తేదీ: 22.05.2016
(వి.సాంబిరెడ్డి) (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి
అధ్యయన యాత్రకు వెళ్ళిన విజయవాడ కార్పొరేటర్లకు
టాక్స్ పేయర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ.
ఆర్యా!
మీరు 29.04.2016 నుండి 13.05.2016 వరకు అధ్యయన యాత్రపేరుతో ఉత్తర
భారతదేశంలోని 7 కార్పొరేషన్లను సందర్శించారు. ప్రజలు చెల్లించిన
పన్నులనుండి ఖర్చు చేసి మీరు ఈ యాత్రకు వెళ్ళారన్న విషయం మీకు తెలియంది
కాదు. కనుక మీ అధ్యయనం విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడాలి. అందువలన మీ
యాత్రలో మీరు అధ్యయనం చేసిన విషయాలు, అవి విజయవాడ నగరానికి ఎలా ఉపయోగపడతాయో
నగరప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీమీద ఉన్నది.
ముందుగా మీ టూర్‌కు నిర్దేశించిన అంశాలు ఏమిటి? ఏఏ అంశాలను అధ్యయనం
చేయటానికి మిమ్ములను టూర్‌కు పంపారు? అన్న విషయాలను బహిర్గతం చేయవలసిందిగా
కోరుతున్నాము. సాధారణంగా అధ్యయనానికి కొద్దిమంది వెళ్తే సరిపోతుంది. కాని
35 మంది కార్పొరేటర్లు టూర్‌కు వెళ్ళారు. ఎక్కువ మంది వెళితే అధ్యయనం మరింత
ఎక్కువగా జరిగుండాలి. అది విజయవాడ నగర ప్రజలకు ఉపయోగపడాలని
కోరుకుంటున్నాము. అందువలన మీ అధ్యయనానికి సంబంధించి కొన్ని అంశాలను
మీనుండి తెలుసుకోగోరుతున్నాము.
01. మన విజయవాడనగరం కృష్ణా నది ఒడ్డున ఉన్న విధంగానే, ఢిల్లీ నగరం
యమునా నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ జనాభా 1.86 కోట్లు. అంటే సుమారు 37 లక్షల
20 వేల కుటుంబాలు ఉన్నాయి. అంత జనాభా ఉన్న ఢిల్లీ నగరంలో ప్రతి ఇంటికీ
నెలకు 20 కిలో లీటర్లు ( మనిషికి రోజుకు సుమారు 150 లీటర్లు) నీరు ఉచితంగా
ఇస్తున్నారు. అంటే నెలకు సుమారు 7.44 కోట్ల కిలో లీటర్లు ఉచితంగా
ఇస్తున్నారు. ఢిల్లీ లాంటి మహానగరంలో అది ఎలా సాధ్యపడుతుందో అధ్యయనం
చేశారా? మన విజయవాడ నగరంలో నీరు ఉచితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే
ఎందుకు లేవో వివరించగలరు.
మన విజయవాడ నగరంలో అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. మనకు
ప్రస్తుతం ఉన్న నీటి చార్జీల రేట్ల ప్రకారం 20 కిలోలీటర్లు వాడితే
రు.505.94 అవుతుంది. కాని ఢిల్లీలో గృహ అవసరాలకు 20 కిలోలీటర్ల వరకు
కిలోలీటరు కనీస చార్జీ రు.4.39 గా నిర్ణయించికూడా ఉచితంగానే ఇస్తున్నారు.
పూనేలో 22.5 కిలో లీటర్ల వరకు కిలోలీటరు రు.4.50కు ఇస్తున్నారు. సిమ్లా
టౌన్‌లో కిలోలీటర్ రు.2.50కి ఇస్తున్నారు. ఛండీఘర్‌లో 15 కిలో.లీ. వరకు
కిలో లీటర్ రు.2.లు, ఆపైన 30 కిలో.లీ.వరకు కిలోలీటర్ రు.4లకు
ఇస్తున్నారు. ఇవన్నీ మన విజయవాడ నగరంలోని నీటి చార్జీలకంటే బాగా తక్కువ.
వీటన్నింటిని పరిశీలిస్తే మన నగరంలో అపార్టుమెంట్ల వారికి నీటి చార్జీలు
తగ్గించడానికి అవకాశాలున్నాయని స్పష్టమవుతున్నది. నీటి చార్జీలు తక్కువగా
ఉంచడానికి ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలేమిటీ? అక్కడ
ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటీ? ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల
అనుభవాలను, పధ్ధతులను మీరేం అధ్యయనం చేశారు? అధ్యయనం వివరాలను బహిర్గతం
చేయాలని కోరుతున్నాము.
02. విజయవాడ నగరంలో 3 కొండలు ఉన్నాయి. నగర జనాభాలో సుమారు 10 శాతం మంది
కొండలమీద నివశిస్తున్నారు. మిగిలిన 90 శాతం జనాభా మైదాన ప్రాంతాలలో
నివశిస్తున్నారు. కొండల మీద నివశించేవారికి దశాబ్దాల క్రితం నుండే బూస్టర్ల
ద్వారా నీటిని అందిస్తున్న చరిత్ర విజయవాడ నగరపాలక సంస్థకు ఉన్నది.
విజయవాడ నగరానికి భిన్నంగా సిమ్లా నగరం పూర్తిగా కొండలపైన ఉన్నది. అక్కడ
నీటి సౌకర్యాలను ఎలా కల్పిస్తున్నారు? నీటి చార్జీలు ఎలా ఉన్నాయి? మనకంటే
మెరుగ్గా అక్కడి నీటి వ్యవస్థ ఎలా ఉన్నది?
హిమాచల్ ప్రదేశ్ ఇరిగేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్
సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు నీరు సరఫరా చేస్తున్నది. ఏ ధరకు నీరు
సరఫరా చేస్తున్నది? సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు నిర్వహణ చార్జీలు
ఎంతవుతున్నాయి? గృహావసరాలకు మున్సిపల్ కార్పొరేషన్ ఏ ధరకు నీరు సరఫరా
చేస్తున్నది అధ్యయనం చేశారా? అంత కొండలమీదకు సైతం నీటిని చౌకగా ఎలా
ఇవ్వగలుగుతున్నారో అధ్యయనం చేశారా? వివరాలను బహిర్గతం చేయాలని
కోరుతున్నాము.
03. జాతీయ రాజధానిగా ఉన్న ఢిల్లీలో 80 శాతం పాఠశాలలకు ఆటస్థలాలు
ఉన్నాయి. మన విజయవాడ నగరంలో అనేక పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. వీటిని మీరు
అధ్యయనం చేశారా? అక్కడ '' రైట్ టు ప్లే'' అన్న నినాదంతో మరిన్ని
గ్రౌండ్స్ కోసం ప్రజలు డిమాండు చేస్తున్న విషయాన్ని మీరు అధ్యయనం చేశారా?
మన విజయవాడలో మన పిల్లలకు '' రైట్ టు ప్లే'' (ఆడుకునే హక్కు) ఎందుకు అమలు
చేయలేము?
04. ఢిల్లీలో అనేక వీధులలో 40 అడుగుల రోడ్లలో సైతం రెండు వైపుల 10
అడుగుల వెడల్పు గలిగిన ఫుట్ పాత్‌లు వేశారు. అవి ఎలా వేశారో, వాటి
ప్రయోజానాలేమిటో, అవి ట్రాఫిక్ నియంత్రణకు ఎలా ఉపయోగ పడుతున్నాయో అధ్యయనం
చేశారా? మన విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అలాంటి ఫుట్ పాత్‌లు
ఎందుకు వేయలేకపోతున్నామో అధ్యయనం చేశారా?
05. ఢిల్లీ నగరంలో ఫుల్‌పాత్‌ల మీద వృక్షజాతి మొక్కలను నాటి
పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన నగరంలో
వృక్షజాతి మొక్కలను నరికి వేశి, చిన్న చిన్న మొక్కలను నాటుతున్నారు.
ఢిల్లీ మాదిరిగా విజయవాడలో వృక్ష జాతి మొక్కలను ఎందుకు నాటలేము? వృక్ష
జాతి మొక్కలను నాటడానికి ఢిల్లీలో ఉన్న అవకాశాలు ఏమిటీ? విజయవాడలో లేనివి
ఏమిటి?
06. ఢిల్లీ నగరంలో పురాతన వారసత్వ సంపదను కాపాడుతున్నారు. అమృతసర్‌లో
జలియన్ వాలా బాగ్‌లాంటి చారిత్రక ప్రదేశాలను కాపాడుతున్నారు. సిమ్లాలో
ఇండియా-పాకిస్తాన్ ఒప్పందం జరిగిన ప్రదేశాలను, బ్రిటీష్‌వారి విడిది
ప్రదేశాలను చారిత్రక స్థలాలుగా కాపాడుతున్నారు. జైపూర్‌లో అనేక చారిత్రక
ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కాపాడుకుంటున్నారు. అందుకు భిన్నంగా మన విజయవాడ
నగరంలో చారిత్రకంగా ఉన్న స్వరాజ్య మైదానాన్ని సైతం లేకుండా చేయబోతున్నారు.
అవి చూచిన తరువాత స్వరాజ్య మైదానాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీకు
ఉన్నదనిపిస్తున్నదా? లేదా?
07. ఢిల్లీ నగరంతోబాటుగా, కొండల మీద ఉన్న నగరం సిమ్లాలో సైతం వివిధ
అవసరాలకోసం గ్రౌండ్లను ఏర్పాటుచేసి కాపాడుతున్నారు. చండిఘర్‌లో విస్తారమైన
గ్రౌండ్‌లు ఉన్నాయి. మన నగరంలో ఉన్న గ్రౌండ్లను కూడా లేకుండా
చేస్తున్నారు. గ్రౌండ్లను కాపాడుకోవటం, క్రొత్త గ్రౌండ్లను ఏర్పాటు చేయటంపై
మీరేమి అధ్యయనం చేశారు?
08. ఢిల్లీ నగరంలో బి.ఆర్.టి.యస్. ఎక్కడనుండి ఎక్కడవరకు ఎన్ని
కిలోమీటర్లు వేశారు. అది జయప్రదమయిందా లేక విఫలమయిందా? జయప్రదమయితే ఎలా
జయప్రదమైంది, విఫలమయితే ఎందుకు విఫలమయింది, మన విజయవాడలో
బి.ఆర్.టి.యస్.కు, ఢిల్లీ బి.ఆర్.టి.యస్.కు ఉన్న సారూప్యత ఏమిటీ,
విజయవాడలో బి.ఆర్.టి.యస్.ను జయప్రదం చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు
తదితర అంశాలను అధ్యయనం చేశారా? చేస్తే వివరాలను బహిర్గతం చేయగలరు.
09. మన విజయవాడ నగరంలో మెట్రోరైలు వేయాలని నిర్ణయించారు. ఢిల్లీ నగరంలో
ఇప్పటికే మెట్రోరైలు వేశారు. ఢిల్లీలో ఎంత నిడివి వేశారు? ఎన్ని
స్టేషన్లలతో వేశారు? అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? ఢిల్లీ
మెట్రో లాభాలలో ఉన్నదా? లేక నష్టాలలో ఉన్నదా? నష్టాలలో ఉంటే ఆనష్టాలను ఎలా
పూడ్చగలుగుతున్నారు? గత 5 సంవత్సరాలుగా ఢిల్లీ మెట్రో చార్జీలను పెంచారా?
మీ అధ్యయన వివరాలను బహిర్గతం చేయగలరు.
.
10. ఢిల్లీ నగరంలో ఒక ప్రైవేటు సంస్థ కూడా మెట్రోరైలు వేశింది.
ఎక్కడనుండి ఎక్కడకు వేశారు? చార్జీలు ఎలా ఉన్నాయి? ఆ రైలు లాభాలలో ఉన్నదా
లేక నష్టాలలో ఉన్నదా? ఆ ప్రైవేటు సంస్థ ఆ రైలును నడపగలుగుతున్నదా? ఢిల్లీ
మెట్రోరైల్ కార్పొరేషన్ వేశిన మెట్రోరైలుకు, ప్రైవేటు సంస్థ వేశిన
మెట్రోరైలుకు మధ్య తేడా ఏమిటి? ఈ విషయాలను అధ్యయనం చేశారా? వివరాలను
బహిర్గతం చేయగలరు.
11. ఢిల్లీలో మెట్రో రైలు పరిస్ధితిని అధ్యయనం చేసిన తర్వాత, మన
విజయవాడ నగరంలో వేయబోతున్న మెట్రోరైలు లాభాలలో ఉంటుందని అనుకుంటున్నారా?
నగర ప్రజలకు చౌకైన రవాణాగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? భావిస్తే ఎలాగో
వివరించగలరు?
12. మెట్రో రైలు వలన ఢిల్లీ నగర ప్రజలపై భారాలేమైనా పడ్డాయా? పడితే ఏవిధంగా భారాలు పడ్డాయి? వివరించగలరు.
13. విజయవాడ నగరానికి పనికి వచ్చే క్రొత్త అంశాలు ఇంకేమేం అధ్యయనం చేశారు? వివరాలను బహిర్గతం చేయగలరు.
అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి) (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి
No comments:
Post a Comment