Thursday, 29 September 2011

Memorandum to Commissioner- చెత్త తొలగింపుకు వసూలు చేస్తున్న యూజర్ చార్జీలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ మున్సిపల్ కమీషనరుకు సమర్పించిన మెమొరాండం

తేదీ:19.09.2011
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా!
విషయం:- గార్బేజీ తొలగింపునకు యూజర్‌ చార్జీల విధింపు గురించి....
విజయవాడ నగరంలో గార్బేజీ తొలగింపుకు యూజర్‌ చార్జీలను ఆస్తిపన్ను నోటీసుతో పాటు కలిపి పంపుతున్నారు. దీని పట్ల అటు నగరంలోని గృహ యజమానులు, ఇటు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేశాము. అయినప్పటికీ పట్టించుకోకుండా యూజర్‌ చార్జీలను ఆస్తిపన్ను నోటీసుతో పాటు కలిపి పంపుతున్నారు. దీనిపట్ల మరో సారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. మా అభ్యంతరాలకు గల కారణాలను ఈ దిగువ నిస్తున్నాము.

01. ఆస్తిపన్నులో భాగంగా కన్సర్వెన్సీ టాక్స్‌ అనే కాంపొనెంట్‌ ఉన్నది. ఇది గార్బేజీ తొలగింపునకు ఉద్దేశించినది. నగరంలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ కన్సర్వెన్సీ టాక్స్‌ను చెల్లిస్తున్నాడు. ఒకవైపు గార్బేజీ తొలగింపునకు ఉద్దేశించిన కన్సర్వెన్సీ టాక్స్‌ వసూలు చేస్తూ, మరోవైపు మరల అదేపనికి యూజర్‌ చార్జీలు వసూలు చేయటం ద్వంద్వ పన్నులవిధానం అవుతుంది. ఒకే పనికి రెండు పన్నులు వసూలుచేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.

02. ఒకవైపు ఆస్తిపన్నులో భాగంగా కన్సర్వెన్సీ టాక్స్‌ను వసూలు చేస్తూనే, మరోవైపు నగరంలోని అనేక కాలనీలలో గార్బేజీ తొలగింపుకు మరల కాలనీలనుండి కాంట్రిబ్యూషన్‌ వసూలు చేస్తున్నారు. కార్పొరేషన్‌ కొంత, కాలనీలు కొంత భరించే పధ్దతిలో కాలనీలతో ఒప్పందాలు చేసుకొని గార్బేజీ తొలగింపు మెయింటెనెన్స్‌ కాలనీలకు అప్పగించారు. కాలనీ అసోసియేషన్లు కాలనీవాసులనుండి ఇంటింటికీ వసూలు చేసి గార్బేజి తొలగించే పారిశుధ్యపనివారికి చెల్లిస్తున్నారు. కాని కాలనీలకు కార్పొరేషన్‌ ఇవ్వవలసిన కాంట్రిబ్యూషన్‌ నెలలతరబడి చెల్లించటం లేదు. ఫలితంగా అది పూర్తిగా కాలనీల వ్యవహారంగా మారి పోయింది. కాలనీ వాసులు గార్బేజీ తొలగింపునకు
జు) ఆస్తిపన్నులో భాగంగా కన్సర్వెన్సీ టాక్స్‌, ఔ)యూజర్‌ చార్జీలు, ్పు) కాలనీ పారిశుధ్ధ్యపనివారికి చెల్లింపులు- ఇలా 3 రకాలుగా చెల్లించవలసివస్తున్నది. కాలనీ వాసులనుండి ఒకే పనికి 3 రకాలుగా వసూలు చేస్తున్నారు. ఒకేపనికి 3 రకాలుగా వసూలుచేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము.

03. గతంలో వీధులలో చెత్త కుండీలు ఉండేవి. ప్రజలు తమ ఇళ్ళలోని వ్యర్ధపదార్ధాలను వారే స్వయంగా వెళ్లి చెత్త కుండీలలో వేేసేవారు. ఇప్పుడు ఆచెత్త కుండీలను తొలగించారు. సైకిల్‌ రిక్షాల ద్వారా చెత్త కలెక్షన్‌ ప్రారంభించారు. చెత్త కుండీలను తొలగించడంద్వారా ప్రజలకున్న ఒక సౌకర్యాన్ని తొలగించారు. సైకిల్‌ రిక్షాల ద్వారా చెత్త కలెక్షన్‌ సౌకర్యాన్ని కల్పించినట్లే కల్పించి ప్రజలనుండి 3 రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. కన్సర్వెన్సీ టాక్స్‌, యూజర్‌ చార్జీలు చెల్లించక పోతే కార్పొరేషన్‌ పన్ను చెల్లింపుదారులనిపై చర్యలు తీసుకుంటుంది. కాలనీలలో చెల్లించక పోతే ఇంటినుండి చెత్తను తీసుకు వెళ్ళటం నిలిపి వేస్తారు. ఇది నగరంలో ఒక సాధారణ పన్ను చెల్లింపుదారుని పరిస్థితి. నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించి కూడా సాధారణ పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తున్నదని స్పష్టం చేస్తున్నాము.
పైకారణాలరీత్యా యూజర్‌ చార్జీల విధింపును టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా వ్యతిరేకిస్తున్నాము. పై విషయాలను దృష్టిలో పెట్టుకొని క్రింది డిమాండ్లను మీముందుంచుతున్నాము.

డిమాండ్లు
01.గార్బేజీ తొలగింపుకు యూజర్‌ చార్జీలను రద్దు చేయాలి.
02.కాలనీ అసోసియేషన్లకు బకాయిపడిన కార్పొరేషన్‌ కాంట్రిబ్యూషన్‌ మెత్తాన్ని తక్షణమే చెల్లించాలి.
03.ఇతర ప్రాంతాలలో మాదిరిగానే కొలనీలలో పారిశుధ్ధ బాధ్యతను పూర్తిగా కార్పొరేషన్‌ నిర్వహించాలి.
04. గతంలో మాదిరిగా చెత్తకుండీలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
చివరిగా మరో విషయాన్ని మీదృష్టికి తెస్తున్నాము. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలను ఇప్పటికే కొంత మందివద్ద వసూలు చేశారు. కాని వారికి ఇస్తున్న రశీదులో మాత్రం యూజర్‌ చార్జీలను ఆస్తిపన్నులో భాగంగా చూపిస్తున్నారు. చట్ట ప్రకారం ఆస్తిపన్ను, యూజర్‌ చార్జీలు రెండూ ఒకటి కాదు. రెండింటినీ వేర్వేరుగా చూపించాలి. కావున రెండింటినీ వేర్వేరుగా చూపించవలసిందిగా కోరుతున్నాము.
                                   అభివందనాలతో
V. Sambi Reddy                                        M.V.Anjaneyulu
President                                                      Secretary


Monday, 5 September 2011

urban reforms- Looting of Public money - Another eaxmple

మహా 'చెత్త' ఒప్పందం!

  • కోట్ల విలువైన చెత్త రాంకీ సొంతం
  • పారిశుధ్య నిర్వహణ బాధ్యతల అప్పగింత
  • ప్రజలపై పెను భారం
మహావిశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణ బాధ్యతలు త్వరలో రాంకీ సంస్థ చేతిలోకి వెళ్లనున్నాయి. 25 ఏళ్లపాటు ఈ బాధ్యతలు రాంకీ సంస్థకు అప్పగించాలని గత నెల 17న జరిగిన కౌన్సిల్‌ తీర్మానించింది. చెత్త సేకరణ, తరలింపు, వివిధ రకాల కంపోస్టులు, ఎరువులు, విద్యుత్‌ తయారీ తదితర కార్యకలాపాలు చేపట్టేందుకు కౌన్సిల్‌ అనుమతించింది. 25 ఏళ్ల తరువాత మరో 15 ఏళ్లపాటు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆ తీర్మానంలో పేర్కొంది.
నగరంలోని టన్ను చెత్త తరలించేందుకు జివిఎంసి రాంకీ సంస్థకు రూ.1683 చొప్పున చెల్లించాలని కౌన్సిల్‌ తీర్మానంలో పేర్కొంది. దీని లెక్కన చూసుకుంటే ప్రతిరోజూ సుమారు వెయ్యి టన్నుల చెత్త నగరం నుంచి సేకరిస్తున్నారు. ఇందుకోసం జివిఎంసి రోజుకు రూ.16 లక్షల 83 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు రూ.5 కోట్ల 4 లక్షల 90 వేలు, ఏడాదికి రూ. 60 కోట్ల 58 లక్షల 80 వేలు జివిఎంసి చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం చెత్త తరలింపు, జనచైతన్య, ఇతర పారిశుధ్య పనివారి వేతనాలు తదితర అవసరాల కోసం ఏడాదికి రూ.42 కోట్లే జివిఎంసి వెచ్చిస్తోంది. దీనికన్నా సుమారు రూ.8 కోట్ల 41 లక్షలు అదనం. ఈ నేపథ్యంలో ఇటీవల కౌన్సిల్‌లో రాంకీకి చెత్త నిర్వహణ బాధ్యతలను అప్పగించడాన్ని సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ బొట్టా ఈశ్వరమ్మ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ మిగతా పార్టీలు అంగీకరించడంతో రాంకీకి చెత్త నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని తీర్మానించారు.
250 ఎకరాల భూమి అప్పగింత
రాంకీ సంస్థకు జివిఎంసి అదనంగా ఆదాయం ముట్టచెప్పేందుకు అంగీకరించడంతోపాటు 250 ఎకరాల భూమి కూడా అప్పగించాలని నిర్ణయించింది. ఆనందపురం మండలంలోని భూమిని చెత్త శుద్ధిచేసే ప్రాజెక్టుకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ భూముల్లో ప్రాజెక్టు పూర్తయిన అనంతరం చెత్త సేకరణ బాధ్యతలు రాంకీ చేతుల్లోకి వెళ్లనున్నాయి.
చెత్తతో వేల కోట్ల ఆదాయం
నెలకు సుమారు 30 వేల టన్నుల చెత్త రాంకీ సంస్థకు చెందుతుంది. ఈ చెత్తతో ఎరువులు, కంపోస్టు, విద్యుత్తు తయారీ తదితర కార్యకలాపాలను చేయనుంది. ఇందువల్ల రాంకీ సంస్థకు వేల కోట్ల ఆదాయం ఏటా వచ్చే అవకాశముంది. అయినప్పటికీ, పారిశుధ్య పనుల నిర్వహణకు జివిఎంసి ఎదురు చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పొంచివున్న యూజర్‌ ఛార్జీల భయం
ప్రస్తుతం చెత్త సేకరణకు ప్రజల నుంచి ఎటువంటి పన్ను వసూలు చేయబోమని మేయర్‌ చెప్తున్నారు. గతంలో డస్ట్‌ బిన్‌ ఫ్రీ సిటీ పేరుతో ఆరు వార్డుల్లో పైలట్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసి, ఇప్పటికీ ప్రజల నుంచి చెత్త సేకరణ పన్ను వసూలు చేస్తున్నారు. రాంకీతో ఒప్పందం నేపథ్యంలో దీన్ని నగరమంతా విస్తరించి, యూజర్‌ ఛార్జీలు వసూలు చేసే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ విమర్శలు
నగరంలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో చెత్తను కోరమాండల్‌ ఫెర్టిలైజర్స్‌ కంపెనీకి అప్పగించాలని గతంలో మేయర్‌ పులుసు జనార్థనరావు ప్రయత్నించారు. ఇందులో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని డిప్యూటీ మేయర్‌ దొరబాబు కౌన్సిల్‌లో విమర్శించారు. ఆ తరువాత డంపింగ్‌ యార్డులో చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వినియోగిస్తే రూ.వెయ్యి కోట్ల వరకూ ఆదాయం వస్తుందనీ, ఉచితంగా కోరమాండల్‌కు అప్పగించడం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమేననీ అన్నారు. ఇప్పుడు 25 ఏళ్లపాటు రాంకీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించినా, డిప్యూటీ మేయర్‌గానీ, అధికార పార్టీ, ఇతర పార్టీలకు సంబంధించిన వారుగానీ దానిపై స్పందించడం లేదు.
రాంకీ సంస్థకు అప్పగించొద్దు : సిపిఎం
జివిఎంసి పారిశుధ్య పనులు రాంకీ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయం 20 లక్షల మంది ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని సిపిఎం విశాఖ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు అన్నారు. కౌన్సిల్‌లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించవద్దని సిపిఎం కోరినా, ఇతర పార్టీలేవీ స్పందించలేదు. ప్రజల ప్రయోజనాలకు నష్టం చేకూర్చేలా చేసుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.