PRESS NOTE తేదీ: 26.04.2016
అధ్యక్షులు కార్యదర్శి
విజయవాడతో సహా రాష్ట్రంలోని అన్నిపట్టణాలలో ఇంటింటికీ నీటి మీటర్లు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నది. నదులలో వరద నీటిని సమర్ధవంతంగా త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవటానికి చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వం, దానికి భిన్నంగా రాష్ట్ర ప్రజల మంచినీటి అవసరాన్ని ఆసరాగా చేసుకొని మంచినీటితో వ్యాపారం చేయటానికి, ప్రజలను దోపిడీ చేయటానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని స్పష్టం అవుతున్నది.
గతంలో జె.యన్.యన్.యు.ఆర్.యం. షరతులకనుగుణంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నించింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కు తగ్గింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నిస్తున్నది. విజయవాడ నగరంలో కూడా అమృత్ పథకం పేరుతో నీటి మీటర్లు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటిమీటర్ల ఏర్పాటుతో సహా అమృత్ పథకంలో మైల్ స్టోన్స్ పేరుతో పొందుపరచిన అన్ని షరతులను అమలుజరపటానికి వీలుగా ఈ నెల 4వ తేదీన జరిగిన విజయవాడ నగర కౌన్సిల్ సమావేశంలో అజెండాగా పెట్టి ఆమోదించుకున్నారు. జె.యన్.యన్.యు.ఆర్.యం. షరతులకు, అమృత్ పధకంలోని మైల్ స్టోన్స్ పేరుతో ఉన్న షరతులకు తేడా ఏమిటో, ఏమి తేడా గమనించి కౌన్సిల్లో ఆమోదించారో నగర ప్రజలకు స్పష్టం చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ విజయవాడ నగర పాలకులను డిమాండ్ చేస్తున్నది. గత కౌన్సిల్లో కనీస అధ్యయనం లేకుండా జె.యన్.యన్.యు.ఆర్.యం. షరతులను కాంగ్రెస్ ఆమోదించింది. చివరకు అది నగరానికి గుదిబండగా మారింది. నగరపాలక సంస్థను దివాలా తీయించింది. ప్రజలపై భారాలు మోపింది. నేడు అమృత్ పథకంలో మైల్ స్టోన్స్ పేరుతో ఉన్న షరతులను కూడా కనీస అధ్యయనం లేకుండా, చర్చలేకుండా తెలుగుదేశం పాలకులు ఆమోదించారు. ఇది నగర ప్రజలపై పిడుగుపాటు కాబోతున్నదని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ 24 గంటల నీటిసరఫరా చేస్తామని, అందుకోసం నీటి మీటర్లు పెడతామని ప్రకటిస్తే, నేటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా 24 గంటల నీటిసరఫరా చేస్తామని, అందుకోసం నీటి మీటర్లు పెడతామని ప్రకటిస్తున్నది. నేటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి నీటి మీటర్ల ఏర్పాటును కేవలం పట్టణాలు,నగరాలకే పరిమితం కాకుండా గ్రామాలకు కూడా విస్తరించబోతున్నది. ప్రయోగాత్మకంగా కర్నూలు జిల్లా ప్రత్తికొండ మండలంలో 24 గంటల నీటిసరఫరా చేస్తామని, అందుకోసం నీటి మీటర్లు పెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.ఇ. కృష్ణమూర్తి ప్రకటించటం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది. రాష్ట్రంలో పట్టణాలు,నగరాలతోబాటు, కుళాయిలున్న అన్ని గ్రామాలలోకూడా నీటిమీటర్లు పెట్టడానికి, నీటిని వ్యాపార సరుకుగా మార్చడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని స్పష్టమవుతున్నది.
జె.యన్.యన్.యు.ఆర్.యం. షరతులకనుగుణంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విజయవాడలో నీటి మీటర్లు పెట్టాలని ప్రయత్నించినప్పుడు తెలుగుదేశం కార్పొరేటర్లు వ్యతిరేకించారు. తెలుగుదేశంపార్టీగా విజయవాడలో ఆంధోళనలు చేశారు. నాడు నీటి మీటర్ల ఏర్పాటుపై వ్యతిరేకించడానికీ, ఆంధోళనలు చేయటానికి గల కారణాలేమిటో, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బాటలోనే నడుస్తూ నీటి మీటర్లను ఎందుకు పెట్టాలంటున్నారో పాలకులు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.
విజయవాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలననలో పెంచిన నీటిచార్జీలు కట్టలేక ఇప్పటికే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాము అధికారంలోకి వస్తే నీటిచార్జీలు తగ్గిస్తామని వాగ్దానంచేసి అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్ పాలకులు, ఏటా 7 శాతం పెంచుతున్నారు. ఇప్పుడు నగరమంతటా నీటి మీటర్లు పెట్టడానికి సిధ్దపడుతున్నారు. ఇది నగర ప్రజలను వంచించటమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ భావిస్తున్నది. నీటి మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు మోపే ప్రయత్నాలను విరమించి, నీటి చార్జీలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోరుతున్నది.
(వి.సాంబిరెడ్డి) (యం.వి.ఆంజనేయులు) అధ్యక్షులు కార్యదర్శి