Friday, 15 July 2016

ఆస్తి ప‌న్నుసంవ‌త్స‌రానికి ఒకేసారి క‌ట్టాల‌ని నోటీసులు పంప‌టం చ‌ట్ట‌విరుధ్ద‌మ‌ని తెలియజేస్తూ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్‌కు, మేయ‌ర్‌కు వ్రాశిన లేఖ‌

                                                                

ప్రెస్ మీట్‌లో లేఖ‌ను విడుద‌ల చేస్తున్న టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు  


                                      లేఖ‌                                                 

                                                       తేదీ: 15.07.2016
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,

ఆర్యా,
విషయం: ఆస్తిపన్ను సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెల్లించాలని డిమాండు పంపటం చట్టవిరుధ్ధమని తెలియజేస్తూ వ్రాస్తున్న లేఖ.

                 2016-2017 ఆర్ధిక సంవత్సరంలో మొదటి అర్ధ సంవత్సరానికి చెల్లించవలశిన ఆస్తిపన్ను నోటీసులను పంపుతున్నారు. అయితే ఆ నోటీసులలో మొదటి అర్ధ సంవత్సరానికి బదులుగా అనగా 01.04.2016 నుండి 30.09.2016 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీల తోబాటుగా 01.10.2016 నుండి 31.03.2017 వరకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, నీటి చార్జీలు , డ్రైనేజి చార్జీలు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు కలిపి మొత్తం సంవత్సరానికి ఒకేసారి చెల్లించాలని ఆదేశిస్తూ డిమాండు నోటీసులను పంపుతున్నారు. ఇది చట్టవిరుధ్ధమన్న విషయాన్ని మీదృష్టికి తీసుక వస్తున్నాము.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్టు 1955, సెక్షన్‌ 264 లో ఈ క్రింది విధంగా ఉన్నది.
                                Collection of Taxes
Sec264: Property taxes how payable:- Each of the property taxes shall be payable in advance either in half-yearly or quarterly installments as the corporation may decide.
(2) In case of-
(a) half-yearly installments, the taxes shall be payable in advance on each first day of    April and October
(b) quarterly installments, the taxes shall be payable on each first day of April and July and each first day of October and January.

                     పై సెక్షన్‌ ప్రకారం ఆస్తిపన్ను అర్ధ సంవత్సరానికి కాని లేదా మూడు నెలలకు ఒకసారి కాని వసూలు చేయాలి. అంతేకాని, సంవత్సరానికి ఒకేసారి వసూలు చేయమని చట్టంలో లేదు. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ ఏనాడో నిర్ణయించి ఇప్పటివరకు అమలు జరుపుతున్నది. ఈ నిర్ణయానికనుగుణంగానే, ఆస్తిపన్నును మదింపు చేసినప్పుడు అర్ధసంవత్సరానికి మదింపు చేసి స్పెషల్‌ నోటీసులను పంపారు. గృహ యజమానులు కూడా అంగీకరించారు. దానికనుగుణంగానే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ప్రతి అర్ధ సంవత్సరం డిమాండు నోటీసులను జారీ చేసి పన్నులను వసూలు చేస్తున్నది. 2016-2017 లో అందుకు భిన్నంగా సంవత్సరానికి ఒకేసారి ఆస్తిపన్ను కట్టమని నోటీసులను పంపుతున్నారు. ఒకసారి మదింపు చేసి పంపిన ఆస్తిపన్ను నోటీసులను మార్చాలంటే ముందుగా కౌన్సిల్‌లో నిర్ణయం చేయాలి. సవరణ నోటీసులను పంపటం ద్వారా గృహ యజమానులకు తెలియ జేయాలి. వారి నుండి అభ్యంతరాలను స్వీకరించాలి. పరిష్కరించాలి. ఇవేవీ చేయకుండా 2016-2017 లో సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం చట్టవిరుధ్ధం.

                      సంవత్సరానికి ఒకేసారి కట్టమని ఆస్తిపన్ను నోటీసులను పంపటం వెనుక, నిజాయితీగా క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లించేవారిపైననే భారంమోపి వారినుండి ఒకేసారి ఆస్తిపన్ను రాబట్టుకోవాలన్న ఆతృత కనుపిస్తున్నది. కాని దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి ఇంత ఆతృత ఎందుకు చూపటంలేదని ప్రశ్నిస్తున్నాము.

                పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని, సంవత్సరానికి ఒకేసారి కట్టమని ప్రస్తుతం జారీ చేస్తున్న ఆస్తిపన్ను డిమాండు నోటీసులను ఉపసంహరించుకొని, అర్ధ సంవత్సరానికి చెల్లించేవిధంగా డిమాండు నోటీసులను జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దశాబ్దాలతరబడి ఆస్తిపన్నును చెల్లించకుండా బకాయీలు పడిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
                                        అభివందనాలతో

వి.సాంబిరెడ్డి                                              యంవి ఆంజనేయులు
అధ్యక్షులు                                                            కార్యదర్శి

గ‌మ‌నికః ఇదే లేఖ‌ను న‌గ‌ర మేయ‌ర్ గారికి కూడా పంపించాము.