏర్పడదా? అట్ల జరిగితే చెప్పమనండి ఏడాదైనా ఇబ్బంది పడతాం? ఎందుకు మాకీ తిప్పలు?'' అంటూ ప్రభుత్వంపై తిట్ల దండకాన్ని లంకించుకున్నాడు. ఇది సామాన్యుని ఘోష. ఒక సామ్యాడు వేశిన ఈ ప్రశ్నలు మనలను ఆలోచింప జేస్తున్నాయి. ఈ సమస్యపై కూలంకషంగా చర్చించమంటున్నాయి. పరిష్కారం వెతకమంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం రు.1000, రు.500లు నోట్లు రద్దు చేసినప్పటినుండి నల్లధనంపై చర్చ జోరుగా సాగుతున్నది. అసలు నల్లధనమంటే ఏమిటీ? పన్ను కట్టకుండా దాచిన సొమ్మును నల్లధనం అంటారని చాలమందిలో ఉన్న అభిప్రాయం. అంటే పన్ను కట్టి ఎంత దోచుకు తిన్నా అది నల్లధనం కాదు. తెల్ల ధనమే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వంకూడా అదే చెబుతున్నది. '' 31 డిశంబరు 2016 లోపల తమదగ్గర ఉన్న నల్లధనాన్ని స్వఛ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను వేస్తాం. అలా వెల్లడించకుండా మా ఆదాయపుపన్ను అధికారులు పట్టుకుంటే 85 శాతం పన్ను వేస్తాం'' అని ప్రకటించింది. అంటే డిశంబరు నెలాఖరులోపు నల్లధనం బయటకు తీసి 50 శాతం పన్ను కడితే మిగిలిన 50 శాతం తెల్లధనంగా మారి పోతుంది. అధికారులు పట్టుకుంటే 15 శాతం తెల్లధనంగా మారుతుంది. అంటే ''దోచుకోండి. మాకు కొంతపన్నుకట్టండి. మిగిలినది మీరు అనుభవించండి'' అని ప్రభుత్వం వారు సెలవిస్తున్నారు. అది అక్రమ డబ్బు అనుకున్నప్పుడు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. అంతే కాని ''కొంతమాకివ్వండి. మిగిలినది మీరు అనుభవించండి'' అనటం ఏమిటి? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవటం అంటే ఇదే. దీనిని మరింత లోతుగా పరిశీలిద్దాం.

కరెన్సీ నోట్లు చెల్లకుండా చేయటాన్ని ఇంగ్లీషులో డీ-మోనిటైజేషన్‌ (Demonetization) అంటారు. ఈ పదం ప్రజలకు ఇప్పుడు బాగా తెలిసిన పదంగా మారింది. డీ-మోనిటైజేషన్‌ అనేది, మోనిటైజేషన్‌ (Monetization ) అనే పదానికి వ్యతిరేక పదం. సాధారణ భాషలో చెప్పాలంటే మోనిటైజేషన్‌ అనగా ఒక వస్తువు యొక్క విలువకు చెల్లుబాటయ్యే ధనరూపం ఇవ్వటం. మరి వస్తువు యొక్క విలువను ఎలా నిర్ణయిస్తారు? ఒక వస్తువుయొక్క విలువను ఆ వస్తువు తయారు చేయటానికి మనిషి వినియోగించిన శ్రమ ఆధారంగా నిర్ణయిస్తారు. కనుక మొత్తం వస్తువుల యొక్క విలువ ఎంతుందో లెక్కగట్టి ఆ విలువకు సమాన విలువతో చెల్లుబాటయ్యే విధంగా కరెన్సీ ఉండాలి. ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే తక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధరలు పడి పోతాయి. ఎందుకంటే కొనటానికి జనం వద్ద కరెన్సీ ఉండదు. వస్తువుల ఉత్పత్తిదారులు నష్టపోతారు. దీనితో ఉత్పత్తి సాధ్యంకాదు. ఉత్పత్తి లేకపోతే సమాజం నడవదు. కనుక ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే తక్కువ విలువకు కరెన్సీ ఉండకూడదు. ఇక ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువ కంటే ఎక్కువ విలువకు కరెన్సీ ఉంటే వస్తువుల ధరలు పెరిగి పోతాయి. ఎందుకంటే కరెన్సీ నోట్లు ఎక్కువ ఉంటాయి. సరుకు తక్కువ ఉంటుంది. వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువకన్నా ఎక్కువ విలువను చెల్లించవలసి వస్తుంది. అంటే వినియోగదారుడు తాను పొందిన వస్తువు విలువతో బాటుగా అదనంగా కొంత ధనం కోల్పోతాడు. వస్తువు విలువతో బాటుగా ఆ అదనపు ధనం కూడా ఉత్పత్తిదారుని వద్దకు చేరుతుంది. ఈ అదనపు ధనం ఇతరులనుండి అధికంగా కాజేసిన ధనం. ఇది నల్ల డబ్బుగా ఉంటుంది.

అయితే ప్రభుత్వం దీనిని నల్లడబ్బుగా పరిగణించటం లేదు. కేవలం పన్ను కట్టకుండా ఉంచుకున్న ధనాన్ని మాత్రమే ప్రభుత్వం నల్లడబ్బుగా పరిగణిస్తున్నది. ఇది తప్పు. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువకంటే ఎక్కువ విలువకు కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అందుకే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వస్తువుల ధరలు పెంచటం కోసం, కంపెనీలకు లాభాలు చేకూర్చటం కోసం ప్రభుత్వమే కరెన్సీనోట్లు విపరీతంగా ముద్రించింది. ఈ అదనపు ధనం ఉత్పత్తిదారుల వద్దకు విపరీతంగా చేరుతున్నది. ఉదాహరణకు ఒక టూత్‌ పేస్టు ఉత్పత్తి చేసేవాడు తన టూత్‌ పేస్టు ధరను నిర్ణయించగలడు. రు.5 ల విలువగలిగిన టూత్‌ పేస్టును రు.40లకు అమ్మినా ప్రభుత్వానికి పన్ను కడితే అది తెల్లధనమే అవుతుంది. ఒక ఎరువుల కంపెనీవాడు 30 రు.లు విలువ చేసే ఎరువును 500రు.లకు అమ్మినా ప్రభుత్వానికి పన్ను కడితే అది తెల్లధనమే అవుతుంది. అది తెలుపైనా నలుపైనా నష్టపోతునష్టపోతున్నది వినియోగ దారులే. అలా వివినియోగదారులనుండి అధికంగా కాజేసిన ధనం పన్నుకడితే తెల్లధనం అవుతుంది. పన్ను కట్టకపోతే నల్లధనం అవుతుంది. అంతేతప్ప వినియోగదారులనుండి అదనంగా కాజేసే స్వభావంలో మాత్రం మార్పుఉండదు.

ఈ అదనపుధనం ఎవరివద్ద పోగుపడుతుంది? ఎవరు ధరలను నిర్ణయించగలుగుతారో వారివద్దే అదనపు ధనం పోగుపడుతుంది. మనదేశంలో కార్మికులకు ధరలు నిర్ణయించే అధికారంలేదు. కనుక కార్మికుల వద్ద పోగుపడే అవకాశంలేదు. ఇక తాను ఉత్పత్తి చేసిన పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదు. అందువలన ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నా, రైతుకు వచ్చేదేమీ లేదు. కనుకనే ధరల పెరుగుదల వలన పారిశ్రామిక వర్గాల వద్దకు ధనం విపరీతంగా చేరుతుంటే రైతులు మాత్రం చితికి పోతున్నారు. కనుక నల్లధనం పారిశ్రామిక వర్గాలు, వారి అనుమాయుల వద్ద విపరీతంగా పోగుపడుతున్నది. నల్లధనానికి ప్రధాన కారణం ఉత్పత్తి అయ్యే వస్తువుల విలువ కంటే ఎక్కువ విలువకు కరెన్సీనోట్లు ముద్రించటమే. వస్తువుల విలువను నిర్ణయించటంలో ఉన్న లోపమే నల్లధనం సృష్టికి మూలకారణం. కనుక నల్లధనం అంటే పన్ను ఎగవేశింది మాత్రమేకాదు. ప్రజలను కొల్లగొట్టి దాచింది నల్లధనం. ఇది ఏ ఆర్ధిక వేత్తా చెప్పడు. ''కొంతమాకివ్వండి. మిగిలినది మీరు అనుభవించండి'' అని పాలకులు చెప్పటాకి గల కారణం కరెన్సీ అంటే శ్రమ విలువ అని, అది ప్రజలదని గుర్తించకుండా, కరెన్సీ అంటే కేవలం సంపాదనేనన్న భావన పాలకులలో పాదుకొని ఉండటమే.

''పన్నుకడితే తెల్లధనం, పన్ను కట్టకుండా దాచుకుంటే అది నల్లధనం'' అనే ప్రభుత్వ నిర్వచనాన్నే తీసుకుని పరిశీలిద్దాం.
నల్లధనం బయటకు వచ్చినందున నాకొరిగేదేంటి? అని క్యూలో నిలబడిన వ్యక్తి అడిగిన ప్రశ్నకు పాలకుల సమాధానం చూద్దాం. నల్లధనం వెలికితీస్తే ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం వస్తుందనీ, దీని ద్వారా దేశంలో అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఏలినవారు సెలవిస్తున్నారు. ఆ అభివృధ్ధిని అనుభవించే వారిలో నీవుకూడా ఉంటావు కదా అని ప్రశ్నిస్తున్నారు. వీరి వాదననే అంగీకరిద్దాం.

మోడీకి ముందు కూడా పన్నుల ఎగవేతలు ఈ దేశంలో ఉన్నాయి అయితే మోడీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ పన్ను ఎగవేతలు విపరీతంగా పెరిగి పోయాయని లోక్‌ సభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే తెలియజెబుతున్నాయి. నవంబరు 18న, బీ.జే.పీ యం.పి కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు ( ప్రశ్న నెం. 640) కేంద్ర ఆర్ధిక శాఖ ఇచ్చిన లిఖిత పూర్వక సమాచారం ఈ క్రింది విధంగా ఉంది.

ఆర్ధిక సం||                        వసూలైన ప్రత్యక్ష పన్నులు            వసూలుకాని ప్రత్యక్ష పన్నులు
                                            (కోట్ల రూ.లలో)                               (కోట్ల రూ.లలో)
2013-14                                  638596                                      674916
2014-15                                  695792                                      827690
2015-16                                  742295                                      929972
2016-17 (సెప్టెంబరు వరకు)         377045                                      903048

పైఅంకెలు చూస్తే వసూలైన పన్నులకన్నా వసూలుకాని పన్నులు విపరీతంగా పెరిగి పోతున్నాయని స్పష్టం అవుతున్నది. ఈ ఎగవేతలు మోడీ పాలనా కాలంలో ఊపందుకున్నాయని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. వసూలు కాని పన్నులు అంటే, ''ఆదాయాన్నీ, దానిమీద పన్నునూ'' నిర్ధారించిన తరువాత, నిర్ధారించిన పన్ను కట్టకుండా ఎగవేసిన పన్ను అన్నమాట. ''పన్ను కట్టకుండా దాచుకుంటే అది నల్లధనం'' అన్న ప్రభుత్వ నిర్వచనం ప్రకారం ఈ పన్నుకు సంబంధించిన ఆదాయం కూడా నల్లధనమే అవుతుంది. ఇలాంటి నల్లధనం ఉద్యోగుల వద్ద చేరదు. ఎందుకంటే ఉద్యోగులు పన్నులు ఎగవేసే అవకాశం ఏమాత్రంలేదు. ప్రతి ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌లోనే ఉద్యోగి యొక్క సంవత్సర ఆదాయం లెక్కించి దాని మీద పన్ను నిర్ధారించి, దామాషా ప్రకారం ప్రతినెలా వసూలు చేస్తారు. కనీసం ప్రతి 3 నెలలకొకసారి ఉద్యోగుల ఆదాయాన్ని సమీక్షించి ఆదాయాల పెరుగుదలను అంచనా వేసి పన్ను నిర్ధారిస్తారు. ఉద్యోగుల వద్దనుండి మార్చి 31 నాటికి ఆ సంవత్సరం ఆదాయంపై పూర్తిగా పన్ను వసూలు చేస్తారు. దీనిని బట్టి ఈ పన్నుల ఎగవేతకు పాల్పడింది ఉద్యోగులు కాదని, పారిశ్రామిక వేత్తలు, వారి అనుమాయులేనని స్పష్టమవుతున్నది.నిర్ధారించిన పన్నును కట్టలేదంటే, ఆపన్నుకు సంబంధించిన ఆదాయాన్ని, పన్ను కట్టకుండానే ఆ సంస్ధల యజమానులు అనుభవిస్తున్నారన్నమాట.

నిర్ధారించిన ఈ పన్నులను వసూలు చేయకపోగా, మోడీ పాలనా కాలంలో ఇదే పారిశ్రామిక వేత్తలకు 2014-15లో రు.5,54,349 కోట్లు, 2015-16లో రు.6,11,128 కోట్లు, 2016-17లో రు.6,67,907 కోట్లు పన్నుల రాయితీలిచ్చారు. పన్ను రాయితీలివ్వటమంటే దానర్ధం ఆ పన్నుకు సంబంధించిన ఆదాయాన్ని ఆ కంపెనీలు పన్ను చెల్లించకుండా అనుభవించడమే. ఖజానాకు రావలసిన పన్ను రాకుండా పోవటమే. నల్లధనం వెలికితీస్తే ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం వస్తుందనీ, దీని ద్వారా దేశంలో అనేక అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్న పాలకుల ప్రచారంలో నిజాయితీ ఉంటే ముందుగా నిర్ధారించిన ఈ పన్నులను వసూలు చేయాలి. కంపెనీలకు ఇస్తున్న లక్షల కోట్లరూపాయల పన్ను రాయితీలను రద్దు చేయాలి. అప్పుడు ఖజానాకు పూర్తిగా ధనం చేకూరుతుంది. దేశంలో అనేక అభివృధ్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఒకవైపు నిర్ధారించిన పన్నులను వసూలు చేయకుండా, మరో వైపు లక్షలకోట్లరూపాయల పన్ను రాయితీలిస్తూ, తద్వారా ఖజానాను నష్టపరుస్తూ, వెలికి వస్తుందో రాదో తెలియని నల్లధనం మీద వచ్చిన పన్నుతో దేశాభివృధ్ధి చేస్తామనటం, దానికోసం పెద్ద నోట్లను రద్దు చేశామనటం బూటకం.

ఇక దేశాభివృధ్ధికి ధనం చేకూరే మరోమార్గం బ్యాంకుల ద్వారా సమకూరేధనం. మోడీ 2014 మే 29 న ప్రధానిగా అధికారం చేపట్టారు. అంటే ఆరోజున బీ.జే.పీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. మోడీ అధికారం చేపట్టేనాటికి బ్యాంకులలో ఉన్న మొండి బకాయీలు రు.2,50,643 కోట్లు. అది ఏ మాత్రం తగ్గక పోగా పెరిగి 2016 సెప్టెంబరు నాటికి రు.6,24,000 కోట్లు అయ్యింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన రెండున్న సంవత్సరాలలో (6,24,000-2,50,643 ) రు.3,73,357 కోట్లు పెరిగాయి. అంటే 149 % పెరిగాయి. ఇది బ్యాంకులు రద్దు చేసిన రు.1,14,000 కోట్లు పోను మిగిలిన పెరుగుదల. రద్దు చేసిన ఈ రు.1,14,000 కోట్లు కలుపుకుంటే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజలసొమ్ము. ప్రజలసొమ్మును తీసుకొని ఎగవేస్తున్న పారిశ్రామిక వేత్తల ఆస్తులను జప్తుచేసి నిర్థాక్షిణ్యంగా వసూలు చేయటానికి బదులుగా వారి బకాయీలను రద్దు చేస్తున్నారు. ఈ ఎగ్గొట్టిన సొమ్ముకూడా నల్లడబ్బుగా మారుతున్నది. బ్యాంకు బకాయీలనే వసూలు చేయలేనివారు, నల్లధనాన్ని బయటకు తీసి దేశాభివృధ్ధి చేస్తామనటం హాస్యాస్పదం.

ప్రభుత్వ నిర్వచనం ప్రకారం ఏర్పడే నల్లడబ్బుకు మరో మార్గం, విదేశీ వ్యాపారం. విదేశీ వ్యాపారాలలో అసలు విలువ కన్నా తక్కువ లేదా ఎక్కువ విలువకు ఇన్‌వాయిస్‌లు చూపించటం ద్వారా నల్లడబ్బు ఏర్పడుతుంది. ఆ డబ్బు ఇక్కడి వ్యాపారికి ప్రధానంగా విదేశాలలో ముడుతుంది. అది ఎక్కువ భాగం ఆదేశాలలో ఉన్న తమ ఎకౌంట్లలోకి వెళుతుంది. కొంత భాగం తిరిగి మన దేశంలోకి మనదేశంలోకి పెట్టుబడుల రూపంలో వస్తుంది. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా జరుగుతుంది. ప్రభుత్వాలు అనుమతిస్తున్న పార్టిసిపేటరీ నోట్ల విధానం, ద్వంద్వ పన్నుల ఒప్పందాలు, సరళీకరణ విధానాలు ఈ విధమైన నల్లడబ్బు ఏర్పడటానికి రాచమార్గాన్ని ఏర్పాటు చేశాయి.


నల్లడబ్బు ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు నల్లడబ్బు ఏఏ రూపాలలో అది ఉంటుందో చూద్దాం. సినిమాలలోనో, టీ.వీలలోనో చూపించిన విధంగా నల్లడబ్బు కట్టలు కట్టి, బీరువాలలో, పరుపుల క్రింద, దిండ్ల క్రింద దాచి ఉండదు. అలా ఉండేది చాలా కొద్ది భాగం మాత్రమే. అత్యధిక భాగం ఇతర రూపాలలోకి మారి పోతుంది. అందులో ప్రధానమైనవి భూమి మరియు నిర్మాణ రంగం. 1976లో ఆ నాటి కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ చట్టం చేసింది. ఈ చట్టప్రకారం మున్సిపాలిటీల స్థాయిని బట్టి పట్టణాలలో 1000 చ.మీ. లనుండి 2000 చ.మీ.లవరకు ఉండవచ్చు. అంతకు మించి ఒక వ్యక్తి కొనుక్కునే అవకాశంలేదు. కాని 1999లో వాజ్‌పేయి నాయకత్వంలోని బి.జే.పీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సెంట్రల్‌ యాక్టు 15 ఆఫ్‌ 1999 ద్వారా రద్దు చేశింది. అయితే భూమి విషయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి కనుక రాష్ట్రాలుకూడా ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టరద్దును ఆమోదించమని రాష్ట్రాలపై వత్తిడి తెచ్చింది. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈచట్టం రద్దును ఆమోదిస్తూ అసెంబ్లీలో 27.3.2008న తీర్మానం చేసింది. ఫలింతగా ఆంధ్ర, తెలంగాణాలలో పట్టణ భూపరిమితి చట్టం రద్దయింది. దీనితో డబ్బున్న వాళ్ళు పట్టణాలలో ఎంత భూమైనా కొనుక్కునే అవకాశం లభించింది. ఇది కేవలం నల్లడబ్బు ఉన్నవాళ్ళు ఆ డబ్బును భూమిరూపంలోకి మార్చుకోవటానికి అవకాశమిస్తూ తీసుకున్న చర్య. అయితే ఈ నల్ల డబ్బుకలిగిన వారికి ఇప్పటికే పట్టణాలలో ఉన్న భూమి చాలదు. అందుకే చుట్టు ప్రక్కల మండలాలలోని గ్రామాలను కలిపి గ్రేటర్‌ నగరాలుగా మార్చుతున్నారు. అప్పటికే మున్సిపాలిటీలుగా ఉన్న వాటిని మున్సిపల్‌ కార్పొరేషన్లుగా మార్చుతున్నారు. ఈవిధంగా గ్రామాలను పట్టణాలలో కలిపిన వెంటనే ఆగ్రామాల పరిధిలో ఉన్న భూములు పట్టణ భూములుగా మారి పోతాయి. అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ చట్టం లేదు కనుక ఈ భూములను ఈ నల్ల కుబేరులు కొనుక్కొవచ్చు.

ఇక గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే తంతు నడుస్తున్నది. ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం 1973 ప్రకారం ఒక కుటుంబానికి మాగాణి 27 ఎకరాలు, మెట్టభూమి అయితే 54 ఎకరాలు వ్యవసాయ భూమి ఉండవచ్చు. కాని ఇటీవల కాలంలో ఈ చట్టానికి తూట్లు పొడిచారు. వందల ఎకరాల భూమిని కొంటున్నారు. నల్లధనం దాచినవారు మారుమూల గ్రామాలలో సైతం వ్యవసాయ భూములుకొన్నారు. కొంటున్నారు. కేవలం లక్ష రూపాయల విలువ చేయని భూములునుకూడా ఎకరం 30 లక్షలకు పైగా కొన్న సందర్భాలున్నాయి. కొన్ని చోట్ల కోట్లు పెట్టి కొన్నారు. ఈ కొనుగోళ్ళు కేవలం నల్లడబ్బును భూమి రూపంలోకి మార్చుకోవటం కోసం జరిగాయి తప్ప అక్కడేదో వ్యవసాయం చేద్దామని కాదనేది స్పష్టం. ఈ విధంగా అటు బీ.జే.పి. ఇటు కాంగ్రెస్‌లు నల్లడబ్బును భూమి రూపం లోకి మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశాయి.

ఇక నల్ల డబ్బు మార్పిడికి మరో మార్గం బంగారం. గతంలో బంగారం అంటే ఆభరణాల రూపంలో ఉండేది. నల్లడబ్బు వేగం పెరిగిన తర్వాత అది బిస్కెట్ల రూపంలో ఉంది. దానికి ప్రభుత్వాలు విదేశాలనుండి బంగారం దిగుమతి చేసుకునే విధానాలు సరళీకరించటంతో, బంగారం లభ్యత పెరిగింది. బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి దాచుకునే వేగంకూడా పెరిగింది. దాచుకోవటానికి లాకర్లు అందుబాటులో ఉండటంకూడా దీనికి దోహదం చేసింది. బంగారానికి నల్లడబ్బు వినియోగించడం పెరగటంతో బంగారం ధర కూడాపెరిగింది.

నల్లడబ్బు మార్చుకోవటానికి అవకాశమిచ్చిన మరోవిధానం విదేశీ మారక ద్రవ్య విధానం. విదేశాలకు తీసుకు వెళ్ళే డబ్బుపై అనేక పరిమితులను విధిస్తూ 1973లో ''ఫారన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని'' రూపొందించారు. వాజ్‌పేయీ నాయకత్వంలో బీ.జే.పి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ''ఫారన్‌ ఎక్సేంజ్‌ రెగ్యులేషన్‌ మెనేజ్‌మెంట్‌ చట్టం 1999'' ని తీసుకు వచ్చారు. ఆతర్వాత రిజర్వు బ్యాంకు ''లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం'' ను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం మనదేశం నుండి విదేశాలలో నివశించేవారు అక్కడి ఖర్చులకోసం ప్రతివ్యక్తి మన కరెన్సీతో 25,000 డాలర్లు కొనుక్కొని తీసుకెళ్లవచ్చు. ఈ నిబంధనను 4 ఫిబ్రవరి 2004న చేశారు.ఆతరువాత బీ.జే.పి. ప్రతిపక్షంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ పరిమితిని 50,000డాలర్లకు, ఆతరువాత 75,000 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన వలన మన దేశ డబ్బు బ్లాక్‌ మనీ రూపంలో విదేశాలకు పోతుందని బీ.జే.పి.గోల పెట్టింది. అసలు ఈ విధానాన్నే రద్దు చేయాలని బీ.జే.పి డిమాండు చేసింది. 2014లో మరల బీ.జే.పి.అధికారంలోకి వచ్చింది. రద్దు చేయటం మాట అటుంచి ఈ మొత్తాన్ని జూన్‌ 3,2014 న 1,25,000డాలర్లకు, మే 26, 2015 నుండి 2,50,000 డాలర్లు (సుమారు 1 కోటి62 లక్షల రూపాయలు)కు పెంచారు. అంటే కుటుంబంలో 4గురు విదేశాలకు వెళితే సుమారు 7 కోట్ల రూపాయలు డాలర్ల రూపంలో విదేశాలకు తీసుకెళ్ల వచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ విధానంద్వారా 2013-2014 లో రు. 10,700 కోట్లు, 2014-2015లో రు. 30,800కోట్లు, 2015-2016లో రు. 33,500 కోట్లు విదేశాలకు తరలివెళ్ళిందని అంచనా. ఇదంతా చేసింది బీ.జే.పి.నే.
నల్లడబ్బు ఎలా ఏర్పడుతుందో, ఏఏరూపాలలోకి మారి పోతుందో తెలుసుకున్నాం. మరి ఈ నల్లడబ్బు వెలికి రావాలంటే ఏం చేయాలి? నల్లడబ్బు వెలికి రావాలంటే 01. ముందుగా నల్లడబ్బు తయారీకి దోహదపడుతున్న విధానాలు మార్చాలి. వస్తువుల యొక్క విలువ ఎంతుందో లెక్కగట్టి ఆ విలువకు సమాన విలువతో చెల్లుబాటయ్యే విధంగా మాత్రమే కరెన్సీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. 02.''మాకు కొంత పన్నుకట్టండి. మిగిలినది మీరు అనుభవించండి'' అనేవిధానానికి స్వస్తి పలికి, అది అక్రమ డబ్బు అనుకున్నప్పుడు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. 03. ఇప్పటికే ఉన్న పన్ను బకాయీలను నిర్ధాక్షిణ్యంగా వసూలు చేయాలి. కంపెనీలకు ఇస్తున్న పన్ను రాయితీలను నిలిపి వేయాలి. 04. బ్యాంకులకున్న మొండి బకాయీలను అవరోహణా క్రమంలో వసూలు చేయాలి. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి.05.లాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని పునరుధ్ధరించాలి. ప్రతికుటుంబానికి ఎంత భూమి ఉందని తెలిసేవిధంగా పారదర్శక పధ్ధతులను రూపొందించాలి. 06 విదేశీ మారక ద్రవ్యవిధానం కఠినతరం చేయాలి. 07. బంగారం కొనుగోళ్ళపై సీలింగ్‌ కఠినంగా అమలు జరపాలి. 08. వీటన్నింటికి అనుగుణంగా చట్టాలను మార్చాలి.

ఇవన్నీ చేయకుండా కేవలం నోట్ల రద్దువలన నల్లధనం బయట పడుతుందనీ బీ.జే.పి. చెప్పటం ప్రజలను వంచించటమే. ఈ నాడు మనం చెప్పుకునే నల్లధనం సరళీకృత ఆర్ధిక విధానాల ఫలితం. సరళీకృత ఆర్ధిక విధానాలను మార్చకుండా నల్లధనం సమస్య పరిష్కారం కాదు.

అయితే మరి మోడీ ప్రభుత్వం ఈచర్య ఎందుకు తీసున్నట్లు? మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నల్లధనాన్ని అరికట్టడం కోసం తీసుకున్న చర్య కానే కాదు. ''నల్ల ధనాన్ని అరికట్టడం కోసం'' అని చెప్పటం కేవలం ప్రజలను వంచించడం కోసమే. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలలో భాగంగా స్వదేశీ, విదేశీ కంపెనీల కోసమే ఈ చర్య తీసుకున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడులను దేశంలోకి విపరీతంగా అనుమతించింది. అందులో ఒక ముఖ్యమైనది రిటైల్‌ రంగం ( అంటే చిల్లర వర్తకం)లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం. దగ్గరలో ఉన్న చిల్లర దుకాణాల నుండి సరుకులు, రోడ్డు ప్రక్కన అమ్మేవారినుండి కూరలు కొనుక్కోవటం మన భారతీయులకు ఉన్న అలవాటు. ఈ అలవాటును అలా కొనసాగనిస్తే చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన విదేశీ కంపెనీలకు లాభాలు రావు. అందువలన ప్రజల అలవాటును మాల్స్‌ వైపుకు మళ్ళించాలి. చివరకు తోటకూరకట్ట, కరివేపాకు కొనాలన్నా మాల్‌కు వేళ్ళేటట్లు చేయాలి. ఇది జరగాలంటే ప్రజలు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు , మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు వినియోగించే విధంగా చేయాలి. అలా చేయాలంటే ప్రజల దగ్గర మారకం నోట్లు లేకుండా చేస్తే ప్రతివాడిలో డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు ఉపయోగించాలన్న ఆలోచన వస్తుంది. కార్డులతో సరుకులు కొనాలంటే దుకాణదారుల వద్ద స్వైపింగ్‌ మిషన్లు ఉండాలి. స్వైపింగ్‌ మిషన్లు పెద్ద దుకాణదారులే ఉంచగలరు. కనుక ప్రజలు తప్పనిసరిగా మాల్స్‌ వైపుకు మళ్ళుతారు. దీనితో చిల్లర దుకాణాలు మూతపడతాయి. నోట్ల రద్దు యొక్క లక్ష్యం నల్లధనాన్ని వెలికి తీయటం కాదు. చిల్లర దుకాణాలను మూయించడమే దీని లక్ష్యం. ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్య మంత్రి కే.సి.ఆర్‌లు డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు , మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌లు వాడమని ప్రచారం చేయటం వెనుక అంతరార్ధం అదే.

-యం.వి. ఆంజనేయులు, కార్యదర్శి,   టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌, విజయవాడ
తేదీ: 28.11.2016



No comments:

Post a Comment