ప్రచురణార్ధం: తేదీ:26.04.2019
అధ్యక్షులు కార్యదర్శి
రాష్ట్రంలో ఆర్.టి.సి. బస్ చార్జీలు పెంచవలసిన అవసరం ఉందని, అధికారంలోకి రాబోయే ప్రభుత్వం బస్ చార్జీలు పెంచటానికి అనుమతినివ్వాలని ఆర్.టి.సి. యం.డి. సురేంద్రబాబు ప్రకటించటం పట్ల టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో 128 బస్ డిపోలకుగాను116 బస్ డిపోలు నష్టాలలో ఉన్నాయని, లాభాలలో ఉన్న డిపోలు కూడా బస్ స్టాండ్‌లు వాణిజ్య కార్యక్రమాలు ఇవ్వటం వలన లాభాలలో ఉన్నాయని సురేంద్రబాబు వెల్లడించారు. ఆర్.టి.సి నష్టాలలో ఉన్నది ప్రయాణీకులు లేక కాదని, యాజమాన్య లోపం వల్లనేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. ఆర్.టి.సి వినియోగించే డిజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించటం, విచ్చలవిడిగా ప్రైవేటు బస్సులకు అనుమతి నివ్వటం, రాష్ట్రంలోని అన్ని గ్రామాలను కలిపేలా బస్సులను నిర్వహించకపోవటం, అస్థవ్యస్తంగా ఉన్న రోడ్ల నిర్మాణం, ప్రైవేటీకరణ విధానాలు ఆర్.టి.సిని దెబ్బతీస్తున్నాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది. ''అమరావతి యాత్రకు, పోలవరం యాత్రకు, సి.యం.సభలకు జనాన్ని తరలించటానికి వినియోగించిన బస్‌లకు అయిన ఖర్చు, ఆ ఖర్చుకుగాను ప్రభుత్వం తిరిగి ఎంత చెల్లించింది'' అన్న వివరాలు ప్రజల ముందుంచాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం వివిధ రకాల ప్రజలకు ఆర్.టి.సి. చార్జీలలో రాయితీలు ప్రకటిస్తున్నది. ఆ రాయితీలు ప్రకటించేది ప్రభుత్వం కనుక ఆ రాయితీల వలన కలిగిన నష్టం మొత్తాన్ని ప్రభుత్వం ఆర్.టి.సి.కి తిరిగి చెల్లించాలి. ఆవిధంగా ప్రభుత్వం తిరిగి చెల్లించిందా లేదా అన్న విషయాన్ని బహిర్గతం చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిిమాండ్ చేస్తున్నది. బస్ స్టాండ్‌లను వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం వలన కొన్ని డిపోలు లాభాలలో ఉన్నాయని చెప్పటం, నష్టాలను పూడ్చుకోవాలన్న పేరుతో రాష్ట్రంలో మరిన్ని బస్ స్టాండ్లను ప్రైవేటువ్యక్తులకు అప్పగించటానికేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో ఇంకా 1000 బస్సుల అవసరం ఉందని, సొంత బస్సుల వలన కిలో మీటరుకు రు 6లు నష్టం వస్తున్నందున క్రొత్త బస్సులు కొనటానికి బదులుగా అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సురేంద్రబాబు చెప్పారు. ఇది కేవలం ఆర్.టి.సి.కి సొంత బస్సులు లేకుండా చేసి ఆర్.టి.సి.ని నిర్వీర్యం చేయటానికి ఉద్దేశించిన చర్య. ప్రజారవాణా వ్యవస్ధను ప్రైవేటీకరించటానికి అనుసరించవలన విధానాలను సిఫార్సులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్ర 4వ ఆర్ధిక సంఘాన్ని కోరింది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్ధను ప్రైవేటీకరించటానికి నిర్ణయించిందని స్పష్టమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగానే ఆర్.టి.సి.ని నిర్వీర్యం చేయటానికి, ప్రజారవాణాను ప్రైవేటీకరించటానికి రకరకాల సాకులను ఆర్.టి.సి.పాలక వర్గం ప్రజలముందు ఉంచుతున్నదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతున్నది.
రవాణా మానవ నాగరికతకు, సమాజ అభివృద్ధికి కీలకమైనది. అందువలన రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందులో అధిక జనాభా ఉన్న మనలాంటి దేశాలలో ప్రజారవాణా చాలా కీలకమైనది. ఛార్జీలు పెంచితే ప్రజలు ప్రజారవాణాకు దూరమవుతాయి. ఇది సమాజం మీద దుష్ప్రభావాలను చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలలో ఎన్నో రకాల సబ్సిడీలు భరిస్తున్నది. ఎలాంటి ఉత్పాదక ప్రయోజనం లేకుండానే ఉచితంగా డబ్బులిచ్చే పథకాలు కూడా ప్రకటిస్తున్నది. ఎన్నికల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, యాజయాన్య లోపాలవలన ఆర్.టి.సి.కి నష్టాలు వస్తే మాత్రం ప్రజలమీద ఎందుకు రుద్దాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. రాబోయే నూతన ప్రభుత్వం చార్జీల పెంపుదలకు అనుమతి నివ్వరాదని, ఆర్.టి.సి.కి వచ్చే నష్టం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిిమాండ్ చేస్తున్నది.
(వి.సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు కార్యదర్శి