విజయవాడ నగరంలో పెంచిన నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నగరపాలక సంస్థ పాలకులను డిమాండు చేస్తున్నది. నగరంలో నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు గత 5 ఏళ్ల కాలంలో 40 శాతం పెరిగాయి. 5 ఏళ్ల క్రితం స్పెషలాఫీసర్ పాలనలో నీటి చార్జీలను ఆస్తి పన్నుతో లింకు పెట్టారు. అపార్టుమెంట్లకు నీటి శ్లాబులు మార్చారు. రేట్లు పెంచారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి రు.15లుగా ఉన్న డ్రైనేజి చార్జీనిరు.30లకు పెంచారు. ఇది చాలదన్నట్టు మరల మరల పెంచే పని లేకుండా ఏటా 7 శాతం ఆటోమేటిక్‌గా పెెరిగే నిబంధనను పెట్టారు. ఇప్పుడది తడిచి మోపెడై 40 శాతానికి పెరిగింది. రాబోయేకాలంలో ఇంకా వేగంగా పెరుగుతుంది. ఇప్పటికే భారం అనుకుంటుంటే మరల నీటి చార్జీలను పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వమే జి.వో. నెం. 159 ని విడుదల చేసింది. ఈ జి.వో ఆధారంగా త్వరలో నీటి చార్జీలు ఇంకా పెంచబోతున్నారు. ఈ జి.వో ప్రకారం నీటి చార్జీలు వ్యక్తిగత నివాస గృహాలకు ఆస్తి పన్ను నెలకు రు.250/-ల లోపుఉంటే 50 శాతం, నెలకురు.250/-లకు పైన ఉంటే 100 శాతం, అపార్టుమెంట్లకు 150 శాతం పెంచబోతున్నారు. పరిశ్రమలకు 150 శాతం, వాణిజ్య సముదాయాలకు 200శాతం పెంచబోతున్నారు.
2014 ఎన్నికలకు ముందు నీటిచార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటం ఘోరమని,ఆస్తి పన్నుతో లింకు పెట్టడం తప్పని, ఏటా 7 శాతం పెంచటం మరీ అన్యాయమని తెలుగు దేశంవారు ఆందోళనలు చేశారు. వీధులలో బ్యానర్లు పట్టుక తిరిగారు. తాము అధికారంలోకి వస్తే ఈ పెంపుదలను రద్దు చేసి, స్పెషలాఫీసర్ పాలనకు ముందున్న రేట్లనే అమలు చేస్తామన్నారు. నమ్మి ఓట్లేయమన్నారు. జనం ఓట్లేశారు. వారు అధికారంలోకి వచ్చారు. అంతే నేటివరకు పెంపుదల విషయంలో ఒక్క అంశంకూడా మార్చలేదు. మార్చమని కౌన్సిల్ ఎజెండాలో పెడితే ఏదో విధంగా దాటేశారు తప్ప తగ్గించటానికి కనీసం తీర్మానం కూడా చేయలేదు. నీటి చార్జీలను ఆస్తి పన్నుతో లింకుపెట్టడాన్ని అలాగే అపార్టుమెంట్లకు నీటి శ్లాబులు మార్చటం, రేట్లు పెంచటంలాంటివాటిని రద్దుచేయటంమాట అటుంచి కనీసం ఏటా 7 శాతం పెంపుదల నిబంధనను కూడా రద్దు చేయలేదు. ఇది చాలదన్నట్లు నేటి తెలుగు దేశం ప్రభుత్వమే నీటి చార్జీలను పెంచటానికి జి.వో. నెం. 159 ని విడుదల చేశారు. ఇది ఓట్లేసిన జనాన్ని దగా చేయటమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
ఇప్పటివరకు నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు స్థానిక సంస్థలు నిర్ణయిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి నీటి చార్జీల ధరల నిర్ణయాన్ని తన చేతులలోకి తీసుకుంటున్నది. త్వరలోనే డ్రైనేజి చార్జీలను కూడా రాష్ట్ర ప్రబుత్వమే లాగేసుకో బోతున్నది. ఇప్పటికే ఆస్తిపన్నును రాష్ట్ర ప్రభుత్వం తన చేతులలోకి తీసుకున్నది. ఇది స్థానిక సంస్థల హక్కులను హరించటమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యవిరుధ్ధం.
ఇప్పటికైనా సరే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, స్పెషలాఫీసర్ పాలనకు ముందున్న చార్జీలనే వర్తింప జేయాలని, నీటి చార్జీలను ఆస్తిపన్నుతో ముడిపెట్టే విధానాన్ని రద్దు చేయాలని, బిల్లులు ఏడాదికి ఒకేసారి కాకుండా గతంలో మాదిరిగానే ప్రతి 6 నెలలకొకసారి ఇవ్వాలని, జి.వో. నెం. 159 ని రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది. ఆస్తిపన్నులు, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల నిర్ణయాధికారం కార్పొరేషన్‌కే ఉంచేవిధంగా పోరాడాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నగర మేయర్, కార్పొరేటర్లను, ఎం.ఎల్.ఏలను కోరుతున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి