Tuesday, 28 January 2014

మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదల, ఆస్తిపన్ను పెంచుతూ మున్సిపల్‌ చట్టాలకు చేసిన సవరణలను వ్యతి రేకిస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు 27.01.2014 న ధర్నా.




మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ కు స‌మ‌ర్పించిన‌ మెమొరాండం.
తేదీ :27. 1. 14

గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి
ఆర్యా,
విషయం:- మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదల, ఆస్తిపన్ను పెంచుతూ మున్సిపల్‌ చట్టాలకు చేసిన సవరణలను వ్యతి రేకిస్తూ ఈ రోజు మీ కార్యాలయం ముందు జరిగిన ధర్నా సందర్భంగా సమర్పిస్తున్న మెమొరాండం.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను విపరీతంగా పెంచింది. అదేవిధంగా ఆస్తిపన్ను పెంచుతూ GHMC Act 1955  కు రాష్ట్రప్రభుత్వం సవరణలు చేసింది. ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ విజయవాడనగర ప్రజలు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రెండు అంశాలను వ్యతిరేకించడానికిగల కారణాలను మీముందుంచుతున్నాము.
మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలపై మా వ్యతిరేకతకుగల కారణాలు 

01. చార్జీలను పెంచేటప్పుడు ముందుగా వినియోగదారులమైన మాకు తెలియపరచాలని, మానుండి అభ్యంతరాలేమైనా ఉంటే స్వీకరించి వాటిని పరిశీలించాలన్న విషయాలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా చార్జీలను పెంచి, ఆస్తిపన్ను నోటీసులలో కలిపి పంపటం పట్ల మేము అభ్యంతరం తెలియజేస్త్తున్నాము. ఇది ప్రజాస్వామ్యవ్యతిరేకమని, నిరంకుశవిధానమని మేము తెలియ జేస్తున్నాము. అంతేకాకుండా నీటి చార్జీలకు ఇంటిపన్నును ఆధారంగా చేయటం, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటంలాంటి విధానపరమైన నిర్ణయాలు
తీసుకునేటప్పుడు వాటిపై సమగ్రమైన చర్చ జరగాలి. కనీసం నీటి చార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయేమో అన్వేషించాలి. ఇది జరగాలంటే విజయవాడనగర వాసులైఉండి, విజయవాడ నగర ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఉండాలి. ఎన్నికైన కౌన్సిల్‌లో ఇది చర్చ జరగాలి. కాని ప్రజల తరఫున చర్చ జరపడానికి, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు. ఎన్నికైన కౌన్సిల్‌ లేదు. ఎన్నికైన కౌన్సిల్‌ లేని సమయంలో కొద్దిమంది అధికారులు కూర్చొని విధాన పరమైన నిర్ణయాలు చేయటం ప్రజాస్వామ్య విరుధ్దం. మీరు అనుసరించిన ఈ నిరంకుశ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మాచే ఎన్నుకోబడిన కౌన్సిల్‌ ఏర్పడే వరకు నీటి చార్జీలపెంపుదలను నిలిపివేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతున్నాము.

02. నీటి చార్జీలను భారీగా పెంచడమే కాకుండా ఇప్పటివరకు లేని విధంగా ఇంటిపన్ను ఆధారంగా నీటిచార్జీలు నిర్ణయించారు. ఇంటిపన్నుకు నీటి చార్జీలకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేస్తున్నాము. భారీగా ఇంటిపన్నుకట్టే ధనవంతుని గృహానికైనా, అతి తక్కువ ఇంటిపన్ను కట్టే పేదవాని గృహానికైనా కార్పొరేషన్‌ అర అంగుళం నీటి కుళాయినే ఇస్తుంది. నీరిచ్చే సమయంకూడా ఇంటి పన్నును బట్టి మారదు. అందరికీ ఒకే సమయంలో, ఒకే విధంగా నీటిని సరఫరా చేస్తారు. అందువలన ఇంటి పన్ను ఎక్కువ చెల్లించేవారికి, తక్కువ చెల్లించేవారికి నీటిని సరఫరా ఒకే పరిమాణంలో ఉంటుంది. కనుక నీటి సరఫరాకు ఇంటి పన్నుకు ఎట్టి సంబంధం లేదన్న విషయాన్ని మీధృష్టికి తెస్తున్నాము.నీటి సరఫరాలో తేడా లేనప్పుడు చెల్లించే ధరలో తేడా చూపడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.

03. నీటి చార్జీలను ఇంటి పన్ను ఆధారంగా నిర్ణయించడం, అపార్టుమెంట్లకు శ్లాబులవారీ నిర్ణయించడం '' విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నీటి సరఫరా బైలా 1993''లో గాని, GHMC Act 1955 లోగాని లేదు. కనుక ఈ నిర్ణయాలు చట్టవిరుధ్ధమని తెలియ జేస్తున్నాము.

04. అపార్టుమెంట్లకు కూడా నీటి చార్జీలను రెట్టింపునుండి మూడు రెట్లు పెంచారు. వ్యక్తిగత గృహాలకు 40శాతంనుండి 400 శాతం వరకు పెంచారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి చార్జీలను నివాసగృహాలకు ఒక్కొక్క మరుగు దొడ్డికి రు|| 15లనుండి రు|| 30లకు పెంచారు. అంటే రెట్టింపు చేశారు.

05. నీటి చార్జీలను, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి చార్జీలను పెంచటంతోబాటుగా, బిల్లుకాలం రెండునెలలుగా మార్చి, బిల్లులు తయారుచేయటానికి, బిల్లులు వసూలు చేయటానికి అయ్యేఖర్చును రెండునెలలకు10 రు||లు చొ||న మానుండే వసూలు చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. బిల్లులుతయారుచేయటం, వసూలుచేసుకోవటం కార్పొరేషన్‌విధి. మీవిధులను ప్రైవేటువాళ్ళకు అప్పగించి వారికి ఇచ్చే మెత్తాన్ని మానుండి వసూలు చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.

06. మంచినీరు, డ్రైనేజి, శానిటేషన్‌ నిర్వహణకు అయ్యేఖర్చు మొత్తాన్ని ప్రజలే భరించాలని కార్పొరేషన్‌ గా మీరు భావిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగానే నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు పెంచారు. అందుకు భిన్నంగా కార్పొరేషన్‌కు అయ్యేఖర్చును రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబట్టాలని మేము డిమాండు చేస్తున్నాము. కారణం రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లలో మంచినీటికి, శానిటేషన్‌కు నిధులు ప్రతి ఏటా కేటాయిస్తుంది. గత ఏడాదికూడా కేటాయించింది. ఆ కేటాయింపులనుండి విజయవాడ నగరంలో మంచినీటికి, శానిటేషన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. అంతేకాకుండా మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌ ప్రజారోగ్యంలో భాగం. ప్రజారోగ్యనిర్వహణ రాష్ట్ర ప్రభుత్వబాధ్యత. అందువలన విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా కేటాయించాలని డిమాండు చేస్తున్నాము.

ఆస్తిపన్ను పెంచుతూ GHMC Act 1955 కు రాష్ట్రప్రభుత్వం సవరణలపై మా వ్యతిరేకతకుగల కారణాలు


రాష్ట్ర ప్రభుత్వం ప్లాను అతిక్రమణలకు పెనాలిటీలపేరుతో ఆస్తిపన్నును పెంచుతూAndhra Pradesh Municipal Corporations (Amendment) Act, 2013(Act No.14 of 2013) published in the Andhra Pradesh Extraordinary
Gazette No.14, dated 12.07.2013 ద్వారా GHMC Act 1955  ను సవరించింది. ఆమేరకు జీ.వో.నెం.382 తేదీ 02.08.2013 ను విడుదల చేసింది. దీనిప్రకారం ఇంటికిసెట్‌ బ్యాక్‌ ( ప్లాను ప్రకారం చుట్టూ వదలవలసిన స్థలం) వదలటంలో 10 శాతం వరకు అతిక్రమిస్తే పెనాలిటీగా ఆస్తిపన్ను ఇప్పుడున్న దానిపై 25 శాతం,. 10 శాతానికి మించి అతిక్రమిస్తే పెనాలిటీగా ఆస్తిపన్ను ఇప్పుడున్న దానిపై 50 శాతం పెంచుతారు. వాస్తుపేరుతోనో, మరేపేరుతోనో కొద్దో గొప్పో డీవియేషన్‌తో ఉండే గృహాలే నగరంలో అత్యధికంగా ఉంటాయి. అంటే నగరంలోని అత్యధిక గృహాలకు ఆస్తిపన్నును భారీగా పెంచబోతున్నారు. ఇంటిపై అసలు ప్లాను లేకుండా చిన్న గది వేసినా ఆ ఇంటి మొత్తాన్ని అక్రమంగా పరిగణించి ఇప్పుడున్న పన్నుకు 100 శాతం పెంచుతారు. అంటే రెట్టింపు చేస్తారు. అపార్టుమెంట్లపై బిల్డర్‌ ప్లానులేకుండా పెంట్‌ హౌస్‌ వేస్తే ఆ అపార్టుమెంట్‌ మొత్తాన్ని ప్లాను లేనిదిగా పరిగణించి అ అపార్టుమెంట్‌ బిల్డింగ్‌లోని అన్ని ఫ్లాట్‌లకు ఆస్తిపన్ను రెట్టింపు చేస్తారట. బిల్డర్లు, మున్సిపల్‌ సిబ్బంది అధికారులు కుమ్మక్కై చేస్తున్న తప్పుకు అపార్టుమెంట్లను కొనుక్కున్నవారిని బలి చేయబోతున్నారు. మున్సిపల్‌ సిబ్బంది అవినీతి, బిల్డింగ్‌ ప్లాన్‌ నిబంధనలు వాస్తవపరిస్తితులకు అనుగుణంగా లేకపోవటం ఈ డీవియేషన్స్‌కు ప్రధాన కారణాలు. వాటిని సరి చేయటానికి బదులుగా డీవియేషన్స్‌ పేరుతో ఆస్తిపన్ను పెంచటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.
ఇప్పటివరకు పెనాలిటీ అంటే ఒకసారి కట్టడమే అనుకునేవారం. ఈ పెనాలిటీ మాత్రం జీవితాంతం కట్టాలి. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము.

ఇది మాత్రమే కాదు. ఇప్పటివరకు ఆయా ప్రాంతాలలోని అద్దె విలువలను తీసుకొని దానిలో 22 శాతంగా ఆస్తి పన్నును లెక్కిస్తున్నారు. ఇకమీదట అద్దె విలువ కాకుండా, ఆస్తి విలువను తీసుకొని దానిలో శాతంగా ఆస్తిపన్నును లెక్కిస్తారని వార్తలువస్తున్నాయి. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాము.

నిధుల కేటాయింపు, ఎకౌంటింగ్‌ విధానాలపట్ల మా వైఖరి 

రాష్ట్రాభివృధ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌ లాంటి అంశాలు కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగమే. విజయవాడ అభివృధ్ది రాష్ట్రాభివృద్ధిలో భాగం. అందువలన విజయవాడ నగరంలోని మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు కేటాయించాలి. స్థానిక సంస్థలకు నిధులు విధిగా కేటాయించాలన్న రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరానికి నిధులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టకుండా మొత్తం ప్రజలనుండే వసూలు చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు మా అభ్యంతరం తెలియజేస్తున్నాము.

మున్సిపల్‌ ఫండ్‌ నిర్మాణం, దానినినుండి వివిధ పనులకు కేటాయింపు అన్న విధానాన్ని వదలి పెట్టి , కార్పొరేషన్‌ నిర్వహించే ప్రతి పనికీ, అందించే ప్రతి సేవకు విడివిడిగా లెక్కగట్టి పూర్తిగా మానుండే వసూలు చేయాలన్న విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము.

ఆస్తిపన్నును నగరపాలక సంస్థకు ప్రధానమైన ఆదాయవనరుగా చేయాలని, కార్పొరేషన్‌ అందించే ప్రతి సేవకు యూజర్‌చార్జీలు వసూలు చేయాలని జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం.షరతులలో ఉన్నది. ఈ షరతులకు అనుగుణంగానే పైనుదహరించిన మంచినీరు, డ్రైనేజి చార్జీలపెంచారు. శానిటేషన్‌ నిర్వహణకు యూజర్‌ చార్జీలు విధించారు. ఆస్తిపన్ను పెంచుతూ GHMC Act 1955 కు సవరణలు చేసారు. ఈ షరతులనూ వాటి పర్యవసానంగా వచ్చిన మంచినీరు, డ్రైనేజి చార్జీలపెంపుదల. శానిటేషన్‌ నిర్వహణకు యూజర్‌ చార్జీలు విధింపు, ఆస్తిపన్ను పెంచుతూ GHMC Act 1955 కు సవరణలను మేము వ్యతిరేకిస్తున్నాము.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది డిమాండ్లను మీముందుంచుతున్నాము.

01. పెంచిన నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను తక్షణమే ఉపసహరించుకోవాలి

02., పెంచిన చార్జీలతో ప్రస్తుతం జారీచేసిన ఆస్తి పన్ను నోటీసులను, నీటి మీటరు బిల్లులను ఉపసంహరించుకొని, వాటిస్థానంలో 2013 మార్చి 31 నాటికి ముందు అమలులో ఉన్న చార్జీలతో కూడిన డిమాండు నోటీసులను, నీటి మీటరు బిల్లులను పంపించాలి

03. ఇప్పటికే పెంచిన నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను చెల్లించినవారికి, ఆమొత్తాన్ని రాబోయే బిల్లులలో తగ్గించాలి.

04. మంచినీటి నిర్వహణ, డ్రైనేజీ. శానిటేషన్‌ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను రాబట్టాలి.

05. ఆస్తిపన్ను పెంచుతూ GHMC Act 1955 కు రాష్ట్రప్రభుత్వం సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

నగర ప్రజలు కోరుతున్న ఈ డిమాండ్లను మీరు ఆమోదిస్తారని ఆశిస్తున్నాము.

                                        అభివందనాతో
                       ఈరోజు జరుగుతున్న ధర్నా తరఫున


(వి.సాంబిరెడ్డి)                                                     (యంవి ఆంజనేయులు)
అధ్యక్షులు                                                                    కార్యదర్శి


No comments:

Post a Comment